కటింగు బోర్డుల్లో... ఎన్ని రకాలో..! - Sunday Magazine
close

కటింగు బోర్డుల్లో... ఎన్ని రకాలో..!

వంట చేయడం ఓ కళ అయితే దాన్ని మించిన ప్రావీణ్యం ఉండాలి కూరగాయలు కోయడానికి అంటుంటారు పాకశాస్త్ర ప్రవీణులు. అం³తే ఒకప్పుడు మహిళలు ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారు కాబట్టి కాస్త తీరిగ్గా కూర్చుని కూరగాయల్ని కత్తిపీటతోనే కోసుకునేవారు. కానీ ఇప్పుడలా కాదు. స్టవ్‌ పక్కనే నిలబడి కూరగాయలు కోస్తూనే గబగబా వంట చేసేస్తుంటారు. అలా కోయాలంటే పదునైన చాకుతోపాటు కటింగు బోర్డూ అంతే సౌలభ్యంగా ఉండాలి. చూడ్డానికీ అందంగా ఉండాలి. అందుకే వాటిని కూడా ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆకర్షణీయమైన రంగుల్లో డిజైన్‌ చేస్తున్నారు.


గిన్నెలతో పనిలేకుండా...

సాంబారో దప్పళమో ముక్కలపులుసో పెట్టేటప్పుడు అందులోకి ఉల్లిపాయలతో పాటు బోలెడు కూరగాయ ముక్కల్నీ కోయాల్సి ఉంటుంది. అలాగే కలగలపుకూరలు వండేటప్పుడు ముందు ఉల్లిపాయ ముక్కలూ పచ్చిమిర్చీ ఆ తరవాత కూరగాయల్ని ఒకటి తరవాత ఒకటి వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కోసి ఒకే గిన్నెలో వేయలేం. కొన్నిసార్లు ఏ టీవీ చూస్తూనో కూరగాయలు కోస్తుంటాం. అప్పుడు హాల్లోకి చాపింగ్‌ బోర్డుతోపాటు అవన్నీ వేయడానికి వేర్వేరు గిన్నెలూ కావాలి. అలా గిన్నెలతో పనిలేకుండానూ వాటిన్నింటినీ వేర్వేరుగానూ వేసుకునేందుకు వీలుగా వస్తున్నవే ఈ స్టోరేజ్‌ కటింగ్‌ బోర్డులు. ప్రెప్‌డెక్‌ కంపెనీ చేసిన బోర్డు అయితే మూసినప్పుడు బాక్సులా ఉంటుంది కాబట్టి లోపలి అరల్లోని ముక్కలమీద ఏవైనా పడతాయన్న బాధా లేదు. పైగా కంటెయినర్లకు అమర్చుకునేందుకు వీలుగా గ్రేటర్‌, జ్యూసర్‌, స్లైసర్‌, జెస్టర్‌, పీలర్‌... ఇలా 45 రకాల ఫీచర్లతో ఉన్న కటింగ్‌ బ్లేడుల్ని కలిపి సెట్‌లా ఇస్తున్నారు. దీన్ని డిష్‌వాషర్‌లోనూ శుభ్రం చేసుకోవచ్చట.


రివర్సిబుల్‌ చాపింగ్‌ బోర్డ్‌

నాన్‌వెజ్‌ కోసిన వాటిమీద కూరగాయలు కోయడం చాలామందికి ఇష్టం ఉండదు. అలాగని ఒకటికి రెండు కటింగుబోర్డులున్నా చిరాకే. అందుకే నాన్‌వెజ్‌ని ఒకవైపునా కూరగాయల్ని మరోవైపునా కోసుకోగలిగే రివర్స్‌బుల్‌ చాపింగ్‌ బోర్డులు చాలానే వస్తున్నాయి. అయితే సీజెడ్‌ఏ కంపెనీ రూపొందించిన ఈ మల్టీపర్పస్‌ చాపింగ్‌బోర్డుకి అదనంగా మరో రెండు బౌల్సులాంటివి కూడా ఉంటాయి. వీటిని విడిగా తీసి ఏవైనా పెట్టుకోవడానికీ వాడుకోవచ్చు. వాటిని తిప్పితే గ్రేటర్‌లానూ ఉంటాయి. అవి చికెన్‌, మటన్‌ముక్కలను మారినేట్‌ చేసుకునేందుకు వీలుగా చిల్లులు రంధ్రాలు పెట్టేందుకూ, అల్లంవెల్లుల్లి వంటి వాటిని సన్నగా తురుముకోవడానికీ ఉపయోగపడతాయి. అలాగే అంచులో ఉన్న వెట్‌స్టోన్‌మీద చాకుని పదును పెట్టుకోవచ్చు కూడా.


బుట్టలా మారిపోతుంది!

దే అరటికాయ. దాన్ని చిప్స్‌లా కోసి వండితే ఒకలాంటి రుచి. చదరపు ముక్కల్లా కోస్తే మరో రుచి. అందుకే వంటలో కూరగాయలు కోసే తీరు కీలకమైనది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తయారైందే ఈ నైన్‌ ఇన్‌ వన్‌ మల్టీఫంక్షనల్‌ కటింగ్‌ బోర్డు. మూతకి ఉన్న చిన్న ప్లేటుని తీసి, అక్కడ కావాల్సిన బ్లేడుని అమర్చి కూరగాయల్ని తరగొచ్చు. అవేవీ వద్దు అనుకుంటే కటింగు బోర్డుగానూ ఉపయోగపడుతుంది. ఇక, బాక్సులా ఉన్నదాన్ని కిందకి నొక్కితే బుట్టలా మారిపోతుంది. చిల్లులు కూడా ఉంటాయి కాబట్టి అందులోనే కూరగాయల్ని వేసి కడుక్కోవడానికీ బాగుంటుంది. నాణ్యమైన ప్లాస్టిక్‌తో తయారైన దీన్ని డిష్‌వాషర్‌లోనూ శుభ్రం చేసు కోవచ్చు. కోయడం అయిపోతే పండ్లబుట్టలానూ వాడుకోవచ్చు.


ఫోను పెట్టుకునేందుకు వీలుగా...

మధ్య చాలామందికి ఫోను లేదా ట్యాబ్‌లో రెసిపీలను చూసి వంట చేయడం అలవాటైంది. అలా కాకున్నా కొంతమంది ఏ పనిచేస్తున్నా ఫోను పక్కనే ఉండాలి అనుకుంటారు. అలాంటివాళ్లకోసం చేసినదే ఈ ఫ్రాంక్‌ఫర్టర్‌ బ్రెట్‌ అల్టిమేట్‌. వంటింటి గట్టు అంచుకి పెట్టుకునేలా చెక్కతో చేసిన ఈ బోర్డు లోపల అవసరమైనప్పుడు బయటకు తీసుకునేలా ఐరన్‌ ర్యాక్‌ ఉంటుంది. దాని అరల్లో పట్టేలా స్టీలు, గాజుతో చేసిన బౌల్సు కూడా ఉంటాయి. కాబట్టి బోర్డుకి పై భాగంలో మూతలా ఉండే దాన్ని తెరిచి అందులో ఫోనూ కూరగాయలూ పెట్టుకుని, గట్టు అంచుకి ఉన్న గిన్నెల్లోకి చెత్త వేసుకోవచ్చు. వీటిల్లోనే మరీ ఎక్కువ అరలు లేకుండా ఫోను మాత్రమే పెట్టుకుని చెత్తని కిందకి తోసే వీలున్నవీ ఉన్నాయి.


బ్యాక్టీరియా చేరకుండా...

టింగు బోర్డుల్ని సరిగ్గా కడగకపోతే వాటిమీద ఉన్న ఎస్కరీషియా కోలై బ్యాక్టీరియా తినే పండ్లూ కూరగాయల్లోనూ చేరుతుంది. దాంతో జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వాన్‌షెఫ్‌, నియోఫామ్‌... వంటి కంపెనీలు యాంటీ మైక్రోబియల్‌, మైక్రో బ్యాన్‌ టెక్నాలజీలను ఉపయోగించి బ్యాక్టీరియా చేరకుండా పూత పూసిన సిలికాన్‌ కటింగ్‌ బోర్డుల్ని తయారుచేస్తున్నాయి. అలాగే కొన్నిసార్లు కోసిన ముక్కల్ని వేసేందుకు పక్కన గిన్నె కానీ ప్లేటు కానీ పెట్టుకోవడం మర్చిపోతాం. అలాంటప్పుడు కటింగుబోర్డులోనే ఓ ప్లేటు ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపించేలా వీటిని డిజైన్‌ చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆ ప్లేటుని బయటకు తీసి లేనప్పుడు బోర్డులోకి తోసేయవచ్చు. పలుచని సింగిల్‌ షీటులా ఉండే వీటిని ఎక్కడికైనా వెంట తీసుకెళ్లనూవచ్చు. అయితే సహజంగానే చెక్కకి బ్యాక్టీరియాని చేరనివ్వని గుణం ఉంటుంది కాబట్టి అచ్చంగా వెదురుతో చేసినవీ చాలానే వస్తున్నాయి.


దేనికదే విడివిడిగా..!

ల్లిపాయలో మిరపకాయలో కోసిన చాపింగ్‌బోర్డుని మనం కడిగినా ఆ వాసన త్వరగా పోదు. పైగా దానిమీద వెంటనే ఆపిల్‌పండునో జామకాయనో కోస్తే ఆ వాసన వీటికి పట్టేస్తుంది. చేపలూ రొయ్యల్లాంటివైతే మరీ వాసన. అలాగని ఒక్కోదానికీ ఒక్కో కటింగుబోర్డు కొని పెట్టుకోలేం కదా. అందుకే ఒకటే కటింగుబోర్డు ఉండి పండ్లూ కూరగాయలూ చికెనూ చేపలూ చీజూ బ్రెడ్డూ... ఇలా ఒక్కోటీ ఒక్కోదానిమీద కోసుకునేలా రూపొందించినదే ఈ సెవిల్లె క్లాసిక్‌ బ్యాంబూ కటింగు బోర్డు. చెక్కతో చేసిన ఈ బోర్డు లోపలి అరల్లో ఏడు రంగుల్లో ప్లాస్టిక్‌ మ్యాట్‌లు ఉంటాయి. వాటిమీద మార్క్‌ చేసి ఉండటం వల్ల దేనికది తీసుకోవడానికీ వీలుగా ఉంటుంది. అదీగాక ఒకేసారి నాలుగైదు రకాలు వండేటప్పుడు దేనికది కోసుకుని పక్కన పెట్టుకుని వాడుకోవచ్చు.


బరువునీ చెబుతాయి

కొంతమంది బరువు పెరగకుండా ఉండేందుకు అన్నీ కొలుచుకుని తింటుంటారు. అలాగే కొన్ని రకాల వంటలకి ముఖ్యంగా కేకులూ బిస్కెట్లూ వంటివి చేసేటప్పుడు కొలత కచ్చితంగా ఉండాలి. అప్పుడు ప్రత్యేకించి వెయింగ్‌ మిషన్‌ వాడుకునే బదులు ఆ వెసులుబాటు ఏదో కటింగు బోర్డుకే ఉంటే బాగుంటుంది అనుకున్న కొన్ని కంపెనీలు బోర్డుకే ఫుడ్‌స్కేల్‌నీ అమరుస్తున్నాయి. చెక్క, వెదురు, ప్లాస్టిక్కుతో చేసే వీటిల్లో చాలానే రకాలు ఉన్నాయి. న్యూట్రిఫిట్‌ కంపెనీ చేస్తోన్న ఫుడ్‌స్కేల్‌ కటింగ్‌బోర్డులో బోర్డుని విడిగా తీయొచ్చు. చాప్‌బాక్స్‌ తయారుచేస్తున్న దాంట్లో టైమర్‌ కూడా ఉంటుంది. కాబట్టి కోయడానికి ఎంత టైమ్‌ తీసుకుంటున్నామో చూసుకోవచ్చు. ఇంకా ఇందులో ఉన్న యూవీసీ లైటును ఓ నిమిషం ఆన్‌ చేస్తే బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. ఛార్జింగ్‌ ద్వారా పనిచేసే వీటిని రోజుకి ఓ గంట చొప్పున వాడినా 30 రోజుల వరకూ ఛార్జింగ్‌ వస్తుందట.


మడిచేయవచ్చు

టింగు బోర్డులన్నీ చెక్క, గాజు, సిలికాన్‌... ఇలా దేంతో తయారైనా సమతలంగానే ఉంటాయి. కోసిన కూరగాయ ముక్కల్ని దానిమీదే ఉంచి బాణలిలో వేయాలంటే అటూ ఇటూ పడిపోతాయి. ఆ సమస్య లేకుండా ఉండేందుకు ఇప్పుడు కొన్ని కంపెనీలు బోర్డుని కావలసినట్లుగా మడిచేలా డిజైన్‌ చేస్తున్నారు. దీనికి ఓ పక్క చిల్లులు కూడా ఉండేలా చేయడంతో గిన్నెలా చేసుకుని అందులో పండ్లూ కూరగాయలు వేసి కడుక్కోవచ్చు. పలుచని షీటులా ఉండే వీటిని క్యాంప్‌లకు వెళ్లినప్పుడు బ్యాగులో పెట్టి తీసుకెళ్లేందుకూ వీలుగా ఉంటాయి. వీటిల్లోనే కిచెన్‌ గట్టు అంచుకి బోర్డుని పెట్టి, చెత్త వేసుకునేందుకు అనుకూలంగా ఉండే బిన్‌తో కలిపి వస్తున్నవీ ఉన్నాయి.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న