close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీ వస్తువుల్ని భద్రంగా దాస్తారు!

కాలం మారుతోంది... ప్రపంచం కుగ్రామమైపోతోంది. మన యువత ఉద్యోగంలో భాగంగా విదేశాలకెళ్లడమూ పెరిగిపోయింది. మరి, వాళ్లు అక్కడ కనీసం ఓ ఏడాదిపాటైనా ఉండాల్సి వస్తే ఇక్కడి అద్దె ఇంటికి అనవసరంగా కిరాయి కట్టాల్సి వస్తోంది. ఆ వృథా బాధని తప్పించి ఆ సామగ్రిని తాము జాగ్రత్త చేస్తాం అంటున్నాయి ‘హౌస్‌హోల్డ్‌ స్టోరేజ్‌’ సంస్థలు.

సాకేత్‌ వైజాగ్‌లోని ఓ టెలీకమ్యూనికేషన్స్‌ సంస్థలో ఉద్యోగి. కంపెనీ అమెరికాలో ఓ కొత్త ప్రాజెక్టు చేపడుతూ ఆయన్ని అక్కడికి పంపుతున్నట్టు చెప్పింది. దాదాపు రెండేళ్లుపట్టే ప్రాజెక్టు అది. అతను ఎంత ప్రయత్నించినా భార్యకి వీసా దొరకలేదు. కనీసం ఆరునెలల తర్వాత కానీ దొరికే వీలూలేదు. ఆ ఆరునెలలూ ఆమె తన పుట్టింట్లో ఉంటానని చెప్పింది. దాంతో వైజాగ్‌లో ఇప్పుడుంటున్న అద్దె ఇల్లు ఖాళీ చేయాలనుకున్నారు. అక్కడున్న ఫర్నిచర్‌, బైకు, ఇతర సామగ్రిని ఎలాగూ అమెరికాకి తీసుకెళ్లడం సాధ్యం కాదు. పోనీ బంధువులూ, స్నేహితుల ఇంట్లో సర్దేద్దామనుకుంటే... తాము తిరిగొచ్చేదాకా ఎలా ఉంటాయోననే సందేహం వాళ్లని పీడించింది. మరి రెండేళ్లపాటు ఆ సామానంతా ఎక్కడుంచాలన్న సమస్య  సాకేత్‌ని తొలిచేస్తోంది!
హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీకన్యదీ ఇంచుమించు ఇలాంటి సమస్యే. అక్కడో ఐటీ కంపెనీలో పనిచేస్తోందామె. మరో రెండువారాల్లో ప్రసూతి సెలవుల మీద తిరుపతిలోని తన పుట్టింటికి వెళ్లాలనుకుంటోంది. ఏడాది తర్వాతే మళ్లీ విధుల్లోకి వస్తుంది. ఆమె భర్త సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కావడంతో నెలలో కనీసం ఇరవైరోజులపాటు పర్యటనలోనే ఉంటాడు. అందువల్ల తాను పుట్టింట్లో ఉన్నంతకాలం అతనూ తిరుపతికే వస్తానంటున్నాడు. అలాంటప్పుడు హైదరాబాద్‌లో ఉన్న అద్దె ఇంటికి కిరాయి కట్టడం వృధా కాబట్టి ఇల్లు ఖాళీ చేయాలనుకుంటోంది. కానీ... అప్పటిదాకా తమ వస్తువుల్ని ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తోంది!

శ్రీకన్య, సాకేత్‌ లాంటి కొత్తతరంకార్పొరేట్‌ ఉద్యోగుల్ని ఆదుకునేందుకు రూపుదిద్దుకున్నవే ‘హౌస్‌హోల్డ్‌ స్టోరేజ్‌’ సంస్థలు. వీళ్లు విదేశాల నుంచో తమ సుదీర్ఘ సెలవుల నుంచో వచ్చేదాకా వాళ్ల ఇంటి సామగ్రిని కావాల్సినంత కాలం భద్రంగా దాచి ఇస్తున్నాయీ కంపెనీలు! అమెరికాలో దాదాపు 36 లక్షల కోట్లరూపాయల భారీ వాణిజ్యం ఉన్న రంగం ఇది! వాటిని స్ఫూర్తిగా తీసుకుని నాలుగేళ్లకిందట మనదేశంలో ఇలాంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ మధ్యే దక్షిణాది నగరాల్లోనూ అడుగుపెట్టాయి.

ఉద్యోగుల కోసమే మొదలైనా...
మొదట విదేశాలకో మనదేశంలోని సుదూర నగరాలకో వెళ్లే కార్పొరేట్‌ ఉద్యోగుల్ని లక్ష్యంగా చేసుకునే ఈ ‘హోస్‌హోల్డ్‌ స్టోరేజ్‌’ సంస్థలు ఏర్పడ్డా... పోనుపోను వైవిధ్యమైన కస్టమర్లూ వీటిని ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఉన్న ఇంటిని పెద్దగాచేసి కడుతున్నవాళ్లూ ఆ నిర్మాణం పూర్తయ్యేదాకా తమ విలువైన ఫర్నిచర్‌ను  వీళ్ల దగ్గరే దాస్తున్నారట. కొవిడ్‌ తర్వాత వీటికి మరెంతోమంది కొత్త వినియోగదార్లు రావడం మొదలుపెట్టారు. దాదాపు అన్ని ఐటీ కంపెనీలూ ‘ఇంటి నుంచే పని’ పద్ధతిని అనుసరించడంతో నగరాల్లోని ఉద్యోగులు చాలావరకూ తమ సొంతూళ్లకి వెళ్లి పనులు చేసుకుంటున్నారు.
అలాంటివాళ్లు అద్దె ఇంటిని ఖాళీ చేసి ఆ వస్తువుల్ని ఇలాంటి సంస్థలకి అప్పగించే వెళ్లారు. అంతేకాదు, కొవిడ్‌ కారణంగా చిన్నతరహా కంపెనీలు తమ కార్యకలాపాలని బాగా తగ్గించుకున్నాయి. సంస్థల యజమానులు అద్దె బాధ తప్పించుకోవాలని తమ కార్యాలయాలనీ, శాఖల్నీ మూసి ఇంట్లో నుంచే వ్యాపారాన్ని నడిపించారు. మూతపడ్డ ఆ కార్యాలయాల్లోని సామగ్రినీ, డాక్యుమెంట్స్‌నీ భద్రంగా దాచడానికి హౌస్‌హోల్డ్‌ స్టోరేజ్‌ సంస్థల్నే ఆశ్రయించారు!

ఖర్చు ఎంతుంటుంది...!
ఓ రెండు బెడ్‌రూముల ఇంటివస్తువులకి నెలకి సుమారు రూ.3 వేల వరకూ అద్దె వసూలు చేస్తున్నారు. నగలూ, డబ్బూ, పేలుడు వస్తువులు తప్ప గృహోప కరణ వస్తువులన్నింటినీ తీసుకుంటారు. తెలుగురాష్ట్రాల్లో స్టోనెస్ట్‌, స్టోర్‌మోర్‌ వంటి సంస్థలు చురుగ్గా పనిచేస్తున్నాయి. వాటిని చూసి అప్పటిదాకా ‘మూవర్స్‌ అండ్‌ ప్యాకర్స్‌’గానూ, వేర్‌హౌస్‌ సంస్థలుగానూ ఉన్న కంపెనీలు ఈ కొత్త బిజినెస్‌పైన దృష్టిపెట్టాయి. ఇలా పోటీపెరగడంతో ఆకట్టుకునే ధరలూ, హై సెక్యూరిటీతో కూడిన స్టోరేజ్‌ వసతులూ, ఇతర సేవలూ వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు