close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ హోటళ్లలో తారల్ని చూస్తూ నిద్రపోవచ్చు

మేఘాలు తలను తాకుతున్నాయా అన్నట్లుండే పర్వతశ్రేణులు...ప్రకృతి అందమంతా అక్కడే పోగుబడిందా అనిపించే కొండా కోనలు... ఎటుచూసినా కళ్లు పట్టనన్ని నక్షత్రాలు కనిపించే ఆకాశం... అలాంటి ప్రదేశాల్లో ఆరుబయట విలాసవంతంగా నిద్రపోయే అవకాశం వస్తే ఎంత బాగుంటుందో కదా! మీకు తెలుసా... మనదేశంలోని కొన్ని పర్యటకప్రాంతాల్లోని హోటళ్లు ఆ అవకాశాన్నికల్పిస్తున్నాయి.

భూ మితల్లికి పచ్చల హారం వేసినట్లున్న ఆ పచ్చటి కొండలూ... మేఘాలే కిందికి దిగాయా అనిపించేలా మంచుతో కప్పుకున్న లోయలూ...కనులకు విందునిచ్చే టీ తోటలూ...కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న సాత్రం పర్వత అందాలను చూడాలంటే నిజంగా రెండు కళ్లూ సరిపోవు. ఇక, అలాంటి చోట రాత్రంతా ఏ అడ్డుగోడలూ లేకుండా ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ నిద్రపోతే ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఎలా... అంటారా... అక్కడి టాస్‌గ్లాంపింగ్‌ హోటల్‌ యాజమాన్యం- పర్యటకులు ఆరుబయట నిద్రించేందుకు ప్రత్యేకంగా ‘గ్లాస్‌ క్యాబిన్ల’ను ఏర్పాటు చేసింది. పూర్తిగా అద్దాలతో నిర్మించిన ఈ గదుల్లోపల ఓ డబుల్‌ కాట్‌, లైటు, వైఫై సౌకర్యాలుంటాయి. భోజనం, స్నానాల కోసం విడిగా హోటల్లో ఏర్పాట్లుంటాయి.

అడవిలో ఇగ్లూ అట...
ప్రకృతి అందాలను చూడాలంటే అడవుల్ని మించినవి ఏవుంటాయి... అందుకే, తమిళనాడులోని ఊటీలో ఉన్న క్రెస్ట్‌ వ్యాలీ ఏకంగా ఆ అడవి మధ్యలోనే నిద్రించే అనుభూతిని కల్పిస్తోంది. అక్కడి హోటల్‌ నిర్వాహకులు ఎత్తైన చెట్ల మధ్యలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ టెంట్‌లు అద్దంలా పూర్తి పారదర్శకంగా కనిపిస్తాయి మరి. ఇగ్లూల ఆకారంలో ఉండే ఈ వాటర్‌ప్రూఫ్‌ టెంట్‌లలో డబుల్‌ కాట్‌, కుర్చీలూ ఉంటాయి. ఇక్కడ వన్య ప్రాణుల నుంచి ఎలాంటి హానీ లేకుండా పూర్తి రక్షణ కల్పిస్తుంది హోటల్‌ యాజమాన్యం. మహారాష్ట్రలోని ‘ద మచన్‌’ ఎకో రిసార్ట్‌ అయితే, మరీ ప్రత్యేకం. ఇక్కడ అడవికి 30-45 అడుగుల ఎత్తులో ట్రీ హౌస్‌లు ఉంటాయి. అక్కడి నుంచి చూస్తే కనుచూపు మేరలో అడవంతా కనిపిస్తుంది. విలాసవంతమైన సౌకర్యాలతో ఉండే ఈ ట్రీహౌస్‌లలో పడకగదికి మాత్రం పైకప్పు ఉండదు. గోడలు కూడా అద్దాలతో నిర్మించి ఉంటాయి. దాంతో పగటి పూట అడవి అందాలనూ రాత్రి నీలాకాశపు సొగసుల్నీ చూస్తూ గడపొచ్చు.

పాలపుంత పక్కేసినట్లూ...
ఒకప్పుడు వేసవి వచ్చిందంటే ఆరుబయట మంచాలు వేసుకునో మేడమీద చాప పరుచుకునో పడుకునేవాళ్లం. చుట్టూ పచ్చని చెట్లు గాలికి ఊగుతూ ఉంటే... ఆ కొమ్మలూ రెమ్మల మధ్యలోంచి చందమామ దోబూచులాడుతుంటే... చిమ్మచీకటిలో ఆకాశం వేసిన చుక్కల పక్కను నిండుగా కప్పుకున్న అనుభూతితో హాయిగా నిద్రలోకి జారుకునేవాళ్లం. కానీ ఇప్పుడు విద్యుద్దీపాల కాంతులు ఎక్కువైపోయి, పల్లెల్లో కూడా అన్ని నక్షత్రాలు కనిపించడంలేదు.
పట్టణాల్లో అయితే ఒకటీ రెండూ అని లెక్కపెట్టు కోవాల్సిన పరిస్థితి. కానీ రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో ఉన్న ‘ఆస్ట్రోపోర్ట్‌ సరిస్క’ రిసార్టుకి వెళ్తే పాలపుంత మొత్తం అక్కడే పరుచుకుందా అనిపిస్తుంది. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ చోటు దేశంలోనే రెండో చీకటైన ప్రదేశం అట. అందుకే, ఇక్కడ ఆకాశంలోని చిన్న చిన్న నక్షత్రాలు కూడా కనిపిస్తూ కనువిందు చేస్తాయి. పర్యటకులు ఆ అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు ఆరుబయట దూరం దూరంగా టెంట్‌లను ఏర్పాటుచేస్తారు. దేశంలోనే తొలి ఖగోళ శాస్త్ర రిసార్ట్‌గా పిలిచే ఇక్కడ టెలీస్కోపులూ బైనాక్యులర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇలాంటి చోట ఉండడం నిజంగా ఎంత గొప్ప అనుభూతి కదా...


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు