
ఒక్కరోజు నిద్ర లోపిస్తే...
ఒక్కరోజే కదా... నిద్ర లేకపోతే ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ కేవలం ఆ ఆరు గంటల నిద్రలేమి వల్ల కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తున్నారు జపాన్‌లోని టోహా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఎందుకంటే నిద్రలేమి వల్ల జీవక్రియా లోపాలు తలెత్తడంతోపాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగినట్లు గుర్తించారు. అంతేకాదు, కాలేయంలో ట్రైగ్లిజరాయిడ్ల శాతం కూడా పెరగడంతో ఇన్సులిన్ నిరోధం ఎక్కువై దాని ఉత్పత్తి తగ్గిపోయినట్లు గుర్తించారు. ఇందుకోసం కొన్ని ఎలుకలకి ఒకరోజు నిద్రలేకుండా చేసి మర్నాడు వాటి గ్లూకోజ్ స్థాయుల్ని పరీక్షించగా అది పెరిగినట్లు తేలింది. అదే ఆహారాన్ని మరో విభాగం ఎలుకలకి ఇచ్చి, హాయిగా నిద్రపోయేలా చేయగా- వాటిల్లో గ్లూకోజ్ స్థాయులు పెరగకపోగా తగ్గినట్లు గుర్తించారు. దీన్నిబట్టి నిద్ర జీవక్రియను చాలానే ప్రభావితం చేస్తుందనీ నిద్రలేమి అనేది మధుమేహానికి దారితీస్తుందనీ స్పష్టం చేస్తున్నారు. కాబట్టి నిద్రపోకుండా అదేపనిగా ఫోనూ లేదా టీవీ చూసుకుంటూ గడిపితే లేనిపోని సమస్యని కోరి తెచ్చుకున్నటే.
ఆకుకూరలతో కండర బలం!
ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అయితే వాటిని రోజూ తినడానికి అందరూ పెద్దగా ఇష్టపడరు. కానీ రోజూ కనీసం 250 గ్రా. ఆకుకూరల్ని తీసుకోవడం వల్ల కండరాల పనితీరు బాగుంటుందని ఎడిత్ కొవన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. నైట్రేట్ ఎక్కువగా ఉండే లెట్యూస్, పాలకూర, కేల్, తోటకూర వంటి వాటితోపాటు బీట్రూట్ కూడా ఎక్కువగా తీసుకునేవాళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు వీళ్ల అధ్యయనంలో స్పష్టమైంది. నైట్రేట్ తక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకున్నవాళ్లతో పోలిస్తే అది ఎక్కువగా ఉండే ఆకుకూరల్ని తీసుకునేవాళ్ల కాళ్లల్లో బలం బాగా ఉండటమే కాదు, వాళ్లకన్నా వీళ్లు వేగంగా నడుస్తున్నట్లు గుర్తించారు. వీటివల్ల వెన్నెముక కండరాలతోపాటు గుండె కండరాల పనితీరు కూడా మెరుగ్గా ఉందట. వయసుతోపాటు వచ్చే కంటి కండరాల క్షీణత కూడా తగ్గుతుందనీ, ముఖ్యంగా వృద్ధాప్యంలో వీటిని ఎక్కువగా తినేవాళ్లు చురుగ్గా ఉంటున్నారనీ చెబుతున్నారు. అంతేకాదు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాళ్లు కూడా రోజువారీ ఆహారంలో ఆకుకూరల్ని తీసుకుంటే కండరాల పనితీరు బాగుంటుంది అంటున్నారు పరిశీలకులు.
చక్కెర తింటున్నారా?
తీపి తినడం ఆరోగ్యానికి ఏ రకంగానూ మంచిది కాదనేది తెలిసిందే. అతిగా కాకుండా అప్పుడప్పుడూ తీసుకుంటే పెద్దగా సమస్య ఉండదులె అనుకుంటాం. కానీ స్వీట్స్‌ను తగుమోతాదులో తీసుకున్నా కాలేయంలో కొవ్వు పదార్థాలు పేరుకుంటాయనీ దీర్ఘకాలంలో అది జీవక్రియను ప్రభావితం చేస్తుందనీ జ్యురిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. దీనికోసం ఆరోగ్యంగా ఉన్న వందమందిని ఎంపిక చేసి మరీ పరిశీలించి చూశారట. మిగిలినవాళ్లతో పోలిస్తే సుక్రోజ్, గ్లూకోజ్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకున్నవాళ్లలో జీవక్రియా వేగం తగ్గడంతోపాటు కాలేయంలో కొవ్వు కణాల శాతం ఎక్కువైనట్లు గుర్తించారు. ఈ పరిశోధన ఆధారంగా- రోజుకి 80 గ్రా. చక్కెర లేదా 0.8 లీటర్ల శీతల పానీయం తీసుకుంటే కాలేయంలో కొవ్వు కణాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందనీ అదలానే కొనసాగితే దీర్ఘకాలంలో ప్రమాదకరంగా పరిణమిస్తుందనీ వివరిస్తున్నారు సదరు పరిశోధకులు. కాబట్టి చక్కెర పదార్థాలతో జాగ్రత్త.
కొవిడ్‌తో వినికిడి సమస్య!
నరాలకు సంబంధించిన సమస్యలున్నవాళ్లలోగానీ కొన్ని రకాల మందుల దుష్ఫలితాల వల్లగానీ చెవిలో ఒకలాంటి మోత వస్తుంటుంది. ఈ రకమైన సమస్యనే టినిటస్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు కొవిడ్ వచ్చినవాళ్లలో కూడా ఈ సమస్య వస్తున్నట్లు గుర్తించారు మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు. అంతేకాదు, కొవిడ్ కారణంగా వినికిడి శక్తి కూడా తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు. గత ఏడాదిగా కొవిడ్ బాధితులను నిశితంగా పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమైందని పేర్కొంటున్నారు. కొవిడ్ వచ్చిన కొత్తలో వినికిడి సమస్యలున్న కేసులు తక్కువగా ఉన్నాయట. కానీ ఏడాది గడిచిన తరవాత 15శాతం మంది వినికిడి సమస్యలతో బాధపడుతున్నట్లు తేలిందట. ఈ వైరస్ నేరుగా వినికిడి వ్యవస్థను దెబ్బతీయడంతోపాటు, కొవిడ్ సోకిన సమయంలో రోగి ఎదుర్కొనే మానసిక ఒత్తిడివల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నట్లు వాళ్లు అభిప్రాయపడుతున్నారు. సో, కొవిడ్ వచ్చి తగ్గాక వినికిడి లోపం కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది అని చెబుతున్నారు సదరు పరిశోధకులు.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్