close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
విభిన్న వ్యక్తిత్వాలు

ధునిక స్త్రీల భావాలకూ, చైతన్యానికీ దగ్గరగా ఉండే ఈ రచన 60 ఏళ్ల క్రితం నాటిదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ‘అప్రాశ్యులు’ అంటే వెలికి గురైనవారనీ, పంక్తి భోజనానికి తగనివారనీ అర్థం. సంఘ రీతికి భిన్నమైన ఆలోచనలూ, ఆచరణా ఉన్న పాత్రలే దీనిలో తారసపడతాయి. రజని, కమల, విశాల, రామం, ప్రసాద్‌, కమలాకరం... ఇలా అందరి వ్యక్తిత్వాలూ విభిన్నమైనవి. ప్రేమాతిశయమూ, కట్టుబాట్లకు అతీతమైన తీవ్ర ఆకర్షణలూ వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాయో, ఏ మలుపులు తిప్పాయో ఆసక్తికరమైన కథనంగా తీర్చిదిద్దారు రచయిత. సంభాషణలు కొన్నిచోట్ల నాటకీయంగా అనిపించినా చాలావరకూ భావగర్భితమై ఆలోచనాత్మకంగా ఉంటాయి. ‘తాజ్‌మహల్‌ను వెన్నెల్లో కాకుండా అమావాస్యనాడు చూడటం ఎక్కువ మనోహరం’ లాంటి అనూహ్య భావనలు ఆకట్టుకుంటాయి. ఉచిత ఈ-బుక్‌గా ఇది అంతర్జాలంలోనూ అందుబాటులో ఉంది.

- సీహెచ్‌.వేణు

అప్రాశ్యులు (నవల)
రచన: భీమేశ్వర చల్లా (సి.బి.రావు)
పేజీలు: 228; వెల: రూ. 150/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు


చదివించే కథలు

పల్లెటూరి మనిషి భార్యతో పాటు బస్సెక్కాడు. తన ఊరి పేరు చెప్పి ‘టికెట్‌ ఎంత’ అని అడిగాడు కండక్టర్‌ని. ‘రూపాయిన్నర’ చెప్పాడు కండక్టర్‌. ‘మరి ఆడమనిసికి...’ అతడి ప్రశ్న విని బస్సులోని వారంతా నవ్వారు. అతడా ప్రశ్న అడగడానికి కారణం ‘కూల్డబ్బులు’. మగాళ్లతో సమానంగా పనిచేసినా మహిళలకు తక్కువ కూలి ఇస్తారు మరి. 18 చిన్న కథల ఈ పుస్తకంలో ప్రతి కథా సమాజ ధోరణులను ప్రశ్నిస్తుంది. యజమానికి లాభాలు తెచ్చిపెట్టేలా బస్సుల్ని ఓవర్‌లోడ్‌ చేయిస్తూ ఆ యజమాని విదిల్చే పాతిక రూపాయల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే క్లీనరు కథ ‘కుంటికాలు’. చాలీ చాలని జీతాలతో చేసే సంసారంలో చికాకులూ గొడవలూ కాక మరేముంటాయి... కానీ ఆలుమగలిద్దరూ ఒకరికొకరు ఆసరా అయితే సర్దుబాట్లతో సంతోషంగా బతకొచ్చంటుంది ‘పొరలు’. కథలన్నీ చదివిస్తాయి, ఆలోచింప జేస్తాయి.

- పద్మ

కూల్డబ్బులు(కథా సంకలనం)
రచన: పట్నాల ఈశ్వరరావు
పేజీలు: 118; వెల: 100/-
ప్రతులకు: ఫోన్‌- 9948845337


స్వీయచరిత్ర

జీవితంలో ఒక కొసన నిలబడి, గతాన్ని సింహావలోకనం చేసుకుని అక్షరరూపమిస్తే- అదే ఆత్మకథ. వ్యక్తి అనుభవాలకు తోడు చుట్టూ ఉన్న పరిస్థితులూ ఆ జీవితాలను మలచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి కాబట్టి ఆత్మకథలన్నీ చదివిస్తాయి. ముఖ్యంగా చక్కటి క్రమశిక్షణతో పెళ్లయ్యాక చదువుకుని తన జీవితాన్ని దిద్దుకోవడమే కాక, కుటుంబ అభివృద్ధికీ సమాజ పురోగతికీ కూడా దోహదం చేసిన శేషమ్మ లాంటివారి కథలు ఆసక్తికరమే కాదు, సమాజానికి అవసరం కూడా. చదివిన నవలలో ‘ఆలోచనయే విద్య’ అన్న ఒక్కమాట ఆమెలో విశ్వాసాన్ని పెంచింది. ఒక్కో మెట్టూ ఎదిగి ఉపాధ్యాయురాలై ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దేలా చేసింది. ఈ పుస్తకం- ఏ కొద్దిమందికి చదువుపై ఆసక్తినీ, కార్యసాధనకై శ్రమించే తత్వాన్నీ నేర్పి, ప్రేరణనిచ్చినా చాలనీ అదే తనకి తృప్తి అనీ అంటున్న శేషమ్మ జీవితం స్ఫూర్తి దాయకం.

- శ్రీ

చదువు తీర్చిన జీవితం
ఒక సామాన్య మహిళ ఆత్మకథ
రచన: కాళ్లకూరి శేషమ్మ
పేజీలు: 148; వెల: 120/-
ప్రతులకు: ఫోన్‌- 9885401882


కాలానుగుణంగా...

వేగం పెరిగిన నేటి సమాజంలో పెద్ద పెద్ద పుస్తకాలను ఓపిగ్గా చదివే తీరిక ఎవరికీ ఉండటం లేదు. అలాగే వదిలేస్తే చదివి తెలుసుకోవాల్సిన మంచి పుస్తకాలకు వాళ్లు దూరంగానే ఉండిపోతారు. అలా కాకుండా అందరికీ అర్థమయ్యే తేలికైన భాషలో, ఆకర్షణీయమైన బొమ్మలతో చక్కటి చిన్న చిన్న కథలుగా మలిస్తే ఎంత పెద్ద గ్రంథమైనా ఇట్టే చదివిస్తుంది. మహాభారత గ్రంథాన్ని రచయిత అలాంటి కథలుగా మలిచారు. కవిత్రయం తెనిగించిన మహాభారతంలోని వేర్వేరు సన్నివేశాలనూ పాత్రలనూ చిన్న కథలుగా విడదీసి వివరంగా రాశారు. వీరుడైనవాడి ప్రతి చేతిలోనూ కత్తి ఉంటుంది, అసలది ఎలా పుట్టింది, బూరుగుచెట్టు గర్వాన్ని వాయుదేవుడు ఎలా అణిచాడు, శ్రీకృష్ణుడికి దుర్వాసుడు ఇచ్చిన వరం ఏమిటి... ఇలాంటి విషయాలెన్నో ఇందులో ఉన్నాయి. వేదవ్యాసుడితో మొదలుపెట్టి స్వర్గలోకంలో ధర్మరాజు వరకూ ప్రతి కథా ఆకట్టుకుంటుంది. పిల్లలనూ పెద్దలనూ కూడా అలరిస్తుంది.

- సుశీల

మహాభారత కల్పతరువు
(కవిత్రయ మహాభారత కథలు)
రచన: విశ్వనాథ శోభనాద్రి
పేజీలు: 450; వెల: 800/-
ప్రతులకు: ఫోన్‌- 9440666669

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు