close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ది బ్లాస్ట్‌

- శ్రీసుధామయి

ఫ్లా ష్‌... ఫ్లాష్‌... ఫ్లాష్‌...
బ్రేకింగ్‌ న్యూస్‌...
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు...
పోలీస్‌ శాఖకు సవాలు...
దేశంలో పెను సంచలనం...
మీడియాకు చేతి నిండా పని.
ఒకేసారి ఒకే రోజున వేర్వేరు రాష్ట్రాలలో  పన్నెండు మంది అమ్మాయిలు కిడ్నాప్‌ అయ్యారు. వీరందరూ కూడా ఆయా రాష్ట్రాలలో అందాల రాణులుగా ఎంపికయినవారే. ఒకే కోవకు చెందినవారు ఒకేరోజు కిడ్నాప్‌ కావడం ఆందోళనకు దారి తీస్తోంది. ఆయా రాష్ట్రాల పోలీస్‌స్టేషన్‌లలో ఒకేరోజు కిడ్నాప్‌ కేసులు నమోదైన ఆధారంగా... ఈ కిడ్నాప్‌ల వెనుక పెద్ద క్రైమ్‌ నెట్‌ వర్క్‌ ఉన్నట్టు భావిస్తున్నారు.
ఎలక్ట్రానిక్‌ మీడియా... ప్రింట్‌ మీడియా... సోషల్‌ మీడియా... ఎక్కడ చూసినా ఇవే వార్తలు. సరిగ్గా అదే సమయంలో...

*             *             *

తమిళనాడు రాష్ట్రానికి ముఖద్వారంగా పేరొందిన ప్రాంతం. ట్యుటికోరన్‌(తూత్తుకుడి) ఓడరేవు.
తీరంలో ఆగి ఉన్న రెండు మూడు నౌకలను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
ఒకపక్కగా ‘‘సెల్వానా’’ వాణిజ్య నౌక ఆగి ఉంది. ఆ నౌక కెప్టెన్‌ అయిన సిరాజ్‌ ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. నౌకలోకి ప్రవేశించిన పర్మిట్‌ అధికారులు అక్కడున్న వస్తువులను పరిశీలించసాగారు.
ఇలా పర్మిట్‌ అధికారులు నౌక తనిఖీకి రావడం కొత్త కాకపోయినా కొత్త కొత్త రూల్స్‌ ప్రకారం నౌకను క్షుణ్ణంగా తనిఖీ చేయడం సిరాజ్‌కు ఆందోళన కలిగిస్తోంది.
కానీ ఆ ఆందోళనను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉలికిపాటును దాచుకుంటూనే ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుంది అతడి వాలకం.
నౌకలో ఒక పక్క ముడిఇనుమూ బొగ్గుతో పాటూ, కంబళ్లూ ఉన్ని వస్త్రాలూ తోలు వస్త్రాలూ పేర్చి ఉన్నాయి. వాటన్నిటినీ పరిశీలిస్తూ నౌక మొత్తం కలియచూసిన అధికారులు ఒకచోట ఆగిపోయారు.
అక్కడ... ఒక గది పరిమాణంలో ఏవో వస్తువులు పేర్చి ఉన్నాయి. వాటి దగ్గరగా వెళ్తున్న అధికారులను ఆపడానికి ఏం చేయాలా అని సిరాజ్‌ ఆలోచించసాగాడు. పర్మిట్‌ అధికారులు ఇంతలో ఆ వస్తువులను బయటకు తీశారు. అవి వస్త్రాల సంచులు. వాటి మధ్య డిటెక్టర్‌ను పెట్టబోతుండగా... ‘ఆగండి’ అని వినిపించింది. అందరూ ఆ వైపుగా తిరిగి చూశారు. అక్కడ ఒక పర్మిట్‌ డైరెక్టర్‌ ఉన్నాడు. అతడిని చూసిన పర్మిట్‌ అధికారులు సెల్యూట్‌ చేస్తూ డిటెక్టర్‌ అతడికి అందించారు. అతడు ఆ డిటెక్టర్‌ను అందుకుని అక్కడా ఇక్కడా పరిశీలించాడు. తర్వాత పెద్ద పరిమాణంలో వస్త్రాల సంచులను పేర్చిన చోటుకి వెళ్లాడు. ఆ సంచుల మధ్య డిటెక్టర్‌ని ఉంచి లాఘవంగా డిటెక్టర్‌లో ఉన్న సౌండ్‌ బీపర్‌ను పనిచేయకుండా చేశాడు. తర్వాత చెక్‌ చేసినట్టు నటిస్తూ డిటెక్టర్‌ను బయటకు తీశాడు. యథాప్రకారం డిటెక్టర్‌ బీపర్‌ను ఆన్‌చేసి అక్కడున్న వారికి ఇచ్చేశాడు. అధికారులు నౌకనుండి వెళ్లిపోయారు.
జరిగింది చూసిన సిరాజ్‌ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. కదలకుండా అక్కడే ఉన్న ఒక కళాసీకి సైగ చేస్తూ పక్కకు కదిలాడు.

*             *             *

ట్యుటికోరన్‌ తీరం నుండి మెల్లిగా ముందుకు కదిలింది సెల్వానా నౌక. క్రమంగా వేగం పుంజుకుని ముందుకు సాగింది. కళాసీ వేషంలో ఉన్న ఆ వ్యక్తి సిరాజ్‌ వద్దకు వచ్చాడు. ఇద్దరూ కలిసి నౌక మీదకి వచ్చారు.
అక్కడున్న వస్త్రాల సంచులను తొలగించగానే కొంతమేర నౌక పైన ఉండే డెక్‌ కనిపించింది.
అటూ ఇటూ చూసి, తమను ఎవరూ గమనించలేదని నిర్ధారించుకున్న తర్వాత... ఆ డెక్‌ మీదున్న చెక్కను తొలగించారు. ఆ చెక్క కింద లోపలకు దిగడానికి మెట్లు ఉన్నాయి. ఇద్దరూ కలిసి నౌక అడుగు భాగంలో ఉన్న గదిలోకి ప్రవేశించారు.
అక్కడ...కిడ్నాప్‌ చేయబడిన పన్నెండు మంది అమ్మాయిలు... వారందరికీ, చేతులు కట్టేసి ఉన్నాయి. అందరూ భయంతో బిగుసుకుని ఉన్నారు. వారి పక్కనే బాంబులు నింపిన సంచులు. సిరాజ్‌తో వచ్చిన కళాసీ ఆ అమ్మాయిల్ని చూస్తూ... ‘‘మీలో ఎవరైనా  తప్పించుకునే ప్రయత్నం చేస్తే... చూడండి... మీ పక్కనే బాంబులు ఉన్నాయి. అవి పేలాయంటే మీరందరూ నామరూపాల్లేకుండా పోతారు. కాబట్టి బుద్ధిగా కదలకుండా కూర్చోండి’’ అని క్రూరంగా నవ్వుతూ వారిని హెచ్చరించాడు. తర్వాత ఆ గది తాళం బిగించి ఇద్దరూ కలిసి నౌక మీదకు వచ్చారు.

*             *             *

గదిలో బంధించిన అమ్మాయిలు భయంతో వణికిపోతూ బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు. వారిలో ఒక అమ్మాయి మాత్రం తీవ్రంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది.
ఏడుస్తున్న అందరినీ చూస్తున్న ఆ అమ్మాయి... ‘‘ముందు మీరందరూ ఏడుపు ఆపండి’’ అంది. ఆ అమ్మాయి మాటలు విన్న అందరూ ఒక్కసారిగా ఏడుపు ఆపేసి ఆ అమ్మాయిని చూశారు. వారందరినీ చూస్తూ ఆ అమ్మాయి... ‘‘నా పేరు సుహానా. మనం అందరం వీళ్ల వలలో చిక్కుకున్నాం. వీళ్లు మనల్ని ఎక్కడికో తీసుకెళ్లి ఎవరికో అమ్మేస్తారు. కానీ మనకు ఆ ప్రదేశం చేరేవరకూ సమయం ఉంది. ఇక్కడ నుండి తప్పించుకోవడానికి మార్గం వెతుకుదాం. చివరి నిమిషం వరకూ పోరాడదాం. ఇప్పుడు మనకున్న ఈ సమయం అత్యంత విలువైనది. ఈ సమయాన్ని మనల్ని రక్షించుకోవడానికి ఉపయోగిద్దాం. ఏడవడానికి కాదు’’ అని చెప్తూ మిగిలిన వారిలో ధైర్యాన్ని నింపింది.
సుహానా మాటలతో వారందరికీ కాస్త ధైర్యం వచ్చింది. ఏం చేయాలా అని అందరూ చర్చించుకోసాగారు.

*             *             *

నౌక పైన ఉన్న సిరాజ్‌ తన గదివైపు వెళ్లాడు. అతడి వెనుక ఉన్న కళాసీ కూడా అక్కడనుండి వెళ్లిపోయేంతలో... అతడి దగ్గర ఉన్న ఫోన్‌ మోగింది.
ఫోన్‌లో అవతల వ్యక్తి చెబుతున్న మాటలు వింటుంటే ఆ కళాసీకి మొహంలో రంగులు మారసాగాయి. కంగారు పడుతూ మాట్లాడసాగాడు. ఫోన్‌ పెట్టేశాక ఆందోళనగా సిరాజ్‌ వద్దకు వెళ్లాడు.
సిరాజ్‌ ఆ కళాసీని చూసి ‘‘ఏమైంది?’’ అని అడిగాడు
‘‘మా బాస్‌ ముస్కర్‌ నుండి ఫోన్‌ వచ్చింది. కిడ్నాప్‌ చేసిన అమ్మాయిల గురించి అప్పుడే అంతటా గగ్గోలు మొదలైందట. ఈ కేసును ఛేదించే పనికూడా మొదలైందట’’ అని చెప్పాడు ఆ కళాసీ కంగారుపడుతూ. సిరాజ్‌కు వెన్నులో వణుకు మొదలైంది. తాను డబ్బు మీద దురాశతో ముస్కర్‌ ముఠాతో చేతులు కలిపాడు. ముస్కర్‌ సామాన్యుడు కాదు. పేరు మోసిన మాఫియా డాన్‌.
అమ్మాయిలనూ పిల్లలనూ కిడ్నాప్‌ చేసి విదేశాలకు అమ్మడంలో అతడిది అందె వేసిన చేయి. ఒక్క కేసులో కూడా దొరక్కుండా తాను అనుకున్నది చేయడం అతడి ప్రత్యేకత. ఏదైనా తేడా వచ్చిందంటే- తమ తప్పు ఉన్నా లేకపోయినా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. సిరాజ్‌ భయంతో పట్టిన చెమటను తుడుచుకున్నాడు.
ఆ కళాసీ ‘‘మనం ఇప్పుడు ఎక్కడిదాకా వచ్చాం? తర్వాత రాబోయే తీరం ఏది?’’ అని అడిగాడు సిరాజ్‌ను.
‘‘దాదాపు నలభై కిలోమీటర్లు ప్రయాణించాం. ఇంకో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే కులశేఖర పట్టణం వస్తుంది’’ అని చెప్పాడు సిరాజ్‌.
‘‘కులశేఖర పట్టణం చేరుకునే ముందు తీరంలో నిర్మానుష్య ప్రదేశంలో నౌకను లంగరు వేసి ఉంచు. ప్రయాణికులకు ఏ మాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించు. అదే సమయంలో నేను ఆ అమ్మాయిలను మరో పడవలోకి ఎక్కిస్తాను. ఇదంతా నీకూ నాకూ తప్ప మరెవరికీ తెలియకూడదు. జాగ్రత్త’’ అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు ఆ కళాసీ.

*             *             *

సుహానా మాట్లాడుతుంటే ధైర్యంగా అనిపించింది మిగిలినవారికి. బాగా ఆలోచించి ఏం చేయాలో వారికి వివరించింది సుహానా. అతి కష్టంమీద ఇద్దరు అమ్మాయిలు తమ నోటితో సుహానా చేతులను కట్టేసిన తాడును విప్పదీశారు. సుహనా అందరి దగ్గరకూ వెళ్లి వారి చున్నీలు తీసుకుంది. ఆ చున్నీలను ఒకదానితో ఒకటి తన దగ్గరున్న సేఫ్టీ పిన్నులతో తగిలించసాగింది. అలా తగిలించిన ఆ చున్నీలు పొడవుగా తయారయ్యాయి. దానిని తన డ్రెస్‌కు అడ్డంగా వేసుకుంది. తర్వాత తన చేతులకు తాడు చుట్టుకుని ఎప్పటిలాగానే కూర్చుంది.

*             *             *

కులశేఖర పట్టణ తీరం...
సెల్వానా నౌక ఒకచోట లంగరు వేసి ఉంది. అమ్మాయిలను బంధించిన గది అడుగు భాగంలో ఉన్న అత్యవసర ద్వారం తెరుచుకుంది. ఆ ద్వారం నుండి కళాసీ ఆదేశం ప్రకారం ఒక్కొక్క అమ్మాయి అక్కడున్న చిన్న పడవలోకి దిగుతోంది. ఆ పడవ నుండి అక్కడే ఒక పక్కగా ఆపి ఉన్న సబ్‌ మెరైన్‌లోకి పంపిస్తున్నారు. పదకొండు మంది అమ్మాయిలు ఆ సబ్‌ మెరైన్‌లోకి వెళ్లాక చివరి అమ్మాయిగా సుహానా అత్యవసర ద్వారం వద్దకు వచ్చింది. కళాసీ కొంచెం ఏమరుపాటుగా ఉండటం గమనించి, తన మీద వేసుకున్న పొడవైన చున్నీ నీటిలో పడేటట్టుగా ముందుకు తూగింది. గాలివాటుకు ఆ చున్నీలు నీటిలో పడిపోయాయి. అది చూసిన సుహానా ‘అమ్మయ్యా’ అనుకుని కళాసీతో పాటూ సబ్‌ మెరైన్‌లోకి ప్రవేశించింది.
కళాసీ లోపలకు వెళ్లాడు. సబ్‌ మెరైన్‌ నడుపుతున్న వ్యక్తి వద్దకు వెళ్లి తొందరగా కదలమని ఆదేశించాడు. ఆ ఆదేశం వినగానే సబ్‌ మెరైన్‌ నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా వెనుతిరిగి కళాసీని చూశాడు. ఆ వ్యక్తిని చూసిన కళాసీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ వ్యక్తి... మాఫియా డాన్‌ ముస్కర్‌.

*             *             *

ఐ ఎన్‌ ఎస్‌ విహార్‌ సముద్రజలాల్లో విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉంది.
విజయ్‌ చౌహాన్‌ కెప్టెన్‌.
వందమంది నావికులతో పాటు ఆయుధాగారంలో దాదాపు అరవై తేలిక రకమైన టార్పెడోలు ఉన్నాయి. సీ వారియర్‌ విమానాలను నడపగల సామర్థ్యం ఉన్న విహార్‌ విమాన నౌక కెప్టెన్‌ విజయ్‌ చౌహాన్‌ అధ్వర్యంలో సముద్రంలో ముందుకు సాగింది.
సముద్ర జలాలలో నీటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతున్న విహార్‌ నుండి సముద్ర ప్రాంతాన్ని నిశితంగా పరికిస్తున్నాడు విజయ్‌ చౌహాన్‌.
కొద్దిసేపటి తర్వాత...
సముద్రంలో సుదూరంగా తదేకంగా చూస్తున్న విజయ్‌కు ఏదో వస్తువు కొట్టుకొస్తున్నట్టు కనిపించసాగింది. తన వద్ద ఉన్న శక్తివంతమైన బైనాక్యులర్స్‌తో చూడగా ఆ కనిపిస్తున్నది ఎవరివో దుస్తులని అర్థమైంది విజయ్‌కు. వెంటనే విహార్‌ నౌకను అటువైపుగా మళ్లించమని ఆదేశించాడు. ఆ ప్రాంతంలో ఎవరైనా నీళ్లలో దూకారేమో అన్న అనుమానం కలిగింది విజయ్‌ చౌహాన్‌కు. క్షణాలలో అక్కడికి చేరుకున్న విహార్‌ నౌక నుండి మరింత పరిశీలనగా గమనించాడు విజయ్‌. అవి దుస్తులు కాదనీ... చున్నీలనీ గమనించాడు. వాటిని డెక్‌ మీదకు తెప్పించాడు. అవి ఒకదానికొకటి జతపరిచి ఉన్నాయి. అది చూసిన విజయ్‌ చౌహాన్‌కు ఎక్కడో అనుమానం మొదలై బలపడసాగింది.
అమ్మాయిల చున్నీలు- ఒకటి కాదు, మొత్తం పన్నెండు. అవి కూడా ఒకదానితో మరొకటి జత చేసి ఉన్నాయి. అతని మెదడు చురుగ్గా ఆలోచించసాగింది. అవి కేవలం సముద్రంలో కొట్టుకువచ్చిన చున్నీలు కావు. చున్నీలకు ఉన్న సేఫ్టీ పిన్స్‌ ఒక పద్ధతి ప్రకారం... ఒక హింట్‌ ఇస్తున్నట్టుగా... ఒక ఆపదను సూచిస్తున్నట్టుగా ఉన్నాయి. నేవీలో పని చేస్తున్న అతడికి ఈ విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఏదో జరిగిందనీ... ఎవరో ప్రమాదంలో చిక్కుకున్నారనీ ఇట్టే గ్రహించగలిగాడు విజయ్‌.
నావిగేషనల్‌ సిస్టం రూమ్‌లో ఒక కంప్యూటర్‌లో డిస్‌ప్లే అవుతున్న న్యూస్‌ని కనురెప్ప వేయకుండా జాగ్రత్తగా గమినించసాగాడు విజయ్‌ చౌహాన్‌. ఒక న్యూస్‌ మీద అతడి కళ్లు ఆగిపోయాయి.
అది వివిధ రాష్ట్రాలనుండి కిడ్నాప్‌ అయిన పన్నెండుమంది అమ్మాయిల గురించి వస్తున్న వార్తలు. అవన్నీ జాగ్రత్తగా చూశాడు విజయ్‌. ఆ వార్తలకీ ఆ దొరికిన చున్నీలకీ ఏదో బలమైన లింక్‌ ఉన్నట్లు అనిపించింది. ఆలోచిస్తూ తిరిగి డెక్‌ మీదకు వచ్చాడు.
సముద్రపు నీటిని యథాలాపంగా చూస్తున్న విజయ్‌ చౌహాన్‌కు దూరంగా తిమింగలం అంత ఉన్నది ఏదో నీటిలో బుడుంగున మునిగినట్టు అనిపించింది. క్షణంలో వెయ్యోవంతు సమయంలో... కేవలం లిప్తపాటు కాలంలో సముద్రంలో మునిగింది ఏమిటో విజయ్‌ చౌహాన్‌కు అర్థం కాలేదు. తిమింగలం కాదని బలంగా అనిపించింది. ఒక్క క్షణం అలా కళ్లు మూసుకున్నాడు. నీటిలో మునిగిన దాన్ని జాగ్రత్తగా స్ఫురణకు తెచ్చుకుంటున్నాడు.
ఒక్కసారిగా మైండ్‌లో ఫ్లాష్‌ అయింది... అది ఫ్యాన్‌లో తిరుగుతున్న ప్రొపెల్లర్‌! సబ్‌ మెరైన్‌లు మాత్రమే నీటిలో మునగగలవు. వాటికి మాత్రమే ప్రొపెల్లర్స్‌ ఉంటాయి. ఈ ఆలోచన రాగానే విజయ్‌ చౌహాన్‌కు ఎక్కడో ఉన్న చిక్కుముడి ఇక్కడ విడిపోతున్నట్లు అనిపించింది. ఆ సబ్‌ మెరైన్‌లో కిడ్నాప్‌ అయిన అమ్మాయిలు ఉన్నారేమో అన్న ఆలోచన వేగంగా కమ్ముకుంది.
అది డీజిల్‌తో నడిచే సబ్‌ మెరైన్‌ కాబట్టి డీజిల్‌ మండి జనరేటర్‌ పని చేయాలి. అంటే ఆక్సిజన్‌ ఉండాలి. నీటిలోపల ఆక్సిజన్‌ ఉండదు కాబట్టి ఆక్సిజన్‌ కోసం నీటి అడుగున ఉన్న సబ్‌ మెరైన్‌లు నీటిపైకి తప్పక వస్తాయని విజయ్‌ చౌహాన్‌కు చప్పున స్ఫురించింది.
వెంటనే విహార్‌ నౌకలో ఉన్న కొంత మంది డైవర్స్‌ను నీటి అడుగున ఏం జరుగుతుందో పరిశీలించమని ఆదేశించాడు. అతడి ఆదేశంతో అక్కడున్న పది మంది డైవర్లు సముద్రపు నీటిలోకి డైవింగ్‌ చేస్తూ కిందకు జారిపోయారు.

*             *             *

సబ్‌ మెరైన్‌ నడుపుతున్న ముస్కర్‌ దానికి అమర్చిన పెరిస్కోపు ద్వారా మూడు వందల అరవై డిగ్రీల కోణంలో సముద్రం పై భాగాన గమనిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆక్సిజన్‌ కోసం నీటిపైకి సబ్‌ మెరైన్‌ను తీసు కొచ్చాడు. ఇంతలో ఎంతో దూరంలో ఉన్న ఐ ఎన్‌ ఎస్‌ విహార్‌ నౌక ముస్కర్‌ కంటపడింది. ఆ నౌకలో ఉన్నవారికి తన సబ్‌ మెరైన్‌ కనిపిస్తే చిక్కుల్లో పడతానని భావించిన ముస్కర్‌ రెప్పపాటులో తిరిగి నీటిలోకి దిగి పోయాడు. కానీ, ఆ రెప్పపాటు కాలంలోనే సబ్‌ మెరైన్‌ను విజయ్‌ చౌహాన్‌ చూశాడు.
నీటి అడుగు భాగానికి వెళ్లిన డైవర్లు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా గాలిస్తున్నారు. కానీ వారికి ఏమీ కనిపించడం లేదు. మరింత ముందుకు వెళ్లాక, వారికి నీటి అడుగున వెళుతున్న సబ్‌ మెరైన్‌ వెనుక భాగం కనిపించింది.
వెంటనే వారిలో ఒక డైవర్‌ నీటి పైకి వచ్చి జి పి ఎస్‌ ద్వారా విజయ్‌ చౌహాన్‌కి సమాచారం అందించారు. తక్షణమే వారున్న ప్రాంతానికి విహార్‌ నౌకలో ఉన్న సెమీ సబ్‌ మెరైన్‌లను పంపించడానికి ఉద్యుక్తుడయ్యాడు విజయ్‌ చౌహాన్‌.
కేవలం పదిహేను నిమిషాలలో నాలుగు సెమీ సబ్‌ మెరైన్‌లు సముద్రజలాల్లో ప్రవేశించి ముస్కర్‌ వెళుతున్న వైపుగా ముందుకు సాగాయి.
పెరిస్కోపు ద్వారా ఆ నాలుగు సబ్‌ మెరైన్‌ లను చూడనే చూశాడు ముస్కర్‌. తన సబ్‌ మెరైన్‌ వేగాన్ని మరింత పెంచాడు. సముద్ర గర్భంలో సినిమా ఫక్కీలో ఛేజింగ్‌ జరుగుతోంది.
విజయ్‌ చౌహాన్‌ ఉన్న సబ్‌ మెరైన్‌ మరింత ముందుకు దూసుకెళుతోంది. మిగిలిన వారు అతడిని అనుసరిస్తున్నారు.

*             *             *

విజయ్‌ చౌహాన్‌ కళ్లూ మెదడూ వేగంగా పని చేస్తున్నాయి. రెప్ప వేయకుండా చూస్తున్నాడు. ముస్కర్‌ నడుపుతున్న సబ్‌ మెరైన్‌ దూరాన్ని అంచనా వేశాడు. శిక్షణలో తాను నేర్చుకున్న విషయాలను సాహసంతో ముడివేశాడు. గట్టిగా ఊపిరిపీల్చి గాలిలోకి డైవ్‌ చేశాడు. మిగిలిన వారు కూడా అలాగే డైవ్‌ చేశారు.
ఒక్కసారిగా భూమి కంపించినట్టూ సముద్రంలో సునామీ వచ్చినట్టూ ఉలిక్కిపడ్డాడు ముస్కర్‌.
ఎదురుగా... విజయ్‌ చౌహాన్‌.
‘‘నో ఛాయిస్‌ ముస్కర్‌... లొంగిపోవడమో, చచ్చిపోవడమో... ఓన్లీ వన్‌ ఆప్షన్‌’’ అతనివైపు చూస్తూ అన్నాడు విజయ్‌ చౌహాన్‌ అలా అంటూనే అతని కళ్లు అన్వేషిస్తున్నాయి. అప్పుడు కనిపించారు పన్నెండు మంది అమ్మాయిలు...
విజయ్‌ చౌహాన్‌ను వారందరూ చూశారు. కెప్టెన్‌ డ్రెస్‌లో ఉన్న అతన్ని చూడగానే వారందరికీ పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అనిపించింది. ముస్కర్‌ మెదడు చురుగ్గా ఆలోచిస్తోంది. ఈ సమయంలో తనను తాను కాపాడుకోవాలంటే... ఒక్క ఉదుటున ఆ అమ్మాయిల దగ్గరికి పరిగెత్తాడు. తన దగ్గర ఉన్న గన్‌ను అమ్మాయిల తలలకు గురి పెట్టాడు.
‘‘మిస్టర్‌ ఆఫీసర్‌... నా దగ్గరికి వస్తే వీళ్ల శవాలు మీ దగ్గరకు వస్తాయి’’ హెచ్చరించాడు ముస్కర్‌.
విజయ్‌ చౌహాన్‌ ముస్కర్‌ వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వు ముస్కర్‌ని కంగారు పెట్టింది. ‘‘ఎందుకు నవ్వుతున్నావ్‌, నేను నిజంగానే షూట్‌ చేస్తాను’’ ...ముస్కర్‌లో భయం అనుమానం.
‘‘నువ్వు ఒక బులెట్‌ ఖర్చుచేసేలోగా, నీ వెనుక ఉన్న మా ఆఫీసర్‌ ఆరు బుల్లెట్స్‌ నీ తలలోకి దించుతారు’’ తాపీగా అన్నాడు విజయ్‌.
ఉలిక్కిపడ్డ ముస్కర్‌ వెనక్కి తిరిగాడు. ఆ కొద్ది క్షణాలు చాలు విజయ్‌ చౌహాన్‌ లాంటి సాహసి అయిన ఆఫీసర్‌కు. కళ్లుమూసి తెరిచేలోపే ముస్కర్‌ని చేరుకున్నాడు. లిప్తకాలంలో అంతా జరిగిపోయింది. ముస్కర్‌ చేతిలోని గన్‌ ఓ మూలకు పడింది. అతని రెండు చేతులూ వెనక్కి విరిచి కట్టేశాడు.

*             *             *

తీరంలో ఆగింది సబ్‌ మెరైన్‌.
పన్నెండు మంది అమ్మాయిలు విజయ్‌ చౌహాన్‌తో కలిసి బయటకు అడుగు పెట్టారు. అమ్మాయిల కళ్లలో కృతజ్ఞతాభావం.
అప్పటికే ఆ వార్త మీడియాను చేరింది. హోమ్‌ మినిస్టర్‌, ప్రధాని, ప్రెసిడెంట్‌... అందరి నుంచీ ఫోన్‌లో అభినందనలు.
అక్కడున్న కోస్ట్‌గార్డ్‌ అధికారులు సబ్‌ మెరైన్‌లో ఉన్న బాంబులను బయటకు తీసుకొచ్చారు.
విజయ్‌ చౌహాన్‌ అమ్మాయిల వైపు చూసి ‘‘మీరిక నిశ్చింతగా మీ ఇళ్లకు వెళ్లొచ్చు. ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందంతో పాటూ సాహసం కూడా మీ స్వంతం. ఆపదలో ఉన్నప్పుడే ఆలోచన రావాలి. ప్రమాదంలో ఉన్నప్పుడే సాహసం చేయాలి...’’ అభినందన పూర్వకంగా అన్నాడు.
‘‘సాహసం చేసింది మీరు సార్‌... సాహసం అంటే ప్రాణాలకు తెగించి ఆపదలో ఉన్నవారిని రక్షించడమే అని మీరు నిరూపించారు’’ అమ్మాయిలు చేతులు జోడించారు. అందులోని సుహానా అనే అమ్మాయి రెండు అడుగులు ముందుకు వేసి... ‘‘సార్‌ ఒక చిన్న రిక్వెస్ట్‌’’ అంది.
‘‘చెప్పమ్మా’’ అన్నాడు మృదువుగా విజయ్‌ చౌహాన్‌.
‘‘వీడిని అరెస్ట్‌ చేసి కోర్టులకు తిప్పి, మమ్మల్ని సాక్షులుగా పిలిచి, మీ సాహసాన్ని కూడా మరోసారి విచారించి... ఇదంతా అవసరమా... వీడు మమ్మల్ని బంధించిన క్షణం నుంచి భయంతో చచ్చి బతికాం. ఇలాంటి వీడిని...’’ అని ఆగింది.
విజయ్‌ చౌహాన్‌కు అర్థమైంది. చేతులు వెనక్కి విరిచి కట్టివేయబడిన ముస్కర్‌ వంక చూశాడు. ఆయుధాల వ్యాపారం, బాంబులను ఉగ్రవాదులకు విక్రయించడం, మహిళల అక్రమ రవాణా...
ముస్కర్‌ కట్లువిప్పాడు. తన రివాల్వర్‌ అతడి వైపు గురిపెట్టి సబ్‌ మెరైన్‌లోకి ఎక్కించాడు ముస్కర్‌ను. బయటకు తీసుకువచ్చిన బాంబులను మళ్లీ లోపలికి చేర్చారు. ఒక నిమిషం తరవాత అవి పేలేలా టైమర్‌ను సెట్‌ చేశారు.
సబ్‌ మెరైన్‌లో ముస్కర్‌... ఆయుధాలూ, బాంబులూ...
అమ్మాయిలు ముందుకు పరుగెత్తారు... విజయ్‌ చౌహాన్‌తో సహా...
తొమ్మిది ఎనిమిది ఏడూ ఆరూ అయిదూ నాలుగూ మూడూ రెండూ ఒకటి...
పెద్ద విస్ఫోటనం.
ఏ సబ్‌ మెరైన్‌తో విధ్వంసాన్ని సృష్టించే మారణాయుధాలనూ బాంబులనూ రవాణా చేస్తున్నాడో... ఏ సబ్‌ మెరైన్‌తో మహిళలను అక్రమంగా తరలించి వారిని విక్రయించడానికి ఆలోచించాడో... ఆ సబ్‌ మెరైన్‌తో సహా పేలిపోయి... బూడిదైపోయాడు... మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ముస్కర్‌.

*             *             *

ముస్కర్‌ మాకు ఎదురుతిరిగి సబ్‌ మెరైన్‌తో సహా పేలిపోయి చనిపోయాడు... ఫోన్‌లో ఉన్నతాధికారులకు చెబుతున్నాడు విజయ్‌ చౌహాన్‌.

*             *             *

విజయ్‌ చౌహాన్‌ ముందుకు వెళ్తుంటే అమ్మాయిలు సెల్యూట్‌ చేస్తున్నారు. సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వారి సాహసానికి నిలువెత్తు కెరటమై అభినందనలు అందిస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు