close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాస్త చోటిస్తే... చిట్టడవి పెంచేస్తారు!

పల్లెలూ, పట్టణాలని లేదు... ఎక్కడ చూసినా ప్రకృతి విధ్వంసమే. అన్నిచోట్లా పచ్చదనం మాయమైపోతోంది. దాంతో జీవవైవిధ్యమూ దెబ్బతింటోంది. ఈ నష్టాన్ని గమనించిన పర్యావరణ ప్రేమికులు పచ్చదనాన్ని పెంచాలనుకున్నారు. అందుకోసం అక్కడక్కడా మొక్కలు నాటడం కాదు ఏకంగా చిట్టడవుల్ని సృష్టిస్తున్నారు!

నగరం చుట్టూ నందన వనాలు!

మిళనాడులో రెండో అతి పెద్ద నగరమైన కోయంబత్తూరు... త్వరలో వనాల నగరంగా ఖ్యాతి సంపాదించనుంది. ఎందుకంటే కలామ్‌ వనం, భారతి వనం, హోప్‌ వనం... ఇలా అనేక వనాలకు నిలయం ఆ నగరం. ఖాళీగా, లేదంటే వ్యర్థాలతో నిండి ఉండే ప్రాంతాలను చదునుచేసి అక్కడ మియావాకీ పద్ధతిలో మొక్కల్ని నాటి వనాల్ని అభివృద్ధిచేస్తున్నారు. ఒక్కోచోట కొన్ని వేల మొక్కల్ని నాటారు. ఈ వనాల వెనక ఉన్న సంస్థ ‘సిరుతుళి’. ఈ ప్రాంతంలో నీటి లభ్యతను పెంచడానికి కృషిచేస్తున్న ఈ సంస్థ... వర్షాలకు పచ్చదనం కూడా ముఖ్యమని భావించి నగరంలో వనాల్ని అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. 2005లో దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ కోయంబత్తూరులోని అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక రావి మొక్క నాటారు. కలామ్‌ 80వ పుట్టినరోజు(2011) నాటికి అక్కడ 80వేల మొక్కల్ని నాటి దానికి ‘కలామ్‌ వనం’ అని పేరుపెట్టిందీ సంస్థ. ఈ వనం స్ఫూర్తిగా అదే నగరంలోని భారతీయార్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో పదివేల మొక్కలతో ‘భారతి వనం’ అభివృద్ధి చేసింది. గతేడాది రైల్వేకు చెందిన పదెకరాల స్థలంలో మొక్కల్ని నాటారు. ఈ నగరం స్ఫూర్తితో సమీపంలోని తిరుప్పూర్‌లోనూ ఇలాంటి వనాలు వస్తున్నాయి. స్థానిక వస్త్ర వ్యాపారులు విరాళాలు ఇవ్వడంతో ‘సిద్దార్థ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో వనాల్ని అభివృద్ధి చేస్తున్నారు.

దేశీ మొక్కలతో...

నాసిక్‌లోని ‘నేచర్‌ ఇండియా నేటివ్‌ ప్లాంట్‌ రీసర్చ్‌’ ఆధ్వర్యంలో నడిచే నర్సరీ మిగతా వాటికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఇక్కడ కేవలం దేశీ వృక్ష జాతుల వంగడాలు దొరుకుతాయి. దీని వెనకున్నది మొహమ్మద్‌ దిలావర్‌. 15ఏళ్ల కిందట పిచ్చుకల సంరక్షణ కోసం ఉద్యమం మొదలుపెట్టాడు దిలావర్‌. అవి కనుమరుగవడానికి స్థానికంగా పెరిగే చెట్లు తగ్గిపోవడమేనని తెలుసుకున్నాడు. ఆ మొక్కల కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. దాంతో తానే దేశీ రకాల మొక్కల్ని సేకరించి వాటితో నర్సరీ ఏర్పాటుచేసి పదేళ్లలో 400 దేశీ వంగడాల్ని సిద్ధం చేశాడు. ఈ నర్సరీ నుంచి వాటిని ఎవరైనా పొందొచ్చు. దిలావర్‌కు చెందిన సంస్థ పూర్తిగాదేశీ రకాలతో చిట్టడవుల్నీ పెంచుతోంది. ‘జీవ వైవిధ్యానికి స్థానిక వృక్షజాతులు ముఖ్యం. వాటి ఆకులు, పువ్వులు, పుప్పొడి రేణువులు, పండ్లు, విత్తనాలు... అన్నీ అక్కడ ఉండే జీవుల మనుగడతో ముడిపడి ఉంటాయి. ఈ మొక్కల్లో మార్పులు వస్తే వాటి ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. మా నర్సరీలో గుగ్గిలం, తాతిరిపుష్పి, పెరుమారుం, తాటి, యేగి, నర్లింగ, చిందుగ లాంటి వృక్ష జాతులూ దొరుకుతాయి’ అని చెబుతాడు దిలావర్‌. పుణెలోని విప్రో కార్యాలయంలో 35 ఎకరాల విస్తీర్ణంలో 24 రకాలదేశీ మొక్కలూ, చెట్లను నాటి అందమైన వనాన్ని సృష్టించింది దిలావర్‌ బృందం. ముంబయి, పుణె, నాసిక్‌లలో ఇప్పటివరకూ 25 వరకూ చిన్న అడవుల్ని పెంచామని చెబుతాడు దిలావర్‌. విదేశీ వృక్షాలకు సరితూగే దేశీ ప్రత్యామ్నాయాల్ని చూపిస్తారు వీరు.

తుపానుల నుంచి కాపాడాలని...

బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందంటే... ఒడిశా ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే, ఏటా కనీసం రెండు తుపాన్లయినా ఒడిశామీద ప్రభావం చూపుతాయి. ముందు జాగ్రత్తలతో ఆస్తి, ప్రాణ నష్టాల్ని తగ్గించగలిగినా... ప్రకృతి విధ్వంసాన్ని మాత్రం ఆపలేకపోతున్నారెవరూ. తుపాను సమయంలో పెద్ద సంఖ్యలో చెట్లు విరిగిపోతాయి, నేలకొరుగుతాయి. ఈ పరిస్థితిని చిన్నప్పట్నుంచీ చూస్తున్నాడు అమ్రేష్‌ సమంత్‌. ఇతడు పారాదీప్‌ పోర్ట్‌ ట్రస్ట్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌. సొంతూరు తీర ప్రాంత గ్రామమైన బిశ్వాలీ. ‘తుపాను దెబ్బకు కొన్ని చెట్లు విరిగిపోతే, ఆ తర్వాత సహాయకచర్యల్లో భాగంగా మరికొన్నింటిని కొట్టేస్తారు. దాంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది’ అని చెప్పే అమ్రేష్‌... 1995 నుంచీ నదులూ, చెరువుల ఒడ్డునా, రహదారుల పక్కనా మొక్కలు నాటేవాడు. తర్వాత తీర గ్రామాల్లోని బీడు భూముల్లో మొక్కలు నాటాలనుకున్నాడు. మిత్రులతో కలిసి ఒకట్రెండు ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటి వనాల్ని అభివృద్ధిచేస్తున్నాడు. బిశ్వాలీతోపాటు కేంద్రపుర, లంకులా, ప్రదీప్‌గఢ్‌... ఇలా ఇప్పటివరకూ 20 గ్రామాల్లో ప్రతిచోటా 500-1000 వరకూ మొక్కల్ని నాటారు. ఇవి పెరిగినపుడు దగ్గరగా ఉండటంవల్ల ఈదురు గాలులకు పడిపోయే ప్రమాదమూ తగ్గుతుంది. వీటిలో పండ్ల చెట్లూ ఉండటంతో ఈ వనాల్లోకి పక్షులూ వస్తున్నాయి. అయిదుగురు వలంటీర్లు కలిసి ఒక్కో వనం సంరక్షణ బాధ్యతను స్వీకరిస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు