close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎడారి ఓడ... పుస్తకాలు తెస్తుంది!

లైబ్రరీ అనగానే... నాలుగు కుర్చీలు, ఓ బల్ల, పక్కనే అల్మారాల్లో సర్దిన పుస్తకాలు అనుకుంటాం. కానీ కెన్యాలో ఒంటెల గ్రంథాలయాలున్నాయి. మారుమూల ప్రాంతాల్లో అక్షరాస్యత పెంచే ఉద్దేశంతో కెన్యా నేషనల్‌ లైబ్రరీ సర్వీస్‌ ఈ ఒంటెల గ్రంథాలయాల్ని మొదలుపెట్టింది. ఇరుకైన దారుల్లోనూ ఇబ్బంది లేకుండా వెళ్తాయని ఒంటెల్ని ఎంచుకున్నారట. జాతీయ  గ్రంథాలయం ఉన్న గరిసా పట్టణం చుట్టుపక్కల 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెల్లోకి పుస్తకాలతో కూడిన ఈ ఒంటెల లైబ్రరీలు వెళుతుంటాయి. ఒంటెలపై అటూ ఇటూ పుస్తకాల్ని ఉంచిన పెద్ద పెట్టెలుంటాయి. ఆసక్తి ఉన్న పిల్లలు పెట్టెల్లోంచి పుస్తకాలు తీసుకుని సంతకం చేస్తారు. మళ్లీ రెండువారాల తర్వాత తిరిగి ఇచ్చేస్తారు.

పెళ్లికి ముందు... పాతకాలంలోకి!

పెళ్లి కుదరగానే కాబోయే వధూవరులకు ప్రీవెడ్డింగ్‌ షూట్‌ గురించే ఆలోచనలు. ఎక్కడ చేసుకోవాలి... ప్రస్తుతం నడుస్తున్న నయా ట్రెండ్‌ ఏది... కొత్తగా విదేశాల్లో ట్రై చేద్దామా... ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటారు. కానీ కర్ణాటకలోని ధార్వాడకు చెందిన చేతన దేశాయ్‌, నిఖిల్‌ మగ్గవి పెళ్లి జంట పాతకాలంలోకి వెళ్లి ప్రీవెడ్డింగ్‌ షూట్‌ జరుపుకుంది. ఏప్రిల్‌ 26న పెళ్లిచేసుకోబోతున్న ఈ జంట ధార్వాడకు చెందిన జ్ఞానపీఠ పురస్కారం పొందిన కవి దత్తాత్రేయ రామచంద్ర బెంద్రే జీవితపు సన్నివేశాల్ని ఎంచుకుంది. చేతనవాళ్లు బెంద్రే పొరుగింట్లోనే ఉండేవాళ్లు. ఆయన్ను నేరుగా చూడకపోయినా వేడుకలకు బెంద్రే ఇంటికి వెళ్లేవాళ్లు. అలా ఆయనపై ఉన్న ఇష్టంతో ఈ కవి రాసిన పద్యాల ఆధారంగా ప్రీ వెడ్డింగ్‌ థీమ్‌ను రూపొందించుకున్నారు. బెంద్రే స్వయంగా ఉపయోగించిన టోపీ, గ్రామఫోన్‌, గొడుగు వాడడంతో పాటు అప్పటి పద్ధతి ప్రకారం దుస్తులు వేసుకుని చక్కగా ఫొటోలు తీయించేసుకున్నారు. భారతీయ సంస్కృతినీ, ఉత్తర కర్ణాటక శైలీ సంప్రదాయాలనూ అందరికీ చూపాలనే ఈ అరుదైన నిర్ణయం తీసుకున్నారట. పాతకాలపు కొత్త ఆలోచనతో పుట్టిన ఈ వెడ్డింగ్‌ షూట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ అవుతోంది. 

జలజల జారే పెళ్లికూతురు...

పచ్చని ప్రకృతి చేతుల్లో ఒద్దికగా ఒదిగిపోయిన అందమైన పెళ్లికూతురులా ఉంది కదూ... ఈ ఫొటో చూస్తుంటే. ఆ అందాల వధువు ఎవరో కాదు. ఓ జలపాతం. చూడాలంటే మీరు పెరూకి వెళ్లాల్సిందే. ఆ దేశంలోని నమోరా అనే పట్టణానికి దగ్గర్లో ఉండే ఈ జలపాతం 160 అడుగుల ఎత్తు మీద నుంచి కిందకు జాలువారుతుంది. కొండల నడుమ నీటిధారలన్నీ కలిసి చూడ్డానికి తెల్లటి గౌను వేసుకున్న పెళ్లికూతురులా కనిపిస్తుంది. అందుకే దీనిని ‘కాస్కాడా లా నొవియా’ అనే పేరుతో పిలుస్తారు... అంటే ‘బ్రైడ్‌ వాటర్‌ఫాల్‌’ అని అర్థమట.

పోలీసా... ఫిట్‌నెస్‌ మోడలా!

ఫిట్‌గా.. కండలు తిరిగిన బాడీతో హీరోలా ఉండాలని ప్రతి అబ్బాయీ కోరుకుంటాడు. అదే దిల్లీకి చెందిన అబ్బాయిలు అయితే మరీ ఎక్కువగా కోరుకుంటారు. ఎందుకంటే రుబల్‌ ధన్‌కర్‌ అనే పోలీసు ఉండేది అక్కడే కాబట్టి! పోలీసుకీ, బాడీబిల్డింగ్‌కీ సంబంధం ఏంటంటారా... ఈ పోలీసు ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ మరి. ఒకవైపు పోలీసుగా విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌గా మారి తన జిమ్‌బాడీతో టాక్‌ ఆఫ్‌ ది ఇంటర్నెట్‌గా మారాడు.ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఛానళ్లలో వేలల్లో అభిమానుల క్రేజ్‌ను సంపాదించాడు. తనదైన స్టైల్‌లో ఫిట్‌నెస్‌ ట్రెయినింగ్‌, బాడీ బిల్డింగ్‌, మోటివేషనల్‌ వీడియోల్ని పెడుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఈ కండల పోలీసు కసరత్తుల్ని చూసినవాళ్లంతా మెచ్చుకోకుండా ఉండలేరు. ఒకవైపు ఉద్యోగాన్నీ, మరోవైపు తనకున్న ఇష్టాన్నీ బ్యాలెన్స్‌ చేస్తూ ‘వారెవ్వా ఏమి పోలీసు’ అంటూ అందరి ప్రశంసలూ అందుకుంటున్నాడు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు