Masks: పరిమళించే మాస్క్‌లు! - Sunday Magazine
close

Masks: పరిమళించే మాస్క్‌లు!

కరోనాతో సహజీవనం చేస్తూ సురక్షితంగా ఉండాలంటే మాస్క్‌ తప్పనిసరి అని తేలిపోయింది. ఒకటీ రెండూ పొరలున్న కాటన్‌ మాస్క్‌లతో పోల్చితే ఎన్‌-95 లేదా ఒకసారి వాడి పారేసే సర్జికల్‌ మాస్క్‌లే బెటర్‌ అంటున్నారు నిపుణులు. అయితే అవి ఎప్పుడూ ఒకే రంగులో ఉంటే బోరే కదూ. పైగా మాస్క్‌ని ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల కాసేపటికి మన ఊపిరి మనకే చికాగ్గా ఉంటుంది. అందుకే అవి ఇప్పుడు అందమైన డిజైన్లనీ సువాసనల్నీ అద్దుకుని మరీ వస్తున్నాయి.

సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయింది. ఓ అబ్బాయి ఎదురుగా వస్తోన్న అమ్మాయిని పలకరిస్తే, ఎవరో పోకిరీ అనుకుని తిడుతుంది. వెంటనే అతను ‘ఒక్క నిమిషం...’ అంటూ జేబులోంచి మాస్క్‌ తీసి పెట్టుకోగానే గుర్తుపట్టి ‘నువ్వా...’ అంటూ ఆనందంగా కౌగిలించుకుంటుంది. కాస్త అతిగా అనిపించినా అంతగా మాస్క్‌ ఓ ముఖ భాగంగా మారిపోయిందనేది నిజం. అయితే మాస్క్‌ ఏదయినా కనీసం మూడు పొరలైనా ఉంటేనే వైరస్‌ నుంచి రక్షణ ఉంటుంది. లేదంటే సర్జికల్‌, ఎన్‌-95 మాస్క్‌లే
వాడాలన్నది తెలిసిందే. అయితే రోజూ ఎన్‌-95 మాస్క్‌లే వాడాలంటే అందరికీ సాధ్యం కాదు. దాంతో, చాలామంది సర్జికల్‌ డిస్పోజబుల్‌ మాస్క్‌లే వాడుతున్నారు. కానీ నీలి రంగులో సాదాగా ఉండే ఆ మాస్క్‌ వాడాలంటే అబ్బాయిల సంగతెలా ఉన్నా అమ్మాయిలకు మాత్రం తగని చికాకు. పైగా ఆ రంగూ నచ్చదు. అందుకే కొన్ని కంపెనీలు ఆ డిస్పోజబుల్‌ మాస్క్‌ల్ని సైతం రకరకాల రంగుల్లోనూ డిజైన్లలోనూ తయారుచేస్తుంటే, మరికొన్ని కంపెనీలు వాటికి సువాసనల్నీ అద్దేస్తున్నాయి.

అరో‘మాస్క్‌’థెరపీ
మామూలుగానే చాలామంది నోరు తాజాగా ఉండేందుకు చూయింగ్‌గమ్‌, మౌత్‌ ఫ్రెషనర్లు నములుతుంటారు. మాస్క్‌ పుణ్యమా అని అది తగ్గిపోయింది. పైగా ఊపిరివల్ల మాస్క్‌ వాసన చిరాగ్గా అనిపిస్తుంది. కానీ ముఖానికి ఆ తొడుగు ఎటూ తప్పదు కాబట్టి దాన్నే నచ్చినట్లుగా మలచుకుంటే పోలా అన్న ఉద్దేశంతో అనేక కంపెనీలు డిస్పోజబుల్‌ మాస్కులకి పుదీనా, తులసి, స్ట్రాబెర్రీ, ఆపిల్‌, పైనాపిల్‌, పీచ్‌, గులాబీ, చామంతి, చమేలీ... ఇలా ఔషధ మూలికలూ పండ్లూ పూల పరిమళాల్ని
అద్దేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు క్లాత్‌ మాస్కుల్నీ పరిమళాల్లో ముంచితీస్తున్నాయి. గాఢ తైలాల్లో ముంచిన బట్టతో ఆ మాస్క్‌ల్ని తయారుచేయడం వల్ల ఉతికినా ఆ వాసన అలాగే ఉంటుందట. మూన్‌ ఇంటర్నేషనల్‌... వంటి దేశీయ సంస్థలైతే పుదీనా, పసుపు, తులసి... వంటి మూలికా తైలాల వాసనలతో ఆయుర్వేదిక్‌ ఎన్‌-95 మాస్క్‌ల్ని రూపొందిస్తున్నాయి. కాబట్టి ఆఫీసులో మాస్క్‌ పెట్టుకుని కూర్చున్నా బాల్కనీలో విరిసిన మల్లెల పరిమళాన్నీ మరువం సుగంధాన్నీ ఆస్వాదిస్తూ పనిచేసుకోవచ్చు. పైగా పరిమళాలవల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి, నరాలు ఉత్తేజితమై మెదడుకీ తద్వారా శరీరానికీ సాంత్వన చేకూరుతుంది. కరోనా సమయంలో ఇది చాలా అవసరం. అందుకే దీన్ని అరో‘మాస్క్‌’థెరపీ అంటున్నారు.

పరిమళించే ప్యాచ్‌లెన్నో!
రోజంతా మనకు నచ్చిన పరిమళాన్ని పీల్చుకుంటూ హాయిగా ఉండాలంటే సెంటెడ్‌ మాస్కే అవసరం లేదు. సువాసనలు వెదజల్లే ఫిల్టర్లూ ప్యాచ్‌లూ స్టిక్కర్లూ ఉన్నా చాలు. అందుకే పుదీనా, స్ట్రాబెర్రీ, వెనీలా, రోజ్‌, లావెండర్‌... ఇలా సహజ గాఢతైలాల్లో ముంచిన ఫిల్టర్లని కొమార్క్‌ కంపెనీ తయారుచేస్తుంటే; స్టికెన్‌ ఫ్రెష్‌, విఫ్లీ, జనరిక్‌, లెమోటన్‌ వంటి కంపెనీలు రక రకాల సెంటెడ్‌ ప్యాచ్‌ల్ని రూపొందిస్తున్నాయి. వీటిని రోజుకొకటి చొప్పున మాస్క్‌కి అతికించుకుంటే సరిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు మాస్క్‌మీద చల్లుకునేలా సిట్రస్‌ తైలాలూ మూలికల సమ్మేళనాలతో మాస్క్‌ స్ప్రేలనీ తీసుకొచ్చాయి కొన్ని సంస్థలు. అలాకాకుండా ఆ వాసనేదో ముక్కు బట్టకే ఉంటే రోజంతా ఆ పరిమళాన్ని ఆఘ్రాణించవచ్చన్నమాట..!


అమెరికాలో దిల్లీని చూడొచ్చు!

దిల్లీ మనకు దాదాపు 13 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. లఖ్‌నవూకు విమానంలో వెళ్లినా ఒకరోజుకుపైనే పడుతుంది. కోల్‌కతాలో జనాభా మొత్తం నాలుగువేలే - ‘ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మాకు ఆ మాత్రం జనరల్‌ నాలెడ్జ్‌ లేదనుకుంటున్నారా’ అంటారేమో. ఆగండాగండీ... అసలు విషయం తెలిస్తే మీరూ ఈ నిజాల్ని ఒప్పుకుని తీరతారు.  

అమెరికా వెళితే న్యూయార్క్‌, వాషింగ్టన్‌, కాలిఫోర్నియా నగరాల్నే కాదండోయ్‌- సేలం, ఇండోర్‌, దిల్లీ, లఖ్‌నవూ, కోల్‌కతాలను కూడా చూసి రావచ్చు. ఎలాగంటే... మన దేశంలో బాగా పేరున్న ఈ నగరాల పేర్లతో అక్కడా ఊళ్ల్లున్నాయి. పలకడంలో కాస్త తేడా ఉండొచ్చు కానీ స్పెలింగ్‌ మాత్రం దాదాపు ఒకటే. ఆ సంగతేంటో కాస్త చూద్దామా...

మొఘల్‌ దిల్లీ!  
దిల్లీ... ఈ పేరు వింటూనే మనకు దేశ రాజధాని నగరమే గుర్తుకు వస్తుంది. కానీ న్యూయార్క్‌లోని డెలవేర్‌ కౌంటీలో దిల్లీ పేరుతో ఓ పట్టణం ఉంది. 166 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ఊరి జనాభా దాదాపు ఐదు వేలు. ‘ఇది సరేకానీ మన నగరం పేరు అక్కడ ఎందుకు పెట్టారబ్బా’ అంటే... 1798లో మూడు చిన్న ఊళ్లని కలిపి పట్టణంగా మార్చాలనుకున్నారట. ఈ విషయంలో ఎబినెజర్‌ ఫూటే అనే న్యాయమూర్తి కీలక పాత్ర వహించాడు. ఆయన కృషి ఫలించింది. ఈ కొత్త పట్టణానికి ఆయన గౌరవార్థం పేరు పెట్టాలనుకున్నారు. అప్పటికే ఆయన గొప్ప వ్యాపారిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అలాంటి ప్రముఖుల్ని ‘మొఘల్స్‌’ అనేవారు. అలా ఎబినెజర్‌ ఫూటేను కూడా ‘ద గ్రేట్‌ మొఘల్‌’ అని పిలుస్తుండేవాళ్లు. మన దిల్లీ మొఘల్‌ల రాజధాని కాబట్టి ఆ పేరే ఈ ఊరికి పెట్టారన్న మాట. 

కాటన్‌ పేరుతో మద్రాస్‌...
మద్రాస్‌ పేరు ఎప్పుడైనా విన్నారా అనడిగితే ‘అదేంటీ చెన్నైనే ఒకప్పుడు మద్రాస్‌ అనేవాళ్లం కదా’ అనేస్తారు. కానీ ఇప్పటికీ ఆ పేరుతో ఓ ఊరు ఉంది. అయితే అది మన దేశంలో కాదు, అమెరికాలో. మన మద్రాసులో ఒకప్పుడు ‘కాలికో’ కాటన్‌ దుస్తుల తయారీ బాగా ఉండేది. ఇక్కడ తయారైన ఆ దుస్తులకు ఆరిగన్‌లోని జెఫర్సన్‌ కౌంటీలోని ఓ ప్రాంతంలో గిరాకీ ఎక్కువగా ఉండేదట. దీంతో దానికి మద్రాస్‌ అనే పేరొచ్చింది.

హలోవీన్‌ సేలం!
తమిళనాడులోని సేలం నగరానికి మంచి పర్యటకప్రాంతంగా పేరుంటే అమెరికాలోని మసాచుసెట్స్‌లోని సేలం ఊరు హలోవీన్‌కి పెట్టింది పేరు. 17వ శతాబ్దంలో ఏర్పడిన ఈ ఊరికి శాంతి, సామరస్యం అన్న అర్థాన్నిచ్చే ‘షాలోమ్‌’ పేరు మీద సేలం అనే పేరు పెట్టారు. 41 వేల జనాభా ఉండే ఈ ఊళ్లో ఏటా హలోవీన్‌ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి.

బాంబే యువరాణి!
మన ముంబయి పేరు మీదుగా పెట్టిన బాంబే పేరుతో న్యూయార్క్‌లోని ఫ్రాంక్లిన్‌ కౌంటీలో ఇప్పటికీ ఓ పట్టణం ఉంది. అప్పట్లో ఈ ఊరి కోసం స్థలాన్ని విరాళంగా ఇచ్చిన మైకేల్‌ హోగాన్‌ భార్య భారతదేశంలోని ఒక సంస్థానానికి చెందిన యువరాణి. ఆమె పుట్టిల్లు ముంబయి కావడంతో ఈ పట్టణానికి బాంబే అని పేరు పెట్టారట. ఇవే కాదు... మన ఉత్తరప్రదేశ్‌లో పెద్ద నగరమైన లఖ్‌నవూ పేరుతో అమెరికాలో మూడు ఊళ్లున్నాయి. ఒకటి పెన్సిల్వేనియాలో, ఇంకోటి సౌత్‌ కరోలినాలో, మూడోది మిన్నెసోటాలో. ఇంకా వెస్ట్‌ వర్జీనియాలో ఇండోర్‌, ఒహాయోలో కోల్‌కతా పేర్లతోనూ ఊర్లున్నాయి!


చరిత్రలో నిలిచిపోయే విశ్వాసం!

కుక్కలంటేనే విశ్వాసానికి మారుపేరుగా చెబుతారు. ఇంటికి కాపలా కాయడం, శత్రువుల జాడ కనిపెట్టడం... ఇలా రకరకాల పనులు చేస్తుంటాయి. కానీ మొదటి ప్రపంచయుద్ధం సమయంలో ‘మెర్సీ డాగ్‌’ల పేరుతో అవి చేసిన సేవ వెలకట్టలేనిది. 1870-71 ఫ్రాంకో పర్షియన్‌ యుద్ధం సమయంలో యుద్ధభూమి నుంచి ఎంతోమంది సైనికులు కనిపించకుండా పోయారు. దాంతో కలత చెందిన జర్మనీకి చెందిన జీన్‌ బంగార్ట్జ్‌ అనే వ్యక్తి ఈ మెడికల్‌ డాగ్‌లకి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇవి సరిహద్దుల్లో గాయపడి, కదల్లేని స్థితిలో ఉన్న సైనికులను కనిపెట్టి ఆ సమాచారాన్ని అధికారులకి చేరవేస్తాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీతో పాటు, ఫ్రాన్స్‌లోనూ నేషనల్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీలు ఈ మెర్సీడాగ్‌లకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాయి. ఈ కుక్కలు రాత్రిపూట నిశ్శబ్దంగా యుద్ధభూమిలో సంచరిస్తూ - గాయపడిన తమ దేశ సైనికుల్ని వాసన ద్వారా కనిపెడతాయి. ప్రతి మెర్సీడాగ్‌కీ వీపుకి ఒక బ్యాగు కట్టి ఉండి, దాన్లో నీళ్ల బాటిల్‌, ఆల్కహాల్‌, ప్రథమ చికిత్సకు అవసరమైనవీ ఉంటాయి... ఆ సైనికులు ఉపయోగించు కునేందుకన్నమాట. ఈ కుక్కలు కొద్దిపాటి గాయాలతోనూ తీవ్రగాయాలతో ఉన్నవారికీ మధ్య తేడాను గుర్తించగలవు. కాబట్టి, ఎవరైనా తీవ్ర గాయాలయ్యి కదల్లేని స్థితిలో ఉంటే, తిరిగి క్యాంపులున్న చోటికి వచ్చి వైద్యుడిని అక్కడికి తీసుకెళ్తాయి. అలాకాకుండా సైనికుడు కొన ఊపిరితో ఉన్నాడనుకుంటే మెర్సీడాగ్‌ అతడి దగ్గరే ఉండి, ఎవరూ లేని ఆ చోటులో చివరి క్షణాల్లో ఆత్మీయనేస్తమై సాంత్వన చేకూరుస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు పదివేల కుక్కలు మెర్సీడాగ్‌లుగా పని చేశాయి. ఒక్కోటి వందమంది సైనికుల జాడ కనిపెట్టిన సందర్భాలూ ఉన్నాయి. అలా ఇవి ఎన్నో వేల జర్మన్‌, ఫ్రెంచి సైనికుల ప్రాణాలని నిలబెట్టాయి. అదే సమయంలో యుద్ధభూమిలోని తూటాల వర్షానికి వాటిలో ఎన్నో ప్రాణాల్నీ కోల్పోయాయి.


మీకు తెలుసా!

ఏ మార్కెట్లో అయినా రాత్రికాగానే మూటాముల్లే సర్దేస్తారు. కానీ ఇరాక్‌లోని నజఫ్‌ సిటీ బుక్‌ మార్కెట్లో - అమ్మడానికి వరుసల్లో పేర్చిన పుస్తకాల్ని రాత్రివేళ కూడా అలానే ఉంచేస్తారు. ‘చదివేవారు వాటిని దొంగతనం చేయరు, దొంగలు పుస్తకాల్ని చదవరు. అందుకే అలా వదిలేస్తా’మని చెబుతారు ఆ దుకాణదారులు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇప్పటి వరకూ అక్కడ ఒక్క పుస్తకం కూడా పోలేదట.


అలాగా!

భర్త భార్యని తిడితే బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్తుంది. అదే భార్య భర్తని తిడితే ఎక్కడికి వెళ్తాడు... ఎక్కడికీ వెళ్లలేడు. కాబట్టి ఆడవాళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న