Gold Ornaments: వడ్డాణంలో నెక్లెస్‌! - Sunday Magazine
close

Gold Ornaments: వడ్డాణంలో నెక్లెస్‌!

వడ్డాణం లేకుండా పెళ్లి చేసుకోవడమా... అస్సలు కుదరదు అంటున్నారు ఈ తరం అమ్మాయిలు. నిజమే మరి, చేతుల నిండుగా గాజులు తొడిగి మెడలో బరువైన నగలెన్ని పెట్టినా నడుముకి వడ్డాణం లేకపోతే పెళ్లి అలంకరణ బోసిపోయినట్లే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో వడ్డాణం చేయించడం అంటే మాటలా... అందులోనూ వజ్రాలూ రత్నాలూ పొదిగి చేసినదైతే ఇక చెప్పేపనే లేదు. అందుకే ఇప్పుడు ఆ వడ్డాణాన్ని రెండు మూడు రకాలుగా పెట్టుకునేలా డిజైన్‌ చేస్తున్నారు నేటి డిజైనర్లు.

డ్డాణం... ఒకప్పుడు పెళ్లిళ్లలో అదీ ఎక్కువగా పెళ్లికూతురు ఒంటిమీద మాత్రమే ధగధగలాడే ఖరీదైన నగ. కానీ ఇప్పుడు బుడి బుడి నడకల పాపల నుంచి పిల్ల తల్లుల వరకూ అందరూ దాన్ని ఎంతో ఇష్టంగా పెట్టుకుంటున్నారు. అయితే వడ్డాణం మీద ఎంత ఇష్టమున్నా సంప్రదాయ పెళ్లి వేడుకల్లో తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లోనూ పెట్టుకోలేరు. అంటే- ఎన్ని లక్షలు పెట్టి చేయించుకున్నా దాన్ని లాకర్‌లో పూజించాల్సిందే. అందుకే ఒకే నగని మూడు నాలుగు రకాలుగా విడదీసి పెట్టుకునేలా తయారుచేసే ట్రెండ్‌ ఈమధ్య పెరుగుతోంది. అందులో భాగంగానే బెల్టులా కాకుండా వెడల్పాటి గొలుసులా చేసిన వడ్డాణాన్ని హారంగానూ వంకీగానూ కందోళిలానూ... ఇలా నాలుగు రకాలుగా పెట్టుకోగలిగేవి ఎప్పటినుంచో మార్కెట్లో ఉన్నాయి.

కానీ ఈమధ్య పెళ్లిళ్లలో వజ్రాలూ కెంపులూ పచ్చలూ పోల్కీలూ పొదిగి చేసిన బెల్టు వడ్డాణాల్ని పెట్టుకోవడానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. కానీ సాదా బంగారు వడ్డాణంతో పోలిస్తే వీటి ధర మరీ ఎక్కువ. పైగా అన్ని లక్షలు ఖర్చుపెట్టి చేయించుకున్న బెల్టు వడ్డాణాన్ని ఆ రూపంలో తప్ప మరో రకంగా ధరించలేరు. అలాగని బీరువాకే పరిమితం చేయలేరు. నడుం చుట్టూ ఉండే బెల్టుకి ముందు భాగంలో పొదిగే రాళ్ల డిజైన్‌ను విడిగా తీసి పెట్టుకునేలా తయారుచేయాలన్న ఆలోచన అప్పుడు పుట్టుకొచ్చినదే. దాంతో అన్‌కట్‌ వజ్రాలూ పచ్చలూ సౌత్‌ సీ ముత్యాలూ కలిపి వడ్డాణం పెండెంట్లను తయారుచేసి బెల్టుమీద అమరుస్తున్నారు. ముందు భాగంలో అందంగా ఆడంబరంగా కనిపించే ఈ వెడల్పాటి పెండెంట్‌ని ఎప్పుడంటే అప్పుడు విడిగా తీసి మెడలో చోకర్‌లానూ బాజుబంద్‌లానూ అలంకరించుకోవచ్చన్నమాట.

పైగా చోకర్‌కి మ్యాచయ్యే ఇయర్‌ రింగ్స్‌ని సైతం వడ్డాణం డిజైన్‌లో భాగంగానే మధ్యలో ఉండే పెండెంట్‌కి అటూ ఇటూ ఉండేలా చేస్తున్నారు. కాబట్టి వాటిని కూడా తీసి చెవులకు పెట్టుకోవచ్చు.

సో, వడ్డాణం వద్దు అనుకునే చిన్న ఫంక్షన్లకి దానిమీది పెండెంట్‌ను తీసి చోకర్‌లా మెడలోనో వంకీలా భుజానికో పెట్టుకోవచ్చన్నమాట. లేదూ ఆ పెండెంట్‌ను చోకర్‌గా మెడలో వేసుకుని, నడుముకి వడ్డాణమూ పెట్టుకోవాలనుకుంటే- చిన్న చిన్న బిళ్లలను విడిగా చేయించుకుని వడ్డాణానికి అమర్చుకుంటే మరో వడ్డాణంలానూ కనిపిస్తుంది. సో, ఒక్క వడ్డాణాన్ని ఒకేసారి రెండు రకాలుగానూ వాడుకోగలగడమే కాదు, రెండు డిజైన్లలో అలంకరించుకోవచ్చన్నమాట. ఐడియా బాగుంది కదూ!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న