close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కూర్చుందమ్మా... కుషన్‌ బొమ్మ!

‘ఈ బొమ్మ నా పాప...’ అంటూ చిన్న పిల్లలు కుషన్‌లా మెత్తగా ఉండే పాప బొమ్మలతో ఎంతో ఇష్టంగా ఆడుకుంటారు. ఎన్ని కొన్నా ఇంకా కొనమని అడుగుతూనే ఉంటారు. మనకేమో బొమ్మలతో ఇల్లు ఖాళీ లేకుండా అయిపోతుందనిపిస్తుంది. ఈ డాల్‌ పిల్లో కుషన్లతో అయితే, ఆ సమస్యే ఉండదు. ఇవి ఇటు ఆడుకోవడానికీ అటు కుషన్లలా కూడా పనికొస్తాయి మరి.
దివాన్‌ మీదా సోఫాల్లోనూ కుషన్లుంటే గోడకు ఆనుకుని కూర్చోవడానికీ, దిండుని ఒళ్లో పెట్టుకుని చేతులు ఆనించేందుకూ సౌకర్యంగా అనిపిస్తాయి. ఇక, ఎవరైనా ఇంట్లోకి అడుగు పెట్టగానే ముందు కనిపించేది సోఫా, దివాన్‌లే కాబట్టి, వాటిని కుషన్లతోనే ప్రత్యేకంగా అలంకరిస్తుంటాం. అందుకోసం రంగు రంగుల్లో ఆకర్షణీయమైన డిజైన్లున్నవీ, రాజస్థానీ బొమ్మల ప్రింట్లున్న కవర్లనూ కొని కుషన్లకు వేస్తుంటాం. కానీ అందరూ అలాంటి అలంకరణలే చేస్తుంటే మన ప్రత్యేకత ఏముంటుందీ... అదే బొమ్మల్లా ఉన్న ఈ డాల్‌ పిల్లో కుషన్లను దివాన్‌ మీద పేర్చితే... చూడ్డానికి ఎంతో భిన్నంగా ఆకట్టుకునేలా ఉంటాయి. ఇకపోతే, ఇంట్లో చిన్న పిల్లలున్నారంటే అడుగడుగునా బొమ్మలే కనిపిస్తాయి. ఆఖరికి మంచాలూ, దివాన్‌, సోఫాలు కూడా బొమ్మలతో నిండిపోతాయి. ముఖ్యంగా ఆడపిల్లలు మెత్తగా ఉండే పాప బొమ్మలతో తెగ ఆడతారు. వాటికి అన్నం తినిపిస్తున్నామనీ, పడుకోబెడుతున్నామనీ... ఏవేవో చెబుతుంటారు. వాళ్లెక్కడుంటే అక్కడ ఆ బొమ్మలుండాల్సిందే. ఆఖరికి నిద్రపోతున్నా. దాంతో మంచం కూడా ఖాళీ లేకుండా అయిపోతుంది. అలాంటప్పుడు పడుకోవడానికి దిండులా, ఆడుకోవడానికి బొమ్మలానూ ఉండే ఈ డాల్‌ కుషన్లను కొనిస్తే మంచాలూ, దివాన్‌ మీద పడేసినా అడ్డంగా అనిపించవు. పైగా ఎక్కువ బొమ్మలు కొని పిల్లలు కొంతకాలానికి వాటితో ఆడకపోతే వృథాగా పోతున్నాయనే బాధా ఉండదు. వీటిని అందమైన కుషన్లలా వాడేసుకోవచ్చు మరి.

బొమ్మ దిండ్లను ఎలా చేస్తారంటే...
డాల్‌ పిల్లోలను తయారుచేసేందుకు కుషన్‌ మీద చిన్నారి పాపల పెయింటింగుల్ని నడుము వరకూ వేసి, అక్కణ్నుంచి దిండు కిందకు వేలాడేలా క్లాత్‌తో కాళ్లను కుడతారు. ఆ పైన కుచ్చులతో గౌను లేదా స్కర్టుల్ని రూపొందించి, అచ్చం పాప బొమ్మలా కనిపించేలా దిండుకి కలిపి కుట్టేస్తారు. ఈ తరహా దిండు బొమ్మల తయారీ గురించి యూట్యూబ్‌లో వీడియోలు కూడా ఉన్నాయి. కాస్త పెయింటింగ్‌ వెయ్యడం, కుట్టడం తెలిసినవాళ్లు ప్రయత్నించొచ్చు. లేదంటే నేరుగా కొనుక్కోవచ్చు. ఈ దిండు బొమ్మలు మీ పిల్లలకి నచ్చాయా మరి!


అరచేతిలో అమ్మాయి!

సంపెంగ ముక్కు... కలువల్లాంటి కళ్లు... దొండపండు పెదవులు... చంద్రబింబం కూడా చిన్నబోయేంత చూడచక్కని ముఖం... మగువ రూపు రేఖల్ని పొగడడానికి ఇలాంటి ఎన్నో పోలికలు. మరి అంత అందమైన రూపం అరచేతిలో గోరింటలా పండితే ఇంకెంత ముచ్చటగా ఉంటుందో కదా... ఎవరి మదిలో మెదిలిన ఆలోచనో గానీ మెహందీ డిజైన్లలో ఇప్పుడు ఆ సొగసులే ట్రెండ్‌.

అమ్మాయి చేతిలో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడు అంటారు. పెళ్లిలోనూ వధువు చేతికి మెహందీ పెట్టడాన్ని ప్రత్యేకమైన వేడుకగా జరుపుతారు. తద్ది పేరంటాలూ ఇతర పండుగల సమయాల్లోనూ ముద్దుగుమ్మల చేతిలో గోరింట పండాల్సిందే. అయితే, ఒకప్పుడు గోరింట చెట్టు ఆకుని అప్పటికప్పుడు రుబ్బి పెట్టుకునేవారు. దాంతో పెద్దగా డిజైన్లు రావు కాబట్టి గుండ్రని చందమామనో చుక్కలనో తీర్చిదిద్దేవారు. మెహందీ కోన్‌ వచ్చాక గోరింట స్టైలే మారిపోయింది. రకరకాల డిజైన్లతో అరచేతిలో అద్భుతాలను సృష్టించడం మొదలుపెట్టారు. పువ్వులూ పండ్ల ఆకారాలతో పాటు ఒక దశలో దేవతామూర్తుల రూపాలూ మెహందీ డిజైన్లుగా ఆకట్టుకున్నాయి. ఇక, ఇప్పుడేమో ఆ స్థానాన్ని మగువలు ఆక్రమించేశారు.

మగువలే మహరాణులు!
మామూలుగా గోరింటాకు పెట్టుకుని ఎవరికైనా చూపించి ‘బాగుందా...’ అని అడిగితే ఇలా చూసి అలా ‘హా బాగుంది’ అనేస్తారు. అదే అందమైన అమ్మాయి పెయింటింగ్‌ని చూపిస్తే, కాసేపు చూసి కళ్లు బాగున్నాయి, ముక్కు బాగుంది... ఇలా వర్ణించడం మొదలుపెడతారు. అరచేతిలో పెట్టే అమ్మాయి మెహందీ చిత్రాలూ అంతే అందంగా ఉంటాయి కాబట్టి, ఎవరైనా చూస్తూ ఉండిపోవాల్సిందే. ముద్దుగుమ్మ మేలి ముసుగు వేసుకున్నట్లూ చక్కగా ముస్తాబైన భామ నడుస్తూ వెళ్తున్నట్లూ అందాల సుందరి ఓర కంటితో చూస్తున్నట్లూ అమ్మాయిలు ఊయల ఊగుతున్నట్లూ... ఇలా అదీ ఇదీ అని తేడా లేకుండా ఎన్నెన్నో రకాలుగా అమ్మాయిల రూపాల్నే అతివల చేతిలో మెహందీ డిజైన్లుగా వేసేస్తున్నారు ఇప్పుడు. అసలే తమలపాకుల్లాంటి చేతులు... వాటిలో ఎరుపు రంగుకే అందమొచ్చిందా అనిపించేంత బాగా పండిన గోరింట... ఆపైన సొగసైన ఈ డిజైన్లు... ఇక, అబ్బాయిలు... ‘నీ చేతుల్ని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు...’ అని పాడుకోవడంలో అతిశయోక్తి ఏముంది..?


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు