తొలి వైష్ణవ క్షేత్రం.. ఈ జనార్దనాలయం - Sunday Magazine
close

తొలి వైష్ణవ క్షేత్రం.. ఈ జనార్దనాలయం

గోదావరి నదికి ఎదురుగా... ధవళగిరి కొండపైన కొలువై... కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తుల పూజల్ని అందుకుంటున్నాడు లక్ష్మీ జనార్దనస్వామి. ధవళేశ్వరంలో ఉన్న ఈ క్షేత్ర దర్శనం సర్వపాపహరణమని అంటారు. కృతయుగం నాటి నుంచీ అందుబాటులో ఉన్న ఈ మందిరాన్ని మొదటి వైష్ణవ క్షేత్రంగా పరిగణిస్తారు. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్న ఈ ఆలయం పర్యటక క్షేత్రంగానూ విరాజిల్లడం విశేషం.

ప్రకృతి రమణీయతా, ఆధ్యాత్మికతా కలబోసిన మహిమాన్విత క్షేత్రం ధవళేశ్వరంలోని లక్ష్మీజనార్దనస్వామి ఆలయం. పవిత్ర గోదావరి నదీ తీరాన కనిపించే ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని ధవళగిరిపైన ఉంది. మహావిష్ణువు జనార్దనుడిగా శ్రీదేవి, భూదేవిలతో కలిసి కొండమీద కొలువై దర్శనమిచ్చే ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు.

గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఈ ఆలయం కొండచుట్టూ మౌనంగా మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. తొలి వైష్ణవ క్షేత్రంగా, నవ జనార్దన ఆలయాల్లో ఒకటిగా చెప్పుకునే ఈ మందిరంలోని స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడనడానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

స్థలపురాణం

జగన్నాటక సూత్రధారి అయిన నారాయణుడు లోక శ్రేయస్సు కోసం కృతయుగంలో జనార్దనుడిగా వెలిశాడని ప్రతీతి. బ్రహ్మాండ పురాణం ప్రకారం... సృష్టికర్త అయిన బ్రహ్మ ముఖాల నుంచి చతుర్వేదాలు కోటిసూర్యుల కాంతులతో ఆవిర్భవించినప్పుడు... ఆ తేజస్సును తట్టుకోలేక ముల్లోకాలూ తల్లడిల్లాయట. లోక సంరక్షణార్థం ఆ తేజస్సును తగ్గించేందుకు శ్రీహరి జనార్దనుడిగా అవతరించి ఆ శక్తిని తనలోనే నింపుకొని ధవళగిరిపైన స్వయంభువుగా వెలిశాడట. అందుకే ఇది మొదటి వైష్ణవ క్షేత్రమని అంటారు. ఆ తరువాత త్రేతాయుగంలో రాముడు సీతా లక్ష్మణ సమేతంగా ఈ ఆలయాన్ని సందర్శించి హనుమంతుడిని క్షేత్రపాలకుడిగా ఉండమంటూ ఆజ్ఞాపించాడట. రాముడిని చూడకుండా తాను ఉండలేనని హనుమంతుడు చెప్పడంతో రాముడు తన పాదముద్రలు ఆంజనేయుడికి ఇచ్చాడట. అలా రాముడి పాదముద్రల్ని స్వీకరించిన హనుమంతుడు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉండేందుకు సిద్ధమయ్యాడట. నేటికీ ఆ పాదముద్రల గుర్తులు ఇక్కడ ఉంటాయనీ... వాటిని రామపాదాల రేవులో భక్తులు దర్శించుకోవచ్చనీ చెబుతారు. క్రీస్తుశకం 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పాలించిన చాళుక్య ప్రభువులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చరిత్ర చెబుతుంటే ఆ తరువాత ఎంతోమంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని అంటారు.

ఇంటింటికీ వచ్చే స్వామి

ఈ ఆలయంలో ఉన్న సంతాన వేణుగోపాల స్వామి మందిరం నుంచి కాశీకి సొరంగమార్గం ఉంటుందని అంటారు. అదేవిధంగా ఈ ప్రాంగణంలోనే హనుమంతుడు, మహాలక్ష్మి ఆండాళ్‌ ఉపాలయాలూ ఉంటాయి. ఈ ఆలయంలో రోజువారీ చేసే పూజలు ఒకెత్తయితే.. మాఘశుద్ధ ఏకాదశి నుంచీ పౌర్ణమి మధ్యలో స్వామికి ప్రత్యేకంగా జరిపే కల్యాణోత్సవం, రథోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. అదేవిధంగా స్వామిని పల్లకిలో ఊరేగించేటప్పుడు ఆ ఊళ్లోని ప్రతి ఇంటిముందూ ఆ పల్లకి ఆగడం, అప్పుడు భక్తులు స్వామికి పూజలు నిర్వహించి హారతులు ఇవ్వడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు సమీపంలోని కాటన్‌ బ్యారేజీ, మ్యూజియంని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడకు పాతిక కిలోమీటర్ల దూరంలోనే వాడపల్లి వేంకటేశ్వరస్వామి, పదిహేను కిలోమీటర్ల దూరంలో కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.

ఎలా చేరుకోవచ్చు..

ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఉంది. రాజమహేంద్రవరం వరకూ బస్సు, రైలు మార్గాల ద్వారా చేరుకుంటే... అక్కడి నుంచి ఆలయానికి వెళ్లేందుకు ఆటోలూ, బస్సులూ, ఇతర ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి.

- శ్రీకాంత్‌ జక్కా, కంటెంట్‌ ప్రొవైడర్‌, తూర్పుగోదావరి జిల్లా


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న