close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎండకి  టోపీ పెట్టేద్దాం..!

అసలే కరోనా కాలం... దీనికితోడు భానుడు రోజురోజుకీ మంటెత్తిపోతున్నాడు. మిట్టమధ్యాహ్నం సంగతి దేవుడెరుగు... ఉదయం తొమ్మిది దాటిందంటేనే బయటకు అడుగుపెట్టాలంటే భయపడిపోతున్నారు. అయితే యువతరం మాత్రం ‘అటు స్టైలిష్‌గానూ ఉంటుంది... ఇటు ఎండ నుంచీ కాపాడుతుంది’ అనుకుంటూ సురక్షితమైన టోపీలను పెట్టుకుని హ్యాపీగా తిరిగేస్తున్నారు. ఇదేదో బాగుందే అనుకుంటూ పిల్లాపెద్దా కూడా వాళ్లనే అనుకరించేస్తోంది.
వేసుకునే బట్టలే కాదు, పెట్టుకునే యాక్సెసరీలు సైతం స్టైలిష్‌గానే ఉండాలి అనుకుంటోంది నవతరం. అందులో భాగంగానే టోపీలూ కొత్తగా ముస్తాబై వాళ్ల మనసును దోచుకుంటున్నాయి. నిజం చెప్పాలంటే- టోపీ అనేది ఐరోపా, అమెరికాల్లో మాదిరిగా మనకి కంపల్సరీ యాక్సెసరీ కాదు. ఎందుకంటే- ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు మనదగ్గర మగవాళ్లు తలపాగా చుట్టుకుంటే, ఆడవాళ్లు చున్నీనో చీరకొంగునో కప్పుకునేవారు. కానీ పాశ్చాత్యదేశాల్లో వస్త్రధారణ వేరు. అందుకే అక్కడ పశువుల కాపరుల నుంచి చక్రవర్తుల వరకూ టోపీ తప్పనిసరి. బ్రిటిషర్ల పరిపాలనతో టోపీ మనదగ్గరా వాడుక లోకి వచ్చింది. సినీ సెలెబ్రిటీలతో మరింత ప్రాచుర్యం చెందింది. బాలీవుడ్‌ స్టైలిష్‌ నటుడు దేవానంద్‌కి టోపీ అంటే యమా క్రేజ్‌. టోపీ లేకుండా ఆయన సినిమా లేదనే చెప్పాలి. జ్యుయెల్‌ థీఫ్‌ సినిమాలో దేవానంద్‌ పెట్టుకున్న హ్యాట్‌ని అప్పట్లో కుర్రకారు పోటీపడి మరీ కొనుక్కున్నారట. అలా టోపీ మనకీ స్టైలిష్‌ ఫ్యాషనైపోయింది. పర్యటనల్లో ఎండ నుంచి తప్పించుకునేందుకు ఎక్కువమంది టోపీ పెట్టుకోవడంతో అవసరార్థం వాడుకునే అలంకారంగా మారింది. టోపీ అనేది గౌరవ సంకేతం కూడా. దీనికి చక్కని ఉదాహరణ ‘హ్యాట్సాఫ్‌’ అనే ఇంగ్లిష్‌ పదబంధం. ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు- వాళ్లను మెచ్చుకుంటూ తలమీద ఉన్న టోపీని తీసి తలను కొద్దిగా వంచి అభివాదం చేయడం నుంచి ఆ పదబంధం పుట్టుకొచ్చింది. తమ గౌరవానికి చిహ్నమైన టోపీని తీసి మరీ మెచ్చుకున్నారంటే వాళ్ల విజయం మరెంతో గొప్పదని దాని అర్థం. అందుకే టోపీ లేనివాళ్లు హాట్సాఫ్‌ అంటూ చేత్తో సెల్యూట్‌ చేస్తుంటారు. అలాగే క్రికెట్‌లో వరసగా మూడు సిక్సర్లూ లేదా ఫోర్లూ కొట్టినా వికెట్లు తీసినా ‘హ్యాట్రిక్‌’ అనడం తెలిసిందే. 1858లో హెచ్‌.హెచ్‌. స్టీఫెన్‌సన్‌ క్రికెట్‌లో వరసగా మూడు వికెట్లు తీసినప్పుడు- అదో అద్భుతమైన ట్రిక్‌గా భావించి అభిమానులు అతన్ని గౌరవిస్తూ టోపీని కొనిచ్చారట. అలా వచ్చిన హ్యాట్‌-ట్రిక్‌నే క్రమంగా అన్ని ఆటల్లోనూ ప్రయోగిస్తున్నారు. ఇక, గ్రాడ్యుయేషన్‌ సందర్భంగా విద్యార్థులూ టోపీ ధరిస్తుంటారు. సైనికులకీ పోలీసులకీ డ్రెస్సులో భాగంగానే టోపీ ఉంటుంది. క్యాడర్‌ని బట్టి మారుతుంటుంది కూడా. ఇవన్నీ పక్కనపెడితే, నేటి తరానికి మాత్రం హ్యాట్‌ అనేది హాటెస్ట్‌ ఫ్యాషన్‌ యాక్సెసరీ. అందుకే అది ఇప్పుడు వెదురు, గడ్డి, ఊలు, లేసు, పాలియెస్టర్‌, కాటన్‌... వంటి భిన్న ఫ్యాబ్రిక్కులతోనూ విభిన్న డిజైన్లలోనూ కనువిందు చేస్తోంది.

సమ్మర్‌ స్టైల్‌!

వేసవిలో బీచ్‌లకి వెళ్లినప్పుడు నెత్తిని మాడ్చేసే ఎండ ఒకవైపూ సముద్రం నుంచి వీచే వడగాలులు మరొక వైపూ తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఆ బాధ లేకుండా హాయిగా ఎంజాయ్‌ చేయాలంటే గడ్డీ వెదురూ వంటి వాటితో చేసిన ఈ భారీ టోపీ పెట్టుకుంటే సరి. వీటి అంచులు మామూలు టోపీలకన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉండటంతో వడగాలులు తగలవు సరికదా, సహజమైన పదార్థాలతో చేయడం వల్ల చల్లగానూ ఉంటుంది. గొడుగులా నీడనీ ఇస్తాయి. పైగా చూడ్డానికీ స్టైలిష్‌గానూ ఉండటంతో అమ్మాయిలకయితే మరీ మరీ నచ్చేస్తున్నాయట.

స్కార్ఫ్‌ హ్యాట్‌!

తలమీద టోపీ ఉన్నా కళ్లకు సన్‌గ్లాసెస్‌ పెట్టుకున్నా ముక్కుకీ మూతికీ మాత్రం మాస్కు కట్టుకోవడం మర్చిపోకూడని కాలం ఇది. దీనికితోడు కాలుష్యం భయానికి ముఖమూ మెడా భుజాలను కప్పి ఉంచేలా స్కార్ఫూ కట్టక తప్పడం లేదు. అందుకే ఇప్పుడు ఆ మాస్కునీ ఈ స్కార్ఫునీ కూడా టోపీలకి జత చేసేస్తున్నారు. యాంటీ స్పిట్టింగ్‌ అవుట్‌డోర్‌ సన్‌స్క్రీన్‌ హ్యాట్స్‌ విత్‌ మాస్కుగా పిలిచే దీన్ని పెట్టుకుంటే ఎండ నుంచి తలనీ కాలుష్యం నుంచి ముఖాన్నీ వైరస్‌ నుంచి ముక్కునీ రక్షించుకోవచ్చన్నమాట. పైగా ఈ హ్యాట్‌ పెట్టుకుంటే సన్‌స్క్రీన్‌ రాసుకోకున్నా ఫరవాలేదు అంటున్నారు తయారీదారులు.

మేలిముసుగు టోపీ!

కొన్ని వర్గాల్లో పెళ్లికూతుళ్లు మేలిముసుగు ధరించడం చూస్తుంటాం. అలాగే యూరోపియన్‌, ఆగ్నేయాసియా దేశాల్లో సంతాప సభల్లో పలుచని నలుపు రంగు వెయిల్‌ టోపీనీ, పెళ్లి వేడుకల్లో తెలుపు రంగు హ్యాట్‌నీ పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. దాన్నే ఓ అందమైన ఫ్యాషన్‌గా తీర్చిదిద్దేశారు టోపీ డిజైనర్లు. ఆ టోపీ సైజుని పెంచి, దాని అంచు నుంచి భుజాల వరకూ వచ్చేలా పలుచని క్లాత్‌ని కుట్టేస్తున్నారు. ముఖానికి స్కార్ఫులూ మాస్కులూ కట్టి కట్టి విసిగిపోయినవాళ్లకి- కాసేపు ఈ మేలి ముసుగు టోపీని పెట్టుకుంటే హాయిగా గాలీ తగులుతుంది. పారదర్శకంగా ఉంటుంది కాబట్టి చూసేవాళ్లకి ముఖమూ కనిపిస్తుంది.

యూవీకాంతిని పీల్చేస్తుంది!

మిట్టమధ్యాహ్నం ముఖ్యంగా ఉదయం 11 నుంచి 3గంటల మధ్య కాలంలో సూర్యకాంతిలోని యూవీ కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయనేది తెలిసిందే. వాటినుంచి కాపాడేందుకు తయారుచేస్తున్నవే ఈ యూవీ ప్రొటెక్షన్‌ వైడ్‌ బ్రిమ్‌ హ్యాట్స్‌. కళ్లనీ ముఖాన్నీ రక్షించే ఈ టోపీల్లోంచి పోనీటెయిల్‌ లేదా జడ బయటకు వచ్చేలా రంధ్రం కూడా ఉంటుంది. యూవీకాంతిని పీల్చుకునే దారాలతో చేసిన ఈ టోపీకి లోపల కుట్టిన పలుచని నెట్‌ క్లాత్‌ తలకి గాలి తగిలేలా చేస్తుంది. కాబట్టి టోపీ పెట్టుకున్నా చెమట పట్టదు. వీటిని మడిచి బ్యాగులో పెట్టుకునేలా తయారుచేయడంతో పార్కులూ హైకింగులూ క్యాంపింగులకీ వెంట తీసుకెళ్లొచ్చు.

తలకీ ముక్కుకీ చేతులకీ...

బండిమీద వెళ్లేటప్పుడు ఎండకి ట్యాన్‌ కాకుండానూ కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండానూ మోచేతులవరకూ గ్లోవ్సూ ముఖానికి స్కార్ఫూ కట్టుకోవడం అమ్మాయిలకి సర్వసాధారణంగా మారింది. అయితే అవన్నీ కట్టుకున్నా తలమీద టోపీ లేకుంటే ఎండకి తల మాడిపోవడమే కాదు, యూవీ కాంతి నేరుగా కళ్లలోకి వెళ్లి హాని కలిగిస్తుంది. అందుకే ఇప్పుడు టోపీ గ్లోవ్సూ స్కార్ఫూ అన్నీ కలిసి మ్యాచింగ్‌ సెట్స్‌గా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా టోపీ ఉండటం వల్ల ఎండ నేరుగా తగలదు. అన్నీ మ్యాచింగ్‌తో ఉంటాయి కాబట్టి ఆటోమేటిగ్గా ఫ్యాషన్‌ లుక్కూ వచ్చేస్తుంది.

తిరగేసీ పెట్టుకోవచ్చు!

ఎంత కాదనుకున్నా అమ్మాయిలకు సౌందర్య పోషణ కాస్త ఎక్కువే. అది దృష్టిలో పెట్టుకునే కాబోలు, వెడల్పాటి అంచు ఉన్న రివర్సిబుల్‌ ఫ్లాపీ సన్‌ హ్యాట్‌లనూ తయారుచేస్తున్నారు. ఎండల్లోనే అని కాదు, సరదాగా ఏ పార్టీకో వెళ్లినప్పుడూ వీటిని పెట్టుకోవచ్చు. తల పై భాగంలోని టోపీ చుట్టూ రిబ్బన్‌లా కట్టేస్తే ఫ్యాషన్‌గానూ ఉంటుంది. గాలికి ఎగిరిపోకుండా గడ్డానికి పట్టి ఉండేలా దీనికి చిన్‌స్ట్రాప్‌ కూడా ఉంది. వద్దనుకుంటే అది తీసేసుకోవచ్చు. డ్రెస్సుని బట్టి టోపీని తిరగేసీ పెట్టుకోవచ్చు. సుతిమెత్తని దారాలతో తయారుచేసిన ఈ టోపీని మడిచి బ్యాగులోనూ పెట్టుకోవచ్చు. వీటిల్లోనే చాపలా చుట్టుకుని బ్యాగులో పెట్టుకునే ఫోల్డబుల్‌ క్యాప్‌లూ వస్తున్నాయి.

రెక్కల క్యాప్‌!

కొందరికి తమ హెయిర్‌స్టైల్‌ ఎక్కడ పాడవుతుందో అన్న భయంతో తలమీద టోపీ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే తల మొత్తం కవర్‌ చేయకుండా ముఖానికి ఎండ తగలకుండా ఉండేలాంటి రిమ్డ్‌ టోపీలూ వస్తున్నాయి. టోపీకి రెక్కలొచ్చాయా అన్నట్లుగా ముఖంమీదకి ఉండే ఈ రకం టోపీల్లో చెవులను కప్పుతూ రెండు వింగ్స్‌ ఉంటాయి. నెట్‌ క్లాత్‌ని పోలినట్లుగా ఉండే ఈ రెక్కలు గాలాడేలా చేయడంతోపాటు ముఖం మొత్తానికీ రక్షణగా ఉంటాయి. వీటిల్లో అన్ని రంగులూ ఉంటున్నాయి కాబట్టి, ఎక్కువ డ్రెస్సులకి మ్యాచయ్యేలా నాలుగైదు కొనుక్కుంటే సరి.

హెల్మెట్‌ టోపీ!

ఎండ నుంచే కాదు, వానొచ్చినా కళ్లలోకి పడకుండా ఉంచేవే ఈ వేకామ్‌ హెల్మెట్‌ టోపీలు. ఈ టోపీ ఉంటే సన్‌గ్లాసెస్‌ అవసరం ఉండదు. గ్లాసెస్‌, హెల్మెట్‌, టోపీ... ఇలా మూడు రకాలుగా ఉపయోగ పడే ఈ టోపీని ఆటలకీ వాడుకోవచ్చు. ఇది ఎంత వేడినైనా తిప్పికొడుతుందట. అలాగే వైరస్‌ భయానికి మాస్కుపెట్టుకుని దానిమీద ఫేస్‌ కవరింగ్‌ షీల్డ్స్‌ పెడుతున్నారు కొందరు. వాళ్లకోసం షీల్డ్‌ హ్యాట్స్‌ కూడా వస్తున్నాయి. సో, ఎండ నుంచీ వైరస్‌ నుంచీ నిశ్చింతగా ఉండొచ్చన్నమాట.

 


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు