ఇంటికే స్టార్‌ హోటల్‌ భోజనం! - Sunday Magazine
close

ఇంటికే స్టార్‌ హోటల్‌ భోజనం!

హైదరాబాద్‌ బిర్యానీ, డోమినోస్‌ పిజ్జా, మెక్‌డోనాల్డ్స్‌ బర్గర్‌... ఇలా ఏది తినాలన్నా ఆప్‌లోకి వెళ్లి నిమిషంలో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు. అలాగే రెస్టరెంట్స్‌, హోటల్స్‌ నుంచీ కోరిన రుచుల్ని తెప్పించుకోవచ్చు. కానీ ఏదైనా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో లంచ్‌ తినాలంటే మాత్రం అక్కడకు వెళ్లాల్సిందే. అయితే కరోనా పుణ్యమా అని ఇప్పుడు బడా హోటల్స్‌ సైతం తమ స్టార్‌ మెనూని ఇంటికే అందిస్తున్నాయి.

స్టార్‌ హోటల్లో ఒకసారయినా భోజనం చేయాలనో లేదా కనీసం స్నాక్స్‌ అయినా తినాలనో చాలామంది అనుకుంటుంటారు. కానీ వెళ్లడానికి తీరికలేని సంపన్నులు కొందరైతే, అక్కడ పద్ధతులు ఎలా ఉంటాయో అన్న ఒకలాంటి సంశయం, బిడియంతో వెనకడుగు వేసే మధ్యతరగతి వాళ్లూ ఉంటారు. పోనీ మిగిలిన రెస్టరెంట్స్‌ మాదిరిగా స్టార్‌ హోటల్‌ భోజనాన్ని ఇంటికి తెప్పించుకోవడమూ కుదరని పని. అయితే కరోనా పుణ్యమా అని ఇప్పుడు అవీ ఇంటికే వస్తున్నాయి. దాంతో ఇంట్లో కూర్చునే ఆ స్టార్‌ హోటల్‌ ఫుడ్‌ను ఆస్వాదించేస్తున్నారు. అవునండీ... దేశంలో అతిపెద్ద స్టార్‌ హోటల్‌ చెయిన్స్‌ అయిన ఐటిసి, తాజ్‌, మారియెట్‌, నోవోటెల్‌, పార్క్‌ హయత్‌, ద పార్క్‌ హోటల్స్‌... వంటివన్నీ మెట్రో నగరాల్లోని ఇళ్లకి తమ రుచుల్ని పంపించడం ద్వారా వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కరోనా ప్రారంభమైన కొన్ని నెలలకే ఫైవ్‌స్టార్‌ హోటళ్లు తమ కస్టమర్లకోసం వినూత్నమైన సేవల్ని ప్రారంభించాయి. మారియెట్‌ ఇంటర్నేషనల్‌ ప్రయోగాత్మకంగా మారియెట్‌ ఆన్‌ వీల్స్‌తో సిగ్నేచర్‌ డిషెస్‌ అందించింది. దానికి మంచి ఆదరణా వచ్చిందట. దాంతో ఐటిసి, తాజ్‌ గ్రూప్‌లు వంటకాలతోపాటు వాటికి సంబంధించిన పదార్థాలను అన్నింటినీ కలిపి ఇంట్లో వండుకునేలా లేదా మ్యారినేట్‌ చేసుకునేలా కలినరీ ప్యాకింగ్‌లనూ పంపించడం ప్రారంభించాయి. తాజ్‌ గ్రూప్‌ క్యూమిన్‌ ఆప్‌ ద్వారా అందిస్తుంటే, మిగిలిన హోటళ్లు స్విగ్గీ, జొమాటోలతో అనుసంధానమై ఆర్డర్లు తీసుకుంటున్నాయి. లేదూ ఆ హోటల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆర్డరు పెట్టడమో లేదా నేరుగా కాల్‌ చేసి తెప్పించుకోవడంతోపాటు టేక్‌ ఎవే సదుపాయాన్నీ కొన్ని హోటళ్లు కల్పిస్తున్నాయి. కార్పొరేట్‌ ఆఫీసులూ మీటింగులకోసం బ్రంచ్‌ తరహా బాక్సుల్నీ బెంటో బాక్సుల్నీ బిజినెస్‌ లంచ్‌ బాక్సుల్నీ కూడా డిజైన్‌ చేసి అందిస్తున్నాయి. ఇళ్లకీ ఆఫీసులకీ పంపిస్తున్న ఈ వంటలన్నీ కూడా హోటల్‌లో వడ్డించే వాటి మాదిరిగానే ఎగ్జిక్యూటివ్‌ షెఫ్‌ ఆధ్వర్యంలోనే వండి ఎంతో జాగ్రత్తగా ప్యాక్‌చేయించి మరీ పంపిస్తున్నామనీ, క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడటంలేదనీ నిర్వాహకులు చెబుతున్నారు. ఆర్డరు మీద స్పెషల్‌ వంటకాల్నీ తయారుచేయడం విశేషం. అందులో ఇండియన్‌, యూరోపియన్‌, ఇటాలియన్‌, పాన్‌ ఏషియన్‌... ఇలా
రకరకాల రుచులు ఉంటున్నాయి. అలాగే మీల్స్‌ బాక్సులతోపాటు శాండ్‌విచ్‌, డెజర్ట్‌, సలాడ్‌... వంటివాటిని దేనికదీ తెప్పించుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌, హై టీ, పిక్నిక్‌ బాక్సుల రూపంలోనూ ప్యాక్‌ చేస్తున్నారు. కొన్ని హోటల్స్‌ మాత్రం ఇంటికి పంపించే మెనూని స్పెషల్‌గా డిజైన్‌ చేస్తున్నాయి. తందూరీ పనీర్‌ టిక్కా, ముర్గ్‌ కొల్హాపురి, చుకందర్‌కె టిక్కి, ముర్గ్‌ మలై టిక్కా, మలబార్‌ ఫిష్‌, దాల్‌ మఖానీ, బాదం కేక్‌, అంబాలా మటన్‌ కర్రీ, కలాకంద్‌ టార్ట్‌... వంటి అనేక వెరైటీలను అందులో ఉంచుతున్నాయి. కాబట్టి వాటిల్లో నచ్చినదాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. చూశారుగా మరి... స్టార్‌ హోటల్‌ మెనూ రుచిచూడాలంటే ఆ హోటల్‌కి వెళ్లకుండానే అక్కడి వంటకాల్ని హాయిగా ఎంజాయ్‌ చేయవచ్చు. సో, కరోనాతో ఆ ఐదునక్షత్రాల హోటళ్లు సంపన్నులతోపాటు సామాన్యులకీ చేరువయ్యాయన్నమాట.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న