నేలపైన ప్రేమ హారం! - Sunday Magazine
close

నేలపైన ప్రేమ హారం!

పచ్చని చెట్లతో నేలతల్లికి పచ్చల హారం చేయించి, ఆ పేరులో అందంగా పొదిగిన రత్నంలా చక్కని భవనాన్ని నిర్మించినట్టు ఉంటుంది చైనాలోని జోంగ్షాన్‌ కొండపైనున్న మీలింగ్‌ ప్యాలెస్‌. ఆకాశంలో నుంచి చూస్తే ఈ పచ్చని చెట్ల హారం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. చుట్టూ నెక్లెస్‌లా పెరిగిన చెట్ల మధ్యలో లాకెట్‌లా ఉండే ఈ భవనాన్ని... దాదాపు తొంభై ఏళ్ల క్రితం చైనా మాజీ అధ్యక్షుడు చియాంగ్‌ కై షేక్‌ తన భార్య సూంగ్‌ మీలింగ్‌కు ప్రేమ కానుకగా సకల సౌకర్యాలతో నిర్మించాడట. ఆ తర్వాత ఈ ప్రేమ సౌధం పర్యటక ప్రాంతంగా మారిపోయింది. రుతువులు మారినప్పుడల్లా ఈ చెట్ల ఆకుల రంగులు మారడమే కాదు, రాత్రివేళ అలంకరించిన విద్యుద్దీపకాంతుల మధ్య జిగేలుమంటూ రవ్వల నెక్లెస్‌లా మెరిసిపోతుంది. ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరుతూ మనసు దోచుకునే ఈ దృశ్యాన్ని చూడ్డానికి సందర్శకులు వరస కడుతున్నారంటే ఆశ్చర్యమేముంది...!


చూడ్డానికే వింతగా అనిపిస్తున్న ఈ నీటి మడుగు ఈజిప్టులోని సివా ఒయాసిస్‌ ఎడారి ప్రాంతంలో ఉంది. ఇక్కడి సాల్ట్‌ పూల్స్‌లో మనుషులు మునుగుదామని దూకినా పైనే తేలతారట. ఉప్పు గనులు ఉన్న ఈ ప్రాంతంలోని నీటిలో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉండడంతో ఆ నీటిలో ఏదీ మునిగిపోదు. కాబట్టి, ఎంత లోతున్నా పర్యటకులు ఏమాత్రం భయం లేకుండా వాటిమీద పడుకుని సేదతీరతారు. ఇక, ఆ నీటిలో ఉండే లవణాలు శ్వాస, చర్మ సంబంధ సమస్యల్ని తొలగిస్తాయట. ఎడారి మధ్యలో నీరుండడమే చిత్రం అంటే అందులో తేలడం ఇంకెంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో..!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న