తృప్తి - Sunday Magazine
close

తృప్తి

విజయారావు

ళ్యాణ మండపం ముందు క్యాబ్‌ ఆగింది. నేనూ మా ఆవిడా క్యాబ్‌ దిగి లోపలకు వెళ్లగానే..‘‘అక్కా, బాగున్నావా... నమస్కారం బావగారూ’’ అంటూ ఒకావిడ ఆప్యాయంగా పలకరిస్తూ, దగ్గరకు వచ్చి నా శ్రీమతి చేయి పట్టుకుని బంధువులున్న వైపుకు తీసుకుని వెళ్లింది. ప్రతి నమస్కారంగా తల ఊపి, వాళ్ల వెనకాలే నెమ్మదిగా అడుగులు వేశాను. ఇక చూడాలి ఆ ఆత్మీయ పలకరింపుల జడివాన...

‘‘ఏం వదినా, బాగున్నావా?’’

‘‘ఏం పిన్నీ, ఇంత ఆలస్యంగా వచ్చావేం?’’

‘‘అవునే అమ్మాయ్‌, ఇలా చిక్కిపోయావేమిటి?’’

‘‘అత్తా, నువ్వు వస్తేగానీ సందడి రాలేదు సుమా!’’

అలా రకరకాల పలకరింపులకు ఆనందంగా నవ్వుతూ నా శ్రీమతి ‘‘నేను బాగానే ఉన్నాను. మీరందరూ బావున్నారా?’’ అని వారి యోగక్షేమాలు విచారించి, అప్పుడు నా గురించి వెనుకకు తిరిగి చూసింది.

నేను మా ఆవిడ ఉన్న వైపు గబగబా అడుగులు వేశాను. అడపా దడపా నేను కూడా నా శ్రీమతితో పాటు వాళ్ల బంధువుల ఫంక్షన్‌లకు వెళ్లడం వలన అక్కడ ఉన్న చాలా మందికి నేను కూడా సుపరిచయస్తుడనే.

అక్కడ ఒక కుర్చీలో కూర్చుని తెలిసిన వాళ్లను పలకరించడం మొదలుపెట్టాను.

మా ఆవిడ చలాకీగా తిరుగుతూ, అందరినీ ఆత్మీయంగా పలకరించసాగింది.

‘‘అత్తా! ఏమిటి చాలా పాడైపోయావు? కిందటి సారి నిన్ను చూసినప్పుడు బాగానే ఉన్నావు కదా?’’ మా ఆవిడ పలకరింపు విని అటువైపు నా దృష్టి సారించాను.

ఒక ముసలావిడ బాగా చిక్కిపోయి ఉంది. ఆవిడ రాని నవ్వును ముఖం మీదకు తెచ్చుకునేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూ...

‘‘వయసు అయిపోతుంది కదే’’ అని నెమ్మదిగా చెప్పింది. పరీక్షగా మరోమారు ఆవిడను చూస్తేనే గానీ నేను కూడా గుర్తుపట్టలేకపోయాను. నా శ్రీమతి చెప్పినట్లు ఇంతకు ముందు ప్రతీ ఫంక్షన్‌లో పెద్దరికం తీసుకుని ఉత్సాహంగా తిరిగిన ఆవిడ ఇవాళ ఒక మూల కూలబడినట్లు కూర్చుని ఉంది.

‘‘ఎప్పుడూ చలాకీగా ఉండే నీలాంటి వారిమీద వయసు ప్రభావం చూపిస్తుందంటే నేను నమ్మనత్తా’’ అని నా శ్రీమతి నవ్వింది.

ఇంతలో పెళ్లి బాజాలు మోగటంతో అందరూ అక్షింతలు పట్టుకుని స్టేజ్‌ దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టారు.

‘‘అక్కా, కిందటి వేసవి సెలవులకు మీ ఇంటికి మా అమ్మాయి వచ్చినప్పుడు ఏం చెప్పావో, ఏం చేశావో, ఏమిటో అంతవరకూ పెళ్లి అంటే విముఖత చూపిన తను ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంది. అంతేకాదు సుమా! తన ప్రవర్తనలో కూడా చాలా మార్పు కనిపించింది. కోపం, తొందరపాటుతనం బాగా తగ్గించుకుంది. ఇప్పుడు తనకి మంచి సంబంధం కూడా కుదిరింది’’ అనందంగా చెప్పింది పెళ్లిలో మొదట పలకరించిన ఆవిడ.

‘‘చాలా మంచి కబురు చెప్పావ్‌’’ అంటూ ఆవిడ భుజం మీద ఆప్యాయంగా తట్టింది నా శ్రీమతి.

‘‘పిన్నీ, మా రెండో అబ్బాయి సరిగ్గా చదవడం లేదు. ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఎలా రాస్తాడో ఏమిటో?’’ బాధ వెళ్లగక్కుకుంది మరొకావిడ.

‘‘ఏం భయపడకు. నీకు ఏమాత్రం అనుమానం ఉన్నా పరీక్షలకు నెల రోజుల ముందు అబ్బాయిని మా ఇంటికి పంపించేయ్‌. బాబాయ్‌గారు కూడా తీరికగానే ఉన్నారు’’ భరోసా ఇచ్చింది నా శ్రీమతి.

దాంతో ఆవిడ ముఖం వికసించి, ఆనందంతో ‘‘థాంక్స్‌’’ చెప్పింది.

అందుకే అందరూ నా శ్రీమతిని బాగా ఇష్టపడతారు. తన దగ్గర ఏముంది ఏం చేయగలదూ అని ఎప్పుడూ ఆలోచించదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ధైర్యం చెప్పి తర్వాత తాను చేయగలిగిన సహాయం చేస్తుంది.

పెళ్లి అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనాల దగ్గర నా శ్రీమతి, వాళ్ల అత్తయ్య ఆరోగ్యం బాగోలేదనీ, ఉన్న ఒక్కకొడుకూ ఆవిడ పెన్షన్‌ డబ్బులు తీసుకుంటూ కూడా సరిగ్గా చూడటం లేదనీ బంధువులు మాట్లాడుకుంటుండగా విని ఆ సంగతి నాకు చెప్పింది.

భోజనాలు అయ్యాక నా శ్రీమతితో పాటూ నేనూ వాళ్ల అత్తయ్య దగ్గరకు వెళ్లి ‘‘బాగున్నారా పిన్నిగారూ?’’ అని ఆప్యాయంగా పలకరించాను.

‘‘దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాను బాబూ. మీరంతా బాగున్నారా?’’ ఆవిడ తిరిగి మా కుశలాన్ని విచారించింది.

‘‘అత్తా, ఇంతకాలం ఈయనకూ పిల్లలకూ క్యారేజీలు కట్టి కట్టి అలసిపోయాను. ఇప్పుడు పిల్లలు ఉద్యోగరీత్యా వేరే చోట ఉండడం, ఈయన రిటైర్‌ అవడంతో కొంత ఊపిరి తీసుకోగలుగుతున్నాను. ఈయనగారు ఇప్పుడు కూడా నన్ను సుఖపడనీయక, జిహ్వ చాపల్యంతో రోజుకొక రకం పిండివంట చేయమని సతాయిస్తున్నారు. నాకేమో కొత్తగా నడుము నొప్పి తోడైంది. పనిమనిషి ఉన్నా కూడా ఇల్లు చక్కదిద్దుకోలేక నానా అవస్థలూ పడుతున్నాను. ఇలాంటప్పుడు ఎవరైనా ‘నావారు’ అనుకునే వారు నా పక్కన సాయంగా నిలబడితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఒక నెల రోజులు మా ఇంటికి వచ్చి నాకు సాయంగా ఉండరాదూ?’’ నా శ్రీమతి వాళ్లత్తయ్య కుడిచేతిని తన రెండు చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకుని అర్థించింది.

నామీద అంత అభాండం వేసేసరికి నేను కంగుతిన్నాను.

‘‘నేనెప్పుడు నిన్ను అది చెయ్యమనీ ఇది చెయ్యమనీ సతాయించాను?’’ ఆశ్చర్యంతో ప్రశ్నించాను.

‘‘చూశావా అత్తయ్యా! ఇంటి విషయాలు బయటకు చెబితే ఈయనగారికి అస్సలు నచ్చదు’’ టపీమని జవాబిచ్చింది నా శ్రీమతి.

మా ఆవిడ సమయస్ఫూర్తికి మరొక్కసారి ఆశ్చర్యపోయే పరిస్థితి నాకు వచ్చింది. మా ఆవిడ మనస్సులో ఏదో ఉందనీ, అది నాకు అర్థమయ్యేదాకా ఆచి తూచి మాట్లాడాలనీ నిశ్చయించుకున్నాను.

‘‘పోనీ ఒక వంట మనిషిని పెట్టుకోలేకపోయావా?’’ నా శ్రీమతిని ప్రశ్నించింది వాళ్లత్తయ్య.

‘‘ఆ ముచ్చటా తీరిపోయింది. వంట మనిషిని పెట్టుకున్నాం. ఆవిడ ఏరోజూ సమయానికి వచ్చేది కాదు సరికదా, రాని రోజు కనీసం రాలేనని ఫోన్‌ కూడా చేసేది కాదు. ఏరోజు వస్తుందో, రాదో కూడా తెలియక ఆవిడ కోసం చూసి చూసి సమయం వృథా చేసుకుని, తర్వాత వంట పని చేసుకోవాలంటే చాలా చిరాకు వచ్చేది. ఎన్నిసార్లు తనకు పని చేసే పద్ధతి నేర్పినా కూడా తన పద్ధతిలోనే తను పని చేసేది. స్టౌ మంట ఎక్కువ పెట్టి గిన్నెలు మాడ్చేసి, స్టౌ చుట్టూ పదార్థాలు జల్లేసి, వంట సామాన్లు ఎక్కువగా వృథా చేసి, కాల్చుకుని తినేసేది అనుకో’’ తన గోడును వెలిబుచ్చుకుంది నా శ్రీమతి.

వంట మనిషి లేని మా ఇంట్లో ఇన్ని సీన్లు జరిగినట్లు కల్పించి చెప్పగలిగిన మా ఆవిడ మేధా శక్తిని చూసిన నాకు ఒక అగ్ర సినీ దర్శకుడు ఆ క్షణాన తనని పూనాడేమో అనిపించింది. వంట మనిషిని పెట్టుకుని సుఖపడమని పిల్లలు చదువుకునే రోజుల్లోనే నేను సలహా ఇచ్చినా, ‘‘మొక్కుబడిగా పనిచేసే వారి వంటలు రుచికరంగా ఎలా ఉంటాయండీ?’’ అయినా భర్తకూ బిడ్డలకూ వండి వార్చడం కూడా ఒక కష్టమైన పనా? మీరందరూ సంతృప్తిగా తింటే అంతకు మించిన ఆనందం నాకు మాత్రం ఏముంటుందండీ? శరీరానికి ఈ మాత్రం వ్యాయామం కూడా లేకపోతే ఎలా?’’ అని సున్నితంగా తను తిరస్కరించడం నాకు ఇంకా గుర్తుంది.

అబద్ధాలంటేనే అసహ్యించుకునే మా ఆవిడ తడుముకోకుండా ఇన్ని అబద్ధాలు ఆడుతుందంటే దానికి తిరుగులేని బలమైన కారణమేదో తప్పకుండా ఉండే ఉంటుందని నా మనసు ఒకపక్క చెబుతూనే ఉంది. సమయం వచ్చినప్పుడు తనే ఈ చిక్కుముడి విప్పుతుందిలే అని తన వాక్ప్రవాహానికి అడ్డు తగలకుండా మౌనంగా కూర్చున్నాను.

‘‘అయ్యో, అలా జరిగిందా? నేను వచ్చినా నీకు సుఖం ఉండదే. నా బరువు కూడా నువ్వే మొయ్యవలసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటే నెల రోజులు ఏమిటే ఒక సంవత్సరం పాటు వచ్చి ఉండేదాన్ని’’ బలహీనంగా చెప్పింది నా శ్రీమతితో వాళ్లత్తయ్య.

‘‘నీ అనుమానాలన్నీ పక్కన పెట్టు. మీ అబ్బాయితో కోడలితో మేం మాట్లాడతాం. నువ్వు మాతో వచ్చేసేయి’’ బలవంతంగా ఆవిడను ఒప్పించింది నా శ్రీమతి.

తర్వాత ఎవరూ పక్కన లేని సమయం చూసి ‘‘అత్తయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి. ఆవిడ బాగున్న రోజుల్లో మమ్మల్నందరినీ చాలా ఆప్యాయంగా చూసుకునేది. ఎన్నో కుటుంబాలకు పెద్దదిక్కుగా ఉండి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండేది. ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆవిడను ఒక నెలరోజులు పాటూ మనింట్లో పెట్టుకుని ఆవిడ ఆరోగ్యం బాగయ్యాక పంపిద్దామని అనుకుంటున్నాను. మనమేమాత్రం జాలితో ఆవిడను పిలిచామని తెలిసినా ఆవిడ రాదు. అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది’’ అని గుట్టు విప్పింది నా శ్రీమతి.

మెత్తంమీద ముగ్గురం కలిసి మా ఇంటికి వెళ్లిపోయాము.

‘‘ఏంటీ! ఇవాళ పులిహోరా, పాయసం కావాలా? రేపు దద్దోజనం, చక్రపొంగలి చేయాలా? చాలా బాగుంది మీ కోరికల లిస్ట్‌. నిండు చూలాలిగా ఉన్నప్పుడు నేను కూడా కోరలేదు ఇన్ని కోరికలు’’ వంటగదిలో నుండి మా ఆవిడ కేకలు విని నవ్వుకున్నాను.

ప్రతిరోజూ నా పేరు చెప్పి ‘‘అత్తా, ఇవాళ మీ అబ్బాయిగారు ఇది చేయమంటున్నారు, రేపు అది చేయాలంటున్నారు’’ అని రోజుకొక రకం పిండివంట చేసి ఆవిడతో ఆప్యాయంగా తినిపించేది నా శ్రీమతి.

మొదటిరోజు ఆవిడ చాలా సిగ్గుపడి సరిగ్గా తినకపోతే, నా శ్రీమతి అది కనిపెట్టి ‘‘అత్తా, నా వంటలు రుచిగా లేవా ఏంటీ?’’ అని పరిహాసమాడింది.

వెంటనే ఆవిడ ‘‘అయ్యో, అదేం లేదే తల్లీ... నీ వంటలకు వంకలు పెట్టేవారెవరే? ఒంట్లో కాస్త నలతగా ఉండడం వల్ల సరిగ్గా తినలేకపోతున్నాను అంతే’’ అని బదులిచ్చింది.

అప్పుడు నా శ్రీమతి ‘‘అత్తా, నువ్వు సరిగ్గా తినకపోతే నీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది?’’ అని బలవంతంగా ఆవిడతో అన్నీ తినిపించింది. ఆవిడ చీర కొంగుతో చెమర్చిన కళ్లను అద్దుకోవడం నా శ్రీమతి గమనించనట్లు నటించింది.

‘‘మీ అబ్బాయి గురకతో నాకు అస్సలు నిద్ర పట్టడం లేదత్తా’’ అని ప్రతి రాత్రీ ఆవిడతోనే పక్కగదిలో పడుకుని పాత విషయాలు అన్నీ గుర్తుకు తెచ్చి ఆవిడను సంతోషంలో తేలేటట్లు చేస్తుండేది.

వేసుకున్న మందుల కంటే, వేళకు తిన్న పౌష్టికాహారం, నా శ్రీమతి చూపించిన ఆప్యాయతానురాగాలకి, వాళ్లత్తయ్య ఆరోగ్యం నెలరోజుల్లో చాలా మెరుగైంది. ఆవిడే స్వయంగా నా శ్రీమతితో... ‘‘మా అబ్బాయిని ఇక రమ్మనవే, ఇంటికి వెళతాను. మనవలను కూడా చూసి చాలా రోజులైంది’’ అని కోరింది.

నా శ్రీమతి ఒప్పుకోకుండా ఇంకో రెండు వారాలైనా కనీసం ఉండాలని బలవంతం చేసింది.

అప్పుడు ఆవిడ చెమర్చిన కళ్లతో ‘‘దేవుడు నీకు ఎంత మంచి మనసును ఇచ్చాడే! నాకు సాయం చేయడానికే నువ్వు నన్నిక్కడకు తీసుకొచ్చావన్న సంగతి కొన్నాళ్లకు గానీ నాకు అర్థం కాలేదు సుమా! నీకు నడుం నొప్పి అనే వంకతో నన్ను తీసుకునివచ్చినా, మొత్తం పనంతా నువ్వే చేసుకున్నావు. మీ ఆయన పేరు చెప్పి రకరకాల పిండి వంటలు చేసి నాతో తినిపించావు. మీ ఆయన గురక పెడతాడు అని అబద్ధం చెప్పి రాత్రిళ్లు నా పక్కనే పడుకుని, తియ్యటి పాత జ్ఞాపకాలను గుర్తుచేసి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపావు. అనారోగ్యంతో బాధపడుతూ ఉండే నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించావు. నువ్వు చేస్తున్న పనులకు మంచి మనసుతో పూర్తి సహకారం అందిస్తున్న మీ ఆయనకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు. మీ ఇద్దరి రుణం ఎలాగైనా తీర్చుకునే భాగ్యం ఆ దేవుడు నాకు కలిగించాలని ప్రార్థిస్తున్నాను’’ అని చేతులు రెండూ జోడించింది.

‘‘తప్పత్తా... నీలాంటి పెద్దవారు దణ్ణం పెట్టకూడదు. మంచికీ మానవత్వానికీ ప్రతిరూపమైన మీతరం చేతుల్లో పెరిగిన వాళ్లం మేము. మీ తరంలోని మంచితనం ఎంతో కొంత మాకు మాత్రం ఒంటబట్టకూడదా ఏం? నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు, అదే పదివేలు’’ అంటూ ఆప్యాయంగా వాళ్లత్తయ్యను కౌగిలించుకుంది నా శ్రీమతి.

పది కాలాల పాటూ మీ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలి. మీరు చల్లగా ఉంటే పది కుటుంబాలని మీరు చల్లగా ఉండేటట్లు చేయగలరు’’ అని ఆప్యాయంగా ఆవిడ మమ్మల్ని దీవించింది.

ఈ దృశ్యం చూస్తున్న నాకు కూడా కళ్లు చెమర్చాయి.

మా ఆవిడ ఫోన్‌ చేసి వాళ్ల అత్త కొడుకుని పిలిపించింది. తల్లిలోని ఉత్సాహం ఆనందం చూసి అతను ఆశ్చర్యపోయాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత వాళ్ల అత్తయ్యను వంట గదిలోకి పనిమీద పంపి, నా శ్రీమతి ఆ అబ్బాయితో...

‘‘నిన్ను ఎంత ముద్దూ మురిపెంతో మీ అమ్మ పెంచిందో నాకు బాగా తెలుసు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆవిడకు పెన్షన్‌ డబ్బులు కూడా వస్తున్నాయి. అటువంటప్పుడు మీ అమ్మను నువ్వెంత బాగా చూసుకోవాలి? ఈ వయసులో వాళ్లకు కావలసింది పుష్కలమైన ప్రేమాభిమానాలు కానీ పంచభక్ష్య పరమాన్నాలు కావు. చీదరింపులూ, చీత్కారాలూ లేకుండా ప్రేమతో పచ్చడి మెతుకులు పెట్టినా ఆనందంతో పరవశించిపోతారు. మనిషి జీవించి ఉన్నప్పుడే మనం చేయగలిగింది చేసి వాళ్లను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. అంతేకానీ మనిషి జీవించి ఉన్నప్పుడు పట్టించుకోకుండా తర్వాత వాళ్లకు గుడి కట్టినా ప్రయోజనం లేదు. ఇంకోసారి మీ అమ్మ కంటతడి పెట్టిందని తెలిస్తే, నేనే కాదు, మీ అన్నయ్య కూడా ఊరుకోరు. ఇకనైనా ఆవిడను జాగ్రత్తగా చూసుకో’’ అని మెత్తగా చివాట్లు వేసింది.

‘‘పిల్లలను మా ఆవిడ అతి గారాబం చేసేస్తుందని అమ్మ పదే పదే హెచ్చరించడంతో, అమ్మకూ మా ఆవిడకూ అభిప్రాయ బేధాలు వచ్చి వాళ్ల మధ్య దూరం పెరిగింది. నా దృష్టికి ఇది కొంచెం ఆలస్యంగా వచ్చింది. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాను వదినా’’ అని సిగ్గుతో తల దించుకున్నాడు అతను.

ఒక మంచి పని చేశామన్న తృప్తి మా ఇద్దరికీ కలిగింది. ఎదురుగా గోడమీద అవతార్‌ మెహెర్‌బాబాగారి ఫోటో నవ్వుతూ కనిపించింది. ఆయన ఫోటో కింద రాసిన ‘ఇతరులను సంతోషపెట్టడం లోనే నిజమైన ఆనందం ఉంది’ అన్న మాటలను మరొక్కసారి మననం చేసుకున్నాను.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న