close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నీలాల రహదార్లు

ఎక్కడైనా రోడ్లు ఎలా ఉంటాయి... నల్ల రంగులోనే కదా. కానీ ఖతార్‌ రాజధాని దోహా నగరంలో మాత్రం అవి నీలిరంగులో మెరుస్తుంటాయి. అందం కోసమో వెరైటీకోసమో కాదు, వేసవిలో ఉష్ణోగ్రత తగ్గి కాస్త చల్లగా ఉండేందుకే అలా వేశారట. అవునుమరి, మామూలుగానే ఆ దేశంలో ఎండలు ఎక్కువ. ఇక, వేసవి వచ్చిందంటే ఉష్ణోగ్రత యాభై డిగ్రీలు దాటిపోతుంది. ఆ వేడికి నల్లని తార్రోడ్డుమీద ప్రయాణించేప్పుడు డాష్‌బోర్డులు పగిలిపోవడం, రంగు ఫేడ్‌ అయిపోవడం, ప్లాస్టిక్‌ ట్రిమ్‌లు కరిగిపోవడం మొత్తంగా కార్లు బాగా దెబ్బతింటున్నాయట. ఇక, పొరబాటున ఎవరైనా చెప్పుల్లేకుండా రోడ్డుమీద అడుగుపెడితే బొబ్బలెక్కడం ఖాయం. అంతేకాదు, తారు వేడిని ఎక్కువగా గ్రహించి మళ్లీ విడుదల చేయడం వల్ల చుట్టుపక్కల వాతావరణమూ వేడెక్కుతుంది. దాంతో ఖతార్‌ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అక్కడి అబ్దుల్లా బిన్‌ జసిమ్‌ స్ట్రీట్‌లో మిల్లీమీటరు మందంలో నీలిరంగు పెయింట్‌ని వేసిందట. నీలం రంగు సూర్యకాంతిని తక్కువగా గ్రహించడంతోపాటు అతినీలలోహకాంతినీ తిప్పికొట్టడంతో ఆ రోడ్లమీద ఉష్ణోగ్రత చాలావరకూ తగ్గినట్లు పాదచారులూ మోటార్‌సైకిళ్లమీద ప్రయాణించేవాళ్లూ చెబుతున్నారట. అక్కడ అమర్చిన సెన్సర్లు సైతం సుమారు పదిహేను నుంచి ఇరవై డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత తగ్గినట్లు సూచిస్తున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం నగరంతోపాటు ఇతర పట్టణాల్లోనూ రహదారులకు ఈ రంగు వేయాలనుకుంటోందట.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు