close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆడా ఉంటా... ఈడా ఉంటా!

‘జాతి రత్నాలు’లో ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే’ అని చిలిపిగా పలికినా... ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’లో ‘సాంబశివ నీదు మహిమ... ఎన్నటికీ తెలియదాయే’ అని జానపదం ఆలపించినా... తాజాగా ‘పుష్పక విమానం’లో ‘సిలకా.. ఎగిరిపోయావా...’ అని బ్రేకప్‌ పాట పాడినా... రామ్‌ మిరియాలకే చెల్లింది. అతడి గొంతు నుంచి ఏ పాట వచ్చినా అది చెవుల్ని దాటి మనసుని తాకుతుంది. రామ్‌ పాటగాడే కాదు... గీత రచయిత, సంగీత దర్శకుడు కూడా!


గోదారి లంక నుంచి...

నేను పుట్టింది తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం మండలంలోని కోలంకలో. మాది వ్యవసాయ కుటుంబం. డిగ్రీ చదువుకోవడానికి హైదరాబాద్‌ వచ్చా. మా అక్కావాళ్ల ఇంట్లో ఉంటూ వెస్లీ కాలేజీలో బీకామ్‌ చేశా. తర్వాత కొన్నాళ్లు ఓ కార్పొరేట్‌ కంపెనీలో ట్యాక్స్‌ కన్సల్టెంట్‌గా, తర్వాత రేడియో మిర్చీ(ఎఫ్‌.ఎం.)లో ప్రోమో ప్రొడ్యూసర్‌గా పనిచేశా.


నేర్చుకున్నది శాస్త్రీయ సంగీతం...

పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి స్కూల్లో రెండేళ్లపాటు చదువుకున్నా. అప్పుడే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. ఆ తర్వాత మళ్లీ చదువుల్లో పడిపోయి కొన్నాళ్లు సంగీతాన్ని వదిలేశా. కానీ జానపదాలు మొదలు పాశ్చాత్య సంగీతం వరకూ అన్నీ వింటూ పాడేవాణ్ని కూడా. తర్వాత ఫ్లూట్‌ కూడా నేర్చుకున్నా. ఎఫ్‌.ఎం.లో ఉన్నపుడు ప్రకటనల్నీ, ఆర్జేల ప్రోమోల్నీ రాసేవాణ్ని. ఓసారి ‘లాయిలో’ అనే పాటని సరదాగా రాశా. అదో బ్రేకప్‌ సాంగ్‌. దాన్ని వీడియో పాటగా తెస్తే మంచి స్పందన వచ్చింది.


చౌరస్తా బ్యాండ్‌...

మిత్రులు యశ్వంత్‌, శ్రీని, బాల, అనంత్‌, అక్షయ్‌, నేనూ రెండేళ్ల కిందట ‘చౌరస్తా’ బ్యాండ్‌ని ఏర్పాటుచేశాం. సొంతంగా పాటలు రాసుకుని వాటికి ట్యూన్లు కట్టేవాళ్లం. ఆ సమయంలో మా నుంచి వచ్చినవే మాయ, ఊరెళ్లిపోతా మామ, సాగు బరువాయెనా ఓ రైతా, చేతులెత్తి మొక్కుతా... పాటలు. వీటిలో కొన్నింటికి యూట్యూబ్‌లో రెండుకోట్ల వీక్షణలు వచ్చాయి. ఊరెళ్లిపోతా(ఆనంద్‌ గుర్రంతో కలిసి), చేతులెత్తి మొక్కుతా పాటలకు సాహిత్యమూ రాశా. స్వల్ప వ్యవధిలోనే మా బ్యాండ్‌కు మంచి గుర్తింపు రావడంతో చాలా లైవ్‌షోలు ఇచ్చాం. గోరటి వెంకన్న, బాబ్‌ మార్లే పాటలు నాకు నచ్చుతాయి. జమైకా దేశానికి చెందిన ‘రెగ్గె’ సంగీత శైలి నన్ను బాగా ఆకట్టుకుంది. ఉత్సాహాన్నిచ్చే పాట మధ్యలో స్ఫూర్తినిచ్చే మాటల్నీ చెప్పే శైలి అది.


సినిమా అవకాశం...

‘జాతిరత్నాలు’ కోసం ఆ సినిమా దర్శకుడు అనుదీప్‌ నాచేత ఒక పాట కంపోజ్‌ చేయిద్దామనుకున్నాడు. కొన్ని కారణాలవల్ల కుదరలేదు. తర్వాత కొద్దిరోజులకు ఆ సినిమా కోసం రామజోగయ్యశాస్త్రి గారు రాసిన ‘చిట్టి నీ నవ్వంటే...’ పాటని పాడమన్నారు. నా స్టూడియో నుంచే రికార్డ్‌ చేసి పంపా. ఆ పాట ఎంత హిట్టయిందో తెలిసిందే! తర్వాత ఆ సినిమా కోసమే ఓ స్పెషల్‌ సాంగ్‌ కంపోజ్‌ చేశా. ఆనంద్‌ దేవరకొండ సినిమా ‘పుష్పక విమానం’ కోసం దర్శకుడు దామోదర రెండు పాటలు నాచేత కంపోజ్‌ చేయించాడు. వాటిలో ‘సిలకా’ పాటని ఆనంద్‌ గుర్రంతో కలిసి రాశా. అది పాడింది నేనే. అంతకు ముందు ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’లో ‘సాంబశివ నీదు మహిమ’ పాటతోపాటు మరికొన్ని సినిమాల్లోనూ పాడాను.


రెండుయాసలూ తెలుసు!

సినిమాల కోసమని చౌరస్తా బ్యాండ్‌ నుంచి ప్రస్తుతానికి బయటకు వచ్చేశా. ఇప్పుడు రెండు సినిమాలకు పనిచేస్తున్నా. ఇక్కడ పనిచేస్తూనే ఇండిపెండెంట్‌ ఆల్బమ్‌లూ చేస్తా. సినిమా పాటలకు కథ, హీరో లాంటి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇండిపెండెంట్‌ పాటల్ని స్వేచ్ఛగా రాయొచ్చు. గోదావరి జిల్లాలో పుట్టి పెరగడంవల్ల ఆ యాస తెలుసు. హైదరాబాద్‌లో 20 ఏళ్లుగా ఉంటున్నా. సిరిసిల్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. కాబట్టి తెలంగాణ యాస కూడా సహజంగా వస్తుంది. అందుకేనేమో నా పాటలు అందరికీ నచ్చుతున్నాయి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు