close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: సాయంత్రం వేళ... వేడివేడిగా!

ఇంటిల్లిపాదీ ఇంట్లో ఉండటం వల్ల... పొద్దుటిపూట చేసుకునే టిఫినే కాదు, సాయంత్రాలు తినే స్నాక్స్‌ గురించీ ప్లాన్‌ చేసుకోవాల్సిన పరిస్థితి. మీ సమస్య కూడా అదే అయితే... ఇలాంటివి ఎందుకు ప్రయత్నించకూడదూ...


చికెన్‌ చీజ్‌ బాల్స్‌

కావలసినవి: చికెన్‌కీమా: అరకేజీ, గుడ్డు: ఒకటి, కొత్తిమీర: కట్ట, ఉల్లికాడల తరుగు: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి గింజలు: చెంచా, గరంమసాలా: చెంచా,  ఉప్పు: తగినంత, వెల్లుల్లి తరుగు: టేబుల్‌స్పూను, మైదా: టేబుల్‌స్పూను, నూనె: వేయించేందుకు సరిపడా, చీజ్‌ క్యూబ్‌లు: ముప్పావుకప్పు, మొక్కజొన్నపిండి: కప్పు, బ్రెడ్‌పొడి: కప్పు.

తయారీ విధానం: ఓ గిన్నెలో చికెన్‌ కీమా, గుడ్డు పచ్చసొన, ఉల్లికాడల తరుగు, కొత్తిమీర తరుగు, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి గింజలు, గరంమసాలా, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ కలుపుకోవాలి. తరువాత అందులో మైదా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని అరచేయంత వెడల్పుగా చేసుకుని దాని మధ్యలో ఒక చీజ్‌ క్యూబ్‌ని ఉంచి అంచుల్ని మూసేయాలి. ఇలా అన్నీ చేసుకుని అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండి, గుడ్డు తెల్లసొన, బ్రెడ్‌పొడిని విడివిడిగా పెట్టుకోవాలి. ఒక చికెన్‌ ఉండను తీసుకుని ముందుగా మొక్కజొన్న పిండిలో, తరువాత గుడ్డు సొనలో, చివరగా బ్రెడ్‌పొడిలో దొర్లించి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకుంటే సరి.


ఆలూ మంచూరియా

కావలసినవి: మైదా: అరకప్పు, మొక్కజొన్న పిండి: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, ఉడికించిన బంగాళాదుంపలు: నాలుగు (ముక్కల్లా కోసుకోవాలి), కారం: అరచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా, ఉల్లిపాయలు: రెండు, వెల్లుల్లి రెబ్బలు: పది, క్యాప్సికం: రెండు, గరంమసాలా: పావుచెంచా, టొమాటో సాస్‌: రెండు చెంచాలు, చిల్లీసాస్‌: చెంచా, సోయా సాస్‌: అరచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో మైదా, మొక్కజొన్నపిండి, పావుచెంచా ఉప్పు, కారం వేసుకుని అన్నింటినీ కలుపుకోవాలి. ఆ తరువాత నీళ్లు పోస్తూ బజ్జీలపిండిలా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది వేడయ్యాక ఆలూ ముక్కల్ని నాలుగైదు చొప్పున మైదా మిశ్రమంలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. స్టౌమీద మళ్లీ కడాయి పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. నిమిషం తరువాత క్యాప్సికం ముక్కలు, గరంమసాలా వేసి అన్నింటినీ వేయించుకోవాలి. అవి వేగాక పావుచెంచా ఉప్పు, సోయాసాస్‌, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌, రెండు చెంచాల నీళ్లు పోసి ముందుగా వేయించుకున్న ఆలూ ముక్కలు వేసి స్టౌని సిమ్‌లో పెట్టి బాగా కలపాలి. వాటికి మసాలా పట్టాక స్టౌని కట్టేయాలి.


పనీర్‌ కట్‌లెట్‌

కావలసినవి: పనీర్‌ తురుము: మూడు కప్పులు, ఉడికించిన బంగాళాదుంప ముద్ద: మూడు కప్పులు, మైదా: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, మెంతికూర తరుగు: కొద్దిగా, గరంమసాలా: చెంచా, నిమ్మరసం: రెండు చెంచాలు, కారం: చెంచా, బ్రెడ్‌పొడి: అరకప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో మూడు చెంచాల మైదా వేసుకుని నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. మరో గిన్నెలో నూనె, బ్రెడ్‌పొడి తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసుకుని ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని కట్‌లెట్‌ ఆకృతిలో చేసుకుని మొదట మైదా మిశ్రమంలో తరువాత బ్రెడ్‌పొడిలో అద్దుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా అన్నింటినీ చేసుకుని వేడివేడిగా టొమాటో కెచెప్‌తో కలిపి వడ్డించొచ్చు.


వెజ్జీ పాన్‌కేక్‌

కావలసినవి: బొంబాయిరవ్వ: కప్పు, పెరుగు: పావుకప్పు, బియ్యప్పిండి: రెండు చెంచాలు, ఉల్లిపాయముక్కలు: పావుకప్పు, క్యాప్సికం ముక్కలు: పావుకప్పు, కొత్తిమీర: కట్ట, పచ్చిమిర్చి ముద్ద: చెంచా, క్యారెట్‌ తురుము: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, నూనె: పావుకప్పు.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి అరచెంచా నూనె వేసి బొంబాయి రవ్వను వేయించుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. పావుగంటయ్యాక మరికాసిని నీళ్లు పోసి చిక్కని పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద పాన్‌ పెట్టి... ఈ మిశ్రమాన్ని చిన్నగా ఉతప్పంలా గరిటెతో వేసి... నూనెతో రెండువైపులా కాల్చుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా అన్నింటినీ చేసుకుని... టొమాటసాస్‌తో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు