వెండి కాన్వాస్‌...చిత్రం అదుర్స్‌! - Sunday Magazine
close

వెండి కాన్వాస్‌...చిత్రం అదుర్స్‌!

అమ్మమ్మ పుట్టినరోజుకు నేహా బహుమతి తెచ్చింది. తీసి చూస్తే ధగధగ మెరిసే నాణెం శివపార్వతుల చిత్రంతో కనిపించింది. ‘ఇదేంటీ, వెండి కాయిన్‌లానే ఉంది కానీ దీనిపైన రంగుల ఫొటో, శుభాకాంక్షలు తెలిపే అక్షరాలూ ఉన్నాయీ’ ఆశ్చర్యంగా అనుకుంది అమ్మమ్మ. అసలు విషయం ఏమంటే, అది పర్సనలైజ్డ్‌ వెండి నాణెం. బహుమతుల్లో ఇప్పుడివే సరికొత్త ట్రెండ్‌!

కప్పుడు ఏదైనా సంస్థ రజతోత్సవమో, ఇంకేదైనా ప్రత్యేకమైన సందర్భమో వస్తే ఆ వేడుకలకు గుర్తుగా కొంతమంది వెండి నాణేల్ని తయారు చేయించి, పంచిపెట్టేవాళ్లు. తెల్లటి మెరుపుల ఆ వెండి నాణేలపై కంపెనీ పేరో, చిహ్నమో కనిపించేవంతే. కానీ ఇప్పుడదే వెండి కాయిన్‌... పుట్టిన రోజు దగ్గర్నుంచి పెళ్లిరోజు వరకూ ప్రతి వేడుకకూ బహుమతిగా మారిపోయి అందరినీ మెప్పిస్తోంది. అందమైన డిజైన్లలో రంగుల‘చిత్రం’లా ముస్తాబై కళ్లను కట్టిపడేస్తోంది.

సందర్భానికో నాణెం!

ఇచ్చే బహుమతి అటు విలువైందిగానూ, ఇటు అమూల్యమైందిగానూ ఉండాలనుకునేవాళ్లు ఈ కస్టమైజ్డ్‌ సిల్వర్‌ కాయిన్ను గిఫ్ట్‌గా ఇచ్చి తమ అభిరుచిని చాటుకోవచ్చు. వెండి నాణెం మీద ఎనామిల్‌ కోటింగ్‌తో మనకు కావాల్సిన చిత్రాల్ని వేయించుకోవచ్చు. నచ్చిన రూపులో మెచ్చిన సైజులో ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి చేయించుకోవచ్చు. సన్నిహితుల బర్త్‌డేకి బహుమతి ఇవ్వాలనుకుంటే వెండి నాణెంమీదనే ఒక వైపు ఫొటో, ఇంకో వైపు ‘హ్యాపీ బర్త్‌డే’ అక్షరాలతో పాటు అందంగా కేకు బొమ్మనీ దింపేయొచ్చు. అదే చిన్నారులకైతే వాళ్లకిష్టమైన కార్టూన్‌ క్యారెక్టర్ల బొమ్మల నాణేల్ని అందిస్తే థ్రిల్‌ కాకుండా ఉంటారా! ఏ పెళ్లిరోజుకో అయితే పెళ్లిమండపంలోని వధూవరుల పెళ్లి ఫొటోని నాణెంపైన వేయించి ఇస్తే అది వాళ్లకు ఎప్పటికీ తీపి గుర్తులా ఉండిపోవాల్సిందే మరి. ‘నువ్వే నా ప్రాణం’ అంటూ ముద్రించి ఇచ్చిన నాణేన్ని చూసి ప్రియురాలు ఫిదా అయిపోదూ!  పాపాయి బారసాల, అమ్మాయి ఓణీల వేడుక, గృహప్రవేశం, సీమంతం... ఒకటనేంటి, ప్రతి సందర్భంలోనూ వెండికాయిన్లను కాన్వాసుగా చేసి అదిరిపోయే బహుమతులుగా ఇవ్వొచ్చు.

ఫొటోలే కాదు... భగవదారాధకుల కోసం దేవుళ్ల చిత్రాలూ, ప్రేయసీ ప్రియులకోసం లవ్‌ థీమ్స్‌, జంతు ప్రేమికులు మెచ్చే వన్యప్రాణులూ అందమైన పక్షులూ, అపురూపమైన ప్రకృతి దృశ్యాలూ... వెండి వెలుగుల్లో చేరి నాణేలకు అదనపు సొబగులు అద్దుతున్నాయి. అభిరుచికీ, వేడుకకూ తగ్గట్టు ఈ కలర్‌ఫుల్‌ సిల్వర్‌ కాయిన్స్‌ను ఎంచుకోవచ్చు, ఇష్టమైనవారికి బహుమతిగా ఇచ్చి వారి మనసులు గెలుచుకోవచ్చు... ఏమంటారు?!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న