ఉన్నది ఒకటే జీవితం - Sunday Magazine
close

ఉన్నది ఒకటే జీవితం

- వలివేటి నాగచంద్రావతి

గేటుముందు ఆటో ఆగిన చప్పుడుకి డైనింగ్‌ టేబుల్‌ తుడుస్తున్న అనసూయమ్మ ఒక్కడుగు వెనక్కివేసి మెడ తిప్పి వీధివైపు చూసింది.

గేటు తలుపు తీసి సూట్‌కేస్‌ లాక్కుంటూ వస్తోంది సంధ్య. గతుక్కుమన్నది అనసూయమ్మ. గబగబా ముందు హాల్లోకి వచ్చేసి లోగొంతుతో, ‘‘ఏవండీ సంధ్య మళ్లీ వచ్చేసింది’’ అంది గాభరాగా.

‘‘ఏవిటీ... సంధ్యా... మళ్లీనా..?’’ పడక కుర్చీలో వాలి వక్కపలుకు నములుతూ, భుక్తాయాసం తీర్చుకుంటూ పొద్దుట చదవగా మిగిలిన పేపరు చివరిపేజీలు తిరగేస్తున్న పార్వతీశంగారు గభాలున కుర్చీలోంచి లేచారు.

ఆపాటికి సంధ్య గుమ్మంలో అడుగుపెట్టింది. కూతురి చేతిలో సూట్‌కేస్‌ అందుకుని గోడవారగా పెట్టి, ‘‘బస్సా, ట్రైన్‌ కొచ్చావా!’’ అడిగింది అనసూయమ్మ. మామూలుగా ఉండటానికి శతధా ప్రయత్నిస్తూ.

‘‘కృష్ణాకొచ్చాను’’ చెప్పింది సంధ్య క్లుప్తంగా.

‘‘అల్లుడొచ్చి ఎక్కించాడా?’’ మరో ప్రశ్న సంధించింది అనసూయమ్మ సంధ్య మొహం వంక పరకాయించి చూస్తూ. మాట్లాడలేదు సంధ్య.

‘‘సరే సరే, ప్రయాణం చేసి వచ్చింది. ముందు దాని స్నానం పానం సంగతి చూడు’’ అన్నారు పార్వతీశంగారు కలగజేసుకుని.

పగటి పొద్దు గడిచిపోయింది. రాత్రి భోజనాలు కూడా ముగిశాయి. హాల్లోని పడకకుర్చీని ముందువైపు వరండాలోకి మార్చుకుని కూర్చున్నారు పార్వతీశంగారు. ఆ కుర్చీ పక్కనే కూర్చుని తండ్రి మోకాళ్ల మీద తల వాల్చింది సంధ్య.

‘‘నాన్నా నేను మళ్లీ అతని దగ్గరికి వెళ్లను’’ అంది గాద్గదికంగా. కూతురి తల నిమురుతూ మాట్లాడలేదు పార్వతీశంగారు. వక్కపొడి డబ్బాతో అప్పుడే అక్కడికొచ్చిన అనసూయమ్మ కొంచెం విసుగ్గా, ‘‘మళ్లీ ఏమయ్యింది?’’ అంది.

కుడి చెయ్యి పైకెత్తి చూపించింది సంధ్య- మణికట్టుకిపైన కమిలిన వేళ్ల గుర్తులు. కళ్లనీళ్లు కమ్ముకొచ్చాయి ఇద్దరికీ.

*              *             *

ఏడాది క్రితం సంధ్య పెళ్లి చేశారు. అప్పటికి బియస్సీ ఫస్టియరు పరీక్షలు రాసింది సంధ్య. ఎవరో తెలిసిన వాళ్లు తెచ్చారు సంబంధం. కుర్రాడు అందగాడు. నిక్షేపంగా బ్యాంకు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. కాళ్లదగ్గర కొచ్చిన సంబంధం కాలదన్నుకుంటే మళ్లీ కావాలనుకున్నప్పుడు దొరక్కపోవచ్చును. ఎంత చదివించినా చివరకు పెళ్లి చేయాల్సిందే కదా- అనుకుంటూ సంధ్యని ఒప్పించేశారు. పెళ్లి చేసేశారు. నెల తిరక్కుండానే చీరాసారే పెట్టి కాపురానికి పంపించేశారు.

ఒకవారం రోజులు కోడలికి సాయముండి అత్తగారు తనదారిన తాను వెళ్లిపోయింది- భర్తా, కాలేజీకి వెళ్లే కొడుకూ, ఆవిడ సంసారం ఆవిడకుంది మరి.

వెళ్లేముందు ఒక్కమాటన్నది... ‘‘ఆదిత్యకి వాళ్లనాన్నలాగా కోపమెక్కువ. వాడి మనసు తెలిసి మసలుకో, గొడవుండదు’’ అని.

అప్పుడా మాటని అంతగా పట్టించుకునే స్థితిలో లేదు సంధ్య. రేపటి నుంచి ఇంట్లో తనూ భర్తే ఉండబోతున్నారు. ఆ ఊహ మాత్రమే మనసులో తిరుగాడుతోంది. పులకింపజేస్తోంది.

ఆదిత్య బ్యాంకు ఇంటికి దగ్గరే, మధ్యాహ్నం లంచ్‌కి ఇంటికే వస్తుంటాడు. నిన్నటిదాకా అత్తగారుండడం మూలానా పెళ్లిలో తప్ప అతనితో పాటు కలిసి భోంచేసిందేలేదు. ఈ రోజు అతనితో పాటూ ముచ్చట్లు చెప్పుకుంటూ సరస సల్లాపాలాడుకుంటూ ఒకరినోటికొకరు అందించుకుంటూ... ఎన్నెన్నో మధురోహలు.

ఆదిత్య వచ్చేవేళకి పువ్వులా తయారయి నవ్వుతూ ఎదురు వెళ్లింది. తనకోసమే ఎదురుచూస్తోన్న భార్యని ఏ స్పందనా లేకుండా సాదాగా చూశాడు ఆదిత్య. నిరాశగా అనిపించినా పని ఒత్తిడేమో అని సరిపుచ్చు కుంది. మళ్లీ ఉత్సాహం కూడగట్టుకుంది. తనకీ అతనికీ వడ్డించి పిలిచింది.

‘‘ఏమిటీ నువ్వు నాతోపాటే తింటావా?’’ ఘోరమైన అపరాధమేదో చేస్తున్నట్లు కళ్లు పెద్దవి చేసి చూశాడు ఆదిత్య.

‘‘అవును, ఏమలా అడిగారు?’’ అంది సంధ్య తనూ ఆశ్చర్యపోతూ.

ఒక్కక్షణం సంధ్య మొహంలోకి చూసి, ‘‘మా అమ్మ మా నాన్నగారు తిన్న తర్వాతగానీ తినదు’’ అన్నాడు ముభావంగా.

చివుక్కుమనిపించింది సంధ్యకి. చురుగ్గా ఏదో అనబోయి సంబాళించుకుంది.

‘‘మరీ పద్దెనిమిదో శతాబ్దం మాటలు చెప్తారేమిటండీ, భలేవారే’’ అంది నవ్వేస్తూ. ఆదిత్య నుదురు ముడతలు పడింది. అదేమీ చూడనట్టే, తనే ఆ మాటా ఈ మాటా మాట్లాడేస్తూ అతని మూడ్‌ మంచిగా మార్చాలని చూసింది. ఆ ప్రయత్నంలోనే ‘‘మీకు పెరుగన్నంలో చిక్కుడు గింజలు నంజుకోవడం ఇష్టమటగదా అత్తమ్మ చెప్పారు. ఇవిగో నావి కూడా మీరు తీసుకోండి’’ అంటూ తన కంచంలోని చిక్కుడు గింజలు అతని కంచంలో వేసింది చొరవగా.

ఉగ్రుడయిపోతూ గబాలున లేచి తింటూ తింటూ ఉన్న కంచాన్ని నేలకేసి కొట్టాడు ఆదిత్య. ‘‘ఎంత పొగరు, నీ వెధవ ఎంగిలి నాకు వేస్తావా?’’ అంటూ కళ్లెర్రజేశాడు.

అది మొదలు ఆదిత్య స్వరూపం వెనకున్న కురూపాన్ని సంధ్య దర్శిస్తూనే ఉంది. భరిస్తూనే ఉంది. అతనికి సంధ్య పకాలున నవ్వడం ఇష్టముండదు. స్నేహితులతో అయిదు నిమిషాల కంటే ఫోన్‌లో మాట్లాడ్డం నచ్చదు. అతను పురమాయించిన వంటకాలే చేయాలి. వేరే ఏదయినా చేస్తే ఆదిత్య అది ముట్టుకోడు. పళ్లెం విసిరికొడతాడు.

అతని ఆగడాలని సహిస్తూనే ఉంది సంధ్య. అతని కనుగుణంగా తన అలవాట్లని మార్చుకుంటూనే ఉంది.

వదులుగా వాలుజడ వేసుకునే తను అతని కిష్టం లేదని గట్టిగా బిగించి వేసుకుంటోంది. తనకి సిల్కు చీరలిష్టమయినా అతని కోసం నేత చీరలు కట్టుకుంటోంది. ప్రతీదీ అతను చెప్పినట్టుగానే నడుచుకుంటోంది.

ఎందుకు? తన సర్దుబాటు గుణం గ్రహించయినా అతను మారకపోతాడా అని చిన్న ఆశ... ఆ సుదినం కోసం సహనంతో వేచి చూస్తోంది సంధ్య.

*              *              *

ఆరోజు బ్యాంకు నుండి వస్తూ వస్తూ తన కొలీగ్‌ని వెంట పెట్టుకు వచ్చాడు ఆదిత్య. ముందు హాల్లో వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే టీ చేసి ట్రేలో బిస్కెట్లూ టీ కప్పులూ పెట్టి తీసుకువెళ్లింది సంధ్య. గుమ్మంలోనే ఎదురువెళ్లి ట్రే అందుకుని ఇక వెళ్లమన్నట్టు సైగ చేశాడు ఆదిత్య. ‘ఇంకా తనని పరిచయం చేస్తాడని ఎదురు చూస్తుంటే ఏమిటిలా... ఇంటికొచ్చిన వాళ్లని భార్యకి పరిచయం చేయాలనే సభ్యత కూడా తెలీదా ఆదిత్యకీ..?’

తెల్లబోయి చూస్తున్న సంధ్యని ఆ వచ్చిన ఆగంతకుడు చూడనే చూశాడు.

‘‘అరె, సంధ్యా నువ్వా?’’ అన్నాడు ఆనందంగా.

‘‘రాఘవన్నయ్యా నువ్వేంటిక్కడ?’’ సంబరపడుతూ తనూ వెళ్లి కూర్చుంది సంధ్య.

సంధ్య ప్రాణ స్నేహితురాలు రమణి అన్నగారే రాఘవ. ఇళ్లు కూడా ఒకే వీధిలో ఉండడం మూలాన రమణితోనే గాక ఆ కుటుంబమంతటితోనూ సంధ్యకి చనువెక్కువే.

రాఘవని చూడగానే తన నెచ్చెలి రమణిని కలిసినట్టే ప్రాణం లేచొచ్చింది సంధ్యకి. 

ప్రహరీ గోడమీద వాలిన పక్కింటివాళ్ల జామకాయల్ని దొంగచాటుగా కోసుకుని తినడం దగ్గర్నుంచీ, స్కూటరుమీద చెల్లెలు రమణినీ, సంధ్యనీ కూడా ఎక్కించుకుని ట్రాఫిక్‌ పోలీసు కనబడగానే సందుగొందు ల్లోంచి స్పీడుగా తప్పించుకున్న రోజులు దాకా గుర్తు చేసుకుని నవ్వేసుకున్నారు ఇద్దరూ.

వాళ్లతోపాటే నవ్వినట్టే నవ్వి వెళ్లేటప్పుడు ‘‘అప్పుడప్పుడూ వస్తూండండి. మా సంధ్య సంతోషిస్తుంది’’ అని నమ్మబలికి, రాఘవ అలా కాలు బయట పెట్టాడో లేదో తలుపులు ఢామ్మని వేసి విషం కక్కటం మొదలుపెట్టాడు ఆదిత్య.

‘‘ఏమో అనుకున్నాను గ్రంధసాంగురాలివే నన్నమాట’’ అన్నాడు వెటకారంగా.

‘‘ఏమంటున్నారు?’’ దెబ్బతిన్నట్టు అడిగింది సంధ్య.

‘‘ఏం నంగనాచివే. బైకుమీద షికార్లూ, సినిమాలూ- అంతేనా ఇంకా ముందుకెళ్లారా?’’ అంటున్నాడు ఆదిత్య అనుమానంగా.

‘‘అంత దారుణంగా మాట్లాడకండి. చిన్నప్పటి నుంచీ రమణితోపాటూ నేనూ అన్నయ్యా అనే పిలుస్తాను. మీరూ విన్నారుగా?’’ ఏడుపొచ్చేసింది సంధ్యకి.

‘‘నోరుముయ్యవే. అన్నయ్యట అన్నయ్య. రంకుతనానికి మంచి ముసుగే వేశావ్‌’’ హేళనగా అన్నాడు ఉచితానుచితాలు మరిచిపోయి.

‘‘ఛీ ఛీ ఇంత అసభ్యమైన నింద వేస్తారా? మీ నోటికి హద్దులేదా?’’ రోషంగా అంది సంధ్య.

‘‘నన్ను ఛీ అంటావా? ఎంత కండ కావరమే నీకు?’’ కళ్లెర్రజేసి సంధ్య చెంప ఛెళ్లు మనిపించాడు ఆదిత్య. అంతటితోనూ ఆగలేదతను. ‘‘నన్ను ఛీ కొట్టిన దానివి నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పో పోవే’’ అంటూ సంధ్య భుజం పట్టుకుని వీధి గుమ్మంవైపు ఒక్కనెట్టు నెట్టాడు. మూసి ఉన్న తలుపు పడిపోకుండా ఆపింది సంధ్యని. ఆ తలుపే ఆధారంగా కిందికి జారి కూలబడిపోయిందా అమ్మాయి.

అనుకోని ఈ హఠాత్‌ పరిణామానికి స్తబ్ధురాలయింది సంధ్య. కాసేపటిదాకా చెంప మండుతున్న సంగతి కూడా తెలియలేదు. కళ్లవెంబడి ధారాపాతంగా జారుతున్నాయి కన్నీళ్లు. ఎంతసేపలా ఉండిపోయిందో తెలీలేదు. లేవాలని కూడా అనిపించలేదు.
రాత్రయింది. చేసింది తప్పని తోచి భర్త తన దగ్గరకొస్తాడని ఎదురుచూసింది. ఉహుఁ, ఉన్నదేదో తినేసి అతను ముసుగుతన్ని పడుకోవడం గమనిస్తూనే ఉంది.

తెల్లారింది. బ్యాగ్‌లో తన బట్టలు సర్దుకుంది సంధ్య. ‘‘నేను వెళుతున్నాను’’ అని మాత్రం భర్త వినేలాగా చెప్పింది. ‘‘పోవే నువ్వు వెళ్లకపోతే నేనే వెళ్లగొట్టేవాణ్ణి’’ అన్నాడు ఆదిత్య.

*             *              *

నలిగిన బట్టలతో, చెదిరిన వెంట్రుకలతో ఇంటికొచ్చిన సంధ్యను చూడగానే గుండెలవిసిపోయాయి తల్లిదండ్రులకి.

కన్నీళ్లతో కూతురు చెబుతోన్న అల్లుడి విపరీత ధోరణిని వేదనా భరిత హృదయాలతో విన్నారు. ఒక రోజంతా తామేడుస్తూ కూతుర్ని ఓదారుస్తూ గడిపారు. ఆ మరుసటి రోజు ఆలోచనలో పడ్డారు- ‘కింకర్తవ్యం’ అని.

లక్షలు కట్నమిచ్చారు. లక్షలు ఖర్చుపెట్టి పెళ్లి చేశారు. ఏడాది తిరక్కుండా పుట్టింటి కొచ్చిందంటే ఎంత అప్రదిష్ట. లోకులు పలుకాకులు. ఎదురుగా అనలేకపోయినా వెనక ఎన్ని అవాకులూ చెవాకులూ పేలుతారో..? ‘అతనికేం? నెల తిరక్కుండా మళ్లీ పెళ్లి కొడుకవుతాడు. కానీ దీన్నెవరు మళ్లీ పెళ్లి చేసుకుంటారు? జీవితాంతం పూవూ కాయా ఎరగని మొండిమాకులా ఉండటం తమకి గుండెకోత కాదూ...’

‘‘చూడు తల్లీ, ప్రతి మగవాడిలోనూ  సహజంగానే అహం ఉంటుందమ్మా- ఇంటిమీదా ఇల్లాలిమీదా తన ఆధిపత్యమే చెల్లాలని. ఆదిత్యలో ఆ అహం ఒక పాలెక్కువన్నమాట. అందులోనూ నువ్వు అతని జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టావు. ముందు జాగ్రత్తగా నిన్ను అతని చెప్పుచేతల్లో ఉంచుకోవడం కోసం ఇంకొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉండవచ్చును. ఇలాంటప్పుడే నువ్వు ఓరిమి పెంచుకోవాలి. అతన్ని నీదారికి తెచ్చుకోవడం నీ చేతుల్లోనే ఉందమ్మా. అతని మూర్ఖత్వాన్ని నీ ప్రేమతో ప్రవర్తనతో మార్చుకో నువ్వే తన లోకమనుకునేలా చేసుకో’’ అని తల్లీ తండ్రీ సంధ్యకి ఎన్నోవిధాలా నచ్చచెప్పారు. తిరిగి వెళ్లడానికి ఒప్పించారు.

*              *             *

పార్వతీశంగారు సంధ్యని వెంటబెట్టుకుని అల్లుడి దగ్గరకు వెళ్లారు. తల ఒంచుకుని కూతురిదే తప్పని ఒప్పుకున్నారు. చిన్నతనం వల్లా, తమ గారాబం వల్లా, లోక జ్ఞానం లోపించడం వల్లా కూతురు తొందరపడిందనీ క్షమించమనీ వేడుకున్నారు.

ఉదార హృదయంతో మన్నించానన్నట్లు తలపంకించాడు ఆదిత్య.

నిర్లక్ష్యం చేసిన వ్యాధిలా ఈసారి మరీ విజృంభించాడు ఆదిత్య. నిరంకుశత్వం శృతిమించి పోయింది. తను ఏం చేసినా ఏమన్నా పడి ఉంటుందా లేదా అని పరీక్షించడం మొదలుపెట్టాడు. పని మనిషిని మానిపించాడు. ప్రతి పనిలోనూ వంకలెంచు తున్నాడు. నలుగురూ వినేలా గొంతు పెంచు తున్నాడు. వీటన్నిటికీ ఎలాగో ఓర్చుకున్నదిగానీ రాత్రిపూట పశువులా ప్రవర్తించటాన్ని మాత్రం భరించలేకపోయింది.

ఆదిత్య బ్యాంకుకి వెళ్లిన సమయంలో సూట్‌కేస్‌ సర్దుకుని పుట్టింటికి వచ్చేసింది.

షరా మామూలే. అదే పాటా, అదే రాగం. పరువూ ప్రతిష్ఠ, పడ్డవాళ్లెప్పుడూ చెడ్డవాళ్లు కాదు. ఓ బిడ్డ పుడితే అన్నీ సర్దుకుంటాయి. నీతులూ, సామెతలూ...

ఈసారి ఎన్ని మాటల ప్రయోగాలు చేసినా సంధ్య మెత్తబడే సూచనలు అగుపించలేదు. ‘భగవంతుడా ఇంకేది దారి?’ అని తల మొత్తుకుంటుండగా మినుకు మినుకుమంటూ దొరికిందొక దారి అనసూయమ్మకి.

‘‘ఇది ఇంకొకరాయి, వేసి చూడు’’ అన్నారు పార్వతీశంగారు నిస్త్రాణగా.

అనసూయమ్మ మెల్లగా కూతురు దగ్గరకు చేరింది. ఏ ఉపోద్ఘాతమూ లేకుండా మొదలుపెట్టింది. ‘‘సుమతి అని మా పెత్తల్లి కూతురు. నీ కంతగా తెలీదులే. నాకంటే కొద్దిగా పెద్దది. నేనంటే ప్రాణం పెడుతుంది. ఇందాక ఫోన్‌ చేసింది. వాళ్ల ఊళ్లో అమ్మవారి జాతరట, తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పింది. దాన్ని చూసి రావాలని ఎప్పటినుంచో కోరిక. కుదరటమే లేదు. ఈ వంక నన్నా వెళ్లాలని ఉంది. నిన్ను కూడా తీసుకురమ్మని గట్టిగా చెప్పింది. ఆ అమ్మవారు చాలా మహిమ గల దేవతట కూడా. వెళదామా?’’ అంది ఆశగా.
‘‘నేనెందుకు, నువ్వెళ్లిరా’’ అంది సంధ్య విరక్తిగా.

నిన్నొదిలి నేనెలా వెళతాను! పోన్లే వద్దులే. అయినా దేనికయినా ప్రాప్తముండాలి కదా’’ కొంచెం నిష్టూరంగా అంది అనసూయమ్మ.

తల్లి మొహంలో ఆశాభంగం తాలూకు నీడలు చూశాక ‘సరే’ననక తప్పలేదు సంధ్యకి. బస్సులో మూడుగంటల ప్రయాణం. దారి పొడుగునా సుమతి చరిత్ర చెబుతూనే ఉంది అనసూయమ్మ.

పద్దెనిమిదేళ్ల సుమతిని మేనత్త కొడుకు సుదర్శనానికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లప్పుడు అల్లుడికి కట్నంగా నాలుగెకరాలు మాగాణీ ఇస్తానన్న తండ్రి కాస్తా అకస్మాత్తుగా మరణించాడు. భర్త ఇచ్చిన మాటతో తనకేమీ సంబంధం లేదన్నది సవతి తల్లి. అప్పట్నుంచీ మొదలయ్యాయి సుమతికి తిప్పలు. పొలం తెస్తేనే ఇంటికి రానిస్తానన్నారు అత్తా భర్త. నా గుమ్మం తొక్కద్దన్నది సవతితల్లి.

ఆ తరువాత లోకానికి వెరిచి భార్యని ఇంట్లోకి రానిచ్చాడేకానీ అప్పట్నుంచీ సుమతి పడిన కష్టాలు భగవంతుడి కెరుక. అత్త తిట్టినా భర్త కొట్టినా ఇంకో ఆడదాన్ని పడగ్గదికి తెచ్చినా భరించిందే తప్ప అల్లరి చెయ్యలేదు. పక్కమనిషికి కూడా చెప్పుకోలేదు. తననంత రొస్టుపెట్టిన అత్తగారు మంచాన పడితే రెండేళ్లు సేవ చేసింది. ఆవిడ కన్నుమూశాక ఆ స్థానాన్ని భర్త భర్తీ చేశాడు. సుఖరోగాలతో ఒళ్లు పుచ్చిపోయిన అతనిని కళ్లల్లో పెట్టి చూసుకుంటోంది ఇప్పటికీ.

‘‘ఊళ్లో వాళ్లకి సుమతి అంటే ఎంతో భక్తి, గౌరవం. దేవత అంటారు. పుట్టింటినీ మెట్టి నింటినీ తరింపజేసిందంటారు. కాపురానికి వచ్చిన ప్రతి కొత్తకోడల్నీ సుమతి దగ్గరకు తీసుకువస్తారు. నాలుగు మంచి మాటలు చెప్పమంటారు. ఆశీర్వదించమంటారు, తెలుసా’’ కళ్లు మెరిపిస్తూ చెప్పింది అనసూయమ్మ.

‘అదన్నమాట!’ అర్థమయింది సంధ్యకి. ‘ఇప్పుడా పతివ్రతగారితో తనకు జ్ఞానబోధ చేయించటానికి తీసుకువచ్చిందన్నమాట అమ్మ.’ తల్లి చూడకుండా నిట్టూర్చింది సంధ్య.

సుమతి వీరిని రెండు చేతులూ చాచి ఆహ్వానించింది. ఆమె ప్రసన్నవదనం చూడగానే ఎందుకోగానీ సంధ్యకి గొప్ప ఆరాధనా భావం కలిగింది. ఈమె ఏమి చెప్పినా కాదనలేనేమో’ అనిపించింది లోపల.

వచ్చినప్పట్నుంచీ సుమతిని క్షణక్షణం గమనిస్తూనే ఉంది సంధ్య. చెల్లెలితో- అంటే అనసూయమ్మగారితో పాతముచ్చట్లు పంచుకుంటూనే ఉంది. అటు మగని అవసరాలు ఏమరుపాటు లేకుండా చేస్తూనే ఉంది. మంచం మీంచి లేవలేకపోయినా ఆయనగారు ఎందుకో ఒకందుకు అరుస్తూనే ఉన్నాడు. ఈమె ఏమాత్రం విసుక్కోకుండా పరమశాంతంగా అనునయిస్తూనే ఉంది.

‘‘జాతరకిది తొలిరోజు. దర్శనం చేసుకురండి’’ అంది సుమతి వీరి స్నానపానాదులు ముగిశాక.

సుమతి మాత్రం భర్తని వదిలి గుమ్మం దిగి ఎక్కడికీ వెళ్లదట. పూదండలూ పూజ సామగ్రీ ఎవరి చేతనయినా గుడికి పంపుతుందట. పది వీధులు ఉన్న చిన్న ఊరు అది. తల్లీ కూతుళ్లు అమ్మవారిని దర్శించుకుని వచ్చారు.

మర్నాడు పొంగళ్లు పెట్టేరోజు. ‘‘పూదండలూ, నిమ్మకాయదండలూ తీసుకుని ముందు నువ్వు వెళ్లు గుడికి. ప్రసాదం తయారయ్యాక పక్కింటమ్మాయిని తోడిచ్చి సంధ్య చేత పంపిస్తాను అనూ’’ అంది సుమతి.

రాత్రి వెన్నెల్లో పందిరికి విచ్చిన మల్లెపూలు కోసుకుంటున్నప్పుడు చూసింది- తల్లీ సుమతి పెద్దమ్మా నిమ్మకాయల దండ గుచ్చుతూ గుసగుసలాడుకోవడాన్ని.

‘అంటే తల్లి వెళ్లాక తనకి బ్రెయిన్‌ వాష్‌ అన్నమాట. నిజంగానే భర్త విషయంలో తను ఇంకొంచెం ఓర్పు వహించి ఉండాల్సిందా?’

*              *               *

‘‘అవసరం లేదు’’ పొంగుతున్న పాలగిన్నెలో బియ్యం వేస్తూ అంది సుమతి- ‘‘నువ్వు పాకులాడే కొద్దీ అతను బిర్రబిగుస్తాడు. నువ్వు లొంగేకొద్దీ అతను అణిచేస్తాడు. మొగుడూ మగాడూ అయినంత మాత్రాన నీ తప్పేమీ లేనప్పుడు ఎందుకు ‘జోహుకుం’ అనాలి? అతని దాష్టీకాన్ని నువ్వెందుకు సహించాలి? ఎదురు తిరుగు. అలాగని నిన్ను గయ్యాళిని కమ్మనటం లేదు. అతని అవసరం నీకెంత ఉందో నీ అవసరం అతనికీ అంతే ఉంది. ఆలుమగలు ఒకరిమీద ఒకరు చూపించాల్సింది అధికారమో అహంకారమో కాదు. ఉండాల్సింది అవగాహన, నమ్మకం, ప్రేమ.

ఈ విషయాన్ని పసివాడికి పాఠం చెబుతున్నట్టుగా సహనంతో చెప్పిచూడు. అప్పటికీ బుద్ది రాలేదా- సాహసం చెయ్యి- ‘నువ్వు కాదు, నేనే నిన్ను వదిలేస్తున్నా’ అని చెప్పి బయటకొచ్చేసెయ్‌. భర్త చాటునే తప్ప బతకలేమనే రోజులు కావివి. చదువు పూర్తి చేసుకో. నీ జీవితాన్ని నువ్వే దిద్దుకో. మంచిగా మలుచుకో. అప్రదిష్టలూ లోకుల కూతలూ గాలొచ్చినప్పుడు దుమ్మురేగినట్టు రేగుతాయి. వాటికవే అణుగుతాయి.

వాటికి విలువివ్వకు.’’

నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూస్తోంది సంధ్య.

‘‘నన్ను చూడు. ధైర్యం చెయ్యాల్సిన సమయంలో పిరికితనం అడ్డొచ్చింది. వాళ్లు కళ్లెర్రజేస్తే వణికిపోయాను. వాళ్లు గీత గీస్తే దాటడానికి భయపడిపోయాను. తిట్లకీ దెబ్బలకీ తల ఒగ్గాను. నరకప్రాయంగా రోజులు గడిపాను. ఆ కడగండ్లలోనే మూడొంతుల జీవితం గడిచిపోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది నాకు? గాయాల తాలూకు మచ్చలు తప్ప. గుణవంతురాలూ, గంగిగోవూ, పతివ్రత అంటున్నారిప్పుడు. ఏం చేసుకోను ఆ బిరుదుల్ని. నా కందకుండా చేజారిపోయిన జీవన మాధుర్యాలని తిరిగి నాకందించగలవా?

సంధ్యా, భగవంతుడు మనకిచ్చిన వరం ఈ జీవితం. దీన్ని వృథా కానీయకు. పోరాడయినా ఫలవంతం చేసుకో.’’

అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వెలుగుదారి చూపిన ఆమెకు కృతజ్ఞతలు నిండిన కళ్లతో నమస్కరించింది సంధ్య.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న