
2007 సంవత్సరం అది. అటు స్టార్టప్‌లూ, ఇటు డ్రోన్లూ... ఈ రెండు పదాలూ కొత్తవే మనదేశానికి. అయితేనేం- అప్పట్లోనే స్టార్టప్పెట్టి పట్టుదలతో డ్రోన్ల తయారీ మొదలుపెట్టారు ఆ నలుగురూ. ఇందుకోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. పదమూడేళ్ల వాళ్ల కష్టానికి ఈ మధ్యే ఫలితం దక్కింది. వాళ్లు స్థాపించిన ‘ఐడియా ఫోర్జ్’ సంస్థ భారత సైన్యానికి తమ డ్రోన్లని అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 12 ప్రపంచ సంస్థలని తోసిరాజని మరీ దాన్ని గెలుచుకుంది!
‘ఐడియా ఫోర్జ్’ ప్రస్థానం గురించి చెప్పాలంటే దాని వ్యవస్థాపక సీఈఓ అంకిత్ మెహతా వేసిన తొలి అడుగు నుంచే మొదలుపెట్టాలి. ఓ మామూలు మధ్యతరగతి కుటుంబం అతనిది. చిన్నప్పటి నుంచే వాళ్లనాన్న ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఎడిసన్లాంటివాళ్ల గురించి కథల్లా చెబుతుంటే విన్న అంకిత్ తానూ ఆవిష్కర్త కావాలనుకున్నాడు. ఆ కోరిక అతణ్ణి ఐఐటీ-బాంబేకి తీసుకెళ్లింది. అక్కడ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన అంకిత్ టాపర్లలో ఒకడిగా నిలిచినా... ఏ క్యాంపస్ ఇంటర్వ్యూకీ వెళ్లలేదు. బదులుగా స్టార్టప్ పెడతానని పట్టుబట్టాడు. చిన్నప్పుడు ఐన్‌స్టీన్ కథలు చెప్పిన వాళ్లనాన్నే అతణ్ణి తీవ్రంగా వ్యతిరేకించాడు. అయినా సరే... లక్షన్నర పెట్టుబడితో ఐఐటీలోని తన జూనియర్లు ఆశిష్ భట్, రాహుల్ సింగ్‌లతో కలిసి ‘ఐడియా ఫోర్జ్’ని స్థాపించాడు. ఎంబీఏ చదివి స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం చేస్తూ వచ్చిన అంకిత్ స్నేహితుడు విపుల్ జోషి కూడా ఆ ముగ్గురితో చేతులు కలిపాడు. నలుగురూ కలిసి కరెంటు అక్కర్లేని ‘సోలార్ మొబైల్ ఛార్జర్’లని తయారుచేస్తుండేవారు. ఓసారి తమ స్టార్టప్‌ని ఇంక్యుబేట్ చేయడానికి ఐఐటీ-బాంబేని ఆశ్రయిస్తే... అక్కడే తొలిసారి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్(యూఏవీ) డ్రోన్ల గురించి విన్నారు. అంకిత్ వాటిని మనదేశంలోనూ రూపొందించాలనుకున్నాడు. అప్పట్లో ఆ రకం డ్రోన్లకి సంబంధించి ఓ అంతర్జాతీయ పోటీ జరిగితే ఐఐటీ-బాంబే తరపున పాల్గొన్న ఐడియా ఫోర్జ్ సంస్థ... అమెరికాలోని ప్రఖ్యాత ఎంఐటీతో కలిసి ప్రథమ బహుమతిని పంచుకుంది! దాంతో డీఆర్డీఓ దృష్టిలో పడింది. ఆ సంస్థ కోసం 2008లో తొలి డ్రోన్‌ని తయారుచేసి ఇచ్చిన ‘ఐడియా ఫోర్జ్’ సంస్థ, ఆ తర్వాతి ఏడాదే మన దేశానికి తొలిసారి నాలుగు రోటార్లున్న (డ్రోన్లపైన ఉండే ఫ్యానుల్లాంటివి) అత్యాధునిక యూఏవీలని పరిచయం చేసింది.
పారామిలటరీకి...
మన భద్రతా దళాలన్నింటికీ తొలిసారి యూఏవీలని ఉపయోగించడం నేర్పింది ఐడియా ఫోర్జ్ సంస్థవాళ్లే. డీఆర్డీఓ ద్వారా సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, నేషనల్ సెక్యూరిటీ గార్డుల్లాంటి పారామిలటరీ దళాలకి యూఏవీలని సరఫరా చేయడం మొదలు పెట్టారు వీళ్లు. 2013లో ఉత్తరాఖండ్ ఘోరప్రళయమప్పుడు బాధితుల కోసం ఏర్పాటుచేసిన ‘నేత్ర’ అనే డ్రోన్ వీళ్లకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎంత గుర్తింపున్నా... ఎక్కువగా ప్రభుత్వాలకే సరఫరా చేస్తుండటం వల్ల మిగతా స్టార్టప్లలా ఆశించినంత లాభాలు రాలేదు. దాంతో రియల్ ఎస్టేట్ సంస్థలూ, ఆయిల్ కంపెనీల కోసం వాణిజ్య డ్రోన్లని తయారుచేసివ్వడం ప్రారంభించారు. కానీ, 2015లో ప్రైవేటు సంస్థల వాళ్లెవరూ డ్రోన్లని వాడకూడదని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తేవడంతో ఆ ఆదాయానికీ గండిపడింది. అయినాసరే... తమకున్న 32 మంది ఉద్యోగులతో ఓపిగ్గా ప్రయోగాలు చేస్తూ వచ్చారు ఈ నలుగురూ. అలా ఐదేళ్లు! కరోనా లాక్డౌన్లో ప్రజలు బయటకు రాకుండా పహారా కాయడానికి పోలీసులు డ్రోన్లూ వాడొచ్చన్న సడలింపు వీళ్లకి ఊరటనిచ్చింది. మహారాష్ట్ర, దిల్లీ సహా పదిరాష్ట్రాలు వీళ్ల నుంచి డ్రోన్లని కొని వాడటం మొదలుపెట్టాయి. దాంతోపాటే కొన్ని ప్రైవేటు సంస్థలకీ అనుమతినిచ్చింది కేంద్రప్రభుత్వం. వీటితో కొద్దిగా లాభాలబాట పట్టిన ఈ సంస్థకు భారత సైన్యం నుంచి మరో గొప్ప అవకాశం వచ్చింది.
అదేంటంటే...
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ రీతులు మారిపోతున్నాయి. పొరుగు దేశాలను దీటుగా ఎదుర్కోవడం కోసం డ్రోన్లని వాడక తప్పని పరిస్థితి. అందుకే మనుషులు అసలే వెళ్లలేని సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచేందుకూ అవసరమైతే దాడి చేసేందుకూ కొత్త డ్రోన్లు కావాలంటూ జనవరిలో టెండర్లని ఆహ్వానించింది రక్షణశాఖ. అమెరికా, ఇజ్రాయెల్ సహా వివిధ దేశాల నుంచి కాకలు తిరిగిన పదకొండు సంస్థలు ఇందులో పాల్గొంటే... వాటితోపాటూ ‘ఐడియా ఫోర్జ్’ కూడా తలపడింది. ఆటలో అరటిపండనే అనుకున్నారు ఈ సంస్థని అందరూ మొదట. కానీ... మన సైన్యం పెట్టిన అతి కఠినమైన పరీక్షలను ఈ సంస్థ తయారుచేసిన ‘స్విచ్-యూఏవీ’ అనే డ్రోన్ మాత్రమే నెగ్గుకు రాగలిగింది. ఆ గెలుపుతో భారత సైన్యానికి రూ.145 కోట్ల విలువైన యూఏవీలని రూపొందించే అతిపెద్ద కాంట్రాక్టు సొంతం చేసుకుంది... ఐడియా ఫోర్జ్.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్