అక్క బంగారం - Sunday Magazine
close

అక్క బంగారం

- ఉమా మహేష్‌ ఆచాళ్ల

అపరాహ్న వేళ, బంగారి పరిగెడుతోంది. నుదుటి మీదనుంచి జారే చెమటనీ, పుస్తకాల సంచీ బరువునీ ఓడిస్తూ పెదవులపై విచ్చుకున్న నవ్వూ, కళ్లల్లో వెలుగూ, తోడురాగా స్కూల్‌ నుంచి ఇంటికున్న ఆ కిలోమీటర్‌ దూరం ఆమె తల్లో కనకాంబరం దండలో దారమంత చిన్నదనిపించేలా పరిగెడుతోంది.

‘నువ్వింక ఆడపిల్లవి. ఈ గెంతులూ పరుగులూ మానెయ్యాలి’ అని వారం క్రితమే నానమ్మ చెప్పిన మాటలు గుర్తున్నా పరిగెడుతోంది. ‘ఓయ్‌ బంగారీ, నీకు తమ్ముడు పుట్టాడే, వెళ్లాలని ఉంటే వెళ్లు, హాజరు వేస్తాలే’ అని మాస్టారు అన్నదే తడవు మొదలైందా పరుగు.

గులాబీ రంగులో, బిగించిన పిడికిళ్లతో పెరటి పాకలో తన పక్కలో హాయిగా నిద్రపోతున్న తమ్ముణ్ణి మురిపెంగా చూపిస్తూ నీరసంగా నవ్వింది బంగారి తల్లి. ఇంతలో నానమ్మ పరుగు పరుగున వచ్చి పురిటి స్నానం అయ్యేవరకూ తమ్ముణ్ణి ముట్టుకోడానికి వీల్లేదని బంగారిని హెచ్చరించింది. అతి కష్టం మీద ఆ పదిరోజులూ తమ్ముణ్ణి దూరం నుంచే చూస్తూ గడిపిన బంగారి ఆ తర్వాత మాత్రం వాణ్ణి వదల్లేదు.

స్నానం అయ్యాక సాంబ్రాణి పొగ తనే పెట్టటం, వాడి బుల్లి బుల్లి వేళ్ల మధ్యలో తన వేలు పెట్టి వాడు గట్టిగా పట్టుకుంటే ఆ మెత్తటి స్పర్శకి మురిసిపోవటం, తెల్లవారుఝామున నాలుక్కల్లా లేచిపోయి తమ్ముడికి తన వేలితో తేనెచుక్క పట్టించడం, వాడు తన వేలుని ఆత్రంగా చప్పరిస్తూ ఉంటే తను ఆకలి మర్చిపోవటం... ఇలా బంగారికి కాలం కాంతి కన్నా వేగంగా పరిగెడుతూ మరో నాలుగేళ్లు గడిచిపోయాయి.

కన్నవాళ్లు బంగారి చేత వేయించిన ఏడడుగులతో మొదలైన దూరం- జ్ఞానం తెలియని వయసులో అక్కతో ఏర్పడ్డ అనుబంధాన్ని కాలం పెట్టే పరుగుపందెంలో పడి మరిచిపోయి తమ్ముడూ, పిల్లలకోసం డాక్టర్ల చుట్టూ దేవుళ్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి అక్కా, అప్పుడప్పుడూ ఫంక్షన్‌లకి కలవడం మినహా ఒకరినొకరు దాదాపు మరచిపోయేలా పెరిగిపోయింది.

* * * * *

‘‘హలో అక్కా బావున్నావా?’’

‘‘ఆ వాసూ బావున్నాను. నువ్వెలా ఉన్నావు. అమ్మాయి పిల్లలూ ఎలా ఉన్నారు. ఏంటిరా చానాళ్లకి ఫోన్‌ చేశావు. అంతా బానే ఉందా’’ అడిగింది బంగారి ఆదుర్దాగా.

‘‘ఆ అంతా బానే ఉందక్కా. బావెలా ఉన్నాడు’’ అవతల్నించి వాసు అడిగాడు.

‘‘ఆయనకేం మహారాజులా ఉన్నారు. ఢిల్లీలో చలి, పొల్యూషన్‌ ఎక్కువగా ఉందని టీవీలో చెప్తున్నారట. మీ బావ చెప్పారు. మీరెలా ఉన్నారు’’ అడిగింది బంగారి.

‘‘పర్లేదక్కా... అసలు విషయం ఏంటంటే నాకు వైజాగ్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. ఇంకో నెలలో ఇక్కడ రిలీవ్‌ అవుతాను. మీ దగ్గరలో మంచి ఇల్లు చూసిపెట్టు’’ అన్నాడు వాసు ఉత్సాహంగా.

‘‘ఎంత మంచి విషయం చెప్పావురా. చాలా సంతోషం. అమ్మ ఉండుంటే ఎంతో సంతోషించేది. ఉండు మీ బావతో కూడా చెప్పు’’ అంటూ ఫోన్‌ తన భర్త వేణుగోపాల్‌కి ఇచ్చింది విషయం చెప్పి.

‘‘ఏరా బామ్మర్దీ, ఎలా ఉన్నావు. ఏంటీ మా ఊరొచ్చేస్తున్నావట? త్వరగా రారా బాబూ. ఎప్పుడో పెళ్లినాడు గెడ్డం కింద బెల్లం పెట్టి కాశీ వెళ్లకుండా ఆపావు. అప్పట్నుంచీ మీ అక్క కొడుతూ ఉంటే ఆపడానికెవరూ లేక ఇబ్బందిగా ఉంది’’ అంటూ నవ్వుతూ ఉండగా బంగారి ఫోను లాక్కుని, ‘‘మీ బావ మాటలకేం గానీ, నువ్వు రా. ఇల్లుదేముంది. ముందు మనింట్లో ఉండండి తర్వాత నింపాదిగా దగ్గర్లో చూద్దాం’’ అంటూ ఇంకాసేపు మాట్లాడి వాసు ఫోన్‌ పెట్టేశాక భర్తతో చాలాసేపు తమ్ముడి చిన్నప్పటి విషయాలు మాట్లాడుతూ గడిపింది బంగారి.

బంగారి వాళ్లది వైజాగ్‌లో మూడుగదుల పోర్షన్‌. ముందు చిన్న హాలు, మధ్యలో బెడ్‌రూమ్‌, ఆ తర్వాత కిచెన్‌, వెనుక చిన్న కామన్‌ పెరడు. పక్క పోర్షన్‌లో అద్దెకుంటున్న వాళ్లు వేసవి సెలవలకి ఊరెళుతుండటంతో వాళ్లనడిగి తాళాలు తీసుకుంది. తమ్ముడూ, మరదలూ, పిల్లలూ రాగానే నాలుగురోజులు బంగారి ఇంట్లోనే ఉన్నారు. పగలంతా ఇంట్లోనే గడిపి పడుకోవడానికి పక్కవాటాకి వెళ్లేవారు. ట్రాన్స్‌పోర్ట్‌లో సామాన్లు రాగానే దగ్గర్లోనే చూసిన ఫ్లాట్‌లో బంగారి దగ్గరుండి సర్దించింది.

అంతా సర్దుకున్నాక ఓ ఆదివారం అందరినీ భోజనానికి పిలిచింది. ఆరోజు బంగారి హడావిడి అంతా ఇంతా కాదు. ఉదయం నాలుగింటికి లేచి కూరలు తరగడం, పప్పు రుబ్బడం లాంటివి చేసేసి, ఐదుకల్లా భర్తని కూడా లేపేసి కాఫీ ఇచ్చి, ఉల్లిపాయలు కొయ్యడం, బఠాణీ ఒలవటం లాంటి పనులు అప్పజెప్పింది. ఉప్మా చేసి హాట్‌బాక్స్‌లో పెట్టి వాళ్లొచ్చాక వేద్దామని పెసరట్ల పిండి రెడీ చేసింది. పిల్లలకి నచ్చుతుందో లేదో అని హోటల్‌ నుంచి మైసూర్‌ బజ్జీ తెప్పించింది. ఫిల్టర్‌ తీసి డికాక్షన్‌ రెడీ చేసింది.

భోజనంలోకి వీధిలో చెట్టుకి కాసిన మామిడికాయతో పప్పూ, వంకాయ కొత్తిమీర కారం కూర, దుంపలవేపుడూ, కొబ్బరికాయ పచ్చడీ, చక్రపొంగలి చేసింది. అరడజను ఎర్ర పాలపేకెట్లు గంటసేపు కాచి తోడుపెట్టగా అంగుళం మందం మీగడ కట్టి ఉన్న గడ్డపెరుగుని ఓమారు తృప్తిగా చూసుకుని మూత పెట్టింది.

అన్నీ అయ్యాక ఉదయం ఎనిమిదిన్నరకి ఫోన్‌ చేసింది.

‘‘పిల్లలు ఇంకా లేవలేదక్కా. లేవగానే బయలుదేరుతాం’’ అన్నాడు వాసు క్యాజువల్‌గా. మళ్లీ తొమ్మిదిన్నరకి ఫోన్‌ చేసింది. ఐదు నిమిషాల్లో బయలుదేరుతామన్నారు. భర్తకి టిఫిన్‌ పెట్టేసి తను మాత్రం తినకుండా కూర్చుంది బంగారి.

మొత్తానికి వాళ్లు వచ్చేసరికి పదకొండు అయ్యింది. టిఫిన్లు దార్లో తినేశాం, ఏకంగా భోజనం చేసేద్దామన్నారు. దాంతో బంగారి కూడా ఏమీ తినకుండా ఉండిపోయింది.

'కాసేపు కబుర్లయ్యాక భోజనాలకి కూర్చున్నారు. పిల్లలకి తనే తినిపించి, వాసుకీ మానసకీ కొసరి కొసరి వడ్డించింది.

‘‘నీ చేతిలో అమృతం ఉందక్కా. ఎప్పుడో చిన్నప్పుడు తేనెలో ముంచిన నీ వేలు లొట్టలేసుకుని నాకానట, అమ్మ చెప్పేది. మళ్లీ ఇదిగో ఇప్పుడే అంత సంతృప్తిగా తినటం’’ అన్నాడు వాసు తృప్తిగా.

అందరికీ వడ్డించి ఆఖర్న బంగారి ఏదో కొద్దిగా ఎంగిలి పడింది. పిల్లలు కాసేపు ఆడుకుని ఒకడు మానస ఒళ్లో, మరొకడు బంగారి ఒళ్లో పడుకున్నారు. చాలా కాలానికి కలవడంతో అంతా కబుర్లలో పడ్డారు.

‘‘అన్నయ్య సంగతులు ఏమైనా తెలుసా అక్కా’’ అడిగాడు వాసు.

‘‘లేదురా, ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నాడు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడట. వాడి పెళ్లైన కొత్తలో ఒకసారి వచ్చాడట. అప్పుడు నాన్న సరిగా మాట్లాడకపోవడంతో మళ్లీ రాకపోకలు లేవు. అమ్మ పోయినప్పుడు రావటమే, మళ్లీ ఏ కబురూ లేదు’’ అంది బంగారి కొంచెం దిగులుగా.

‘‘మీ సంగతేంటక్కా’’ అడిగాడు వాసు నెమ్మదిగా.

‘‘ఏముందిరా. ఆయనకి నేనూ నాకు ఆయన. పిల్లలు పుడతారేమోనని నిన్న మొన్నటి వరకూ చూశాం. ఆ ఆశ సన్నగిల్లాక ఎవర్నైనా దత్తత తీసుకుందామనుకుంటున్నాం. ఇప్పుడు అదంతా పెద్ద ప్రొసీజర్‌ అట కదా. మీ బావ చెప్పారు’’ అంది బంగారి చంటోడి తల నిమురుతూ.

‘‘ఓ పని చెయ్యక్కా. నీకు నచ్చినంత కాలం వీణ్ణి నీ దగ్గరే అట్టే పెట్టుకో’’ అన్నాడు వాసు నవ్వుతూ బంగారి ఒళ్లో ఉన్న పిల్లాడిని చూపిస్తూ.

బంగారి కళ్లల్లో ఆశ. ‘‘నిజంగా అంటున్నావురా... సరదాగానా’’ అంది అనుమానంగా.

‘‘నీతో సరదాగా అంటానా అక్కా. సీరియస్‌గానే చెబుతున్నాను. కావాలంటే మంచిరోజు చూసి ఫార్మల్‌గా దత్తత కూడా తీసుకో. వాడు నా దగ్గరుంటే ఒకటీ నీ దగ్గరుంటే ఒకటీనా. పైగా మానస కూడా ఇద్దర్నీ సమర్థించలేక ఇబ్బంది పడుతోంది’’ అని వాసు అంటూ ఉండగా మానస చిన్నగా దగ్గింది. అందరూ ఆమెవైపు చూశారు.

‘‘ఏమండీ, వెళ్దామా’’ అంది పొడిగా.

‘‘అయ్యో మాటల్లో పడి మర్చిపోయా. ఉండండి టీ పెడతా’’ అంటూ పిల్లాణ్ణి ఎత్తుకుని లేవబోయింది బంగారి. ఆమె చేతుల్లోంచి పిల్లాణ్ణి తీసుకుంది మానస.

బంగారి టీ పెట్టి తెచ్చింది. అందరూ తాగారు. ఎంత బతిమాలినా మానస టీ తాగలేదు.

వాళ్లకారు వీధి మలుపు తిరిగే వరకూ వీధిలోనే ఉండిపోయింది బంగారి.

బయట నెమ్మదిగా చీకటి పరుచుకుంది. బంగారి మనసులో బెంగలా.

* * * * *

‘‘ఈరోజు చాలా బాగా గడిచింది కదా. మా అక్కకి నేనంటే ప్రాణం’’ అన్నాడు వాసు డ్రైవ్‌ చేస్తూ పక్కనే కూర్చున్న మానసతో. పిల్లలిద్దరూ వెనకసీట్లో పడుకున్నారు.

‘‘ఇకపై మీరు మీ అక్క ఇంటికి రాకపోకలు తగ్గిస్తే మంచిదేమో’’ అంది మానస కారు అద్దంలోంచి బయటకు చూస్తూ.

‘‘అదేంటి మానసా అలా అన్నావు. ఏం అక్కడ నీకేమైనా ఇబ్బంది కలిగిందా?’’ అడిగాడు వాసు అనుమానంగా.

‘‘అదేం లేదు, వెళ్లిన మొదటిరోజే పిల్లాణ్ణి ఇచ్చేస్తానంటుంటే కొంచెం భయం వేసింది అంతే’’ అంది మానస వెనకసీట్లో పిల్లల్ని ఓసారి తడిమి.

‘‘ఓహ్‌ అదా. మా అక్కకి నేనంటే ప్రాణం మానసా. పాపం తనకి పిల్లలు లేరు కదా, అందుకని అలా అన్నానంతే. అయినా ఇప్పుడు ఇద్దరం ఒకే ఊళ్లో ఉంటున్నాం. ఒకణ్ణి వాళ్ల దగ్గర పెరగనిస్తే తప్పేంటి. తను ఎంతో బాగా చూస్తుంది. మన పిల్లాడు మన కళ్లముందే ఉంటాడు. పైగా నీకూ కొంచెం శ్రమ తగ్గుతుంది. అక్కా బావా పెద్దవాళ్లవుతున్నారు. ఏదో ఇంట్లో ఓ పిల్లాడు తిరిగితే వాళ్లకీ కొంత సంతోషం కదా’’ అంటూ వాసు నచ్చచెప్పబోయాడు.

అతని మాటకి అడ్డుపడింది మానస. ‘‘సరదాకి కూడా ఇంకోసారి ఆ మాట అనకండి. మీకు తెలుసో తెలీదో, పిల్లి కూడా తన పిల్లల్ని ఎవరైనా ముట్టుకోవడానికి చూస్తే కరుస్తుంది. ఆఖరికి సరిగ్గా తిండి కూడా దొరకని వీధి కుక్క సైతం తన పిల్లల్ని ఎవరైనా ముట్టుకుంటే మీదకొస్తుంది. అలాంటిది పొట్ట కోయించుకుని మరీ కన్న నా పిల్లాడిని ఏదో ఆస్తిలో వాటా ఇస్తానన్నంత సులువుగా చెప్పేస్తున్నారు దత్తత తీసుకోమని. దానికి ఆవిడ రెడీ అయిపోవటం ఇంకా బాగుంది. ఇందుకేనా ఈ ఊరు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నది’’ అంది మానస ఆవేశంగా.

ఆమె కోపం చూసి బెదిరిపోయాడు వాసు. అంతలో ఇల్లు రావటంతో సెల్లార్‌లో కారు దిగి, వాసు తాను తీసుకొస్తాను అంటున్నా వినకుండా పిల్లలిద్దరినీ ఎత్తుకుని లిఫ్ట్‌లో వెళ్లిపోయింది మానస.

అంతే. మరోసారి ఆ అక్కాతమ్ముళ్ల మధ్య కనపడని దూరం పెరిగింది.

* * * * *

గోధూళి వేళ బంగారి నడుస్తోంది.

నుదుటి మీదనుంచి జారే చెమట, షుగర్‌ వల్ల వచ్చే నీరసం ఆమెని ఇబ్బంది పెడుతుండగా కిలోమీటర్‌ దూరం అంతరిక్ష ప్రయాణంలా ఎంతకీ తరగటం లేదు.

కాలింగ్‌ బెల్‌ మోగటంతో తలుపు తీసిన వాసు అక్కని చూసి ఒక్క క్షణం కంగారుపడి వెంటనే తేరుకుని ‘‘రా అక్కా’’ అంటూ పక్కకి తప్పుకున్నాడు. బంగారి సోఫాలో కూర్చోగానే గ్లాస్‌తో నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చాడు.

‘‘ఏంటక్కా ఒక్కత్తివే వచ్చావు? బావేడీ, అంతా ఓకేనా’’ అన్నాడు కంగారుగా.

‘‘ఊరికినేరా, ఆయనా వస్తానన్నారు. నేనే వద్దన్నా’’ అంటూ మంచినీళ్ల గ్లాస్‌ పక్కన పెట్టి, ‘‘అమ్మాయేదీ’’ అంది.

‘‘లోపలుందక్కా ఉండు పిలుస్తాను’’ అంటూ లోపలికెళ్లాడు. వెళ్లిన ఓ ఐదు నిమిషాలకి మానస బైటకొచ్చి బంగారిని మొహమాటంగా పలకరించి వంటింట్లోకి వెళ్లబోయింది.

‘‘ఇప్పుడు టీలూ అవీ వద్దు మానసా, ఇలా వచ్చి కూర్చో’’ అంది బంగారి.

అయిష్టంగానే బంగారికీ వాసుకీ కొంచెం దూరంగా కూర్చుంది మానస.

‘‘ఏం లేదర్రా. మేము ఈ ఊరొచ్చి పాతికేళ్లవుతోంది. మార్పు కావాలనిపిస్తోంది. కాశీ వెళ్లి అక్కడే కొన్నాళ్లు ఉందామనుకుంటున్నాం. ఇలాంటి ప్రయాణాలు ఒంట్లో ఓపికున్నప్పుడే చెయ్యాలి’’ అంది బంగారి నవ్వుతూ.

వాసుకి విషయం అర్థమైంది. ‘‘ఇప్పుడేమైందని మీరు ఊరొదిలి వెళ్లిపోవాలక్కా? కావాలంటే ఓ నెలో రెణ్ణెల్లో అలా తిరిగి రండి. అంతే కానీ వెళ్లి కాశీలో ఉండిపోవడమేంటీ? అదేం వద్దు. నేను బావతో మాట్లాడుతాను’’ అన్నాడు బాధగా.

‘‘లేదురా. నాకే ఇక్కడ బాగా బోర్‌ కొడుతోంది. నాకు ఊహ తెలియకముందే నాన్న ఏదో అన్నారని అన్నయ్య ఇంట్లోంచి వెళ్లిపోవడంతో నువ్వు పుట్టే వరకూ నాది ఒంటరి బాల్యమే. నీతో పట్టుమని నాలుగేళ్లు గడిపానో లేదో పెళ్లంటూ పంపేశారు. మీ బావ నన్ను ఎంత పువ్వుల్లో పెట్టుకుని చూసినా ఇంట్లో పిల్లల సందడి లేకపోవటంతో మళ్లీ అదే ఒంటరితనం. ఇదిగో ఇప్పుడు మీరొచ్చాకే నా ఇంట్లో కొద్దిగా అలికిడి మొదలైంది. అసలు దత్తత టాపిక్‌ తీసుకురావటం నాదే తప్పు. అమ్మాయి వైపు కూడా ఆలోచించాలి కదా. ఆమె స్థానంలో నేనున్నా కచ్చితంగా ఒప్పుకోను. క్షమించమని అడగడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఏమీ అనుకోకండి. అప్పుడప్పుడూ ఫోన్‌ చేస్తూ ఉండండి. పిల్లలు జాగ్రత్త’’ అంది బంగారి స్థిరంగా.

‘‘సరే అక్కా నీ ఇష్టం. టిక్కెట్లూ అవీ ఎప్పుడు బుక్‌ చెయ్యాలో చెప్పు. అక్కడ రూమ్‌కానీ ఇల్లుకానీ మాట్లాడాలంటే చెప్పు. అలాగే అమౌంట్‌ ఏదైనా కావాలంటే మొహమాట పడకక్కా’’ అన్నాడు వాసు.

‘‘అదంతా మీ బావ ఎవరికో చెప్పారు లేరా’’ అంటూ చీర కొంగు చాటు నుంచి ఓ చిన్న బ్యాగ్‌ తీసి అందులో కొన్ని కాగితాలు బయటకు తీసి వాసు చేతికిస్తూ, ‘‘ఇవి నాపేర్న మీ బావ దాచిన బ్యాంకు డిపాజిట్లు. ఇది చెక్‌బుక్‌. అన్నీ సంతకాలు చేసి పెట్టాను. నీ దగ్గర ఉంచు. పిల్లల చదువులకి అవసరమైనప్పుడు వాడుకో. ఇంతవరకూ నీకు గానీ, పిల్లలకి గానీ నేనేమీ ఇవ్వలేదు’’ అంది బంగారి అతని చేతిలో బ్యాగ్‌ పెడుతూ.

‘‘అదేంటక్కా ఇవన్నీ మీ లైఫ్‌ టైం సేవింగ్స్‌. నాకెందుకు. అక్కడికి వెళ్లాకా మీకు ఇంటద్దె అనీ, మెడికల్‌ అనీ చాలా ఖర్చులుంటాయి. ఉన్నదంతా నాకే ఇచ్చేస్తే ఎలా. నేను నీకు ఇవ్వవలసింది పోయి నీ దగ్గర తీసుకుంటానా’’ అంటూ తిరిగి ఇచ్చేయబోయాడు.

‘‘అవన్నీ మీ బావ వేరే ఏర్పాటు చేశార్రా. అమ్మా మానసా, ఈ కాగితాలు లోపల పెట్టు’’ అంటూ మానస చేతిలో పెట్టింది.

బంగారి బలవంతం మీద మానస బ్యాగ్‌ తీసుకుని బీరువాలో పెట్టడానికి బెడ్‌రూమ్‌కి వెళ్లింది. పిల్లలిద్దరూ గదిలో పడుకున్నవాళ్లు బీరువా తలుపు చప్పుడికి ఓసారి లేచి మళ్లీ పడుకున్నారు.

ఎంత ఆపుకున్నా ఆ అక్కాతమ్ముళ్లిద్దరి కళ్లల్లో నీళ్లు. బంగారి తమ్ముడి కంట పడకుండా తల దించుకుంది.

అంతే, వాసు ఓ నిర్ణయానికొచ్చినవాడిలా, కళ్లు తుడుచుకుని, ‘‘సరే అక్కా, నీ ఇష్టప్రకారమే నీ డబ్బంతా నా దగ్గరే ఉంచుతా. అలాగే దత్తత కార్యక్రమం కూడా జరుగుతుంది. రేపే పంతులుగారితో మాట్లాడి దగ్గరలో ముహూర్తం చూసి పెట్టేస్తా, ఎవరికీ ఇబ్బంది లేకుండానే అంతా సవ్యంగా జరుగు తుంది. నా మాట నమ్ము’’ అన్నాడు స్థిరంగా.

ఆ మాట విన్న బంగారి ఆనందంగా వాసు కేసి చూస్తుండగా అంతలోనే బెడ్‌రూమ్‌లోంచి బీరువా తలుపు గట్టిగా వేసిన శబ్దానికి బెదిరిపోయింది.

‘‘మరేం పర్లేదక్కా, నువ్వేమీ ఆలోచించకు. హాయిగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. పద నిన్ను ఇంటిదగ్గర డ్రాప్‌ చేస్తాను’’ అంటూ తాళం చేత్తో పట్టుకుని అక్క వెంటే నడిచాడు వాసు.

* * * * *

బంగారి ఇల్లంతా పూలదండలతో, తోరణాలతో, కళకళలాడిపోతోంది. చాలా కాలానికి ముంబయి నుంచి అన్నా వదినా వచ్చారు. వచ్చిన వాళ్లంతా వీధిలో టెంటులో వేసిన కుర్చీల్లో కూర్చున్నారు. భోజనాలు కేటరింగ్‌కి ఇచ్చేద్దామని అందరూ చెప్పినా వినకుండా బంగారే తెల్లవారి రెండుకి లేచి పక్కింటామె సాయంతో పంతులుగారు వచ్చేలోపు వంట మొత్తం పూర్తి చేసేసింది.

పంతులుగారు శ్రావ్యంగా చదువుతున్న మంత్రాలతో వీధి హాల్లో దత్తత తంతు నడుస్తోంది. ఎదురుగా మానస కూర్చుని చూస్తోంది.

‘‘... అపుత్రస్యమే పుత్రిత్వ సిధ్యర్థం, పుత్ర స్వీకరణం కరిష్యే...’’ దత్తత మంత్ర సహితంగా మేనమామ చేతులమీదుగా వాసుని దత్తత స్వీకారం అందుకున్నారు వేణుగోపాల్‌- బంగారి దంపతులు. బంధువులతో బంగారి చేసిన పెసరపప్పు బూరెలు, మావిడల్లం పులిహోర ఘుమఘుమలతో, ఆ ఇంటికి పండగొచ్చింది.

‘‘తల్లిదండ్రులు కొడుకు దగ్గర ఉండడమే న్యాయం కదక్కా. ఇకనుంచీ అందరం కలిసే ఉందాం. కాశీఅన్నపూర్ణను దర్శించుకుని త్వరగా వచ్చేయండి’’ ప్రేమగా అన్నాడు వాసు.

మిట్టమధ్యాహ్నం ఎండని సైతం లెక్కచెయ్యకుండా వీధిలో మామిడిచెట్టు కొత్త చిగుర్లు ఆహ్లాదంగా కదులుతున్నాయి. అలసట లెక్కచెయ్యని బంగారి మొహంలోని సంతోషపు ఛాయల్లా.

పక్కన పుట్టిన పుణ్యఫలం అక్కంటేనే అమ్మతనం.

‘‘ఓ పని చెయ్యక్కా. నీకు నచ్చినంత కాలం వీణ్ణి నీ దగ్గరే అట్టే పెట్టుకో’’ అన్నాడు వాసు నవ్వుతూ బంగారి ఒళ్లో ఉన్న పిల్లాడిని చూపిస్తూ.

బంగారి కళ్లల్లో ఆశ. ‘‘నిజంగా అంటున్నావురా... సరదాగానా’’ అంది అనుమానంగా.


‘‘నీతో సరదాగా అంటానా అక్కా. సీరియస్‌గానే చెబుతున్నాను. కావాలంటే మంచిరోజు చూసి ఫార్మల్‌గా దత్తత కూడా తీసుకో.


‘‘లేదురా. నాకే ఇక్కడ బాగా బోర్‌ కొడుతోంది. నాకు ఊహ తెలియకముందే నాన్న ఏదో అన్నారని అన్నయ్య ఇంట్లోంచి వెళ్లిపోవడంతో నువ్వు పుట్టే వరకూ నాది ఒంటరి బాల్యమే. నీతో పట్టుమని నాలుగేళ్లు గడిపానో లేదో పెళ్లంటూ పంపేశారు. మీ బావ నన్ను ఎంత పువ్వుల్లో పెట్టుకుని చూసినా ఇంట్లో పిల్లల సందడి లేకపోవటంతో మళ్లీ అదే ఒంటరితనం.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న