close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ బడిలో టీచర్లు ఉండరు!

ఒక తరగతిలో విద్యార్థులందరికీ నేర్చుకునే సామర్థ్యం ఒకే స్థాయిలో ఉండదు. కొందరు సగటు విద్యార్థికంటే ముందుంటే, మరికొందరు చాలా వెనకబడి ఉంటారు. ‘అందుకే క్లాసుతో పనిలేకుండా ఒకేస్థాయి విద్యార్థులందరూ ఒకచోట కూర్చొని నేర్చుకుంటే వారి చదువులు మెరుగవుతాయి’ అంటున్నారు అక్షర వనం నిర్వాహకులు. విద్యా విధానంలో మార్పు తెచ్చేందుకు ఇంకెన్నో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు ఇక్కడ! ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కేంద్రంగా, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు లక్ష్యంగా పాఠాలు చెబుతారు. ‘కానీ విద్యార్థి కోణంలో చదువులు నేర్పిస్తేనే అసలైన విద్య సాధ్యమవుతుంది’ అంటారు అక్షరవనం నిర్వాహకులు శ్రీపతి రెడ్డి, మాధవ రెడ్డి. వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ ప్రయోగశాల నాగర్‌కర్నూల్‌ జిల్లా, కల్వకుర్తి దగ్గర్లో ఉంది. 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆధునిక గురుకులంలో విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బోధన జరుగుతుంది. ‘బోధన తక్కువ నేర్చుకోవడం ఎక్కువ’ అనేది వీరు అనుసరించే పద్ధతి.

వార్షిక పరీక్షలు ఉండవు...
ఇక్కడ విద్యార్థుల్ని వయసునిబట్టి తరగతిలో చేర్చుకోరు. అసలు ఇక్కడ తరగతులూ, తరగతి గదులే ఉండవు. విద్యార్థుల సామర్థ్యాన్నిబట్టి వారిని చిన్న బృందాలుగా విభజిస్తారు. సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ స్థాయులు ఉంటాయి. ప్రతి స్థాయిలో మళ్లీ మూడు దశలు ఉంటాయి. లాంగ్వేజ్‌(తెలుగు, ఇంగ్లిష్‌, కంప్యూటర్‌, కళలు), లాజిక్‌(గణితం, సైన్స్‌) లైఫ్‌ స్కిల్స్‌(సోషల్‌ స్టడీస్‌, యోగా, సంగీతం, డ్యాన్స్‌, సాగు, ప్లంబింగ్‌లాంటి వృత్తి విద్యలూ ఉంటాయి)... ఇలా మూడు విభాగాల్లో విద్యార్థులకు సబ్జెక్టులు ఉంటాయి. వీటిని తోటివారి సాయంతో, వారి దగ్గరే సందేహాల్ని నివృత్తి చేసుకుంటూ నేర్చుకోవాలి. ఒక గ్రూపులో ఏ వయసువారైనా ఉండొచ్చు. ప్రతి గ్రూప్‌లోనూ సభ్యులు ఒక సీనియర్‌ విద్యార్థి నేతృత్వంలో చదువుకుంటారు. తమలో తాముగానీ, సీనియర్‌ సహకారంతోగానీ, సందేహాలు తీర్చుకోలేనపుడు ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థీ ఒక్కో దశనీ, స్థాయినీ దాటుకుంటూ వెళ్లాలి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ, లంచ్‌ తర్వాత మరో రెండు గంటలపాటు వీరంతా స్కూల్‌ ఆవరణలోనే కూర్చొని చదువుకుంటారు. ఒక పూటంతా దాదాపు ఒక సబ్జెక్టునే నేర్చుకుంటారు. తర్వాత ఎవరికి నచ్చిన సబ్జెక్టుని వారు చదువు కోవచ్చు. ఇంగ్లిష్‌ భాషని ల్యాబ్‌లో వీడియోలు చూస్తూ నేర్చుకుంటారు. విద్యార్థులంతా ఇలా ఒత్తిడిలేని చదువులు పూర్తిచేశాక పదో తరగతి పరీక్షల్ని ఓపెన్‌ విధానంలో రాసి తర్వాత ఇంటర్మీడియెట్‌లో చేరుతారు. విద్యార్థులకు విద్య, వసతి ఉచితం. దాతల సాయంతోనే ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆరేళ్ల కిందట 15 మంది విద్యార్థులతో మొదలైన ఈ పాఠశాలలో ప్రస్తుతం 85 మంది చదువుకుంటున్నారు. ఏడాదిలో 20 రోజులు మాత్రమే విద్యార్థులు ఇంటికి వెళ్తారు.

వ్యవసాయ పాఠాలు కూడా...
ఇక్కడ విద్యార్థులందరికీ సాంస్కృతిక కార్యక్రమాలూ, క్రీడల్లో శిక్షణ ఉంటుంది. గతేడాది నుంచి వ్యవసాయాన్నీ చదువులో భాగం చేశారు. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం రెండు గంటలపాటు విద్యార్థులు కూరగాయలు లేదా ఆకుకూరల్ని పెంచడానికి కేటాయిస్తారు. దీన్లో భాగంగా ప్రతి విద్యార్థికీ ఒక సీజన్లో ఒక పంటని సాగు చేసే బాధ్యతను అప్పగిస్తారు. పొలం దున్నడం, విత్తనాలు నాటడం, నీరు కట్టడం, కలుపు తీయడం, పంటకోయడం... ఇవన్నీ వారే చేస్తారు. ఈ సాగు సేంద్రియ విధానంలోనే ఉంటుంది. వంకాయ, టొమాటో, ముల్లంగి, క్యారెట్‌, మిరప, పాలకూర, కొత్తిమీర, బొప్పాయిలాంటివి సాగుచేస్తారు. వీటిని ఇక్కడ వంటలకు ఉపయోగిస్తారు. అక్షర వనంలో వంట, వడ్డింపు, పాత్రలు శుభ్రపరచడం లాంటి బాధ్యతల్నీ విద్యార్థులే తీసుకుంటారు. ప్రకృతి నడుమ, ఒత్తిడిలేని వాతావరణంలో చదువుతోపాటు ఎన్నో నైపుణ్యాలు పిల్లలు నేర్చుకోవడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తున్నారు.  తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులూ ఇక్కడకు వచ్చి ఈ విద్యావిధానం గురించి తెలుసుకుంటూ తమ పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి ఆసక్తిచూపుతుండటం విశేషం.

- నర్సింగోజ్‌ మనోజ్‌ కుమార్‌ ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు