close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పేదలు లేని భారత్‌... అతడి కల!

దానగుణం ఉన్నవాళ్లు ఆపన్నులకు తమకు తోచినంతలో సాయం చేస్తారు. మనసంతా దాతృత్వ భావంతో నిండినవాళ్లు... జీవితాన్నే సేవకు అంకితం చేయాలనుకుంటారు. అలాంటి వ్యక్తి అతుల్‌ సతైజా. కోట్ల రూపాయల జీతం వచ్చే కొలువును  విడిచిపెట్టి అతుల్‌  పట్టిన  సేవా పథం ఇది...
న్నెండేళ్ల కిందట గూగుల్‌లో ‘జపాన్‌-ఆసియా పసిఫిక్‌’ మొబైల్‌ బిజినెస్‌ విభాగం హెడ్‌గా ఉండేవాడు అతుల్‌. వార్షిక వేతనం రూ.కోటిపైనే. గురుగ్రామ్‌లో ఆఫీసు. తను, భార్య, నాలుగేళ్ల పాప... చింతలు లేని చిన్న కుటుంబం. కానీ అతడి మనసంతా సామాజిక సేవపైన ఉండేది. కారణం అతడి నేపథ్యమే. చండీగఢ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడైన అతుల్‌ తండ్రి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేవారు. ఎన్‌ఐటీ-కురుక్షేత్ర నుంచి ఇంజినీరింగ్‌, ఐఎస్‌బీ- హైదరాబాద్‌ నుంచి ఎంబీఏ చేసిన అతుల్‌ సేవ కోసం వీలైనంత త్వరగా రిటైరవ్వాలనుకునేవాడు. ‘ఎప్పుడూ సేవ గురించే ఆలోచించేవాణ్ని. కానీ ఎవరికీ దానం చేయలేదు. దాంతో, నిజంగానే నాలో సేవా గుణం ఉందా, లేక ఊరకే అలా అనుకుంటున్నానా అన్న సందేహం వచ్చి నిర్ధారణ కోసం స్వచ్ఛంద సంస్థల్లో వాలంటీరుగా పనిచేయాలనుకున్నా’ అని చెప్పే అతుల్‌... రెండేళ్లపాటు వారాంతాల్లో వాటిలో పనిచేశాక సేవలోనే ఎక్కువ సంతోషం ఉందని గ్రహించి శేష జీవితం కాదు, మొత్తం జీవితమే సేవకు కేటాయించాలనుకున్నాడు. ఉద్యోగ విధుల్లో భాగంగా విదేశాలకు వెళ్లాల్సిరావడంతో గూగుల్‌కు రాజీనామా చేసి బెంగళూరు కేంద్రంగా మొదలైన అంకుర సంస్థ ఇన్‌మొబిలో ‘చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌’గా చేరాడు. పేదరికానికి ప్రధాన కారణాల్లో ఒకటి నైపుణ్యాల కొరతని అర్థమై యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే సంస్థని పెట్టాలనుకున్నాడు. ఇన్ఫోసిస్‌ సహ- వ్యవస్థాపకుడు నందన్‌ నిలేకనిని కలిసి ఆలోచనను వివరిస్తే రూ.1.3కోట్లు, ఇన్‌మొబి వ్యవస్థాపకుడు నవీన్‌ రూ.50 లక్షలూ సాయం అందించారు. టాటా ట్రస్ట్స్‌ లాంటి మరికొన్ని సంస్థలూ  సహకరించడంతో రూ.2.3కోట్ల నిధులతో 2015లో బెంగళూరు కేంద్రంగా ‘ది నడ్జ్‌ ఫౌండేషన్‌’(thenudge.org)ను ప్రారంభించాడు అతుల్‌.

ఆధునిక గురుకులాలు
దేశంలో ఏటా కోటిమందికిపైగా యువత ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. అయితే, వాళ్లలో పూర్తిస్థాయి నైపుణ్యం ఉన్నవాళ్లు అయిదారు శాతమే. ప్రత్యేక గురుకులాలు ఏర్పాటుచేసి, యువతకు నైపుణ్యాలతోపాటు జీవిత పాఠాలూ నేర్పాలనుకున్నాడు అతుల్‌. 18-25 ఏళ్ల మధ్య వయసు వారికి 90 రోజులపాటు ఉచితంగా నిర్వహించే ఈ శిక్షణలో బ్యుటీషియన్‌, బీపీఓ, రిటైల్‌, ప్లంబింగ్‌, డ్రైవింగ్‌... మొదలైన వృత్తుల్లో శిక్షణతోపాటు ఆంగ్ల భాషా నైపుణ్యాలూ ఆర్థిక, డిజిటల్‌ పాఠాలూ జీవనశైలి నైపుణ్యాలూ నేర్పుతారు. ‘నిధుల సమీకరణకంటే కూడా శిక్షణకోసం అభ్యర్థుల్ని తీసుకురావడానికే మేం ఎక్కువ కష్టపడ్డాం. కొత్త సంస్థ కావడం, గురుకులంలో ఉండాలని చెప్పడంతో ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. పది రోజుల ప్రయత్నం తర్వాత ఆయేషా అనే యువతి అంగీకరించింది. బ్యుటీషియన్‌ కోర్సు చేసి నెలకు రూ.15 వేలు వచ్చే ఉద్యోగంలో చేరింది’ అని తమ మొదటి విద్యార్థిని గుర్తుచేసుకుంటాడు అతుల్‌. ప్రస్తుతం బెంగళూరులో మూడు, దిల్లీలో రెండు గురుకులాల్ని నిర్వహిస్తోంది నడ్జ్‌ ఫౌండేషన్‌. టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణతతోపాటు పేదరిక నేపథ్యమే అభ్యర్థుల ఎంపికకు ప్రాథమిక అర్హత. ఈ గురుకులాల ద్వారా ఆరువేల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇప్పించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘ఫ్యూచర్‌ పర్‌ఫెక్ట్‌’ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు అతుల్‌. కరోనాతో గురుకులాలు మూతపడటంతో ఆ కోర్సు ఆన్‌లైన్లో అందుబాటులో ఉండేలా మార్పులు చేశారు. ఈ శిక్షణలో భాగంగా ఇంగ్లిష్‌తోపాటు 21వ శతాబ్దపు నైపుణ్యాలైన సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనా విధానం, టీమ్‌ వర్క్‌, ఇంటర్వ్యూ నైపుణ్యాలూ, కెరీర్‌ అవేర్‌నెస్‌ లాంటి అంశాల్ని నేర్పుతున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ఈ శిక్షణ ఉంటుంది. సామాజిక రంగంలో అంకుర సంస్థల్ని ప్రోత్సహించేందుకు ‘సెంటర్‌ ఫర్‌ సోషల్‌ ఇన్నోవేషన్‌’ను ప్రారంభించింది ఈ సంస్థ. 81 సంస్థలు దీన్నుంచి లబ్ధి పొందాయి. ఇటీవలే సిస్కోతో కలిసి
‘అగ్రి ఛాలెంజ్‌’ పోటీనీ, సేవా విభాగంలోకి కార్పొరేట్‌ ప్రతిభను ఆకర్షించేందుకు ‘ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఫెలోషిప్‌’నూ ప్రారంభించింది.

కొవిడ్‌ విరాళాలు వందల కోట్లు
దాతల నుంచి విరాళాలు సేకరించి విద్య, వైద్యం, ఉపాధి కల్పన రంగాల్లో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు అందించే వేదిక   గివ్‌ ఇండియా. 2017లో దీని బాధ్యతల్ని అతుల్‌కి అప్పగించాడు దాని వ్యవస్థాపకుడు వెంకట్‌ కృష్ణన్‌. అతుల్‌ వచ్చాక ఆన్‌లైన్లో వివిధ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాల్ని చేపడుతోంది గివ్‌ ఇండియా. నెలవారీ చందాదారుల్ని చేర్చుకోవడాన్నీ మొదలుపెట్టింది. కొవిడ్‌ సమయంలో వందల కోట్ల రూపాయల విరాళాలు సేకరించి లక్షల మందికి సాయపడింది. గూగుల్‌ కూడా భారత్‌లో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సహాయక చర్యల్లో భాగంగా గివ్‌ ఇండియా ద్వారా కోట్ల రూపాయల విరాళాలు అందించడానికి ముందుకు వచ్చింది.
‘మంచి కెరీర్‌ను వదిలి ఇటువైపు వచ్చారు. మీకు సంతృప్తిగా ఉందా’ అని అడిగితే, సేవకు మించిన తృప్తి మరెక్కడా దొరకదని బదులిస్తారు అతుల్‌.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు