close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వెదురు పళ్లెంలో తినేద్దామా?!

డిన్నర్‌వేర్‌, టేబుల్‌వేర్‌ అనగానే రంగురంగుల్లో అందంగా కనువిందు చేసే పింగాణీ లేదా ప్లాస్టిక్కువే గుర్తొస్తాయి. కానీ చేయిజారి పగిలిపోతాయేమోనన్న భయంతో పింగాణీనీ, ఆరోగ్యానికి మంచిది కాదన్న కారణంతో ప్లాస్టిక్కునీ పక్కకు పెట్టేసి స్టీలువే వాడుతుంటాం. ఇప్పుడు ఆ బాధ లేదు. ఎంచక్కా పిల్లలూ పెద్దలూ అందరూ డైనింగ్‌టేబుల్‌మీద అందంగా కనువిందు చేసే రంగు రంగుల ప్లేట్లలో హాయిగా తినొచ్చు. ఎందుకంటే వెదురు నారతో రంగురంగుల ప్లేట్లు వచ్చేశాయి మరి!

పెద్దవాళ్ల సంగతెలా ఉన్నా పిల్లలు బొమ్మలూ రంగులూ ఉన్న ప్లేట్లలోనూ బాక్సుల్లోనూ తినడానికే ఇష్టపడతారు. దాంతో మంచిదికాదని తెలిసినా ప్లాస్టిక్కువే కొని వాడక తప్పని పరిస్థితి. కానీ ఇప్పుడు ప్లాస్టిక్కుని తలదన్నేలా వెదురు నారతోనే రకరకాల డిన్నర్‌వేర్‌నీ టిఫిన్‌బాక్సుల్నీ తయారుచేసి, వాటికి సేంద్రియ రంగులద్ది మరీ డిజైన్‌ చేస్తున్నారు.
ఎందుకంటే- కన్ను మూసి తెరిచేలోపు వెదురు మొక్క పెరిగిపోతుంది. మరే మొక్కా పెరగని రీతిలో అది రోజుకి మూడున్నర అడుగుల పొడవు పెరిగిపోతుందట. కలపకోసం వాడే మరే చెట్టుకన్నా వెయ్యి రెట్లు వేగంగా పెరుగుతుందట. అందుకే వెదురుని పునరుత్పాదక వనరుగా గుర్తించి, దాంతో రకరకాల ఉత్పత్తుల్ని తయారుచేస్తూ ప్లాస్టిక్కు, చెక్క వినియోగాన్ని తగ్గించేస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్కుకి ్రత్యామ్నాయంగా వెదురుతోనే ఆకర్షణీయమైన కిచెన్‌వేర్‌నీ టేబుల్‌వేర్‌నీ తయారుచేస్తూ దాన్ని బయోప్లాస్టిక్కుగా అభివర్ణిస్తున్నారు. పైగా వెదురు మొక్కల పెంపకానికి ఎలాంటి రసాయన ఎరువులూ క్రిమిసంహారక మందులూ కూడా వాడాల్సిన అవసరం లేదు కాబట్టి దీంతో చౌకగానే మనకు కావాల్సిన ఉత్పత్తుల్ని తయారుచేసుకోవచ్చు. అందుకే ఓ ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా వెదురు నుంచి పీచుని వేరుచేసి దాంతో రకరకాల సామగ్రి తయారుచేస్తున్నారు.

ఏమేం చేస్తున్నారు?
కేన్‌ ఫర్నిచర్‌ రూపంలో వెదురు వాడకం ఎప్పటి నుంచో ఉన్నదే. దాంతోపాటు ఇటీవల కటింగు బోర్డులూ ట్రేలూ పెన్ను స్టాండులూ ాటర్‌బాటిళ్లూ ఆవిరితో ఉడికించే పాత్రల్నీ తయారుచేయడం చూస్తున్నాం. కొత్తగా ఇప్పుడు వెదురు ఫైబర్‌తోనూ భోజనం, టిఫిన్‌ ప్లేట్లూ గ్లాసులూ మగ్గులూ కప్పులూ గరిటెలూ స్పూన్లూ వంటివి తయారుచేస్తున్నారు. ఇవి చూడ్డానికి అచ్చం గాజు లేదా ప్లాస్టిక్కుతో చేసినట్లే నున్నగా మెరుస్తుంటాయి. పైగా వీటిని శుభ్రం చేయడం కూడా తేలికే. కాబట్టి గాజూ, పింగాణీ, ప్లాస్టిక్కు డిన్నర్‌వేర్‌కి బదులుగానే కాదు, డిస్పోజబుల్‌ పేపర్‌ ప్లేట్లకి ప్రత్యామ్నాయంగానూ మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. ఫలితంగా వృథా ప్లాస్టిక్కూ, కాగితం వాడకం బాగా తగ్గి పోతుంది అంటున్నారు తయారీదారులు. అంతేకాదు, వెదురుకి సహజంగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాల వల్ల ఈ ప్లేట్లూ గిన్నెలకీ ఆహార పదార్థాల వాసన పట్టదు సరికదా, అందులో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. పైగా ఇవి అల్యూమినియం, చెక్కతో చేసినవాటికన్నా దృఢంగా ఉంటాయట. నేలమీద పడినా త్వరగా పగలవు. వాడి పారేస్తే నేలలోనూ కలిసిపోతాయి. అందుకే కేవలం వంటింటి పాత్రలే కాదు, మొక్కల్ని పెంచే కుండీల్ని సైతం వెదురు ఫైబర్‌తోనే తయారు చేసేస్తున్నారు. సో, అచ్చం ప్లాస్టిక్కుని తలపిస్తోన్న ఈ వెదురు సామగ్రిలో భోజనం పసందుగానే కాదు, కను‘విందు’గానూ ఉంటుందనడంలో ఇంకా సందేహమెందుకు?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు