ఉచిత వైద్యం... ఇంటివద్దే! - Sunday Magazine
close

ఉచిత వైద్యం... ఇంటివద్దే!

శోభాదేవికి రొమ్ముక్యాన్సర్‌ ఉంది కానీ... వైద్యం చేయించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె రోజుకూలి. మహేష్‌ ఒంటరి. భార్య చనిపోవడం, కూతుళ్లు దూరం పెట్టేయడంతో మానసికంగా కుంగిపోయాడు. దానికితోడు జబ్బులు కూడా తోడయ్యాయి. వీళ్లనే కాదు.... మారుమూల ప్రాంతాల్లో, పల్లెటూళ్లల్లో ఉండే ఎంతోమంది పరిస్థితి ఇదే. ఇలాంటి వాళ్లకు ఉచిత వైద్యసాయం అందించడంలో ఆశాకిరణంగా నిలుస్తోంది ‘స్మైల్‌ ఆన్‌ వీల్స్‌’

అధ్యయనాల ప్రకారం... మన దేశంలోని మారుమూల పల్లెల్లో ఇప్పటికీ చాలాచోట్ల వైద్య సదుపాయం లేదు. ఏ చిన్న జబ్బు చేసినా పక్కఊరికో, కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్దాసుపత్రికో వెళ్లాలి. దానికితోడు కుటుంబ పరిస్థితులూ, ఆర్థిక ఇబ్బందులూ, సరైన అవగాహన లేకపోవడం తదితర కారణాల వల్ల చాలామంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ గుర్తించిన స్మైల్‌ ఫౌండేషన్‌ ఇండియా పల్లె ప్రజలకు ఉచిత వైద్య సదుపాయం అందించాలనే లక్ష్యంతో కొన్నేళ్ల క్రితం ‘స్మైల్‌ ఆన్‌ వీల్స్‌’ సేవల్ని ప్రారంభించింది. ఇంటివద్దకే వైద్యం పేరుతో ఏర్పాటుచేసిన ఈ మొబైల్‌ ఆసుపత్రి ద్వారా ఇప్పటి వరకూ దాదాపు పదిహేడు రాష్ట్రాల్లోని ఐదులక్షలమంది దాకా చికిత్స చేయించుకోవడం విశేషం.

మొబైల్‌ ఆసుపత్రి అంటే...

సాధారణంగా గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం మామూలే. ఊరి వాళ్లందరినీ ఒకచోటకు చేర్చి, పరీక్షించి, మందులు ఇచ్చి పంపించేస్తుంటారు. కానీ ఈ మొబైల్‌ ఆసుపత్రి అలా ఉండదు. ఈ వ్యానులో ఓ డాక్టర్‌, నర్స్‌, సహాయకుడు ఉంటారు. ఈ వ్యాను ఊళ్లోకి రావడానికి ముందే స్మైల్‌ ఫౌండేషన్‌ వాలంటీర్లు అక్కడికి చేరుకుని ఊరివాళ్ల సమాచారాన్ని సేకరిస్తారు. తరువాత ఈ మొబైల్‌ ఆసుపత్రి ఊళ్లోని ప్రధానవీధుల్లో తిరుగుతుంది. ఒక వ్యక్తిని ప్రాథమికంగా పరీక్షించేందుకు అవసరమైన పరికరాలన్నీ ఈ వ్యానులో ఉంటాయి. ఒకవేళ రోగి ఆరోగ్యంపట్ల డాక్టర్‌ ఏదయినా అనుమానం వ్యక్తం చేస్తే... ఆ ఊరికి దగ్గర్లో ఉండే ఆసుపత్రిలో రోగికి అదనపు పరీక్షలు చేయిస్తారు. రోగి పూర్తిగా కోలుకున్నాడని నిర్థారించుకునేవరకూ అతన్ని పర్యవేక్షిస్తుంటారు. ఉదాహరణకు... రొమ్ముక్యాన్సర్‌ బారిన పడిన శోభాదేవి మొదట్లో తోచిన మందులు వేసుకుందే తప్ప డాక్టర్‌ దగ్గరకు వెళ్లలేదు. చివరకు స్మైల్‌ ఆన్‌ వీల్స్‌ డాక్టర్‌ పరీక్ష చేయించడం వల్ల అసలు విషయం బయటపడటంతో క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంది. ఆమె పూర్తిగా కోలుకునేవరకూ సంస్థ వాలంటీర్లు శోభకు సాయంగానే ఉన్నారు. అదేవిధంగా భార్య చనిపోయాక ఒంటరివాడైన మహేష్‌కు కేవలం చికిత్స చేయడంతోనే ఆగిపోకుండా ఆ పెద్దాయన మానసికంగా కోలుకునేలా చేశారు. ఇలా లక్షలమంది  జీవితాల్లో వెలుగులు నింపింది ఈ మొబైల్‌ ఆసుపత్రి.

వైద్య సేవలే కాదు...

కొన్నాళ్లక్రితం మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో కలిపి దాదాపు పదిహేడు రాష్ట్రాల్లో ఈ మొబైల్‌ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. మురికివాడలూ, మారుమూల పల్లెల్లోనే ఎక్కువగా తిరిగే ఈ వ్యాన్‌లు కరోనా సమయంలోనూ పూర్తిస్థాయిలో సేవలు అందించాయి. ‘కరోనా సమయంలో చాలా ఆసుపత్రులు కోవిడ్‌ కేంద్రాలుగా మారిపోయాయి. దాన్ని గుర్తించాక మా మొబైల్‌వ్యాన్‌లు వివిధ గ్రామాలకు వెళ్లి ఆరోగ్యసమస్యలపైన పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాయి. కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించడంతోపాటూ మందులు కూడా అందించాం. మా సిబ్బంది కేవలం పరీక్షలు చేసి, మందులు మాత్రమే ఇవ్వరు. మహిళలూ, పిల్లలూ, గర్భిణులూ... ఆరోగ్యం, పోషకాహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, వ్యక్తిగత పరిశుభ్రతతోపాటూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కలిగే లాభాలు కూడా తెలియజేస్తారు. అదే విధంగా ప్రతి వ్యక్తి ఆరోగ్యచరిత్రనూ ఫైల్‌రూపంలో పొందుపరుస్తాం. దానివల్ల వాళ్లు ఎక్కడికి వెళ్లినా ఆ ఫైల్‌ డాక్టర్‌కు చూపించగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మేం ఉచిత వైద్యం అందించడం వల్ల వాళ్లు ఆ డబ్బుల్ని మరోదానికి ఉపయోగించుకోగలుగుతారు...’ అని చెబుతారు సంస్థ సహ వ్యవస్థాపకుడూ, ట్రస్టీ శంతను మిశ్రా.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న