బాధ్యత విలువ - Sunday Magazine
close

బాధ్యత విలువ

- యశోదాకైలాస్‌ పులుగుర్త

‘‘ఏమోయ్‌ కామేశ్వరీ, ఇప్పుడే అమ్మాయి ఫోన్‌ చేసింది బెంగళూర్‌ నుండి... నీకూ అమ్మకూ ట్రైన్‌ టిక్కెట్టు బుక్‌ చేస్తాను బెంగళూర్‌కి, ఏరోజుకి బుక్‌ చేయను అంటూ! నువ్వు స్నానం చేస్తున్నావని చెబితే తరువాత నీతో మాట్లాడతానని అంది.
ఊఁ చెప్పు కామేశ్వరీ, అమ్మాయికి ఏమి చెప్పనూ? ఏరోజుకి టిక్కెట్లు బుక్‌ చేయమననూ? నువ్వు మంచిరోజూ అదీ అంటూ అన్నీ చూస్తావుకదా...’’
‘‘వద్దు, బుక్‌ చేయొద్దని చెప్పండి,’’ కాస్త విసుగ్గా సమాధానం ఇచ్చింది.
‘‘అదేంటి కామేశ్వరీ, అలా చెప్పేస్తే అమ్మాయి బాధ పడదూ?’’
‘‘పడితే పడింది లెండి,’’ కాస్తంత కోపంగానే అందావిడ!
‘‘లేకపోతే ఏమిటండీ, అమ్మాయి దగ్గర నెల రోజులుండి వచ్చాం. వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు, మళ్లీ వెళ్లడమా, నావల్ల కాదండి బాబూ!
అక్కడకు వెళ్లి దానింట్లో చాకిరీ చేయలేను. నాకు ఓపికలేదు. మీకేం, మీరు చెపుతారు. మీకు కొన్ని అర్థంకావు!
అది నా కన్నకూతురే, కాదనను. కానీ ఎంతకని? నన్ను చూస్తేనే చాలు
అది మరింత బద్ధకస్తురాలు అయిపోతుంది. అది కాఫీ తాగేసిన కాఫీ కప్పుకూడా నేనే తీసి సింక్‌లో పడేయాలి.’’
భాస్కరరావుగారు ఆశ్చర్యంగా భార్యకేసి చూస్తూ ఉండిపోయారు...
భాస్కరరావు, కామేశ్వరమ్మగార్ల కూతురు మాధవి. బెంగళూర్‌లో ఉంటుంది. అల్లుడు అక్కడ సీమన్స్‌ ఇండియాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కూతురికి ఇద్దరు పిల్లలు.
భాస్కరరావు, కామేశ్వరికి ఇద్దరు పిల్లలు... మాధవికన్నా పెద్దవాడు కొడుకు ‘పవన్‌’ పూనేలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. కోడలు శ్వేత కూడా వర్క్‌ చేస్తుంది. వారికి ఒక్కడే పిల్లాడు. రెండేళ్లు. వాడిని వారింటి దగ్గరే ఉన్న డే కేర్‌లో దింపి ఇద్దరూ ఆఫీస్‌కు వెళ్లిపోతారు.
మాధవి పెళ్లికి ముందు జాబ్‌ చేస్తూ ఉండేది. పెళ్లి అయిన తరువాత కొద్ది కాలానికే ప్రెగ్నెన్సీ రావడం, పిల్లలు పుట్టడం, అసలే బద్ధకస్తురాలు కావడంతో సంబాళించుకోవడం చేతకాక ఉద్యోగం చేయలేననుకుంటూ జాబ్‌ మానేసింది. కూతురికి రెండు పురుళ్లూ  పోసి పుట్టిన పిల్లలకు ఆరునెలలు నిండేవరకూ ఉండి వచ్చారు భార్యాభర్తలిద్దరూ. రెండవ పురుటికి ‘నేను రాలేనే బాబూ, మీ అత్తగారిని పిలిపించుకో’ అంటే ససేమిరా నువ్వే రావాలని మంకుపట్టు పట్టింది. కన్న హృదయం, వెళ్లక తప్పలేదు.
తరువాత నుంచీ ప్రతీ ఆరునెలలకూ రమ్మనమనడం, రెండు నెలలు ఉంచేసుకోవడం. ఆ ఉన్న రెండు నెలలూ కూతురింట్లో ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా యంత్రంలా పని చేసేది. తల్లిని చూస్తేనే మాధవికి ఎక్కడ లేని బద్ధకం వచ్చేసేది. ఏమిటీ పిల్ల అని అనుకోకుండా ఉండలేకపోయేవారు కామేశ్వరమ్మగారు. పొద్దుటే లేవడం, కాఫీ టిఫిన్‌ల దగ్గర నుంచి వంట చేయడం, అల్లుడికి లంచ్‌ బాక్స్‌ కట్టివ్వడం, మనవరాలిని కిండర్‌ గార్డెన్‌ స్కూలుకి తయారుచేయడం, దానికి పాలు పట్టడం, టిఫిన్‌ తినిపించడం... దాన్ని పంపాక, సంవత్సరం నిండిన మనవడు నిద్రనుండి లేవగానే వాడిని బుజ్జగిస్తూ, బ్రష్‌ చేయించడం, పాలు పట్టడం, స్నానం వగైరాల బాధ్యత అంతా తనదే. కూతురు మాత్రం ఉదయం ఎనిమిది అయితేనేగానీ నిద్ర లేచేదికాదు. పొరపాటున కూడా ‘అమ్మా వాడికి స్నానం నేను చేయిస్తాను’ అనేది కాదు. ఎక్కడి బట్టలక్కడే, మంచం మీంచి లేవగానే బెడ్‌షీట్స్‌ కూడా మడిచి పెట్టదు. పిల్లల బట్టలూ తన బట్టలూ గుట్టలుగా పడేయడం, ఏమైనా కావాలంటే ఆ గుట్టల మధ్యలో నుండి బర బరా లాక్కోవడం. తనకి అలా ఉంటే నచ్చదు. మధ్యాహ్నం భోజనాలయ్యాక పిల్లల వార్డ్‌రోబ్స్‌, మాధవి వార్డ్‌రోబ్స్‌ తీసి అన్నీ ఎక్కడివక్కడ నీట్‌గా సర్దేది. రెండు రోజుల తరువాత చూస్తే మళ్లీ యధాప్రకారం దర్శనమిచ్చేవి. అంతకీ మధ్య మధ్యలో అంటూనే ఉండేది ‘నీట్‌గా సర్దుకోవే అమ్మలూ’ అని! ఊఁ కొట్టడమే కానీ పని శూన్యం. తను ఎప్పుడు వెళ్లినా మాధవీ వాళ్ల వంటగది కూడా అస్తవ్యస్తంగా, స్టౌతో బాటూ వంటింటి గట్టంతా జిడ్డోడుతూ ఒక తీరులో ఉండేది కాదు. తను వెళ్లగానే ముందు వంటిల్లంతా ఎక్కడికక్కడ సర్దుకుని, గట్టూ స్టౌ శుభ్రంగా తోమి కడుక్కున్న తరువాతగానీ వంటలోకి దిగేది కాదు.
చెప్పాలంటే అల్లుడు అనంత్‌ బంగారమే. అతనికి శుభ్రత కావాలి. అతను ఇంట్లో ఉంటే ఏదో ఒకటి సర్దుతూనే ఉంటాడు. అతను అలా సర్దుతూ ఉంటే తను ఎంతో ముచ్చట పడుతూ, తనుకూడా అల్లుడి కూడా ఉంటూ అతనికి సహాయపడడం చేసేది. మాధవి మీద నవ్వుతూ తనతో కంప్లైంట్‌ చేస్తూ... ‘చూడండి అత్తయ్యగారూ, తన బట్టలు తనే సర్దుకోదు. అన్నీ ఎలా పెట్టుకుంటుందో చూడండి. తనవి కూడా నేనే సర్దాలన్నట్లు చూస్తుంది’ అనగానే మాధవి కోపంతో రుసరుసలాడడం, తను సర్ది చెప్పడం చేసేది.
అల్లుడైనా అప్పుడప్పుడూ ‘మీరు రెస్ట్‌ తీసుకోండి అత్తయ్యగారూ, తరువాత చేయొచ్చు’ అంటూ తనచేత పని ఆపించేవాడు కానీ మాధవి మాత్రం ఎప్పుడూ ‘అమ్మా చాలు రెస్ట్‌ తీసుకో’ అనేది కాదు. చివరకు ఇడ్లీకీ దోసెకూ వెట్‌ గ్రైండర్‌లో పప్పుకూడా తనే వేసి అయిపోయాకా అందులో నుంచి తనే తీయాలి. తరువాత ఆ గ్రైండర్‌ని తనే శుభ్రం చేయాలి. ఓపిక ఉన్నంతవరకూ ఏమీ అనిపించదుగానీ, ఇటువంటి పనులు కూడా చేసేసరికి అలసటా నిస్సత్తువా ఆవహించేవి. మాధవి ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటుందీ అని బాధకలిగేది. దాని అత్తగారూ మామగారూ వచ్చినా ఎక్కువ రోజులుండరు. ఎందుకుంటారు... ఆవిడే అన్నీ చేసుకోవాలి మరి. ఇక్కడ అందరికీ నడుం వంచి పొద్దుట నుంచీ సాయంత్రం వరకూ చాకిరీ చేసే బదులు ఆవిడ ఇంట్లో ఆవిడ ఉండి తనకీ తన భర్తకూ చేసుకోవడం ఎంతో హాయిగా ఉంటుంది.  కన్న బిడ్డలతో కొన్ని రోజులు ఆనందంగా గడపాలని ప్రతీ తల్లిదండ్రులకూ ఉంటుంది. కానీ వాళ్లు వచ్చేది తమకు చాకిరీ చేయడానికే అని పిల్లలు అనుకుంటే ఎలా. అయినా పెద్ద వయసు వచ్చాక కూడా ఎన్ని రోజులు చాకిరీ చేయగలరు ఎవరైనా మాత్రం!

ఏ అత్తా కోడలిని కూతురులాగా చూసుకోదు, అలాగే ఏ కోడలూ అత్తగారిలో తల్లిని చూడాలనుకోదు అంటారు. కానీ తన కోడలి విషయంలో కామేశ్వరమ్మగారు చాలా అదృష్టవంతురాలు. కూతురు దగ్గర ఎంత అసంతృప్తిగా గడుపుతుందో కొడుకూ కోడలు దగ్గర అంత ఆనందంగా ఉంటుంది.

తాము అక్కడ ఉంటే శ్వేత ఆఫీస్‌కు వెళుతున్నా ప్రొద్దుటే లేచి చాలావరకూ పనులు పూర్తి చేసేసేది చకచకా. తను కాయగూరలు కోసి ఇస్తే ఎంతో ఆనందపడిపోయేది. ఏ కాస్త సహాయం చేసినా అగ్గగ్గలాడిపోతుంది. ‘నేను వచ్చాక చేస్తానత్తయ్యా, మీరు రెస్ట్‌ తీసుకోండి’ అంటుంది. కోడలే అన్నీ చేసిపెట్టాలన్నట్లు తనూ ఉండదు. అలా ఉండడం తన స్వభావం కాదు... మాధవి ఇంట్లో చేసినట్లుగానే అక్కడా చేయాలని ప్రయత్నించినా శ్వేత అడ్డుకుంటుంది. కాస్త సహాయం చేసినా ఆమె ముఖంలో ఎంతో ఆనందం. ‘అయ్యో, మీరు చేశారా’ అంటూ ఆరాటపడిపోతుంది. ఇల్లు చక్కగా నీట్‌గా ఉంచుతుంది. ఇంట్లో ఉన్న సమయంలో రెస్ట్‌ తీసుకోవాలని అనుకోదు. ఏదో ఒకటి సర్దుతూనే ఉంటుంది. తన కొడుకు ఆఫీస్‌ నుంచి లేట్‌గా వస్తాడు. ఈ లోపల ఇంట్లోకి కావలసినవన్నీ చూసుకుంటుంది. అయ్యో ఈ వస్తువు లేదే అనుకోకుండా చక్కగా ప్రణాళికాబద్ధంగా సంసారాన్ని తీర్చిదిద్దుకునే తీరు చూసి ముగ్ధురాలౌతుంది ఆవిడ. మాధవి, శ్వేతల సంసారంలోని వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఇదంతా పెంపక ప్రభావమా అంటే కానే కాదు అనుకుంటుంది ఆవిడ.
కామేశ్వరమ్మగారి చిన్నతనంలో ఆమె తల్లిదండ్రులు పెళ్లిచేసి అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు తనకు ఎన్నో నీతిబోధలు చేయడం గుర్తు ఉంది ఆవిడకు... చిన్నతనంలోనే పెళ్లయిపోయింది కాబట్టి ఆవిడ ఎక్కువగా చదువుకోలేదు. అయినా ఆవిడ మాధవికి చిన్నతనం నుంచే అన్ని పనులూ నేర్పించింది... అతిగారం కూడా చేయలేదు... నిజానికి ఇప్పటి తరం పిల్లలు ఎంతో విద్యావంతులు, వాళ్లకు తెలియని విషయం అంటూ లేదు. అంత మెచ్యూరిటీ ఉన్న పిల్లలు పెళ్లయి ఏలోటూ లేకుండా సంసారం చేసుకునేటప్పుడు పెద్దవారి పట్ల కాస్తంత కనీస సంస్కారం కూడా లేకుండా ప్రవర్తించడమే బాధగా ఉంటుంది. ఆ మధ్య కామేశ్వరిగారి స్నేహతురాలు ఉమాదేవిగారు కూతురి డెలివరీకని అమెరికా వెళ్లి, తిరిగి వచ్చేసరికి పేషెంట్‌లా వచ్చింది. ‘ఏమిటండీ ఇలా అయిపోయారు’ అనగానే, పాపం ఆవిడ కళ్లల్లో సన్నని కన్నీటి తెర. ఇంకాస్త ఆప్యాయత చూపిస్తే తనను పట్టుకుని ఏడ్చేటట్లుగా అనిపించింది...
‘అలసిపోయాను కామేశ్వరీ’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది. ‘లేచినప్పటి నుంచీ గొడ్డు చాకిరీ కామేశ్వరీ... నెలకొకసారి ఎవరినైనా పెట్టుకుని ఇల్లంతా క్లీన్‌ చేయించుకుంటారు కొంతమంది... కానీ నా కూతురూ అల్లుడూ ఒక్క డాలర్‌ కూడా ఇలాంటివాటికి ఖర్చు చేయరు. పని చేయడానికే నన్ను పిలిపించుకున్నామని అనుకుంటూ అమెరికాకు రానూపోనూ అయిన టికెట్‌ డబ్బులకు న్యాయం చేకూర్చాలనే ఆరాటమే కనపడింది వాళ్ల ప్రవర్తనలో... డిష్‌ వాషర్‌ లోడింగులూ, అన్‌ లోడింగులూ, లాండ్రి, బట్టలు మడతపెట్టడం, వంటా వార్పూ, పసిపిల్లవాడి సంరక్షణ, మధ్య మధ్యలో ఇంటికి అతిథులను పిలిస్తే వాళ్ల భోజనాలూ... ఎంత చేసినా తరగని చాకిరీ కామేశ్వరీ. మరోసారి డెలివరీకి వెళ్లకూడదనే ఏవగింపు కలిగింది. కన్నకూతురే, ఏమని చెప్పమంటావు? బయటకు చెప్పుకున్నా అసహ్యంగా ఉంటుంది. స్నేహితురాలివి కాబట్టి నీకు చెప్పుకుంటున్నాను. సొంత పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించే తీరు ఆప్యాయంగా ప్రేమగా ఉండాలిగానీ నిర్లక్ష్యంగా, కఠినంగా ఉండకూడదం’టూ చెప్పుకొచ్చింది ఆవిడ...
కామేశ్వరమ్మగారి ఆలోచనలు ఇలా సాగుతుండగా, భాస్కరరావుగారు వచ్చి ‘‘ఇదిగో నీ కూతురు నిన్ను పిలుస్తోంది మాట్లాడు, నువ్వే చెప్పు ఏ విషయం’’ అనగానే ‘‘అమ్మా మధూ ఇప్పుడు రాలేము బెంగళూర్‌కి. అన్నయ్య దగ్గరకి పూనె వెళ్లాలనుకుంటున్నాం. అక్కడి నుంచి వచ్చాక చూద్దాం. మీ వదిన ‘ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు ఉండండి, విశ్రాంతి తీసుకుందురుగానీ’ అంటోందమ్మా. ఏమిటో ఈ మధ్య కాళ్ల నెప్పులు ఎక్కువైపోయాయి తల్లీ’’ అనగానే ‘సరేనమ్మా’ అంటూ
ఠపీమని ఫోన్‌ పెట్టేసింది!
‘తప్పదు, మాధవికి కోపం వచ్చినా ఫరవాలేదు. బాధ కలిగినా గత్యంతరం లేదు. ఒకరి మీద ఆధారపడడం బాగా అలవాటైపోయింది దానికి. కూతురు పిలవగానే తను వెళ్లడం కాస్త తగ్గిస్తేనన్నా మెల్లగా బాధ్యత తెలిసొచ్చి అన్నీ
అలవాటు చేసుకుంటుంది. నేనైనా ఎల్లకాలం ఉండనుగా’ అనుకుంటూ భారంగా నిట్టూర్చారు ఆవిడ!
ఏ అత్తా కోడలిని కూతురులాగా చూసుకోదు, అలాగే ఏ కోడలూ అత్తగారిలో తల్లిని చూడాలనుకోదు అంటారు. కానీ తన కోడలి విషయంలో కామేశ్వరమ్మగారు చాలా అదృష్టవంతురాలు.
కూతురు దగ్గర ఎంత అసంతృప్తిగా గడుపుతుందో కొడుకూ కోడలు దగ్గర అంత ఆనందంగా ఉంటుంది.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న