పండ్లు... నెలరోజుల వరకూ తాజాగా! - Sunday Magazine
close

పండ్లు... నెలరోజుల వరకూ తాజాగా!

దిల్లీ బాబులకి కర్ణాటక తాజా బాదామి మామిడి తినాలనీ బెంగళూరు వాసులకి లక్నో తోటల్లో కాసిన మాలిహాబాద్‌ దస్సేరి పండ్ల రుచిని ఆస్వాదించాలనీ ఉంటుంది. కానీ అవి ఇక్కడికీ ఇవి అక్కడికీ చేరేలోగానే చాలావరకూ దెబ్బతింటాయి. అందుకే వచ్చిన ధరకి దగ్గర్లోని మార్కెట్టుకి తరలించేస్తారు రైతులు. దాంతో పండించిన రైతుకీ లాభం ఉండదు, కొనుక్కున్న వినియోగదారుడికీ సంతృప్తి ఉండదు. ఆ కొరత తీర్చేందుకు ఏర్పాటైందే నోయిడాకి చెందిన సూపర్‌ ప్లమ్‌... వినూత్నమైన అంకురసంస్థ. అదెలానో చూద్దాం..!

ధాన్యం, పప్పులు ఎంత కాలమైనా నిల్వ ఉంటాయి కాబట్టి పండించాక గోడౌన్లకు తరలించి సరైన ధర వచ్చాక అమ్ముకుంటారు. కానీ పండ్లు అలాకాదు, వారం రోజులకే వడలిపోవడం, కుళ్లిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా లిచి, నేరేడు, స్ట్రాబెర్రీ, చెర్రీ, మామిడి, పియర్స్‌, ప్లమ్స్‌... వంటి పండ్లన్నీ త్వరగా పాడైపోతాయి. పైగా కొన్ని రకాలు కొన్నిచోట్లే పండుతాయి. అక్కడి నుంచి నగరాలకు వెళ్లేలోపే దెబ్బతింటాయి. అలా కాకుండా ఉండాలంటే కోల్డ్‌ స్టోరేజీగానీ రిఫ్రిజిరేషన్‌గానీ ఉండాలి. ఇది ఖర్చుతో కూడుకున్న పని. అందుకే రైతులు దగ్గర్లోని మార్కెట్టుకి తరలిస్తుంటారు. మామిడి పండ్లయితే పచ్చిగా ఉండగానే కోసేయడంతో పండటం కోసం వ్యాపారులు అనేక మార్గాల్ని అనుసరిస్తుంటారు. దాంతో వాటి అసలైన రుచిని ఆస్వాదించలేం. ఈ లోపాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేశాడు శోభిత్‌ గుప్తా. అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ ‘సూపర్‌ప్లమ్‌’ స్టార్టప్‌. చెట్టు నుంచి కోసిన పండ్లను నెల రోజులు తాజాగా ఉంచడం ద్వారా రైతులకీ కొనుగోలుదారులకీ లాభాన్ని చేకూరుస్తున్నాడు.
ఇందుకోసం ముందుగా పండ్లను తాజాగా ఉంచే ఫ్రెషరేటర్‌ కంటెయినర్ల మీద దృష్టి పెట్టారు. పండ్ల నుంచి సహజంగా విడుదలయ్యే ఇథిలీన్‌ కారణంగానే అవి త్వరగా పాడవుతాయనేది తెలిసిందే. కాబట్టి పండ్ల నుంచి విడుదలైన ఇథిలీన్‌ను గ్రహించే రాడ్స్‌ను కంటెయినర్లలో అమర్చడంతోపాటు వాతావరణంలోని ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌, తేమ శాతాన్ని నియంత్రించగలిగే కంటెయినర్‌ని డిజైన్‌ చేయించాడు శోభిత్‌. దీనికే ఫ్రెషరేటర్‌ అని పెట్టాడు. మాన్యువల్‌గానే కాకుండా ఆప్‌ ద్వారానూ కంటెయినర్‌ లోపలి వాతావరణాన్ని మార్చగలిగేలా దీన్ని రూపొందించారు. పైగా ఈ ఫ్రెషరేటర్‌ పండ్ల రకాన్ని బట్టి లోపలి వాతావరణాన్ని ఆటోమేటిగ్గానూ సెట్‌ చేసుకుంటుందట. ఈ కంటెయినర్‌కి బయటి నుంచి విద్యుచ్ఛక్తి అవసరం లేదట. కాబట్టి ఈ సరికొత్త కోల్డ్‌స్టోరేజీ చెయిన్‌ ద్వారా ఎంత దూర ప్రాంతాలకైనా పండ్లను తాజాగా అందించవచ్చు అంటున్నారు సంస్థ సభ్యులు. ప్రారంభించిన ఏడాదిలోనే కొవిడ్‌, లాక్‌డౌన్‌ అడ్డంకులు ఉన్నప్పటికీ లక్షన్నర కిలోమీటర్ల వరకూ పండ్లను చేరవేశారట.

ఎలా చేస్తున్నారు?

రైతుల దగ్గరకు నేరుగా వెళ్లి, వాళ్లు పండ్లను పండించే పద్ధతుల్నీ నేలనీ శాస్త్రీయంగా పరీక్షించి మరీ వాటిని కొంటుందీ సూపర్‌ ప్లమ్‌ సంస్థ. అలా ప్రస్తుతం ఈ కంపెనీ 230 ఫామ్స్‌తో అనుసంధానమై, సుమారు 20 రకాల పండ్లను దిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లోని స్పార్‌, నేచర్స్‌ బాస్కెట్‌, రిలయెన్స్‌, స్థానిక దుకాణాలు... ఇలా మొత్తం 320 స్టోర్లకు చేరవేస్తుందట. తమ వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌, ఆప్‌ల ద్వారానూ పండ్లను అమ్ముతోంది. దాంతో అటు రైతులకు సరైన ధర లభించడంతోపాటు ఇటు వినియోగదారులకు తాజా పండ్లూ దొరుకుతున్నాయి. ప్యాకింగుమీద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేస్తే చాలు, అది ఏ ఫామ్‌లో పండిందీ సేంద్రియమా, కాదా అన్న వివరాల్నీ తెలుసుకోవచ్చట. కాబట్టి తాము తింటోన్న పండు రుచే కాదు, దాన్ని ఎక్కడ, ఎలా పండించారో కూడా తినేవాళ్లకు తెలుస్తుందన్నమాట. ఇవన్నీ అలా ఉంచితే, దేశవ్యాప్తంగా పండిన పండ్లలో 30 శాతం వృథాగా పోవడంవల్ల పర్యావరణానికీ నష్టమే. కుళ్లిన పండ్ల నుంచి విడుదలైన మీథేన్‌ గాల్లో కలిసి ఆక్సిజన్‌తో చర్యపొంది, కార్బన్‌డైఆక్సైడ్‌ను విడుదల చేస్తూ వాయుకాలుష్యానికీ కారణమవుతుంది. కాబట్టి సూపర్‌ప్లమ్‌ లాంటి సంస్థల ద్వారా ఆ వృథాని కొంతవరకైనా అరికట్టొచ్చన్నమాట.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న