మనుషులు-ఆంతర్యాలు! - Sunday Magazine
close

మనుషులు-ఆంతర్యాలు!

- యశోదాకైలాస్‌ పులుగుర్త

అప్పుడే ఆఫీస్‌లోకి అడుగుపెట్టిన వసుధ యథాలాపంగా తనకి ఎదురుగానున్న కేబిన్‌లోకి దృష్టి సారించింది. ఆశ్చర్యం... వాణీ తలొంచుకుని ఏవో ఫైల్స్‌ తిరగేస్తూ కనబడింది. అరె... వాణీ డ్యూటీలో జాయిన్‌ అయిపోయిందే అనుకుంది. దాదాపు నెలరోజులు లాంగ్‌ లీవ్‌ తరువాత వాణీ డ్యూటీలో జాయిన్‌ అవ్వటం వసుధకి ఎంతో సంతోషాన్ని కలుగచేసింది. వాణీ తన చిన్నకూతురి పెళ్లని రెండు నెలలు సెలవు పెట్టింది. వసుధ కూడా ఆ పెళ్లికి హాజరైంది. పెళ్లి వైభవంగా చేశారు. ఏమాట కామాటే చెప్పుకోవాలి. వాణీ ఇద్దరాడపిల్లలూ బంగారు బొమ్మలే. చదువుల్లో సరస్వతీ పుత్రికలే... ఏరి కోరి వచ్చాయి మంచి సంబంధాలు. వాణీ ఎంత అదృష్టవంతురాలో అనుకోకుండా ఉండలేకపోయింది.

వాణీ తనూ, దాదాపు ముప్ఫై సంవత్సరాల నుండి ఒక ప్రభుత్వరంగ సంస్థలో ఒకే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరి స్నేహం ఎంతో అపురూపమైంది, అరమరికలు లేనిది. మనసు విప్పి మాట్లాడుకునేంత సాన్నిహిత్యం ఉంది. వాణీని పలకరిద్దాం అని అటువైపు నడిచేలోపే అటెండర్‌ తనని మేనేజర్‌గారు పిలుస్తున్నారని చెప్పడంతో, హ్యాండ్‌బ్యాగుని సీటులోనే వదిలేసి హడావిడిగా మేనేజర్‌ కేబిన్‌లోకి నడిచింది.
ఒక గంట తరువాత కానీ వాణీని పలకరించే తీరిక దొరకలేదు. తరువాత మెల్లగా వాణీ సీట్‌ దగ్గరకి వెళ్లి పలకరించింది.

‘‘అబ్బా, ఎన్నాళ్లకి వచ్చావే. నువ్వులేక బోర్‌ కొట్టేస్తోంది. అన్నట్లు మీ చిన్న అమ్మాయి రమ్య ఎలా ఉంది, అత్తవారింటికి వెళ్లిపోయిందా?’’
‘‘ఆ..!’’
‘‘మీ అత్తగారూ మామగారూ ఉన్నారా, మీ మరిదితో వెళ్లిపోయారా’’ అని అడిగేసరికి వెళ్లిపోయారని చెప్పింది.
‘‘ఏమిటే ఆ ముక్తసరి జవాబులు. నువ్వు డ్యూటీలో జాయిన్‌ అయ్యాక బోలెడన్ని కబుర్లు చెబుతావని నేను ఎదురుచూస్తుంటే, నువ్వేమిటే అలా డల్‌గా, ఏమీ కబుర్లే లేవన్నట్లుగా. రమ్య మీద బెంగపెట్టుకున్నావా?’’
లేదంటూ... మౌనంగా తల ఊపుతున్న వాణీ వైపు సాలోచనగా చూస్తూ... ‘‘సరేలే లంచ్‌టైమ్‌లో మాట్లాడుకుందాం’’ అంటూ వసుధ తన సీట్లోకి వెళ్లిపోయింది.
వసుధా వాణీ లంచ్‌టైమ్‌లో కలుసుకున్నారు. లంచ్‌ బాక్స్‌ తెరుస్తూ... వసుధే మొదలుపెట్టింది, ‘‘ఆఁ ఇంతకీ నీ మౌనానికి అర్థమేమిటే వాణీ?’’
‘‘ఏం ఉంటుందే వసూ, మా చిన్నమ్మాయి రమ్యకి పెళ్లైపోయిందని సంబరపడడం చూసి దేవుడు నాకు మరో చిన్న పరీక్ష పెట్టాడే’’ అంది.
‘‘అబ్బ... ఏంటో చెప్పవే, పరీక్షలంటావేంటి? అయినా నువ్వూ నేనూ ఈ జీవితంలో ఎన్ని పరీక్షలను ఎదుర్కోలేదూ? ఇంట్లో సమస్యలే కాకుండా, ఉద్యోగంలో కూడా ఎన్నిరకాల సవాళ్లను ఎదుర్కొన్నాం. నీకు నేనున్నాను వాణీ. నీ సమస్య ఎటువంటిదైనా దాన్ని నేను పరిష్కరిస్తాను’’ అనగానే వాణీ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కళ్లమ్మట నీరు ధారాపాతంగా కారిపోతోంది.

‘‘ఏయ్‌ పిచ్చీ... ఎందుకే ఆ దుఃఖం? చిన్న చిన్న సమస్యలకే ఇంత బాధ పడితే ఎలాగే? మిసెస్‌ శ్రీవాణి- అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసరుగారు ఏడవటమా... నోవే’’ అంటున్న వసుధ వైపు రోషంగా చూస్తూ... ‘‘ఏం, నేను మనిషిని కానా వసూ, నాకు సమస్యలు ఉండకూడదా?’’ అనగానే...

‘‘అబ్బ... కాదని ఎవరన్నారే బాబూ. మనిషివే, మహా మంచి మనిషివి కూడా’’ అంటూ నాటక ఫక్కీలో చేతులు జోడిస్తూ... వసుధ అన్న మాటలకు వాణీ పకపకా నవ్వింది.
‘‘హమ్మయ్య మామూలు మూడ్‌కి వచ్చావా, ఇప్పుడు చెప్పవే బాబూ నీ సస్పెన్స్‌తో చంపక’’ ‘‘మా ఆయన నన్ను వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోమంటున్నారే!’’

‘‘అవునా, మంచిదే కదా బాధ్యతలు కూడా తీరిపోయాయి... హాయిగా మీవారు చెప్పినట్లు తీసేసుకోవే’’ అంది వసుధ.

ఆ మాటలకు వాణీ కోపం ఉవ్వెత్తున లేచింది. ‘‘వసూ, నువ్వూ అలాగే అంటావని నేను ముందే ఊహించాను. ఇంతకీ మా ఆయన నామీద ప్రేమతో ఆ మాట అన్నారనుకున్నావా. లేదే బాబూ, మా మరిది దగ్గర ఉంటున్న మా అత్తగారినీ మామగారినీ తెచ్చుకుని మా దగ్గర ఉంచుకోవాలట. ఇన్నాళ్లూ నా ఉద్యోగం బాధ్యతల మూలాన వాళ్లు మా మరిది దగ్గరే ఉండిపోయారు. ఇప్పుడేమో ఇంకో అయిదేళ్లలో రిటైర్‌ అయిపోతాను కాబట్టి ఈ విధంగా వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోమని అంటున్నారు. మా అమ్మానాన్నల బాధ్యత పెద్ద కొడుకుగా నాదే కదా అంటున్నారు. బాధ్యతే, కాదనను... కానీ...’’

‘‘మరి అయితే ఏమిటే నీ సమస్యా?’’
‘‘అది కాదే, ఇది న్యాయంగా ఉందా చెప్పు. రెండు సంవత్సరాల క్రితం మావారిని- నేను వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుంటాను, మా అమ్మ ఒక్కతీ వైజాగ్‌లో పనిమనిషి సాయంతో బతుకుతోంది. ఒక్కగానొక్క కూతురిగా మా అమ్మను చూసుకోవడం నా బాధ్యత కదా... అని ఒక విధంగా బతిమాలానే.

నీకు తెలుసుగా అమ్మకు ఎనభై నాలుగు సంవత్సరాలు నిండాయి. అమ్మకు నేను లేట్‌గా పుట్టాను. నాన్నగారు నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు చనిపోతే అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించి ప్రయోజకురాలిని చేసింది. నేను పెళ్లి చేసుకుంటే నిన్ను ఎవరు చూస్తారమ్మా... పెళ్లి చేసుకోనంటే తను చచ్చినంత ఒట్టని పెళ్లికి ఒప్పించింది. ఈ వయసులో ఏదో నాన్నగారు కట్టించిన ఇంటిలో తనకొస్తున్న పెన్షన్‌తో బతుకుతోంది. ఇంకా ఎన్నాళ్లని అమ్మని అలా వదలమంటావు వసూ.

అప్పుడేమో అమ్మను వైజాగ్‌ నుండి తెచ్చుకుని మనం చూసుకుందామంటే బోల్డన్ని అభ్యంతరాలు... ‘మీ అమ్మగారిని తెచ్చుకుని మనదగ్గర పెట్టుకుంటే మా అమ్మావాళ్లూ, తమ్ముడువాళ్లూ, చూసేవాళ్లూ ఏమనుకుంటారు. అయినా మన రమ్య పెళ్లి కావాలీ, ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి కదా...’ అని దాటవేశారు.
‘‘అయితే ఏంటే వాణీ! నీ భర్త శ్రీరామ్‌ స్వార్థపరుడని నీ అభిప్రాయమా?’’

‘‘అవునే, ముమ్మాటికీ! లేకపోతే ఏంటే వసూ? నేను అప్పటికీ అన్నాను, మామయ్యగారినీ అత్తయ్యనూ కూడా మన దగ్గరే పెట్టుకుని చూసుకుందామని. అప్పుడేమీ మాట్లాడలేదు. ఇప్పుడేమో, చిన్నదాని పెళ్లయి పోయింది కదా అంటూ నన్ను వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోమనీ అత్తయ్యనూ మామయ్యనూ తీసుకుని వచ్చేస్తాననీ ఒత్తిడి చేస్తున్నారు’’ అంటూ కళ్ల నీళ్లు పెట్టుకుంది.

వాణీ బాధలో ఎంతో అర్థం ఉందనిపించింది వసుధకు. వాణీ అమ్మగారు వసుధకు బాగా తెలుసు. మంచి వ్యక్తిత్వం, ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి. కష్టం అంటే ఏంటో తెలిసిన మనిషి. అప్పుడప్పుడూ వాణీ వెళ్లి తన తల్లి దగ్గర రెండు మూడురోజులు ఉండి వస్తుందే తప్ప ఎప్పుడూ ఆవిడ కూతురింట ఒక పదిరోజులైనా ఉన్న పాపాన పోలేదు. వాణీకి- పెళ్లికి ముందు ఎన్నో సంబంధాలు వచ్చినా, తోబుట్టువులెవరూ లేరనీ, తల్లి బాధ్యత కూతురు మీద పడుతుందనీ చాలామంది వాణీ అమ్మగారి ముందే అనడం, సంబంధాలన్నీ వెనక్కి వెళ్లిపోవడంతో ఆవిడ అప్పుడే మనసులో దృఢంగా నిశ్చయించుకుంది- కూతురికి బరువుగా ఉండకూడదని.

పాపం వాణీ... అనుకుంది వసుధ. దీనికి పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తూ మెల్లిగా వాణీని ఊరడించి ధైర్యాన్ని చెప్పింది.
ఒక రెండు వారాల అనంతరం రాత్రి భోజనాల సమయంలో వాణీ శ్రీరామ్‌తో మెల్లిగా చెప్పింది... తను వైజాగ్‌ బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాననీ, రెండు రోజుల్లో వెళ్లి జాయిన్‌ అవ్వాలనీ.
శ్రీరామ్‌ ఒక్క నిమిషం తెల్లబోయాడు.

‘‘అదేంటి వాణీ, నువ్వు ఈ నిర్ణయం తీసుకునే ముందు మాట మాత్రంగా కూడా నాతో అనలేదు. ఇప్పుడెలా? నాకు ట్రాన్స్‌ఫర్‌ కుదరదు వైజాగ్‌కు. నిన్ను నేను వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోమంటే, నువ్వు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోవడమేంటీ? ఇక్కడొకళ్లం అక్కడొకళ్లమా... ఇప్పుడు ఈ వయసులో! పోనీ మా అమ్మానాన్నల్ని తెచ్చుకుందామంటే అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఆమె ఏ పనీ చేయలేదు... నాకు భోజనం ఎలా? వంట రాదే నాకు?’’

మనసు చివుక్కుమంది వాణీకి... ఎన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేసినా ఇంతే. ఇంట్లో భార్య లేకపోతే వంట ఎలా అన్నదే సమస్య మగవాళ్ళందరికీ. కానీ తన సమస్య వేరు. శ్రీరామ్‌కు అర్థం కాదు. నిజానికి వసుధ సహాయం చేయకపోతే తను వైజాగ్‌ వెళ్లగలిగేదా? మేనేజ్‌మెంట్‌తో ఒక రకంగా ఫైట్‌ చేసి మరీ వైజాగ్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించింది.

తను ఏ ఒత్తిడికీ లొంగిపోకూడదు. ఇప్పుడు తనకూ శ్రీరామ్‌కూ మధ్య ఈ విషయంలో మనస్పర్థలు వచ్చినా పట్టించుకోకూడదు. ఇద్దరూ కొద్ది సంవత్సరాల తేడాలో అరవై ఏళ్లను చవి చూడబోతున్నారు. తనకు ప్రస్తుతం తన తల్లి ముఖ్యం. ఎవరూ లేకుండా ఆవిడ అనాథలా పోతే, ఆ బాధను భరించే శక్తి తనకు లేదు. ‘నేను అమ్మకు ఇవేమీ చెప్పను. వైజాగ్‌కు బదిలీ అయిందని మాత్రమే చెబుతాను’ అని నిశ్చయించుకుంది వాణీ. వైజాగ్‌కు వెళ్లగానే శ్రీరామ్‌కు మెయిల్‌ చేసింది...

‘క్షమించండి, ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు. చెప్పానుగా అమ్మను ఈ వయసులో ఒంటరిగా వదలలేను. అలా అని మీకు దూరంగానూ ఉండలేను. మీకు అత్తయ్యనీ మామయ్యగారినీ చూసుకోవలసిన బాధ్యత ఎంత ఉందో, ఒక్కగానొక్క కూతురిగా నాకూ మా అమ్మ బాధ్యత ఉంది.

మీతో నా మనసులోని బాధను ఎన్నోసార్లు విడమర్చి చెప్పాను. కనీసం ‘అవును వాణీ, చూద్దాం’ అని గానీ, ‘ఆలోచిద్దాం’ అని గానీ ఒక చిన్న సానుభూతి మాట కూడా మీ నోట్లోనుండి వచ్చేది కాదు. అయినా ఓపిగ్గా ఎదురుచూశాను. మన పెళ్లై ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ ఒంటరిగా తన ఇంట్లో కాలం గడుపుతోంది. కనీసం ఈ చివరిరోజుల్లో అయినా అమ్మని నా దగ్గరుంచుకుని ఆవిడకి మనశ్శాంతిని ఇవ్వాలనుకున్నాను.

మీ తల్లిదండ్రులని పెద్ద వయసులో చూసుకోవాలనీ వాళ్ల ఋణం తీర్చుకోవాలనీ మీరెంత తపించిపోతున్నారో అలాగే నాకూ మా అమ్మను చూసుకోవాలని ఉండదా? పైగా తోబుట్టువులు సైతం లేని దౌర్భాగ్యురాలిని. అమ్మ ఎవరూ లేని అనాథలా ఒక్కతీ క్షణాలను లెక్కించుకుంటూ బతకడం నేను సహించలేకపోతున్నాను శ్రీరామ్‌! నా సుఖాలూ సంతోషాలూ ఇప్పుడు అనుభవిస్తున్న నా జీవితం- అంతా అమ్మదే! నేను సంపాదిస్తున్న జీతం, ఈ సంపద- అన్నీ మా అమ్మ నన్ను కష్టపడి చదివించిన మూలానే కదా. అందుకే నా వంతు సాయం అమ్మకు ఇప్పుడు నేను చేయాలని అనుకుంటున్నాను. మీరు వద్దని అడ్డు చెప్పడం ఎంత వరకూ న్యాయం శ్రీరామ్‌?

మన ఇంట్లోనే కాదు ఎక్కడయినా ఇంతే. చెల్లెళ్ల పెళ్లిళ్లూ, తమ్ముళ్ల చదువులూ వంటి బాధ్యతలు ఉన్న మగవాడు తన పెళ్లి మానుకోనక్కరలేదు. తనతో సహకరించే భార్యని వెతుక్కోవచ్చు. నా కుటుంబాన్ని నీదిగా భావించాలని ముందరే మాట తీసుకుంటాడు. కానీ అదే పరిస్థితిలో ఉన్న ఒక అమ్మాయి ‘నా మీద ఆధారపడేవాళ్లు ఉన్నారు. వాళ్ల బాధ్యత నాదే’ అని చెబితే మాత్రం భయపడిపోతారు. అటువంటి ఆడపిల్లలకు పెళ్లి అవడం కూడా చాలా కష్టం. ఒకోసారి ఇటువంటి సమస్యలతో  పెళ్లి కూడా మానుకుంటారు కొందరు... ఎందుకంటే సహకరించే భర్త దొరుకుతాడన్న నమ్మకం లేక.

‘నేను మీ భార్యగా ఇంటా బయటా, అన్ని బాధ్యతల్లో మీకు మనస్ఫూర్తిగా సహకరించాను’ అని పదే పదే చెప్పడం నాకు ఇష్టం లేదు. మీకు నా సమస్య ఏంటో పూర్తిగా అర్థమైతే- మనం అందరం ఒకేచోట కలిసి ఉండే ఏ ఏర్పాటు చేసినా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. నేను ఎప్పటికీ మీ వాణీనే శ్రీరామ్‌!’

మెయిల్‌ చదివిన శ్రీరామ్‌కి వాణీ దీనమైన ముఖం కళ్లముందు కదలాడింది. నిజమే, వాణీ లేకపోతే తను ఈ స్థితిలో ఉండేవాడే కాదు... తన చెల్లెళ్ల పెళ్లిళ్లూ, తమ్ముడి చదువూ వాణీ సహకారం లేకపోతే నిర్వహించగలిగేవాడే కాదు... ఇంత చేసినా వాణీ తనను కోరిందేంటి? వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి కాస్తంత ఆసరాగా ఉండాలనే కదా! తను వాణీ పట్ల ప్రవర్తించిన తీరుకి మనసులో పశ్చాత్తాపం కలగడం ప్రారంభమైంది... వెంటనే రిప్లై పంపాడు... ‘వాణీ, నిన్ను బాధపెట్టినందుకు వెరీ సారీ... ఈ శనివారం విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో నీ దగ్గరకు బయలుదేరి వస్తున్నాను. అన్నీ నీ ఇష్టప్రకారమే జరుగుతాయి. మిగతా విషయాలన్నీ నీ సమక్షంలో’ అంటూ!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న