close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బ్యాగుకే సెల్‌ఫోను పౌచ్‌

బ్యాగులో సెల్‌ఫోను పడేసుకుంటే అది మోగినప్పుడు ఆ జిప్పు తీసి... ఏ అరలో ఫోను పడేశామో వెతికి మాట్లాడేసరికి అవతలివాళ్లు పెట్టేస్తారు. అందుకే ఎక్కువశాతం మంది ఫోనుని చేత్తోనే పట్టుకుంటారు. కానీ రోజంతా అలా పట్టుకునే ఉండాలన్నా మాటలు కాదు. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఇప్పుడు కొత్తరకం హ్యాండుబ్యాగుల్ని డిజైను చేస్తున్నారు తయారీదారులు. హ్యాండుబ్యాగుకు అదనంగా సెల్‌ఫోను పౌచ్‌ జతచేయడమే వీటి ప్రత్యేకత. కాస్త పెద్దగా ఉండే పౌచ్‌లో ఫోనుతోపాటూ కొద్దిగా చిల్లర కూడా పడేసుకుంటే... అన్నింటికీ బ్యాగును తెరవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ బ్యాగులు రకరకాల మోడళ్లలోనూ రంగుల్లోనూ వస్తున్నాయి.


బాత్‌బాంబ్స్‌... ఇవీ సబ్బులే

చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ఎన్నో రకాల సబ్బులూ, బాడీవాష్‌లూ అందుబాటులో ఉన్నా...  ఇంకా కొత్తగా ఏదయినా దొరికితే బాగుండని కోరుకునే వారికోసమే ఇప్పుడు ‘బాత్‌బాంబ్స్‌’ వచ్చేశాయి. దీన్ని సబ్బులా అదేపనిగా ఒంటికి రాసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చిన్నసైజు బంతిలా రంగురంగుల్లో ఉండే దీన్ని స్నానం చేసే నీటిలో ఒక్కటి వేసుకుంటే చాలు. నీళ్లు ఆ రంగుల్లోకి మారిపోతాయి. ఇక చర్మం కూడా తాజాగా, మృదువుగా తయారవుతుంది. సబ్బుల్లో పండ్లూ, అరోమా సుగుణాలు ఉన్నట్లుగా... వీటినీ నిమ్మ, నారింజ, పుదీనా, పూలు... వంటి ఎసెన్సులను కలిపి తయారుచేస్తారు. కావాల్సిన ఫ్లేవర్లలో కొనిపెట్టుకుంటే నచ్చినదాన్ని వాడుకోవచ్చు. బాగున్నాయి కదూ!


ఈ నీళ్లసీసా పప్పీకోసం!

వెళ్లిన ప్రతిచోటకీ తాము ఎంతో ముద్దుగా పెంచుకునే కుక్కపిల్లల్ని కూడా తీసుకెళ్తుంటారు కొందరు. కానీ అలా తీసుకెళ్లినప్పుడు వాటికి ఆకలి వేస్తే ఆహారాన్ని ఏ పేపరుప్లేటులోనో పెడితే సరిపోతుంది కానీ నీళ్లు పట్టాలంటే కచ్చితంగా గిన్నెలాంటిది ఉండాల్సిందే. అలాగని అన్నిసార్లూ గిన్నెలు తీసుకెళ్లలేం కాబట్టి వాటికోసమే తయారు చేసిన ఈ ‘పోర్టబుల్‌ పెట్‌ డాగ్‌ వాటర్‌బాటిల్‌’ని వెంట పెట్టుకుంటే సరి. చూడ్డానికి సాధారణ నీళ్లసీసాలా కనిపించే దీని ఆకృతి ముందువైపు గిన్నె తరహాలో ఉంటుంది. ఇందులో నీళ్లు పోస్తే... పప్పీకి దాహం వేసినప్పుడు సీసాను కొద్దిగా వంచి దానికి ఉండే బటన్‌ని నొక్కితే చాలు. సీసాలో ఉన్న నీళ్లు ఆ గిన్నెలోకి వస్తాయి. అలా ఏ ఇబ్బందీ లేకుండా పప్పీకి నీళ్లు తాగించేయొచ్చు.


కదలకుండా కూర్చోబెట్టొచ్చు!

కాస్త నడక వచ్చిన పిల్లలు ఇల్లంతా కలియదిరుగుతూ... అందినవి లాగేస్తూ, కొన్ని మీద పడేసుకుంటూ నానా హంగామా చేస్తారు. దాంతో వాళ్లు మెలకువగా ఉన్నంతసేపూ ఓ కంట కనిపెడుతూనే తల్లులు ఇంటిపనులు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. అదేమీ లేకుండా వాళ్లంతట వాళ్లు హాయిగా ఆడుకుంటూ ఉంటే... ఎంతపనైనా చకచకా చేసుకోవచ్చని కోరుకునే తల్లుల కోసం ‘ప్లే పెన్‌’లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని గుండ్రంగానో, నలుచదరంగానో అమర్చి మధ్యలో పిల్లల్ని వదిలేసి కాసిని బొమ్మల్ని కూడా అక్కడ పెట్టేస్తే ఇల్లంతా తిరగకుండా అక్కడే కూర్చుని ఆడుకుంటారు. అవసరం లేదనుకున్నప్పుడు వాటిని మడిచేసి ఓ మూలన పెట్టుకోవచ్చు. ఫైబర్‌, ఇనుము, చెక్కతో తయారుచేసే ఈ ప్లేపెన్‌లు రక రకాల డిజైన్లలోనూ వస్తున్నాయి కాబట్టి నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు