ఈ కథల్లో పాత్రలు మన పిల్లలే..! - Sunday Magazine
close

ఈ కథల్లో పాత్రలు మన పిల్లలే..!

‘అనగనగా ఓ రాజు... ఆ రాజుకేమో ఏడుగురు కొడుకులు...’ అంటూ కథ మొదలెడితే ఓపిగ్గా వింటూ ఊకొట్టే పిల్లల కాలం కాదు ఇది. ఆ కథలో హీరో లేదా హీరోయిన్‌ తామే కావాలనుకుంటారు నేటి చిచ్చర పిడుగులు. నిజం, వాళ్లనే పాత్రలుగా మలిచినా కథలో వాళ్ల పేరు చేర్చినా వాళ్లకు నచ్చినట్లుగా కథని మార్చి చెప్పినా వాళ్లకెంతో ఇష్టం. అది గమనించే ఓ ముగ్గురు మిత్రులు ‘మెర్లిన్‌వ్యాండ్‌’ పేరుతో ఏకంగా కథల పుస్తకాల్నీ కస్టమైజ్డ్‌ చేస్తున్నారు. ఆ కథాకమామిషు..!

నగనగా ఓ ఊళ్లో కునాల్‌ అనే కుర్రాడు ఉన్నాడు. ఆ అబ్బాయికి పక్షులన్నా జంతువులన్నా చాలా ఇష్టం. రోజూ స్కూలు అయిపోగానే స్నేహితులతో కలిసి ఆటలు ఆడుతూ గాలిపటాలు ఎగరేసుకుంటూ ఉంటాడు. ఓసారి అలా ఆడుకుంటుండగా దూరంగా పర్వతం నుంచి లావా ఉప్పొంగడం కనిపించింది. అది చూసిన కునాల్‌ తన స్నేహితులతో కలిసి ఊరినీ జంతువులనీ కాపాడతాడు. ఇదీ క్లుప్తంగా ‘టింబక్టు రెస్క్యూ’ అనే కథ సారాంశం. అయితే ఆ స్టోరీలోని కునాల్‌కి బదులుగా మీ అబ్బాయి పేరుతోనే కథని ముద్రిస్తే... ఆ చిన్నారి ఆనందానికి హద్దుంటుందా! బిడ్డఆనందాన్ని చూసి అమ్మానాన్నలకూ గుండె నిండిపోదూ! ఈ ఆలోచనతోనే హైదరాబాద్‌కు చెందిన సుదర్శన్‌ విగ్‌, రామారావు రౌతు, నీరజ్‌ అగర్వాల్‌ అనే ముగ్గురూ కలిసి ఓ సరికొత్త స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు. అదే ‘మెర్లిన్‌వాండ్‌...’ కస్టమైజ్‌డ్‌ కథలు..!

పబ్లిషింగ్‌ అండ్‌ డిజైన్‌లోనూ సాఫ్ట్‌వేర్‌ రంగంలోనూ అనుభవం ఉన్న ఈ ముగ్గురూ పిల్లలకోసం ఏదైనా చేయాలనుకున్నారు. కథలు వినడమన్నా చదవడమన్నా పిల్లలకు సహజంగానే ఇష్టం ఉంటుంది. వాటి వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరగడమే కాదు, వాటి ద్వారా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా తెలుసుకుంటారు. ఆ పాత్రల్లో తమను ఊహించుకునీ ఆనందిస్తారు. అయితే టీవీలూ ఫోన్ల నుంచి నేటి తరం పిల్లల్ని కాసేపయినా దూరం చేయడం కష్టంతో కూడుకున్న పని. అందుకే వినూత్నంగా ఆలోచించాలనుకున్నారు. అప్పుడు వచ్చిన ఆలోచనే... ఈ పర్సనలైజ్డ్‌ స్టోరీబుక్స్‌. విలువల్ని నేర్చుకుంటూ మంచిచెడులు అర్థమయ్యేలా కథల్ని రాయించి, వాటిల్లోని పాత్రల పేర్లను పిల్లలు లేదా తల్లిదండ్రుల కోరిక మేరకు మార్చి ముద్రించి ఇస్తున్నారు. కేవలం ఒక్క హీరో అనే కాదు, అతని స్నేహితుల పేర్లనూ చేర్చుకోవచ్చు. ఇందుకోసం మెర్లిన్‌వ్యాండ్‌ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కథను ఎంపిక చేసుకుని మార్చాల్సిన పేర్లు ఇచ్చి పుస్తకం ఆర్డరు ఇవ్వాలి. అప్పుడు కథలోని పాత్రల పేర్లను మార్చి పుస్తకంగా ముద్రించి పంపుతారు. కావాలంటే కథను కూడా పిల్లలే తమకు నచ్చినట్లుగా మార్చి రాసుకోవచ్చు. ఉదాహరణకు ఆ కథ అడవి నేపథ్యంగా సాగుతుందే అనుకుందాం... దాన్ని పిల్లల కోరిక మేరకు అంతరిక్షంలోనో ఎడారిలోనో జరుగుతున్నట్లు మారుస్తారు. పైగా ఒక్కో పుస్తకం 32 నుంచి 40 పేజీలతో రంగుల బొమ్మలతో కళ్లకు
ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకంటే- పుస్తకం అట్టతోపాటూ పేజీలు కూడా ఎంతో మందంగా ఉంటాయి. ఇంత మందంతో వచ్చే పిల్లల పుస్తకం ఇప్పటి వరకూ ఇదే అంటున్నారు బోర్డు సభ్యుడూ డిజైన్‌ అడ్వైజర్‌ అయిన రామారావు. పైగా ఇది మ్యాట్‌ ఫినిషింగ్‌తో రావడం వల్ల ఎలాంటి లైటింగ్‌లో చదివినా గ్లేరింగ్‌ ఉండదట. దాంతో ఇంకేముందీ... తల్లితండ్రులే తమ పిల్లల పేరుతో కథను ప్రింట్‌ చేయించి వాళ్ల పుట్టినరోజు కానుకగా ఆ పుస్తకంతో వాళ్లని సర్‌ప్రైజ్‌ చేస్తున్నారట. అంతేకాదు... పిల్లలు తమ స్నేహితుల పుట్టినరోజుకీ ఇలా కస్టమైజ్డ్‌ చేయించిన పుస్తకాన్ని ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారట.

ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో గ్రేట్‌ టింబక్టు రెస్క్యూ, ద టింగ్లింగ్‌ ఫింగర్‌, మ్యూజిక్‌ బ్యాండ్‌... వంటి కథలు ఉన్నాయి. పర్సనలైజ్డ్‌ చేయగలిగే మరికొన్ని కథల్ని రాయించే పనిలో ఉన్నామని చెబుతున్నారు సంస్థ సీఈవోగా ఉన్న సుదర్శన్‌. ఇందుకోసం ప్రత్యేకంగా రచయితల్నీ బొమ్మలకోసం ఆర్టిస్టుల్నీ కూడా ఏర్పాటుచేసుకుందీ బృందం. ఈ మిత్ర త్రయానికి ఆగ్మెంటెడ్‌ రియాల్టీ, యానిమేషన్‌ టెక్నాలజీతోనూ పుస్తకాల్ని రూపొందించే ఆలోచన ఉందట. అంటే- ఆప్‌ సాయంతో పేజీని స్కాన్‌ చేస్తే అందులోని క్యారెక్టర్లన్నీ కదులుతూ మాట్లాడుతూ కనిపిస్తాయన్నమాట. అంతేకాదు, త్వరలో పిల్లల ఫొటోని సైతం కార్టూన్‌లా మార్చి బొమ్మలు వేయించే ఆలోచనలోనూ ఉన్నారట. అప్పుడిక పిల్లల ఆనందానికి అంతే ఉండదేమో!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న