close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆశావహ కథలు

ప్రతికూలతలు ఎదురైనపుడు నిరాశతో నిష్క్రియగా ఉండకుండా ధైర్యంగా ముందుకు సాగితే పరిస్థితులు అనుకూలమవుతాయి. ఈ కథల్లో చాలావరకూ ఇలాంటి ఆశావహ దృక్పథమే ప్రతి ఫలిస్తుంది. అన్నిటిలోనూ ఉన్న ఉమ్మడి లక్షణం- పఠనీయత. చరమదశను పల్లెల్లో ప్రశాంతంగా గడపాలనుకునేవారూ, ప్రజాశ్రేయోభిలాషులైన ప్రభుత్వాధికారులూ, నిజాయతీపరులూ, ఆదర్శవంతులే కాకుండా అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు సంఘర్షించే పాత్రలూ తారసపడతాయి. మేని చాయ కన్నా మనసు గొప్పదని గ్రహించి తప్పు సరిదిద్దుకున్న యువకుడి కథ ‘తమసోమా’. అజంతా గుహల నేపథ్యంతో రూపుదిద్దిన ‘శిథిల చిత్రం’, కాలయంత్రం ఇతివృత్తంగా ప్రపంచ భవిష్యత్తుపై రాసిన ‘స్వయంకృతం’ కథలు ఆసక్తికరం. ‘అందమైన పచ్చని లోయను చూడా లంటే ఎత్తైన కొండను ఎక్కక తప్పదు’ లాంటి వాక్యాలు ఆకట్టుకుంటాయి.

- సీహెచ్‌.వేణు

 

గమ్యం (కథా సంపుటి)
రచన: గన్నవరపు నరసింహమూర్తి
పేజీలు: 152; వెల: రూ. 130/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు


మనస్తత్వాలు

పేరుకి తగ్గట్టే ఇందులోని కథలన్నీ సామాజిక జీవితంలో మనిషి పెనవేసుకునే పలురకాల అనుబంధాల గురించి భిన్న కోణాల్లో చర్చిస్తాయి. నగరంలో దర్జాగా బతుకుతూ అత్తమామలు రాగానే ఎక్కడ వాళ్లు శాశ్వతంగా తమ దగ్గర ఉండిపోతారోనని భయపడి బీదరుపులు మొదలుపెట్టే కోడలు(బంధాలు), ఒకటో తారీకునే కొడుకు వచ్చి తండ్రి పెన్షన్‌ వసూలు చేసు కెళ్తోంటే కూతురేమో తండ్రి కట్టించిన ఇంట్లోనే ఉంటూ ఆయనకింత తిండి పెట్టడానికి బాధ పడుతుంటుంది. మాస్టారిగా చదువుచెప్పి తమ బతుకులు బాగుపడడానికి తోడ్పడిన ఆయన్ని తీసుకెళ్లి అపురూపంగా చూసుకుంటాడు శిష్యుడు(అంతా రామమయం...). అల్లుణ్ణి గుప్పిట్లో పెట్టుకోమని కూతురికి నూరిపోస్తూ కోడలు చెప్పినట్లు వింటున్నావేమిటని కొడుకుని నిలదీస్తుంది భాగ్యమ్మ(ఆమె అంతరంగం). విభిన్న నేపథ్యాల్లో మనిషి ప్రవర్తనని విడమరిచి చెప్పే కథలివి.

  - పద్మ

 

బంధాలు(కథలు), రచన: వియోగి
పేజీలు: 188; వెల: రూ.160/-
ప్రతులకు: ఫోన్‌- 7794820104


అమ్మానాన్నల కోసం...

ప్రసిద్ధ జానపద కథ బాలనాగమ్మ స్ఫూర్తితో ఆధునికంగా రాసిన కాల్పనిక నవల అని రచయిత చెప్పినట్లుగానే మాయలూ మంత్రాల స్థానంలో రోబోనీ కృత్రిమమేధనీ వాడారు. తెలంగాణ నేపథ్యంలో అల్లిన ఈ కథ పన్నెండేళ్లు దాటిన పిల్లలను ఆకట్టుకుంటుంది. బాలవర్ధన్‌కి తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారనీ, తాను అమ్మానాన్నలని పిలుస్తున్నది పిన్నీ బాబాయిలననీ తెలుస్తుంది. దాంతో తల్లిదండ్రుల గురించి ఆరా తీస్తాడు. వాళ్లు కనిపించకుండా పోయిన విషయం తెలుసుకుని ఎలాగైనా వారి గురించి కొంత సమాచారమైనా సేకరించాలని తల్లి పుట్టిపెరిగిన ఊరు వెళతాడు. అక్కడినుంచి పాతాళ కోట్‌ లోయకు వెళ్లాలని బయల్దేరి అనుకోకుండా హిమాలయాలకి వెళ్లిన బాలవర్ధన్‌ తన తల్లిదండ్రుల్ని ఎలా కలుసుకున్నాడూ అతడికి ఎవరు సాయం చేశారూ అన్నది కథ.

- సుశీల

 

బాలవర్ధన్‌(పిల్లల నవల)
రచన: డా.వి.ఆర్‌.శర్మ
పేజీలు: 112; వెల: రూ, 65/-
ప్రతులకు: మంచిపుస్తకం
ఫోన్‌-9490746614


మనోవైజ్ఞానిక నవల

బ్రిటన్‌లో పందొమ్మిదో శతాబ్దపు ఉత్తమ రచనగా పేరొందిన ఆణిముత్యం ఈ నవల. పుట్టకముందే తండ్రిని కోల్పోయిన డేవిడ్‌ కాపర్‌ఫీల్డ్‌ తన జీవితకథని పాఠకుడికి చెబుతున్నట్లుగా సాగుతుంది కథనం. డేవిడ్‌ తల్లిని పెళ్లి చేసుకున్న మర్డ్‌స్టోన్‌ పిల్లవాడిని బోర్డింగ్‌ స్కూలుకు పంపుతాడు. తల్లి మరణించాక చదువు మాన్పించి ఫ్యాక్టరీలో పనికి పెడతాడు. ఆ కష్టాలు తట్టుకోలేక పారిపోయి ఓ బంధువు వద్దకు చేరిన డేవిడ్‌ని ఆమె ఆదరించి మంచి స్కూల్లో చదివిస్తుంది. పెళ్లయ్యాక తన భార్యకు మానసిక ఎదుగుదల సరిగాలేదని అర్థమవుతుంది డేవిడ్‌కి. చిన్నప్పటినుంచి మధ్యవయసు వరకు విభిన్న మనస్తత్వాల వ్యక్తులతో ఎదురైన అనుభవాలు డేవిడ్‌ వ్యక్తిత్వాన్ని ఎలా మలిచాయన్నదే కథ. అధికారం, ఐశ్వర్యం, సాంఘిక హోదాలకన్నా దయా జాలీ సహానుభూతీ కలిగివుండటం మిన్న అనే నీతిని చాటే ఈ నవల అనువాదం చదివిస్తుంది.

    - శ్రీ

 

డేవిడ్‌ కాపర్‌ఫీల్డ్‌, రచన: చాల్స్‌ డికెన్స్‌
అనువాదం: మేళం రామ్‌ పవన్‌కుమార్‌
పేజీలు: 268; వెల: రూ. 250/-
ప్రతులకు: ప్రధానపుస్తకకేంద్రాలుఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు