మా నాన్న - Sunday Magazine
close

మా నాన్న

- గుడిపాటి కనకదుర్గ

‘‘ఒరేయ్‌, ఇంటికిరా ఒకసారి’’ ఫోను ఎత్తగానే మా ఇంటి పక్కనున్న ప్రసాద్‌ గొంతు వినిపించింది. చిన్నప్పటి నుంచీ వాడు నాతో బాగా చనువుగా ఉంటాడు . పైగా నాకు క్లోజ్‌ ఫ్రెండ్‌ అంటూ పెద్దగా ఎవరూ లేరు వాడు తప్ప. ‘‘ఇప్పుడెందుకురా నాకు చాలా పెండింగ్‌ వర్కుంది’’ అన్నాను విసుగ్గా. ‘‘కాదు రమ్మన్నాను కదా, వెంటనే బయలుదేరు, అమ్మ చెప్పింది’’ అని ఫోన్‌ పెట్టేశాడు.

మధ్యాహ్నం పూట టిఫిన్‌ ఆఫీసు క్యాంటీన్‌లోనే సింపుల్‌గా ఏ రెండు ఇడ్లీలో తినేసి వస్తాను. అమ్మ ఇంట్లో ఏదయినా స్పెషల్‌ టిఫిన్‌ చేస్తే ఇలాగే ఫోను చేయిస్తుంది. ఇవాళే కాదు, ఇలా చాలాసార్లు జరిగింది. ‘ఇప్పుడేం చేసిందో పిండివంట. అయినా సాయంత్రం వస్తాను కదా ఎందుకో అర్జంటు’ అనుకుంటూ సైకిల్‌ మీద ఇల్లు చేరాను.

సైకిల్‌ స్టాండు వేసి చూసేసరికి వరండా నిండుగా చుట్టుపక్కల జనం నిలబడి ఉన్నారు. నాకాళ్లు వణికాయి. గుండె దడదడలాడింది. భయపడుతూనే లోపలికి అడుగుపెట్టాను. నాన్న చాపమీద పడుకుని ఉన్నారు.

అమ్మ ఒకటే ఏడుస్తోంది. నన్ను చూడగానే బావురుమంది. ‘నాన్న...’ అని చెప్పలేక మళ్లీ ఏడుస్తోంది. నా భార్య కూడా బాగా ఏడ్చిందేమో కళ్లు వాచిపోయి ఉన్నాయి. నా కూతురు నాలుగేళ్ల పిల్ల ‘తాతా లే... తాతా లే...’ అంటోంది. నా గుండె ఆగినంత పనయింది.

ఇదేమిటి? ఏం జరిగింది? ఎలా జరిగింది? ఇది సాధ్యమేనా? పొద్దున నేను ఆఫీసుకి వెళుతుంటే నా కూతుర్ని ఎత్తుకుని ‘బై’ చెప్పిన నాన్న ఇప్పుడు లేరా? నిజమేనా? నాకు కళ్ల నీళ్లు రావటం లేదు. ఏం జరిగిందో అర్థమయ్యేసరికి ‘నాన్న ఇక మాట్లాడరా’ అనుకున్నాను. మనసంతా మొద్దుబారిపోయింది. కళ్ల నీళ్లు కూడా రావటం లేదు. నాన్నకి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. ఒళ్లంతా చెమటలు పట్టేసిందట. డాక్టరు దగ్గరకి తీసుకెళ్లే టైమ్‌ కూడా లేదట. అన్నీ రెండు మూడు నిమిషాల్లో జరిగిపోయిందట. అమ్మ ఏడుస్తూనే ఒక్కొక్కటీ చెబుతోంది.

ఈ లోపున అక్కా బావా వచ్చారు. వాళ్లు ఈ ఊళ్లోనే ఉంటారు.

అక్క ఘొల్లున ఏడుస్తోంది. మధ్యలో తల కొట్టుకుంటోంది. ఏవేవో జ్ఞాపకం చేసుకుంటోంది. పరిచయస్తులూ బంధువులూ నాన్న మంచితనం, ఆయన గుణగణాలు చెబుతున్నారు. మరికొందరు వాళ్ల చుట్టాల హటాన్మరణం, గుండెపోట్లు గురించి చెప్పుకుంటున్నారు. అన్నీ నా చెవులకు వినపడుతూనే ఉన్నాయి.

అన్నీ నిశ్శబ్దంగా వింటున్నాను. నాన్న తల నిమురుతూ ఆయన మొహమే చూస్తూ కూర్చున్నాను. ఈలోపల నా భార్య హేమ టీ పట్టుకొచ్చింది. ఎప్పుడూ టీ తెస్తే వద్దని అనని నేను మొదటిసారిగా ‘తాగాలని లేదు ఇప్పుడు’ అని పంపించేశాను.
నాన్నతో గడిపిన బాల్య స్మృతులు ఒకదాని వెంట మరొకటి మనసులో రీలు మాదిరి తిరుగుతున్నాయి. మా మధ్యతరగతి కుటుంబాల్లో ఆడంబరాలుండవు. పుట్టినరోజులూ, పెళ్లిరోజులూ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడాలు కూడా ఉండవు. కానీ నాన్న  నాకూ అక్కకీ ఏలోటూ చెయ్యలేదు. ఉన్నంతలోనే సింపుల్‌గా గుర్తుండిపోయేటట్లు చేసేవారు. బొటాబొటీగా జీతాలూ, అందులోనే అన్ని ఖర్చులూ... ఇప్పుడు కూడా అంతే. ఇదివరకు పక్కవాటా అద్దెకిచ్చాం. అమ్మానాన్నా నా దగ్గర కొచ్చేసిన తరువాత ఇల్లు చాలదని పక్కవాటా ఖాళీ చేయించాం. ఇప్పుడు అద్దె కూడా లేదు. ఇల్లంతా మేమే వాడుకుంటున్నాం.

నాన్న చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. చల్లగా ఐసులా ఉంది. అవును శరీరంలో జీవం ఉంటేగా. నాకేం చెప్పకుండా వెళ్లిపోయారు. ఏ జాగ్రత్తలూ చెప్పలేదు. ఈ సంసారమంతా చూసుకోవడానికి నాకు ధైర్యమేది? గొడుగులేని ఎండలో నిలబడ్డట్టుగా ఉంది నా పని. అందరినీ ఎలా ఓదార్చాలి? అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య నా ముందు భూతంలా నిలబడి ఉంది... అదే డబ్బు. రేపటికయ్యే ఖర్చు ఎలా? నా దగ్గర అంత మొత్తం లేనేలేదు. నేనెంతా నా జీతమెంతా? ముందు అర్జంటుగా ముప్ఫై నలభై వేలన్నా కావాలి. ఎక్కడి నుంచి తేవాలి? బ్యాంకు బ్యాలన్స్‌ కూడా పెద్దగా లేదు. ఇంటి మీద లోను తీర్చటంలో పెద్దగా మిగిలేది కాదు.

ఎలా ఏం చెయ్యాలి? ఎవరిని అడగాలి? అడగటానికి కూడా సిగ్గుగా ఉంటుంది.

ఎదురుగా అమ్మా నాన్నా కలిసివున్న ఫొటో ఉంది. ఎంత చక్కగా పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు. నాన్న పోవటం అనేది నిజమేనా? ఎప్పుడూ ఎవరి చేతా ఆయన ఏ పనీ చేయించుకోలేదు. కనీసం ‘మంచినీళ్లు పట్టుకురా’ అని కూడా ఎప్పుడూ అన్నట్లు గుర్తు లేదు. తన పనులన్నీ తనే స్వయంగా చేసుకునేవారు. ఆరోగ్య సూత్రాలన్నీ చక్కగా పాటించేవారు. రెండు పూటలా వాకింగ్‌ చేసేవారు. నాకు  కూతురు పుట్టినప్పుడు ఆయన సంతోషం మాటల్లో చెప్పలేను. టైమంతా చిన్నపాప దగ్గరే గడిపేవారు. దాన్నెత్తుకుని ఏవో భజన పాటలు పాడుతూ నిద్రపుచ్చేవారు. నా కూతురికప్పుడే తాతగారి ప్రేమ దూరమయిందా? ఆలోచనలతో తల పగిలిపోతోంది. అందరూ ఏడుస్తున్నారు. నాకెందుకు ఏడుపు రావటం లేదు?

చుట్టాల్లో కొంతమంది దుఃఖపడి, నాన్న గుణగణాలని శ్లాఘించి, శోష వచ్చిందో ఏమో హాల్లోకెళ్లి టీవీ తక్కువ సౌండ్‌లో పెట్టి కార్తీక దీపం సీరియల్‌ చూస్తున్నారు.

రేపు డబ్బెలా... అన్న ప్రశ్న వేధిస్తోంది. వేలకివేలు ఎవరిని అడగాలి? ఎవరిస్తారు? ఓ పక్క నాన్న పోయిన బాధ రంపపు కోతలా ఉంటే డబ్బులేని బాధ మరోపక్క తినేస్తోంది.

నా భార్య బిక్కమొహం వేసుకుని నేనేమయిపోతానో అన్నట్లు చూస్తోంది నావంక. నా పరిస్థితి తెలుసు కానీ ఏం చేస్తుంది?

నన్ను లోపలికి రమ్మని సైగ చేసింది. మెల్లగా లేవలేక లేవలేక లేచి వెళ్లాను.
‘‘డబ్బెలా?’’ అంది ఆందోళనగా.

‘‘అదే, ఎలాగో మరి, నేనూ అదే ఆలోచిస్తున్నాను.’’

‘‘నా గొలుసు అమ్మేయండి. అత్యవసర పరిస్థితుల్లో ఏం ఫరవాలేదు’’ అంది.

మెడలో ఒంటిపేట గొలుసు. అది పెళ్లిలో కనక చేయించగలిగాను. నా జీతంతో బంగారం కొని నేను మళ్లీ చేయించగలనా? అయినా పెళ్లిలో పెట్టింది అమ్మటానికి నాకు మనస్కరించలేదు.

‘‘నేను చూసుకుంటాలే’’ పురుషాహంకారం నాలో ఎక్కడో ఉందేమో. వచ్చి మళ్లీ నాన్న దగ్గర కూర్చున్నాను... ‘ఏమిటి నాన్నా ఇలా పడుకునే ఉన్నారు. లేవండి... మీరు లేస్తే నాకు ఏ సమస్యా లేదు’ అనుకుంటూ. ఇంటి డాక్యుమెంట్స్‌ పెట్టి ఎక్కడయినా అప్పు తేవాలి. లేకపోతే ఈ కార్యక్రమం ఎలా నడుస్తుంది? గోడకి తల ఆన్చి కూర్చున్నాను.

ఏదో ఒంటరి తనం వేధిస్తోంది. ఈ కార్యక్రమం అంతా నేను చెయ్యగలనా? ఇప్పటివరకూ నాన్న ఎలా చెబితే అలా చేశాను. అన్నీ చెయ్యగలననే భరోసాతో నాన్న వెళ్లిపోయారా? ‘నాకు ఏమీ చేతకాదు నాన్నా... మీరుండాలి. చిన్నప్పుడు నన్ను నడిపించినట్టు నాకు ప్రతిదానిలోనూ మీ సలహా కావాలి. మీరు వెళ్లిపోవాల్సిన వయసు కాదే. ఎందుకంత తొందర? నన్నిలా వదిలేసి వెళ్లిపోతే నేనేమయిపోవాలి? మీరు లేకుండా అమ్మ ఎలా బతుకుతుంది? నామీద ఇంత బాధ్యత పడేశారు మీకిది భావ్యమేనా నాన్నా?’ మనసులోనే రకరకాలుగా ఏడుస్తున్నాను.

అమ్మ కళ్లు తుడుచుకుని ఎందుకో నన్ను లోపలికి పిలిచింది. మళ్లీ అమ్మ తన గొలుసు అమ్మమంటుందా. బహుశా అంతకన్నా ఏం చెబుతోంది పాపం... అనుకుంటూ లోపలికి వెళ్లాను.

అమ్మ నన్ను కావలించుకుని భోరుమంది. నాకేం చెయ్యాలో తోచలేదు. ‘ఊరుకోమ్మా, ఇలా జరుగుతుందని నేనూ అనుకోలేదు’ అన్నాను. ఏదో నోటికి తోచినట్టు వస్తున్నాయి నా మాటలు. మనసు మాత్రం డబ్బెలాగా అన్న ఆలోచన మీదే ఉంది.
అమ్మ కళ్లు తుడుచుకుంది. ‘‘అందుకోసం కాదు, నీకొకటి చెప్పాలి.’’ నేను ఏమిటన్నట్లు చూశాను.

‘‘మీ నాన్నగారికి ముందుచూపు ఎక్కువని తెలుసుగా...’’

‘‘అయితే’’

‘‘ఇలాంటి టైము ఒకటొస్తుందని ఆయన ముందే ఊహించారో ఏమో నువ్వు ఇబ్బంది పడకూడదని రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో లక్ష రూపాయలు దాచి ఉంచారు. అది వాడు. ఈ విషయం నాకొక్క దానికే చెప్పారు.’’
‘‘నిజమా? నాన్న డబ్బులు దాచి ఉంచారా?’’

‘‘అవును ఇలాంటి కార్యక్రమాలు హటాత్తుగా వస్తాయి. చేతిలో డబ్బుండాలీ, లేకపోతే సహయం చేసే వాడుండాలి. ఎవరు ఎప్పుడు ఎలా పోతామో తెలీదు. డబ్బులులేక నా కొడుకు విలవిలలాడకూడదు అనేవారు మీ నాన్న. నువ్వు డబ్బు విషయాలు ఆలోచించకు’’ అని వరండాలోకి వచ్చేసింది.

నేను కూడా నిద్రలో నడుస్తున్న

వాడి మాదిరి అమ్మ వెనకాలే వచ్చాను. తన చావులో కూడా నేనిబ్బంది పడకూడదనుకున్నారా నాన్న... ఇలా ఆలోచించే నాన్న ఎంతమందికి ఉంటారు!

నాన్న పాదాల దగ్గర కూర్చున్నాను. అప్పుడు వచ్చింది దుఃఖం ఉప్పెనలాగా... వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. కడుపులో భారం దిగినందుకా? నాన్న నా గురించి ఆలోచించినందుకా? ఏమో, కానీ ఏడుపు ఆగటం లేదు. నాన్న మంచితనానికీ, ప్రేమకీ ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలను... ఏమిచ్చి రుణం తీర్చుకోగలను... వణుకుతున్న చేతులతో ఆయన పాదాలు కళ్లకద్దుకున్నాను.

‘‘పాపం వాళ్ల నాన్న పోయినందుకు ఎంత దిగులు పడుతున్నాడో పిల్లాడు’’ అనుకుంటున్నారు అందరూ. ఇటువంటి నాన్న దూరమైనందుకు జీవితమంతా చింత పడాలి... ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా పొగిలి పొగిలి వస్తున్న నా ఏడుపు చూస్తూ స్థాణువులా నిలబడిపోయింది నా భార్య.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న