close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ని ఇట్టే పసిగట్టేస్తుంది!

కొవిడ్‌ పరీక్ష చేయించుకోవడం ఒక ఎత్తయితే, దాని ఫలితం కోసం నిరీక్షించడం మరోకెత్తు. అందుకే సాల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు నిమిషాల్లో కొవిడ్‌ను పసిగట్టే ‘నిర్వాణ’ అనే పరికరాన్ని తయారుచేశారు. కేవలం కొవిడ్‌ వైరస్‌ ఒక్కటే కాదు, ఇన్‌ఫ్లుయెంజా వంటి వాటినీ ఇది గుర్తిస్తుందట. దీనికోసం ఖరీదైన పరికరాలు కూడా అవసరం లేదు అంటున్నారు.  కాబట్టి కొవిడ్‌ను నిమిషాల్లో పరీక్షించి తెలుసుకోవడం ద్వారా దాని వ్యాప్తిని నిరోధించగలం. ఎందుకంటే ఇది కొందరిలో చికిత్సకీ వ్యాక్సిన్‌కీ కూడా లొంగడం లేదు. ప్రస్తుతం చేస్తున్న స్వాబ్‌ పరీక్షలో వైరస్‌ను దాని జన్యుపదార్థం ద్వారానే గుర్తిస్తున్నారు. అందులో అది ఏ రకమైన కొవిడ్‌ వైరస్‌ అనేది గుర్తించలేం. అయితే కొత్తగా ఈ బృందం కనుగొన్న నిర్వాణ పరికరం సార్స్‌కోవ్‌-2తోపాటు ఇన్‌ఫ్లుయెంజా-ఎ, హ్యూమన్‌ ఎడినో వైరస్‌... ఇలా అన్ని రకాల్నీ 15 నిమిషాల్లో గుర్తించి రిపోర్టు ఇస్తుంది.అది ఏ స్ట్రెయిన్‌ అనేదాన్ని కూడా పసి గడుతుంది. కాబట్టి దీన్ని స్కూళ్లూ ఎయిర్‌పోర్టుల్లో వాడటం వల్ల వైరస్‌ వ్యాప్తిని చాలావరకూ అరికట్టగలం అని వివరిస్తున్నారు.

మాస్కుకి మూడు పొరలు!

కొవిడ్‌ కేసులు మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. అయినా మాస్కులు పెట్టుకోనివాళ్లు కొందరైతే, పెట్టుకున్నా దాన్ని గడ్డంమీద అలంకారంగా పెట్టుకునేవాళ్లు మరికొందరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటీ రెండూ కూడా కాదు, మూడు పొరలు ఉండే మాస్కులయితేనే కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోగలవు అంటున్నారు శాన్‌డీగోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఈ వైరస్‌ అనేది ముక్కు ద్వారానే ఎక్కువగా లోపలకు ప్రవేశిస్తుందనేది తెలిసిందే. అయితే మాస్కుకి మూడు పొరలు ఉండటం వల్ల వైరస్‌ వడబోత ప్రక్రియ మూడు దశలుగా జరిగి ప్రమాదం తగ్గుతుంది. ఇందుకోసం వీళ్లు రకరకాల మాస్కుల్ని పరిశీలించగా- దగ్గినప్పుడూ తుమ్మినప్పుడూ వెలువడే వైరస్‌తో కూడిన పెద్ద సైజు తుంపర రేణువుల్ని ఒకటీ రెండు పొరలు అడ్డుకుంటాయి. కానీ మరీ చిన్నగా ఉండేవి మాత్రం ఆ రెండింటిలోంచీ వెళ్లే అవకాశం ఉంది. పైగా ఒకటే పొర ఉంటే తుంపరలోని రేణువుల్ని 30 శాతం, రెండు పొరలుంటే 91 శాతం నిరోధించగలుగు తున్నాయనీ అదే మూడు పొరలుఉన్నప్పుడు వైరస్‌ లోపలకు చేరే అవకాశమే లేదనీ గుర్తించారట. కాబట్టి త్రీ లేయర్డ్‌ మాస్క్‌ అయితేనే కొవిడ్‌ను శక్తిమంతంగా అడ్డుకోగలదు అని చెబుతున్నారు.

మాంసాహారం తింటే..!

మాంసాహారం ఎప్పుడూ మంచిది కాదనేది తెలిసిందే. అందులోనూ ప్రాసెస్డ్‌ మాంసాన్ని తింటే హృద్రోగాలు పొంచే ఉంటాయని హామిల్టన్‌ పరిశోధకులు పేర్కొంటున్నారు. అదే ప్రాసెస్‌ చేయని రెడ్‌ మీట్‌, చికెన్‌ల వల్ల అలాంటి ప్రమాదం కనిపించలేదని పేర్కొంటున్నారు. దీనికోసం ఐదు ఖండాల్లోని 21 దేశాల్లో సుమారు లక్షన్నరమంది ఆహారపుటలవాట్లనీ ఆరోగ్యాన్నీ పరిశీలించారట. అందులో వారానికి 150 గ్రా. ప్రాసెస్డ్‌ మాంసాన్ని తీసుకునేవాళ్లలో 46 శాతం హృద్రోగాలకూ, 51 శాతం గుండెపోటు మరణాలకూ గురవుతున్నట్లు గుర్తించారట. అదే ప్రాసెస్‌ చేయని మాంసాన్ని తీసుకున్నవాళ్లలో ఈ రకమైన సమస్యలు అంతగా కనిపించలేదట. మొత్తమ్మీద మాంసాహారానికీ హృద్రోగాలకీ సంబంధం ఉందనేదయితే నిజం. కాబట్టి దాన్ని వీలయినంత తక్కువ తినడమే మేలు అంటున్నారు.

జుట్టు మళ్లీ వస్తుందా?

జుట్టు కాస్త ఊడినా మళ్లీ వస్తుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఊడిపోయి తిరిగిరాదు. అందుకు కారణం ఒత్తిడిని కలిగించే కార్టికొస్టెరాన్‌ అనే హార్మోనేననీ, ఇది జుట్టు కుదుళ్లకు చెందిన మూలకణాలను స్తబ్దుగా మారుస్తుందనీ అందువల్లే మళ్లీ కొత్త వెంట్రుకలు రావడం లేదనీ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎలుకల్లో చేసిన పరిశోధన ఆధారంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అదెలా అంటే- ఒత్తిడికి సంబంధించిన సంకేతం ముందుగా జుట్టు కుదుళ్ల చుట్టూ ఉండే చర్మ కణాలకు చేరుతుంది. అక్కడి నుంచే అది జుట్టు పెరుగు దలకి కారణమైన గ్యాస్‌6 అనే హార్మోన్‌ను మూల కణాలు విడుదల చేయకుండా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. దాంతో వీళ్లు జుట్టు కుదుళ్ల చుట్టూ ఉండే చర్మ కణాలకు గ్యాస్‌6 హార్మోన్‌ను ఇంజెక్టు చేయగా- శిరోజాలకు సంబంధించిన మూల కణాలు ఉత్తేజితమై మళ్లీ కొత్త వెంట్రుకల్ని ఉత్పత్తి చేసినట్లు గుర్తించారు. పైగా ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ హార్మోన్‌ను ఇంజెక్టు చేయడం వల్ల వాటి పెరుగుదలకి ఎలాంటి అడ్డంకీ ఏర్పడలేదట. అంతేకాదు, ఒత్తిడికి కారణమైన హార్మోన్‌ను పూర్తిగా తొలగించినప్పుడు మూలకణాలు చురుకుగా మారాయనీ, వయసు పెరుగుతున్నా జుట్టు ఊడిపోకుండా పెరుగుతూనే ఉందనీ గుర్తించారు. సాధారణంగా జుట్టు కుదుళ్లు కొన్నిరోజులపాటు చురుగ్గా ఉండి, మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాయట. అవి విశ్రాంతి దశలో ఉన్నప్పుడు- వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ కొత్త పరిశోధన ఆధారంగా- మూలకణాలు ఎక్కువకాలం స్తబ్దుగా ఉన్నప్పుడే జుట్టు బాగా ఊడిపోతుందనీ అందుకు కారణం ఒత్తిడి అనీ తేల్చి చెబుతున్నారు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు