close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ పిల్లలకు ఆయనే అమ్మానాన్నా!

బాల్యం... మనిషి జీవితానికి పునాది. కానీ కొందరు పిల్లలకు అదో కుదుపుగా మారుతోంది. అమ్మానాన్నలు లేకపోవడం... ఇద్దరిలో ఎవరో ఒకరున్నప్పటికీ పోషించే స్థితిలో లేకపోవడంవల్ల ఆ బాలలు వీధి బాలలవుతున్నారు. వారి బాల్యం రైల్వేస్టేషన్లలో, బస్టాండుల్లో అల్లరిచిల్లరగా గడిచిపోతోంది. అలాంటి పిల్లల్ని చేరదీసి వారి బతుకుల్లో మళ్లీ వెలుగులు నింపుతోంది సికింద్రాబాద్‌లోని ‘తారా హోమ్‌’.

కేరళకు చెందిన ఫాదర్‌ జోస్‌ మాథ్యూస్‌ 2002 సమయంలో సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ప్యాట్రిక్స్‌ హైస్కూల్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. అప్పుడే పాఠశాల ఆవరణలోనే అనాథల కోసం ‘తారా హోమ్‌’ను స్థాపించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తోపాటు ఆ చుట్టుపక్కల వీధి బాలల్ని గుర్తించి వారిని తీసుకువచ్చి హోమ్‌లో ఆశ్రయమిచ్చి వారికి విద్యాబుద్ధులు నేర్పేవారు ఫాదర్‌ జోస్‌. తారా హోమ్‌ సేవల్ని గుర్తించిన లయోలా మిషనరీ సంస్థ... న్యూ బోయిన్‌పల్లిలో వారికున్న అయిదెకరాల స్థలాన్ని శాశ్వత హోమ్‌ ఏర్పాటు కోసం అప్పగించింది. ఆ తర్వాత దాతల సహకారంతో అక్కడ నూతన భవనాన్ని నిర్మించి... 2011లో హోమ్‌ను అక్కడికి మార్చారు. శిశు విహార్‌ నుంచి కూడా అనాథ బాలల్ని ఇక్కడికి పంపిస్తుంటారు. ప్రస్తుతం హోమ్‌లో 85మంది బాలురు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో అయిదేళ్ల పిల్లలనుంచి ఉంటారు. గత 11 ఏళ్లుగా హోమ్‌లో సేవలందిస్తున్న పద్మ, కుమార్‌రాజు దంపతులనే పిల్లలంతా తమ తల్లిదండ్రులుగా భావిస్తూ, వాళ్లని అదే విధంగా పిలుస్తూ ఆప్యాయతను చాటుకుంటున్నారు.

ఏటా విహారయాత్ర...
హోమ్‌లో ఉండే పిల్లలు... బోయిన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మౌంట్‌ కార్మెల్‌ హైస్కూల్‌లలో చదువుకుంటున్నారు. పదో తరగతి తర్వాత లయోలా అకాడమీ, కేంబ్రిడ్జ్‌ లాంటి కళాశాలల్లో పైచదువులకు వెళ్తారు. కొందరు ఎలక్ట్రీషియన్‌, డ్రైవింగ్‌ లాంటి వృత్తి విద్యల్లో శిక్షణ తీసుకుంటారు. హోమ్‌లోనే చదువుకుని ప్రస్తుతం తమిళనాడులో ఇంజినీరింగ్‌ చేస్తున్నాడో యువకుడు. 18 ఏళ్లు నిండగానే హోమ్‌ నుంచి పంపించకుండా వారికో ఆర్థిక ఆసరా దొరికాకే వెళ్లమంటారు. హోమ్‌ నుంచి వెళ్లినవాళ్లతోనూ తరచూ మాట్లాడుతూ అనుబంధం కొనసాగిస్తారు జోస్‌. కొందరికి ఆయనే పెద్దగా ఉండి హోమ్‌లోనే వివాహాలు జరిపించారు కూడా. వాళ్లు ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని సంతోషంగా సాగించడమేకాకుండా హోమ్‌కు తమవంతు సహకారాన్నీ అందిస్తున్నారు. హోమ్‌లోని పిల్లల్ని ఏటా విహారయాత్రకు తీసుకువెళ్తుంటారు. అలా ఇప్పటివరకూ తమిళనాడు, కేరళ, జమ్మూ కశ్మీర్‌, పంజాబ్‌, సిక్కిం, గోవా మొదలైన రాష్ట్రాలతోపాటు నేపాల్‌ సైతం తీసుకెళ్లారు.

అందరి పుట్టినరోజూ అప్పుడే
హోమ్‌లోని పిల్లలంతా తెల్లవారుజామున అయిదింటికే నిద్రలేచి గంటపాటు వ్యాయామం, ధ్యానం చేస్తారు. తర్వాత చదువుకుని స్కూల్‌, కాలేజీలకు వెళ్తారు. సాయంత్రం క్రీడల్లో పాల్గొనడమూ దినచర్యలో భాగమే. పిల్లల్లో పశుపక్ష్యాదులపట్ల ప్రేమభావం పెంపొందించడానికిగాను హోమ్‌ ఆవరణలోని ఆవులు, గొర్రెలు, బాతులు, కోళ్లు, కంజుపిట్టల సంరక్షణ బాధ్యతను వారికే అప్పగించారు. సంగీతంపట్ల మక్కువను పెంచేందుకు కీబోర్డు, తబలా, గిటార్‌, వయొలిన్‌లాంటివీ సమకూర్చారు. ‘ఆల్‌ పీపుల్‌ బర్త్‌ డే’గా భావించే మార్చి 19వ తేదీన హోమ్‌లో పిల్లలందరి జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున దాతల కుటుంబాల్నీ ఆహ్వానిస్తారు. ‘వివిధ కారణాలవల్ల ఇళ్లనుంచి బయటకు వచ్చిన పిల్లలు వీధి బాలలుగా మారి చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. అలాంటి వాళ్లని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని తిరిగి సన్మార్గంలోకి తీసుకొస్తున్నాం’ అని చెబుతారు ఫాదర్‌ జోస్‌. హోమ్‌ నిర్వహణలో కొవిడ్‌ సమయమే తనకో పెద్ద సవాలుగా నిలిచిందంటారు. గతేడాది లాక్‌డౌన్‌ ప్రకటించిన మరుక్షణమే పిల్లల్ని హోమ్‌కే పరిమితం చేశారు. ఈ క్రమంలోనే మొదటి మూడు నెలలకు సరిపడా వంట సామగ్రిని అందించిన ముగ్గురు దాతలతోపాటు ప్రతిరోజూ కూరగాయలను సరఫరా చేసిన బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సేవలను ఎప్పటికీ మరిచిపోలేమంటారు జోస్‌. ‘మేక్‌ ఏ డిఫరెన్స్‌’ స్వచ్ఛంద సంస్థ హోమ్‌లోని పిల్లలకు ఉచితంగా ఏడు సెల్‌ఫోన్లూ, ఆరు ల్యాప్‌టాప్‌లనూ అందించింది. ఇప్పటికీ ఆ సంస్థ వలంటీర్లు ఆన్‌లైన్‌ ట్యూషన్లు చెబుతున్నారు. అనాథలమైన తమకు నిలువ నీడనివ్వడంతోపాటు చదువూ, సంస్కారమూ నేర్పిస్తున్న జోస్‌ను పిల్లలంతా ‘ఫాదర్‌’ అని పిలిచినా, వారికి మాత్రం ఆయనో దేవుడు!

- బట్టి శ్రీకాంత్‌, న్యూస్‌టుడే కంటోన్మెంట్‌ ఫొటోలు: గూడ రాము

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు