పిలుపులో ఏముంది? - Sunday Magazine
close

పిలుపులో ఏముంది?

- శశికళ ఓలేటి

స్టాప్‌లో చలికి ముడుచుకుని కూర్చున్న సత్యవాణి మనసులో లక్షబెంగలు. అన్నీ గడపబోయే బతుకు గురించే. ఇన్నాళ్లంటే... తల్లి కష్టం చాటున కష్టం తెలియకుండా పెరిగింది.

అన్నవరం సత్యదేవుడి కొండకిందే ఆమెకు పద్దెనిమిదేళ్లు వచ్చేవరకూ... తండ్రి పోయినా, పద్ధతిగా పెంచిన తల్లి సంరక్షణలో పెరిగింది.

అన్నవరంలో సత్యవాణి అమ్మ నూకరత్న మంటే అక్కడ సేఠులూ, హోటల్‌ యజమాన్లూ ఎంతో గౌరవంగా చూసేవారు. నిప్పులాంటి మనిషనీ, ఎన్ని అవకాశాలొచ్చినా చనిపోయిన భర్తను మనసులో పెట్టుకుని మరొకరిని కన్నెత్తి కూడా చూడని మా కచ్చితమైన మనిషని!

‘పూట గడవకపోతే సచ్చిపో. కానీ తప్పుడు దారిన బతకకు’ అని కూతురికి చెప్పి మరీ పోయింది నూకరత్నం. రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయింది. కూతురు కోసం రాత్రింబగళ్లూ క్యాంటీన్లలో పనిచేసి దాచిన డబ్బులు తన వైద్యానికి ఖర్చు పెట్టనివ్వకుండా చావు కొనితెచ్చుకుంది.

నూకరత్నం పోవడంతోనే లోకంలో ఉన్న తోడేళ్లన్నీ ఎర్రతేలంటి అందమైన ఏపుగా పెరిగిన సత్యవాణిమీద పడ్డాయి. ఎవరో ఒకరిని నమ్ముకోవాలి కనక... పెళ్లి చేసుకుంటానన్న లారీ డ్రైవరు రాజుని నమ్మింది ఆ పిల్ల.

‘అన్నీ అమ్మేసుకుని కాకినాడ పోదాం వాణీ. సొంత లారీ కొందాం. మన బతుక్కి మనమే ఓనర్లం’ అంటే ఉన్నదంతా అమ్మేసి, ఎవరు చెప్పినా వినకుండా రాజుచేతిలో పెట్టింది.

రాజు కొత్తలారీలో సత్యవాణిని సింహాచలం తెచ్చాడు... తాళికట్టి సొంతం చేసుకోవడానికి.

అన్నారం స్వామి సత్యవాణి అందున్నాడు కనుకనే వాడి రంగు బయటపడింది.

సింహాచలం బస్టాండులో సత్యవాణి బాత్‌రూమ్‌ కెళ్లి వచ్చేసరికి వాడు గోడచాటుగా ఫోన్లో రహస్యంగా మాట్లాడుతున్నదంతా వినేసింది. ‘వచ్చేత్తాను దేవీ! ఇదిగో లారీకి పూజ చేయించడానికి తలుపులమ్మ లోవకు వచ్చా. రేపటికల్లా సర్పారం వచ్చేత్తా! సిట్టితల్లికి బొమ్మలు తెత్తాలే...’ అంటున్నాడు రాజు. అంతే... ఆ పిల్ల మనసు రాయేసి కొట్టిన అద్దాలమేడలా పగిలిపోయింది.

చడీచప్పుడు చేయకుండా తన రేకుపెట్టె పట్టుకుని, ఆ బస్టాపులో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న బస్సెక్కి... ఇదిగో ఈ బస్టాపులో దిగేసింది.

‘ఏం సెయ్యాలిప్పుడు. సేతిలో రెండొందలు మించి లేవు. ఎక్కడుండాలి? ఎవరూ తెలీదు. ఇన్నాళ్లూ మాయమ్మలాగే నిప్పులాగే బతికా. పని దొరకకపోతే సావనయినా సస్తా కానీ దారి తప్పను’ అనుకుంటూ శపథం చేసుకుంది.

ఆలోచనల్లో పడి మరిచిపోయిన ఆకలి, ఇప్పుడు పైకి తన్నుకొస్తోంది. చుట్టూ చూసింది. అక్కడ ఎవరో ఓ ముసలమ్మా ఓ సాధువూ ఉన్నారు.

ఆ ముసలమ్మ సత్యవాణిని చూసి... ‘‘ముండలు పెట్టెలట్టుకు దిగిపోతారు... పనులు చెయ్యడానికి’’ అంటూ వినిపించేలా సణుగు తోంది. సత్యవాణికి ఒళ్లు మండిపోయింది. ‘‘ఇదిగో ముసలీ, ఏంటి వాగుతున్నావు? నేను తాటిపర్తి నూకరత్నం కూతుర్ని. మా అమ్మ రెక్కల్ని నమ్ముకుంది. నేను పనికోసం వచ్చా. పైటలు పరవడానిక్కాదు. జాగర్తగా మాటాడు’’ అంటూ గట్టిగా అరిచింది. ముసలమ్మ కాసేపూరుకుని ‘‘అన్నారమా మీది. మా పెద్దప్ప అత్తోరు తాడిపర్తోరే’’ అంటుంటే ఆ మాటలు విన్న సత్యవాణికి ప్రాణం లేచొచ్చింది.

ఏదో మాట్లాడే లోపు పక్కన కూర్చుని చుట్ట పీలుస్తున్న సాధువొచ్చి చెయ్యి పట్టుకున్నాడు. ‘‘పద పని చూపిస్తా నీకు, రాణీభోగం పని’’ అంటూ. వాడి చొరవకి బెదిరిపోయింది సత్యవాణి. ‘‘ఏటన్నా, ఏటా మాటలు తప్పు కదా. ఎలా ఉండాలి సాధూలంటే తప్పు, ఎల్లెల్లు’’ అంటూ దులపరించుకుంది.

ఈలోపున బిలబిలమంటూ ఓ పదిమంది కాలేజీ అమ్మాయిలూ అబ్బాయిలూ బస్టాప్‌లోకి వచ్చారు. ముసలమ్మ లేచి అందరి దగ్గరా చెయ్యి చాపింది. వాళ్లకు తోచిందేదో ఇచ్చారు. అది తీసుకుని నడుచు కుంటూ పోయింది. సత్యవాణికి ఆమె వెళ్లిపోతుంటే పెన్నిధేదో పోయినట్టయింది.

ఆ సాధువు పెద్ద స్టీలు క్యారేజీనుండి ఏవో పొట్లాలు తీసి కొందరు కుర్రాళ్ల చేతిలో పెడుతున్నాడు. వాళ్లు అటూ ఇటూ చూసి వాడిచేతిలో డబ్బులు కుక్కుతున్నారు.

సత్యవాణి చదువు వానాకాలం చదువే అయినా, కొండకింద ఇలా భంగుపీల్చే సన్యాసుల్ని చాలామందిని చూసింది.

భయపడి అక్కడ నుంచి వెళ్లిపోబోతుంటే ముసలమ్మ మళ్లీ వచ్చింది. చేతిలో రెండు బన్నులూ, టీ గ్లాసుతో వచ్చి సత్యవాణి చేతిలో పెట్టి ‘తిను’ అంది. సత్యవాణికి ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది. చుట్టూ అందరూ వింతగా చూస్తున్నా... చేతుల్లో మొహం పెట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది కాసేపు. మెల్లగా చల్లారిపోయిన టీలో బన్నులు ముంచుకుని తిన్నాకా కాస్త ఓపికొచ్చింది.

‘‘అవ్వా, ఎక్కడయినా పని ఇప్పిస్తావా?’’ అంటూ దైన్యంగా అడుగుతుంటే... ‘‘ఏ పని సేస్తావ్‌? వొయిసులో ఉన్న పిల్లను పనిలో ఎట్టుకోరు వొవరూ. చూద్దారి. కిష్ణ రావాలి’’ అంది ముసలమ్మ. సాయంత్రం ఐదవుతుంటే ఆ క్రిష్ణ రానే వచ్చాడు నూడుల్స్‌ బండి తోసుకుంటూ.

ముప్ఫైయేళ్లు ఉంటాయేమో. ఎర్రగా కుదమట్టంగా ఉన్నాడు మనిషి. పెద్ద గిరజాల జుట్టు. మొహంలో నవ్వుతో వెలిగే పెద్దకళ్లు. జీవితాన్ని సాదా అద్దాలనుండి చూస్తూ సంతృప్తిగా బతికే మనిషిలోని నిశ్చింత క్రిష్ణలో.

ముసలమ్మ బండి దగ్గరకెళ్లి, బస్టాప్‌లో నుంచున్న సత్యను చూపించి ఏదో అడిగింది. అతను చూపు సారించి బుర్ర అడ్డంగా తిప్పుతున్నాడు. ముసలమ్మ బతిమాలుతోంది.

సత్య ఒక్క నిమిషం ఆలస్యం చెయ్యలేదు. పెట్టె పట్టుకుని పరుగుల్న పోయి క్రిష్ణ కాళ్లట్టేసుకుంది. ‘‘అన్నయ్యా, దిక్కులేనిదాన్ని. మా అమ్మ పోయింది. ఎవరూ లేరు. సెడిపోడం ఇష్టం లేదు. ఏదో పని చూపించు. తిండి పోతే సాలు నాకు’’ అంటుంటే క్రిష్ణకు వింతగా అనిపించింది. తన నగరంలో గుంటలు ఒక్కళ్లూ ఇంత దైన్యంగా అలా బతిమాలుతూ అగపడరు. ప్లేటు నూడుల్స్‌ కోసం రకరకాల నకరాలేసే గుంటల్ని చూస్తున్నాడు ఈ రోజుల్లో. ఏమనుకున్నాడో ఏమో మరి ‘సరే’ అన్నాడు.

అప్పటివరకూ జన సందోహం అంతగా లేని ఆ ప్రదేశం ఆరయ్యేసరికల్లా జాతరయి పోయింది. రకరకాల వీధితిళ్లు అమ్మే బళ్లు వచ్చి చేరాయి. చాట్లూ, పానీపూరీ, చికెన్‌ పకోడీ, కుల్ఫీ, ఐస్‌క్రీమ్‌ బండ్లు అవన్నీ.

క్రిష్ణ నూడుల్స్‌ కోసం ప్రత్యేకంగా జనాలు గుమిగూడిపోతున్నారు. పెద్ద బండమీద స్టవ్‌ పెట్టి, ఇనుప మూకుడులో రకరకాల నూడుల్స్‌ చేసి, ప్లేట్లలో పెట్టి క్షణాల్లో అందిస్తున్నారు క్రిష్ణా, అతని అసిస్టెంట్‌. ఆ గ్లాసులూ, స్టీలు ప్లేట్లన్నీ అక్కడ అందరూ డబ్బిచ్చి తెప్పించుకున్న ట్యాంకరు నుండి బిందెలతో నీళ్లు తెచ్చి శుభ్రం చెయ్యడం, నీళ్లజగ్గులో నీళ్లు నింపి ఇవ్వడం, కస్టమర్లకి నూడుల్స్‌ అందించడం, కుర్చీలు సర్దడం... ఇలా ఒక్కక్షణం ఖాళీ లేకుండా పని చేసింది సత్యవాణి.

కడుపు చూసి పని చేయించుకునే మనిషి క్రిష్ణ. మొట్టమొదటి ప్లేటు సత్యవాణి చేత రూపాయి తీసుకుని బోణీ చేయించాడు. నిండిన కడుపూ, చేతిలో పని ఆమెకు ఎక్కడాలేని హుషారూ ఇచ్చింది. ఎవరైనా ఎకసెక్కాలు చెయ్యబోయినా నవ్వేసి, ‘‘ఊరుకో అన్నయ్యా, ఏటి తమ్ముడూ ఆ మాటలు, నువ్వు కూడానా బాబాయ్‌’’ అంటూ అనువయిన వరుసలు కలిపేసి వాళ్ల ఆశలమీద నీళ్లు పోసేసేది. ఆ తరువాత ఒంటిమీద బట్ట చెదరనీయకుండా, మర్యాదగా మాట్లాడుతూ బుర్రొంచుకుని శ్రద్ధగా పని చేసుకుపోయే సత్యవాణిని అందరూ ఆదరంగా చూడడం మొదలుపెట్టారు. క్రిష్ణ మంచితనం చూశాకా స్వచ్ఛందంగా అతన్ని క్రిష్ణగారూ అనే పిలిచేది.

మొదటిరోజు రాత్రి పదింటి వరకూ ముసలమ్మ దండుడు అయిపోయాకా, క్రిష్ణ ఇచ్చిన నూటయాభై కళ్లకద్దుకుని, ముసలమ్మతో పాటూ ఆవిడ ఇంటికెళ్లిపోయింది సత్యవాణి. అక్కడికి దగ్గరలో నూరుగజాల స్థలంలో ప్రభుత్వ పథకంలో కట్టిచ్చిన ఒంటిగది ఇల్లది. వాళ్లమ్మ పోయిన తరువాత మొట్టమొదటిసారి ఆరాత్రి నిశ్చింతగా ఆదమరిచి నిద్రపోయింది సత్యవాణి.

ఆ రోజు నుంచి ముసలమ్మ మనవరాలిగా ఆ పేటలో స్థిరపడిపోయింది. ఉదయాన్నే ముసలమ్మకు టీ పెట్టి, నూకల జావ కాచి ఇచ్చేది. రెండుపూటలకూ సరిపడా వరన్నం, చేపలపులుసో, గుడ్లకూరో, కూరగాయలో వండి పెట్టేది. ముసలమ్మ ఇంటిచుట్టూ స్థలంలో బంతినారూ, చామంతినారూ తెచ్చి వత్తుగా పూలు పూయించేది. అడ్డదిడ్డంగా ఇంటిమీదకు పాకేసిన పొరుగింటి సన్నజాజితీగకు ఊతమిచ్చి చక్కగా పైకిపాకించి రోజూ నాలుగింటికల్లా మొగ్గలు కోసి మూడు మూరల మాల అల్లేది. ఓ మూర పక్కోళ్లకిచ్చి, మిగిలింది క్రిష్ణ బండిమీద హనుమంతుడికి వేసేది.

చూస్తుండగానే సత్యవాణి ఆ ఊరొచ్చి ఏడాది తిరిగిపోయింది. తల్లి జ్ఞాపకాలు బతుకు పరుగులో కాస్త పాతబడ్డాయి. ఎంచుకున్న దారి మంచిదయినప్పుడు, ఆ దారిలో నీతీ, నిజాయతీ, కాయకష్టం ఉన్నప్పుడు ఆ దారిలో పోయేవారిని బతుకు భయపెట్టదు. మరిన్ని దారుల్ని సుగమం చేస్తుంది.

ఆ రోజు క్రిష్ణకు బండిమీద సర్దడానికి కూరల తరుగులూ, నూడుల్స్‌ డెగిసా, మూకుడూ ఒకటి ఒకటిగా అందిస్తోంది సత్యవాణి.

హఠాత్తుగా బండికి అతి దగ్గరగా కొబ్బరికాయల లోడ్‌తో చిన్న గూడ్స్‌ ట్రక్కు ఆగింది. డ్రైవరు సీటు పక్కనుంచి ఒక మధ్య వయస్కురాలు దిగింది.

చెవులకు వరసగా కుట్లూ, జుంకాలూ, చెంపసరాలూ, మెడలో ఎర్రరాళ్ల కంటె, చేతులకు ఎర్రగాజులూ తలకు పైకి కట్టిన కొప్పుతో మనిషి మహా గంభీరంగా ఉంది.

పని చేస్తున్న క్రిష్ణ... ఒక్కసారి మాట పడిపోయినట్లు నిలబడిపోయాడు. సత్యవాణి మాత్రం ‘‘ఎవరండీ? ఏం కావాలి?’’ అంటూ ఆరాగా అడిగింది.

‘‘ముందు నువ్వెవరే సయితీ. ఆడి అమ్మను పట్టుకుని ఎవురని అడుగుతున్నావ్‌?’’ అని ఆవిడ గద్దించేసరికి సత్యవాణి గడగడలాడుతూ ‘‘నమస్కారం అమ్మగారూ’’ అంటూ సాష్టాంగపడిపోయింది.

ఆ వచ్చినామె క్రిష్ణ తల్లి మాణిక్యం. సత్యవాణిని తేరిపారి పరికించి, తృప్తిగా తలాడించి, క్రిష్ణకేసి తిరిగి ‘‘ఉప్పుడే చోడారం నుంచి కొబ్బరికాయల లోడేసుకుని ఒత్తన్నాను. మీ నాన్న కేజీయెచ్‌ కాడ కూకున్నాడు బొండా లెట్టుకుని. సరే, రేపు ఏ పనీ యెట్టుకోకు. పొద్దులకాడనే సిమ్మాచలంలో నీకూ, దీనికీ పెళ్లి. అంతే పైనల్‌’’ అనేసి ఠీవిగా ట్రక్కు ఎక్కేసింది.

క్రిష్ణ వెనకాల పరిగెడుతూ వాళ్లమ్మను ఆపే ప్రయత్నం చేశాడు. ఆమె పైనల్‌ అంటే పైనలే ఆళ్లింట్లో మరి.

నేరం చేసినోడిలా సత్యవాణి మొహంలోకి చూసిన క్రిష్ణ... సిగ్గులమొగ్గలా ఉన్న సత్యవాణిని చూసి తికమకపడిపోయి తల గోక్కున్నాడు.

ఆ మర్నాడు క్రిష్ణ ముగ్గురు అన్నలూ, వదిన్లూ చోడవరం నుంచి వచ్చారు. సత్యవాణి ముసలమ్మతో సింహాచలంలో బస్సు దిగింది. క్రిష్ణ ముందు భార్య కూతురు ఆరేళ్ల ప్రియాంకతో అత్త మాణిక్యం సత్యవాణికి నగలెట్టించింది. తోడికోడళ్లు పట్టుచీర కట్టి బాసికం పెట్టారు. సత్యవాణి పెళ్లి బాజాల్లేకుండానే సింహాద్రప్పన్న సన్నిధిలో ఆనందంగా అయిపోయింది.

ఆ రోజు సాయంత్రం మామూలుగానే సత్యవాణీ, క్రిష్ణా నూడుల్స్‌ బండి పెట్టారు. ఆంజనేయస్వామి రెండుమూరల దండ ఒకమూరే అయింది ఆ రోజు. ఇద్దరూ ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదు.

రాత్రి పదింటికి మౌనంగా సత్యవాణితో పాటూ బండి తోసుకుంటూ ముసలమ్మ ఇంటికి తోడొచ్చాడు క్రిష్ణ.

సత్యవాణి లోపలికి పోబోతున్నదల్లా బయటకొచ్చి ‘‘యావండీ, జాగర్తగా ఎళ్లండి ఇంటికి. భోజనం చేసి పడుకోండి’’ అంటూ ఎర్రబడిన బుగ్గలతో అప్పగింతలు పెట్టి నవ్వుతూ పారిపోయింది.

తన పని తప్పా మరోటి పట్టని మొద్దు క్రిష్ణకు పకపకా నవ్వొచ్చింది ఆ రాత్రి.

కాలం మరికొన్ని మార్పుల్ని తెచ్చింది. ముసలమ్మ స్థలంలో క్రిష్ణ నాలుగ్గదులు డాబా వేశాడు.

సత్యవాణి జాజితీగ మరింత రక్షణతో డాబామీద పరుచుకుంది.

ఒకరాత్రి పుచ్చపువ్వులాంటి వెన్నెలలో అందరూ బయట మంచాలేసుకుని కూర్చున్నారు. మాణిక్యం తమలపాకులు నవులుతోంది. వాళ్లాయన ఏదో లల్లాయిపాట పాడుతున్నాడు.

సత్యవాణి ఒళ్లో పడుకుండిపోయిన కూతుర్ని పైకితీసి నుదుట ముద్దు పెట్టుకుని క్రిష్ణ లోపల పడుకోపెట్టి వచ్చాడు.

తనో మంచం మీద కూర్చుని ఏదో గుర్తుకొచ్చిన వాడిలా వాళ్లమ్మతో ‘‘అమ్మా నీకు తెలుసా... ఈ సత్య నన్ను ‘అన్నా’ అని పిలిసేది. ఇప్పుడేమో ‘యాండీ, యావండీ’ అని పిలుస్తుంది’’ అంటూ పకపకా నవ్వాడు.

మాణిక్యం కోడలికేసి ప్రేమగా చూసింది. ‘‘నీతున్న ఆడది ముక్కూమొగం తెలీనోడిని అలానే పిలుత్తుందిరా. ఆ పిలుపు రచ్చన ఆడదానికి, ఆ పిలుపు కంచెలా కాపాడుతాది. ఆ కంచె దాటి ఎవుడన్నా యెల్తే రామణాసురుళ్లా సత్తాడు. దీనికి నువ్వు కాక ఎవురో ఒక ఆటోవాడితో మనువు కుదిర్చినా, ఆడెవడో దీనికి మనువుకు ముందు తెలియక పోతే అన్నా అనే పిలిచి ఉండేది. అది ఒక హద్దు. అది దాటి రాకు అని చెప్పడం. ఉరే, మన పేటలో అమ్మాయిలు రాకీలు కట్టిన పోరగాళ్లతోనే యెదవ యేసాలేత్తన్నారు. బతుకుతెరువు కోసం, ఎలాటి దన్నూ లేని సత్తెవాణి... సాయం కోరి మరింకేం పిలుపు పిలవగలదు? ఇది బంగారం. ఆ అన్నారం సత్తెమ్మతల్లి మనకోసం పంపినాది. ఆళ్లమ్మ నాగరత్నం ఒద్దేగా పెంచింది పిల్లను.’’

అత్తమ్మ నోటంట నిండుగా వచ్చిన ఆ మాటలు సత్యవాణి మనసు నింపాయి. పెదాలమీద చిలిపినవ్వు మొలిచింది. చేతుల్లోకి బుట్టలోంచి ఇన్ని విడిజాజులు తీసుకుంది. ‘‘యావండీ క్రిష్ణగారూ, మీరు నాకు మొగుడుగారు కాకపోతే ఇప్పటికీ అలానే పిలుద్దునండీ, ఆయ్‌’’ అంటూ ఆ పూలన్నీ మొగుడుమీద దిమ్మరించింది.

లోపలిగదిలో పడుకున్న ముసలమ్మ ఈ మాటలన్నీ వింటోంది. ‘నీతున్న గుంట. అందర్నీ అన్నా, బాబాయ్‌ అనుకుంటూ... కాలు జారకుండా కాపాడుకుంది. ఆ నీతి నాకు తెలీక చివరకు బిచ్చగత్తెగా మిగిలాను’ అనుకుంటూ వేదాంతంగా నవ్వుకుంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న