నిష్కృతి - Sunday Magazine
close

నిష్కృతి

- వంకమామిడి వెంకటరావు

‘‘ఏమండోయ్‌, మీకు ఫోను’’ లోపల నుంచి పెద్దగా అరిచింది సరోజ.

‘‘ఆఁ వస్తున్నా’’ ఎవరబ్బా ఇంత పొద్దున్నే ఫోను చేసింది అనుకుంటూ భార్య అందించిన ఫోను అందుకుని ‘‘హలో, ఎవరు?’’ అన్నాడు.

‘‘బావగారూ, నేను మాధవిని మాట్లాడుతున్నాను.’’

‘‘చెప్పమ్మా, అందరూ క్షేమమేనా?’’ అడిగాడు సంజప్ప.

‘‘నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానండీ, పాప డెలివరీకి అని వచ్చాను. బెంగళూరులో మీ తమ్ముడికీ, కిషోర్‌కీ కరోనా వచ్చింది. వాడికి ఓ మోస్తరుగా ఉన్నా, ఆయనకి సీరియస్‌ అవటంతో హాస్పిటల్లో చేరారు. ఆయనకి ఎలా ఉందో కూడా చెప్పేవాళ్లు లేరు. పిల్లాడు గదిలోంచి బయటకు రాలేని పరిస్థితులు. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఏం చేయాలో తోచక మీకు ఫోను చేశాను.’’

‘‘అలాగా! నువ్వేమీ కంగారు పడకు. వెంటనే నేనూ సరోజా బయలుదేరి బెంగళూరు వెళతాం. దగ్గరుండి చూసుకుంటాం. బెంగళూరు వెళ్లగానే నీకు ఫోను చేస్తాను, సరేనా’’ అంటూ సంజప్ప మరదలికి ధైర్యం చెప్పాడు.

ఫోనులో సంభాషణ విన్న సరోజకి కొంత అర్థం అయి కొంత అర్థంకాక ‘‘ఏం జరిగిందండీ?’’ అని భర్తని అడిగింది.

‘‘కేశవులుకీ, కిషోర్‌కీ కరోనా వచ్చిందట. కేశవుల్ని హాస్పిటల్లో చేర్పించారట. మాధవి అమెరికాలో ఉంది పాప దగ్గర. బట్టలు సర్దు. మనం వెంటనే బయలుదేరి బెంగళూరు వెళ్లాలి.’’

వర్క్‌ ఫ్రమ్‌ హోం కావటంతో గదిలో పని చేసుకుంటున్న వాళ్ల పెద్ద అమ్మాయి సరిత హాల్లో పెద్ద పెద్దగా ఏవో మాటలు వినపడితే బయటకు వచ్చింది.

‘‘సరితా... బాబాయికీ కిషోర్‌కీ కరోనా వచ్చిందట. బాబాయిని హాస్పిటల్లో చేర్పించారట. పిన్నేమో అమెరికా వెళ్లింది కూతురి డెలివరీకి. నేనూ అమ్మా బెంగళూరు వెళుతున్నాం. వీలైనంత తొందరలో వస్తాం. నువ్వు నానమ్మను జాగ్రత్తగా చూసుకో. వాళ్లకి కరోనా వచ్చిన సంగతి నానమ్మకు చెప్పొద్దు. కంగారు పడుతుంది’’ కూతురితో అన్నాడు సంజప్ప.

సంజప్ప, సరోజ బస్టాండుకి వచ్చి బెంగళూరు బయలుదేరటానికి రెడీగా ఉన్న బస్సు ఎక్కారు. యెలహంకలో దిగి నేరుగా చెన్నప్ప ఇంటికి వెళ్లారు.

అన్నదమ్ముల మధ్య పెద్దగా రాకపోకలు లేవు. రాకపోకలు ఉన్నప్పుడే మనుషుల మధ్య అనుబంధాలూ, ఆప్యాయతలూ ఉంటాయి. ఆ కారణంగా కిషోర్‌కి పెదనాన్న కుటుంబంతో పెద్దగా అనుబంధం లేదు. అయినా కిషోర్‌కి ఇవాళ వాళ్లను చూడగానే అప్పటిదాకా ఒక్కడినే ఉన్నానన్న దిగులు పోయినట్లు అనిపించింది.

‘‘కిషోర్‌, నువ్వు భయపడకు. మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడే హాస్పిటల్‌కి వెళ్లి ఒకసారి డాక్టర్‌తో మాట్లాడి వస్తాను.’’

సంజప్ప హాస్పిటల్‌కి వెళ్లినా తమ్ముడిని కలవటానికి కుదరలేదు కానీ డాక్టర్‌తో మాత్రం మాట్లాడగలిగాడు.

‘‘మీ తమ్ముడు చాలా లేటుగా వచ్చారండీ హాస్పిటల్‌కి. అయినా మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఇక మీ అదృష్టం.’’

‘‘ఒక్కసారి మా తమ్ముడితో మాట్లాడాలని ఉంది. వీలవుతుందాండీ?’’ ఆశగా అడిగాడు సంజప్ప.

‘‘ప్రస్తుతం మీ తమ్ముడు వెంటిలేటర్‌ మీద ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడటం కుదరదు.’’

‘‘నేనూ నా భార్యా వచ్చాం. వాడికీ వాడి కొడుక్కీ తగ్గేవరకూ ఇక్కడే ఉంటాము అని మాత్రం వాడి చెవిన వేయండి చాలు’’ ప్రాధేయపడుతున్నట్టు అడిగాడు.

‘‘సరే చెబుతాం లెండి!’’

ఇంటికి వచ్చిన తర్వాత సంజప్ప మాధవికి ఫోన్‌ చేసి తమ్ముడి ఆరోగ్య పరిస్థితి తెలియచేశాడు.

అప్పటినుంచీ ప్రతిరోజూ హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్‌తో మాట్లాడి తమ్ముడి ఆరోగ్యం గురించి తెలుసుకోవటం, మాధవి కంగారు పడకుండా ఏరోజుకారోజు తమ్ముడి పరిస్థితి చెప్పటం చేస్తున్నాడు.

పెదనాన్న వాళ్లు వచ్చిన తరువాత కిషోర్‌కి మనోధైర్యం పెరిగింది. వేళకి ఇంటి భోజనం, పెదనాన్నా పెద్దమ్మా చూపించే ఆప్యాయతా, డాక్టర్‌ చెప్పిన మందులు వేళ తప్పకుండా వాడటం... వీటన్నింటితో కిషోర్‌ త్వరగా కోలుకుంటున్నాడు.

రోజూలాగే సంజప్ప డాక్టర్‌ని కలిసినప్పుడు ‘‘మీరు అదృష్టవంతులు, మీ తమ్ముడి ఆరోగ్యం మెరుగుపడటంతో ఐసియూ నుంచి రూముకి తరలిస్తున్నాము. అంతా బాగుంటే రెండు మూడు రోజులలో డిశ్చార్జ్‌ చేస్తాము. మీరు ఫోను చేసి మాట్లాడొచ్చు. కలవటానికి కుదరదు. చాలా బలహీనంగా ఉన్నాడు. ఎక్కువసేపు మాట్లాడొద్దు’’ అని చెప్పారు.

అన్నయ్య గొంతు ఫోనులో వినపడంగానే కేశవులు విపరీతమైన భావోద్వేగానికి లోనై ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయాడు.

తమ్ముడి పరిస్థితి అర్థం చేసుకున్న సంజప్ప ‘‘కేశవా... ఇంక భయం లేదురా. దేవుడి దయవలన పెద్ద గండం నుంచి బయట పడ్డాం. రాత్రికి మాధవి చేత ఫోను చేయిస్తాను. కిషోర్‌ కూడా బాగున్నాడు. నువ్వు సంతోషంగా ఉండు. ఎక్కువసేపు మాట్లాడించొద్దని అన్నారు డాక్టర్‌. ఉంటాను సరేనా!’’ ఫోను పెట్టేశాడు సంజప్ప.

రోజు రోజుకీ కేశవులు ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండటంతో డాక్టర్స్‌ అతణ్ణి డిశ్చార్జ్‌ చేయటానికి నిశ్చయించుకున్నారు.

ఆ వార్త తెలియగానే సంజప్పా, సరోజా, కిషోర్‌ హాస్పిటల్‌కి వెళ్లారు.

‘‘పేషెంటుకి రెండు మూడు నెలలు చాలా నీరసం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్తి రెస్టు ఇవ్వాలి. మంచి బలవర్ధకమైన ఆహారం పెట్టండి. ఏదన్నా ప్రాబ్లమ్‌ వస్తే ఆలస్యం చేయకుండా మా దగ్గరకు తీసుకురండి. రాసిన మందులు క్రమం తప్పకుండా వాడండి’’ డాక్టర్‌గారు ముగ్గురినీ తన రూములోకి పిలిచి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు.

కేశవులు అన్నయ్యను చూడగానే చిన్న పిల్లాడిలాగా భోరున ఏడ్చేశాడు. సంజప్పకు కూడా కళ్లలో నీళ్లు తిరిగాయి.

డిశ్చార్జ్‌ ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి చేసుకుని ఇంటికి చేరేటప్పటికి చీకటి పడింది.

సంజప్ప, సరోజలకు సూర్యోదయానికి ముందే లేచి కాఫీ తాగటం అలవాటు. కేశవులు, కిషోర్‌ ఇంకా లేవలేదు.

‘‘సరోజా, మనం బెంగళూరు వచ్చి అప్పుడే పది రోజులు దాటిపోయింది. ఊళ్లో సరిత ఒక్కతే అన్ని పనులూ చేసుకోలేక సతమత మవుతుంటుంది. మనం వచ్చిన పని కూడా అయిపోయింది. ఊరికి వెళ్లిపోతాం అని కేశవులుకి చెబుదామని అనుకుంటున్నాను. నువ్వేమంటావు?’’ కాఫీ తాగుతూ అడిగాడు సంజప్ప.

‘‘అవును! ఫోను చేసినప్పుడల్లా అమ్మాయి ఎప్పుడొస్తున్నారు అని అడుగుతూనే ఉంది. కానీ మనం వెళ్లిపోతే వీళ్లు మళ్లీ ఆ హోటల్‌ భోజనం మీదే ఆధారపడాలి. అవీ ఇవీ తిని ఒకరోజు అరిగీ, ఒకరోజు అరక్కా ఏం కొత్త రోగాలు తెప్పించుకుంటారో! మాధవికి అమెరికా నుండి రావటానికి కనీసం ఒక నెలన్నా పడుతుందట. ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరినీ వదిలేసి వెళ్లటం బావుంటుందా?’’

‘‘నువ్వన్నది కూడా నిజమే! ఏం చేద్దాం మరి?’’

‘‘ఇద్దరినీ మనతో పాటూ మన ఊరు రమ్మంటే ఎలాగుంటుంది. ఇంటి భోజనం, కొత్త వాతావరణంలో నలుగురి మధ్య ఉంటే వాళ్లకి కూడా మంచిది. ఈ లోపల మాధవి రానే వచ్చేస్తుంది. మనకి కూడా అత్తమ్మనీ పిల్లనీ వదిలి ఉండాల్సి వచ్చిందని బెంగ ఉండదు. ఏమంటారు?’’

‘‘నీ ఆలోచన బాగుంది. కేశవులుతో మాట్లాడుతాను.’’

*              *              *

కేశవులు అప్పుడే గదినుంచి బయటకు వచ్చాడు.

‘‘రాత్రి బాగా నిద్ర పట్టేసింది. వదిన పెట్టే భోజనంతో రోజురోజుకీ ఆరోగ్యం మెరుగుపడుతోంది’’ అన్నాడు.

‘‘అవును నాన్నా, కరోనా వచ్చి తగ్గిన వాళ్లకి చాలా రోజులు నీరసంగా ఉంటుందని మా ఫ్రెండ్స్‌ చెప్పారు. కానీ పెద్దమ్మ భోజనం తింటుంటే నీరసమనే మాటే లేదు’’ అప్పుడే మేడ దిగి వచ్చిన కిషోర్‌ అన్నాడు.

‘‘ఆపండిరా మీ పొగడ్తలు. అరేయ్‌ కేశవా! అప్పుడే మేమొచ్చి పది రోజులు దాటిపోయింది. సరిత ఒక్కతే అన్ని పనులూ చేసుకోలేక అవస్థ పడుతుంది. మీ ఇద్దరి ఆరోగ్యం కూడా ఒక దారికి వస్తోంది. అందుకే ఊరికి వెళ్లిపోదాం అని మీ వదినతో అంటే- ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న వాళ్లని వదిలి వెళ్లటం భావ్యం కాదు, బయట భోజనంతో ఏమవుతుందో, మిమ్మల్ని కూడా మాతో పాటు మన ఊరు తీసుకువెళదాం అంటోంది. నాకూ ఆ ఆలోచన బాగుందనిపించింది. నువ్వేమంటావు?’’

‘‘పెదనాన్నతో పాటు వాళ్ల ఊరు వెళదాం నాన్నా. నాకూ ప్లేస్‌ ఛేంజ్‌ కావాలి అనిపిస్తోంది. ఎలాగూ వర్క్‌ ఫ్రమ్‌ హోం కాబట్టి నాకు ఎక్కడైనా ప్రాబ్లమ్‌ లేదు’’ హుషారుగా అన్నాడు కిషోర్‌.

‘‘అది మావూరు కాదురా! మన ఊరు’’ నవ్వుతూ అన్నాడు సంజప్ప.

అనుకోవటం ఏమిటి, అరగంటలో తయారయి కార్లో అనంతపురానికి బయలుదేరారు.

పెద్ద కొడుకుతో పాటూ చిన్న కొడుకూ, మనవడూ కూడా వస్తున్నారని విన్న ముసలావిడ వాళ్లకోసం ఎదురుచూస్తూ ఇంటి బయట అరుగుమీదే కూర్చుంది.

కారు దిగి వచ్చిన కొడుకునీ మనవడినీ దగ్గరకు తీసుకుని ‘‘ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి... చాలా సంతోషంగా ఉందిరా. కోడలు రాలేదా? పోనీలే వీలు పడి ఉండదు, లేకపోతే వచ్చేదేగా!’’ అంది.

‘‘లేదమ్మా, పాప పురిటికి అమెరికా వెళ్లింది. అందుకే రాలేకపోయింది’’ సమాధానమిచ్చాడు కేశవులు.

‘‘అలానా! అంటే నేను తొందరలో తాతమ్మని కాబోతున్నాను అన్నమాట. చాలా సంతోషంరా. నాకేదో అయిపోతుందని చెడువార్తలు ఎటూ చెప్పటం లేదు, కనీసం శుభవార్తలైనా చెప్పండిరా’’ అంది నవ్వుతూ.

‘‘చాలారోజుల తరువాత చూశాను అమ్మ ఇంత హుషారుగా ఉండటం’’ అన్నాడు సంజప్ప.

ఇదివరకు ఎప్పుడొచ్చినా ఎందుకు వచ్చాంరా భగవంతుడా అన్నట్టు ఉండేది కేశవులుకి. తప్పనిసరి అయితే తప్ప ఇక్కడకు వచ్చేవాడు కాదు. ఉదయం లేవగానే బాత్‌రూమ్‌ మొదలుకుని రాత్రి ఏసీ లేని బెడ్‌రూమ్‌లో పడుకునే వరకూ అన్నీ సమస్యలే. ఉన్న రెండు మూడు రోజులూ ముళ్లమీద కూర్చున్నట్టు ఉండేవాడు. అదే ఇవాళ ఇంట్లో అడుగు పెడుతుంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందంతో మనసు పరవశించింది అతనికి.

లోపల పని చేసుకుంటున్న సరిత బయటకి వచ్చి బాబాయినీ, కిషోర్‌నీ నవ్వుతూ పలకరించింది. ఆమెకు బాబాయి మీదా, ఆయన కుటుంబ సభ్యుల మీదా రక్త సంబంధీకుల మధ్య ఉండే ప్రేమా, అభిమానం అంటూ ఏమీ లేవు. అలా అని ద్వేషమూ లేదు. బాబాయి, నాన్నకు తమ్ముడు అనే ఒకే ఒక కారణంతో అతనికి గౌరవం ఇస్తుంది.

‘‘అన్నయ్యా, చిన్నది ఏదిరా?’’

‘‘కాలేజీ, ట్యూషన్స్‌తో బిజీగా ఉండి వాళ్ల అమ్మమ్మా, మామయ్యా ఎప్పుడు రమ్మన్నా పాపం దానికి వెళ్లటం కుదిరేది కాదు. ఇప్పుడు అవేమీ లేవుగా, అందుకే వెళ్లింది.’’

ముసలావిడ పక్కనే కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తుంటే కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు. తర్వాత కూడా ఆవిడ ఏదో చెబుతూనే ఉంది.

‘‘వినేవాళ్లు ఉండాలే గానీ అమ్మ రాత్రంతా ఏవో కబుర్లు చెబుతూనే ఉంటుంది. ఇక పడుకుందాం. రేపు మాట్లాడుకోవచ్చు. కేశవా, నీకు ఆ గదిలో పడక ఏర్పాటు చేశాం. కిషోర్‌ మాతోపాటూ హాల్లో పడుకుంటాడు. వెళ్లి రెస్టు తీసుకో.’’

కేశవులు గదిలోకి వెళ్లి పడుకున్నాడు. పడు కున్నాడని మాటే గానీ ఎంత ప్రయత్నించినా కళ్లు మూత పడటం లేదు. మనసంతా గందరగోళంగా ఉంది. తెలియని అశాంతి నిద్రని దరిదాపులకి రానివ్వటం లేదు. పుట్టి పెరిగిన రోజులు కళ్లముందు మెదిలాయి.

*              *              *

ఆదినారాయణ అనంతపురానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరిలో నాలుగు ఎకరాల భూమి సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిన్నపాటి రైతు. అనంతపురం లాంటి వర్షపాతం చాలా తక్కువగా ఉండే ప్రాంతంలో నాలుగు ఎకరాలు ఉన్నాయన్న మాటేగానీ వాటిమీద వచ్చే ఆదాయం మటుకు అంతంత మాత్రమే. ఆదినారాయణకు ముగ్గురు పిల్లలు. సంజప్ప, కేశవులు, పద్మావతి.

చిన్నప్పటి నుంచీ ఆదినారాయణకు భూమిమీద తగని మమకారం. దాన్ని వదలకుండా సేద్యం చేసుకుంటూ జీవనం సాగించాలి అని కోరిక. కానీ అనుభవం మీద తెలుసుకున్నది ఏంటంటే ‘ఇటువంటి ప్రాంతంలో సేద్యం మనిషిని బతకనివ్వదు, చావనివ్వదు’ అని. అందుకే పిల్లలిద్దరినీ బాగా చదివించాలి అనుకున్నాడు. పొలం మీద వచ్చే ఆదాయంతో ఇల్లు గడవటమే కష్టంగా ఉంటే ఇక పిల్లల్ని సిటీలో ఉంచి చదివించటం సాధ్యం అయ్యేపని కాదు అని కుటుంబాన్ని అనంతపురానికి షిప్టు చేశాడు.

చౌకగా వస్తుందని ఊరి చివరలో ఖాళీ స్థలం బాగా ఉన్న ఒక ఇల్లు అద్దెకి తీసుకుని బ్యాంకులోనుతో అయిదు గేదెలు కొని పాల వ్యాపారం మొదలుపెట్టాడు. మనిషిని పెట్టుకుని ఊళ్లో సేద్యం మటుకు వదిలిపెట్టకుండా చేసుకుంటున్నాడు. రెండు మూడు ఏళ్లు గడిచేటప్పటికి పాల వ్యాపారం ఒక గాడిన పడింది. పిల్లలను చదివించగలను అనే ధైర్యం వచ్చింది ఆదినారాయణకు.

సజావుగా సాగిపోతున్న కుటుంబం మీద శరాఘాతంలా ఆదినారాయణ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దాంతో కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా కుప్పకూలినట్టు అయింది. కుటుంబ బాధ్యతలు నిండా ఇరవై ఏళ్లు రాని సంజప్పమీద పడ్డాయి.

వయసులో చిన్న అయినా నిర్ణయాలు తీసుకోవటంలో సంజప్ప పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోడు. నాలుగు రకాలుగా ఆలోచించి తల్లితో సంప్రదించి నిర్ణయం తీసుకునేవాడు.

కేశవులు చదువులో రాణిస్తుండటంతో అతని చదువు కొనసాగించటమే సబబు అని సంజప్ప తన చదువుకి స్వస్తి పలికాడు. తండ్రి లాగానే కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ చెల్లెలి పెళ్లి చేశాడు.

సంజప్పకు పెళ్లి అవటం, వెంట వెంటనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం జరిగిపోయింది.

తమ్ముడు బాగా పైకి వస్తాడు అని గట్టి నమ్మకం సంజప్పకు. చదువు విషయంలో కేశవులు ఏది అడిగినా కాదనకుండా సమకూర్చేవాడు.

కేశవులు బి.కామ్‌ అవగానే సిఏ చేస్తాను అంటే బెంగళూరులో చేర్పించాడు. కష్టపడి చదివి మూడేళ్లలో సిఏ కంప్లీట్‌ చేసి, ఓపెద్ద అకౌంటెంట్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. కేశవులు చురుకుతనం, పనిలో చూపిస్తున్న నిబద్ధత చూసి ఆయన తన కంపెనీలో భాగస్వామిగా చేర్చుకోవటమే కాకుండా అతనికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కేశవులు ఈ సంగతి ఇంట్లో చెప్పినప్పుడు వాళ్లకు కూడా ఏం అభ్యంతరం లేకపోవటంతో కేశవులు పెళ్లి జరిగిపోయింది. అదిగో అప్పటి నుంచీ అనంతపురానికి కేశవులు రాకపోకలు తగ్గిపోయాయి. కేశవులుకి ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు పుట్టారు.

చిన్నప్పటి నుంచీ డబ్బుల కోసం మొహం వాచి ఉన్నాడేమో కేశవులుకి డబ్బు అంటే కసి. చదువు ఎంత కసిగా చదివాడో డబ్బులు కూడా అంతే కసిగా సంపాదించటం మొదలుపెట్టాడు. అన్న గురించి పట్టించుకోవటం పూర్తిగా మానేశాడు.

అన్నయ్యా తల్లీ ఫోను చేసి ఏ పండక్కో పబ్బానికో రమ్మన్నా ఏదో వంక చెప్పి తప్పించుకునేవాడు. తన ఎదుగుదలకి వాళ్లు సంకెళ్లు అనుకున్నాడు.

ఒకరోజు సంజప్ప, కూతుర్ని తీసుకుని తమ్ముడింటికి వెళ్లాడు. ఆరోజు జరిగిన సంబాషణ గుర్తుకు వచ్చింది కేశవులుకి.

‘‘కేశవా! సరితకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది. నీకు తెలిసిన మంచి హాస్టల్‌ ఏదైనా ఉంటే చేర్పిద్దాం అని వచ్చాను’’ అన్నాడు సంజప్ప.

‘‘అన్నీ ఒకటే అన్నయ్యా. చూసేదేమీ లేదు. టైం వేస్టు. ఆఫీసుకు దగ్గరలో ఉన్న వాటిల్లో ఏదో ఒకటి చూసి చేర్పించేసేయ్‌...’’

ఎంత నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు తను!

అయినా అన్నయ్య ఏమన్నాడు... ‘‘నువ్వన్నది కరెక్టేరా. ఆఫీసుకు దగ్గరగా చూసుకుంటే సరిపోతుంది’’ అన్నాడు.

అదే తన స్థానంలో అన్నయ్య ఉంటే అలాగే మాట్లాడేవాడా...

‘‘అదేంటిరా! అక్కడో ఇక్కడో చేర్పిస్తానంటావూ. మా ఇల్లు లేదా. నీ కూతురు వేరూ, నా కూతురు వేరా ఏంటీ. నా దగ్గరే ఉంచుకుంటాను’’ అనేవాడు.

రెండు సంవత్సరాలు దాటిపోయింది సరిత ఉద్యోగంలో చేరి. తరువాత అన్నయ్య ఎన్నోసార్లు బెంగళూరు వచ్చి ఉంటాడు. అయినా ఎప్పుడూ తనింటికి రాలేదు.

కేశవులు మనసులో భీకర ప్రళయం.

తను ఎన్ని కష్టాల్లో ఉన్నా పొలం మీద వచ్చే ఆదాయంలో తనకు రావలసిన సగభాగాన్ని ప్రతి ఏడూ అన్నయ్య ఇచ్చేవాడు. తను సంపాదించే దానితో పోలిస్తే అది చాలా తక్కువ. అయినా ఏమాత్రం మొహమాటం లేకుండా తీసుకుంటూనే ఉన్నాడు.

కేశవులుకి తను ప్రవర్తించిన తీరు తలచుకునే కొద్దీ హృదయం భారమైపోతోంది.

సినిమాలో రీళ్లులాగా ఒకటి తరువాత ఒకటి కళ్లకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి జరిగిన సంఘటనలు.

కరోనా వచ్చినప్పుడు సొంత బావమరిదికి ఫోను చేసి చెబితే ఏమన్నాడు?

‘‘అయ్యో! అలానా, బ్యాడ్‌లక్‌. రిస్కు తీసుకోకండి బావగారూ. వెంటనే అంబులెన్స్‌ పిలిపించుకుని హాస్సిటల్లో జాయిన్‌ అవ్వండి. అందులో మీకు బీపీ, షుగర్‌ కూడా ఉన్నాయి. అవి ఉన్నవాళ్లకి కరోనా వస్తే చాలా డేంజరట. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితులు’’ అని చెప్పి చేతులు దులిపేసుకున్నాడు.

అదే అన్నయ్య తన సంగతి తెలియగానే ముందూ వెనుకా ఆలోచించకుండా తనతో పాటూ వదినను కూడా తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు.

‘మరి నువ్వు ఒక కుటుంబ సభ్యుడిగా ఏం చేశావు?’ అని అంతరాత్మ ఎదురుగా నుంచుని అడుగుతున్నట్టు అనిపించింది కేశవులుకి.

కేశవుల్ని జ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. హృదయంలో సంక్షోభం.

ఏదో ఒకటి చేయాలి. అప్పుడు గానీ ప్రశాంతంగా నిద్రపోలేడు. ఏం చేయాలి? ఆలోచించాడు... మెరుపులా తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. ఒక నిర్ణయానికి వచ్చాడు. అంతే స్విచ్చి వేసినట్టు నిద్ర ముంచుకొచ్చింది. బయట వాన తగ్గుముఖం పట్టింది.

*              *              *

తెల్లగా తెల్లారింది. కాలకృత్యాలు ముగించుకుని ఇంట్లోకి వచ్చేటప్పటికి అప్పుడే పిండిన పాలతో చేసిన ఫిల్టర్‌ కాఫీ అందించింది సరిత. ఒక సిప్‌ తాగాడు. ఆహా... ఎంత బాగుంది అనుకున్నాడు.

కేశవులు అనంతపురం వచ్చి పదిహేను రోజులైపోయింది. తండ్రీ కొడుకుల ఆరోగ్యం పూర్తిగా నార్మల్‌ అయింది. బెంగళూరు వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు.

‘‘అన్నయ్యా, చూస్తుండగానే పదిహేను రోజులు ఇట్టే గడిచిపోయాయి. బెంగళూరులో పనులన్నీ పెండింగులో పడిపోయాయి. వదిన పెట్టిన భోజనంతో నీరసం, గీరసం అన్నీ ఎగిరిపోయాయి. అందుకే రేపు బయలుదేరి వెళదాం అనుకుంటున్నాము. మాధవి కూడా తొందర్లోనే వస్తానంది’’ సాయంత్రం వేళ అందరూ కూర్చుని కాఫీలు తాగుతున్నప్పుడు చెప్పాడు కేశవులు.

‘‘అన్నయ్యా, వెళ్లేముందు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. సరిత బెంగళూరు వెళ్లవలసి వస్తే మటుకు మా దగ్గరే ఉండాలి. హాస్టల్‌ ప్రసక్తే లేదు. ఇవాళ్టి నుంచి సరిత బాధ్యత నాది. ఇంకోటి కూడా చెబుతున్నాను... సరితకు పెళ్లికొడుకుని చూడటం వరకే మీ వంతు, పెళ్లి చేయటం నా వంతు. ఒక్కపైసా కూడా మీరు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. మాధవితో సంప్రదించే ఈ నిర్ణయాలు తీసుకున్నాను. కాబట్టి మీకు ఆ సందేహం కూడా అక్కరలేదు. సరిత పెళ్లి కోసం దాచుకున్న డబ్బులతో రెండో దానిని బాగా చదివించండి. ఇంకోటి అన్నయ్యా... ఇకమీదట భూమి మీద వచ్చే ఆదాయం మొత్తం నీదే. నాకు ఒక్కపైసా కూడా వద్దు. నాన్నపోయిన దగ్గర్నుంచీ నువ్వూ, వదినా, అమ్మా ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇకనుంచి అయినా మీరు ఏలోటూ లేకుండా సుఖంగా ఉండాలని నా కోరిక. నేను చెప్పిన దానికి ఒప్పుకోకుండా, ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పించాలని చూస్తే మటుకు నా మనసు బాధపెట్టినవాళ్లు అవుతారు...’’ ఇంకా ఏదో చెప్పాలని తీవ్ర ప్రయత్నం చేశాడు కానీ కంఠం బిగుసుకుపోయింది. చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నాడు. లోపలి మాటలు లోపలే ఉండిపోయాయి. తలదించుకున్నాడు.

కాసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఎవరూ నోరు తెరిచి ఒక్కమాట మాట్లాడలా.

కేశవులు నెమ్మదిగా నడుచుకుంటూ గదిలోకి వెళ్లిపోయాడు. పొగిలిపొగిలి ఏడ్చాడు. మనసులో ఉన్న భారం అంతా దిగిపోయేలా ఏడ్చాడు. చివరికి ఆనందంతో ఏడ్చాడు. ఇప్పుడు అతని మనసంతా నిర్మలమయింది. కడిగిన ముత్యంలాగా ఉంది.

కేశవులు మనసులో ఎంత మధన పడుతున్నాడో సంజప్ప అర్థం చేసుకున్నాడు.

చేసిన తప్పు తెలుసుకుని తమని తాము సరి దిద్దుకోవాలని ఎవరైనా అనుకుంటే ఎవరు అడ్డుపడతారు, అడ్డుపడకూడదు కూడా... పశ్చాత్తాపానికి మించిన నిష్కృతి ఏముంది..!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న