సాయం మీది... సంతోషం వారిది! - Sunday Magazine
close

సాయం మీది... సంతోషం వారిది!

చల్లమ్మా ప్రభాకరన్‌ సంతోషం పట్టలేకుండా ఉంది. కొత్తగా కట్టిన ఆ ఇంట్లోని ఒక్కో గదిలోకీ ఆమె వందసార్లు తిరిగుంటుంది... పొద్దుట్నుంచీ. గోడల్నీ కిటికీల్నీ తలుపుల్నీ అపురూపంగా తాకింది. తెల్లని ఆ గోడల వెనకనున్న చల్లని మనసులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా ఉంది ఆ స్పర్శ. అవును మరి, ఒకరూ ఇద్దరూ కాదు, కొన్ని వేలమంది.
ఆమె ఎవరో వారికి తెలియదు. వారెవరో ఆమెకూ తెలియదు.
కానీ వారిద్దరికీ మధ్య ‘ఈనాడు’ వారధిగా నిలిచింది.
మంచిమనసుతో వారు చేసిన సాయం ఇప్పుడు చల్లమ్మను ఓ ఇంటిదాన్ని చేసింది. ఆమెకూ ఆమె బిడ్డలకూ భద్రమైన నీడనిచ్చింది.
ల్లమ్మ ఒక్కతే కాదు, ఇంకో నూట ఇరవై కుటుంబాలూ ఆమెలాగే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి.
ఏడాదిన్నర క్రితం... చినుకు చినుకుగా మొదలైన వాన... కుండపోతగా మారి నాలుగు రోజుల పాటు తెరపి లేకుండా కురిసింది. వాననీరు వరద పొంగై ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తింది. చెమటోడ్చి, పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న సొంతిళ్లూ... పెద్దల జ్ఞాపకార్థంగా కాపాడుకుంటూ వచ్చిన అనుభవాల పొదరిళ్లూ... ఏవీ మిగలలేదు. ఇల్లూ వాకిలీ గొడ్డూగోదా సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన వాళ్లు... వారంతా. వరదల అనంతరం చిన్న చిన్న గుడిసెల్లో అష్టకష్టాలు పడుతున్న ఆ వరదబాధితులకి సొంతిల్లు కలలోకి కూడా రాని మాట. అలాంటిది ఇప్పుడు సౌకర్యంగా కట్టిన రెండు పడకగదుల ఇళ్లకు సొంతదారులైన సంబరం అది.‘ఈనాడు సహాయనిధి’కి విరాళాలిచ్చిన వేలాది మానవతావాదుల మంచితనంతో కట్టిన ఇళ్లు అవి.
ఒక సంప్రదాయం
సూర్యోదయానికన్నా ముందే వార్తలతో ప్రజల ముంగిళ్లలో వాలే ‘ఈనాడు’ వారి ప్రేమాభిమానాలతో పాటు నమ్మకాన్నీ చూరగొంది కాబట్టే ఓ సత్సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ, ప్రజలకూ ప్రకృతి విపత్తు బాధితులకూ నడుమ వారధి కాగలిగింది. గత నాలుగు దశాబ్దాలుగా దేశంలో ఏ మూల ప్రకృతి కన్నెర్ర చేసినా ‘ఈనాడు’ పిలుపు ఇవ్వడం ఆలస్యం... బాధితులను ఆదుకోవడానికి మేమున్నామంటూ చేయందించారు పాఠకులు. విశాలహృదయంతో వారిచ్చిన వందలూ వేలే కోట్లు అయ్యాయి. ఆ కోట్లే ఇళ్లుగా, బడులుగా మారి మనసారా వారు చేసిన సాయానికి సార్థకతను చేకూర్చాయి.

సమాజంలో చాలారకాల సమస్యలుంటాయి. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వమూ, పాలనా యంత్రాంగమూ ఉంటాయి. అవి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తాయి. కానీ, ప్రకృతి విపత్తులు అలా కాదు. వరదలూ తుపానులూ భూకంపాలూ సునామీలూ... క్షణాల్లో విరుచుకుపడతాయి. కన్నుమూసి తెరిచే లోపే సర్వం తలకిందులవుతుంది. వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలతో బయటపడినవారు ఆశ్రయం కోల్పోయి, అన్నం మెతుకు కరవై, అయినవారు కానరాక, ఆదుకునే తోడులేక... దిక్కుతోచని స్థితిలో మిగులుతారు.
బాధితులకు తాత్కాలిక పునరావాసం కల్పించి, జరిగిన విధ్వంసాన్ని సరిచేసి సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రభుత్వాలు పూనుకుంటాయి. అందుకు స్వచ్ఛంద సంస్థలూ తలా ఒక చెయ్యీ వేస్తాయి. కానీ, ఆ తర్వాత? ఆ నాల్రోజులూ గడిచి ఎవరి దారిన వాళ్లెళ్లిపోయాక...
బాధితుల పరిస్థితి ఏమిటి?
ఊహించని ఆ విపత్తులో తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న బిడ్డల్నీ, బిడ్డల్ని పొగొట్టుకున్న తల్లిదండ్రుల్నీ, అయినవారందరినీ కోల్పోయి అనాథలుగా మిగిలినవారినీ ఓదార్చేందుకు మనకు తెలిసిన భాష చాలదు. అంత దుఃఖానికి తోడు ఇల్లూవాకిలీ కూడా కోల్పోయి, కట్టుబట్టలతో నిలవడం బాధితులను నిర్వేదంలోకి నెడుతుంది. ఈ పూట తిండీ బట్టా ఇచ్చి చేతులు దులుపుకుని పోబోమనీ రేపటికి తలదాచుకోను ఓ గూడూ, బతకడానికో దారీ కూడా కల్పిస్తామనీ నమ్మకం కలిగించగలిగితేనే వారు కన్నీళ్లను దిగమింగి అడుగు ముందుకు వేయగలుగుతారు. విపత్తులు చోటుచేసుకున్నప్పుడు తక్షణసాయం ఎంత అవసరమో ఒక పద్ధతి ప్రకారం అందించే దీర్ఘకాల అండాదండా కూడా అంతే అవసరమంటుంది సహాయచర్యల్లో తలపండిన రెడ్‌క్రాస్‌ సంస్థ. ఎప్పటికప్పుడు ‘సహాయ నిధి’లో తలా ఓ చేయి వేయడం ద్వారా ఆ మహత్కార్యంలో పాలు పంచుకుంటున్నారు ‘ఈనాడు’ పాఠకులు.
నలభై ఏళ్లు... ఎన్నో కోట్లు!
‘సర్వేజనా సుఖినోభవంతు’ అని కోరుకునే సమాజం మనది. అందుకే గత నలభై ఏళ్లలో దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ‘ఈనాడు పాఠకులు’ స్పందించారు. ఆపత్కాలంలో బాధితులను అక్కున చేర్చుకోవటం అందరి బాధ్యతగా భావించారు. మనిషి బాధ సాటి మనిషికే అర్థమవుతుందని నిరూపిస్తూ తమ వంతు సాయం అందించడానికి ముందుకొచ్చారు. వినిమయ వస్తువుల మోజులో విలాసాల ఆకర్షణలో పడి మనిషి సంపాదన వెంట పరుగులు తీస్తూ స్వార్థపరుడవుతున్నాడన్న ఆరోపణ నిందే కానీ నిజం కాదనీ నిండుహృదయంతో చేయూతనిచ్చేందుకు మనిషి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడనీ రుజువు చేశారు.

సంపన్నులంటే ఇస్తారు కానీ మేమేమివ్వగలమని చిరుద్యోగులు అనుకోలేదు.
కార్మికుల నుంచి ఖైదీల వరకూ అందరూ పెద్ద మనసుతో స్పందించారు.
కిడ్డీబ్యాంకుల్లో దాచుకున్న డబ్బును తెచ్చిచ్చిన చిన్నారుల్నీ పింఛను సొమ్ము నుంచి కూడా కొంత మొత్తం తీసి ఇచ్చిన వృద్ధుల్నీ... అందరినీ కదిలించింది సాటి మనిషి కష్టమే. మనుషులం ఎక్కడున్నా మా మనసిక్కడే ఉందంటూ ప్రవాసులూ సహాయహస్తం చాచారు. అలా... అందరూ తలా ఒకచెయ్యీ వేశారు కాబట్టే ఒక్కో చుక్కా చేరి సముద్రమైనట్లు వందలూ వేలే... లక్షలూ కోట్లూ అయ్యాయి.
సాయానికి సార్థకత
అది 1976... అప్పటికి ‘ఈనాడు’ పుట్టి సరిగ్గా రెండేళ్లు. ఆ ఏడాది వరసగా మూడు తుపాన్లు విరుచుకుపడి ఆంధ్రరాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాయి. మొట్టమొదటిసారిగా పదివేల రూపాయలతో ‘తుపాను సహాయ నిధి’ని ప్రారంభించింది ఈనాడు. ఎంతోమంది పాఠకులు పెద్ద మనసుతో ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. ఆ మొత్తం దాదాపు 65 వేలు. అప్పట్లో అది పెద్ద మొత్తమే. దాన్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసింది ‘ఈనాడు’. ప్రతిసారీ అలాగే ఇచ్చేయొచ్చు. కానీ ఎంతో నమ్మకంతో సాటివారి పట్ల ప్రేమతో ప్రజలు ఇచ్చిన డబ్బు ఎలా ఖర్చవుతోందో కూడా వారికి తెలిస్తే... ఆ సొమ్ముతో శాశ్వత నిర్మాణాలు చేపడితే... మంచి మనసుల ఉదారతకు నిలువెత్తు నిదర్శనగా ఆ నిర్మాణాలు నిలుస్తాయి. అటు బాధితులకూ లబ్ధి, ఇటు ఇచ్చినవారికీ తృప్తిగా ఉంటుందన్న ఆలోచన ఫలితమే- సహాయనిధి సొమ్ము నీడనిచ్చే ఇళ్లుగా, చదువు చెప్పే బళ్లుగా సార్థక రూపం సంతరించుకోవడం మొదలెట్టింది. ఈ విధంగా తాము చేసిన సాయానికి ఓ అర్థవంతమైన రూపం ఇచ్చి కళ్లెదుట నిలపడమన్నది- ఇచ్చే గుణాన్ని మరింతగా ఇనుమడింపజేసిందనడానికి నిదర్శనం... ఎప్పటికప్పుడు విరాళాలిచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉండడమే.
ప్రతి పైసాకీ లెక్క
మన సొమ్ము మనిష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాం, అడిగేవారుండరు. కానీ ప్రజల సొమ్ము అలా కాదు, నమ్మకంతో వారిచ్చే ప్రతి పైసాకీ లెక్కుండాలి. అందుకే ఏరోజుకారోజు సహాయనిధికి ఎవరెవరు ఎంతిచ్చారన్నది పత్రికాముఖంగానే ప్రచురిస్తోంది ‘ఈనాడు’. చివరికి ఆ నిధులతో ఏం చేయాలీ ఎలా చేయాలీ అన్నది కూడా బాధిత ప్రాంత అధికారులతో, నాయకులతో చర్చించాకే తగిన నిర్ణయం తీసుకుంటుంది. స్థలమూ, లబ్ధిదారుల ఎంపికా వారి సూచనమేరకే. ఆ తర్వాత... తలపెట్టిన పథకానికి కార్యరూపమిచ్చే బాధ్యతను ప్రతిష్ఠాత్మక సంస్థలతో పంచుకుంటుంది. రామకృష్ణ మఠం, స్వామినారాయణ్‌ సంస్థ, కుటుంబశ్రీ లాంటి సంస్థల సహకారం మరవలేనిది. అలాగని డబ్బిచ్చి చేతులు దులుపుకోలేదు. నిర్మాణాలు పూర్తై, లబ్ధిదారులకు అందజేసి, నిర్వహణ బాధ్యతను స్థానిక గ్రామపంచాయతీలకు అప్పజెప్పేవరకూ అడుగడుగునా ‘ఈనాడు’ పాత్ర ఉంది. బడుగుల కోసం ఖర్చు చేసే సంక్షేమ నిధుల్లో రూపాయిలో పదిహేను పైసలు మాత్రమే వారిదాకా చేరుతోందన్నారు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఓ సందర్భంలో. ఈనాడు సహాయనిధి సొమ్ము మాత్రం రూపాయికి రూపాయి పావలా ప్రతిఫలం కన్పించేలా ఈ పథకాల కార్యాచరణ జరగడం విశేషం. పై ఖర్చులన్నిటినీ సంస్థే భరిస్తూ సహాయనిధిని పొదుపుగా, అవకాశం ఉన్నచోటల్లా ఖర్చు తగ్గించుకుంటూ చేయడం వల్లే ఇది సాధ్యమైంది. అలా- నాటి దివిసీమ నుంచి నేటి అలెప్పీ వరకు ప్రకృతి విపత్తుల బాధితులకు గుండె పగిలి... కన్నీరింకిన... ఎన్నో సందర్భాల్లో ఈనాడు పాఠకుల సహాయం కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉంది.

ఆ ఊరు... పరమహంసపురం!
1977 నవంబరు 19... కృష్ణా జిల్లాలో బంగాళాఖాతానికి మహా అంటే మైలు దూరంలో ఉంటుందేమో ఆ ఊరు. పేరు పాలకాయతిప్ప. చేపలు పట్టడమే జీవనోపాధిగా బతుకుతున్న దాదాపు ఏడొందల జనాభా ఉన్న ఆ ఊరిమీదికి దివిసీమ ఉప్పెన రూపంలో ముంచుకొచ్చిన ప్రళయం సగం మందిని తనతో తీసుకుపోయింది. మనుషులతో పాటూ ఇళ్లూ వాకిళ్లూ వలలూ పడవలూ... అన్నిటినీ మింగేసింది. ప్రాణాలతో మిగిలినవారికి ఏడవటానికి కూడా ఓపిక లేని దీనస్థితి. అది చూసి చలించిన ఈనాడు- సహాయనిధికి పిలుపివ్వగానే పలువురు విరాళాలు ఇచ్చారు. దాదాపు నాలుగు లక్షలకు చేరువైన ఆ మొత్తానికి సమానంగా రామకృష్ణ మఠం నుంచి కూడా డబ్బు అందింది. అలా సమకూరిన పెద్ద మొత్తంతో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలోనే విపత్తులకు తట్టుకునేలా 112 పక్కా ఇళ్లు కట్టించి ఊరివారికి ఇచ్చారు. ఇప్పుడక్కడ పాలకాయ తిప్ప లేదు, ఉన్నది పరమహంసపురం. ఇళ్లు కట్టగా ఇంకా కాస్త డబ్బు మిగిలితే దాంతో పక్కనే ఉన్న కృష్ణాపురం అనే ఊళ్లో మరో 22 మంది నిరుపేదలకూ నీడ ఏర్పాటైంది.
సూర్యతేజం...
1996లో కోస్తా మీద పెనుతుపాను విరుచుకుపడింది ఐదు జిల్లాల వారిని అతలాకుతలం చేసింది. వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోగా ఇళ్లూ బడులూ గుడులూ అన్నీ రూపురేఖలు లేకుండా కొట్టుకుపోయాయి. ఆ ఘోరాన్ని చూసి తల్లడిల్లిన ‘ఈనాడు’ మరోసారి రంగంలోకి దిగింది. పాతిక లక్షలతో తుపాను సహాయనిధిని ప్రారంభించింది. పాఠకులు ఆ మొత్తాన్ని కోటిన్నర దాటించారు. ఆ డబ్బుతో వెలసినవే 42 ‘సూర్య’ భవనాలు. తీరప్రాంత జిల్లాలకు తుపాను అనేది ఎప్పుడూ పొంచిఉన్న ప్రమాదమే. వారికి శాశ్వతంగా ఉపయోగపడడం కోసం మామూలు సమయంలో పిల్లలకు పాఠశాలలుగా పనికొస్తూనే ప్రకృతి ప్రకోపించినపుడు పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడేలా నిర్మించినవే ‘సూర్య’ భవనాలు.


ఒడిశాలో సూర్యనగరం
1999... సూపర్‌ సైక్లోన్‌ పొరుగున ఉన్న ఒడిశాను చిందరవందర చేసింది. మన రాష్ట్రం కాదు కదా అని ఎవరూ అనుకోలేదు. అన్ని ప్రాంతాలవారూ మేమున్నామంటూ ముందుకొచ్చారు. పదిలక్షల విరాళంతో మొదలెట్టిన సహాయనిధి అరకోటికి చేరువైంది. ఆ సొమ్ము జగత్సింగ్‌పుర్‌ జిల్లాలో 60 పక్కా ఇళ్లతో ‘సూర్యనగర్‌’గా రూపుదిద్దుకోవడానికి రామకృష్ణ మఠం తోడ్పడింది.

గుజరాత్‌లో కావ్డా
2001... పద్నాలుగు వేలమందిని బలిగొని యావత్‌దేశాన్నీ కుదిపేసిన పెను విపత్తు గుజరాత్‌ భూకంపం. రెండు లక్షలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఊళ్లకు ఊళ్లు శ్మశానాలుగా మిగిలిన ఆ పరిస్థితులను చూసి తల్లడిల్లని వారు లేరు. ఈసారి పాతిక లక్షల రూపాయలతో మొదలుపెట్టిన సహాయనిధి రూ.2.22 కోట్లకు చేరింది. దాంతో స్వామినారాయణ్‌ సంస్థ సహకారంతో భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన కచ్‌ జిల్లాలో నిరాశ్రయులకు 104 ఇళ్లు సమకూరాయి. అలా ఏర్పడిన ఊరే పాక్‌ సరిహద్దులోని కావ్డా.
దక్షిణతీరానికి అండ
2004... దేశ దక్షిణ తీరప్రాంతాన్ని సునామీ ముంచేసింది. కళ్లు మూసి తెరిచేలోగా కనీవినీ ఎరగని రీతిలో ఎగసిపడిన అలలు యావత్‌ ప్రపంచాన్నే వణికించాయి. సముద్రం మీద ఆధారపడి బతికిన మత్య్సకారులెందరో ఆ సముద్రానికే బలయ్యారు. కట్టుబట్టలతో మిగిలిన అక్కడి ప్రజలను ఆదుకోవడానికి రూ.పాతిక లక్షల తక్షణసాయం ప్రకటిస్తూ మొదలుపెట్టిన సహాయనిధికి ఈసారి రెండున్నర కోట్లు సమకూరాయి. ఆ డబ్బుతో రామకృష్ణ మఠం సహకారంతో కడలూరు, నాగపట్టణం జిల్లాల్లో మత్య్సకారులకు 164 ఇళ్లు ఏర్పడ్డాయి.


వరదబాధితులకు ఉషోదయం
2009... కృష్ణా, తుంగభద్రా నదులకు వరదలు వచ్చి కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలను ముంచేయగా వెంటనే ఆహారపొట్లాలు అందించి ఆకలి తీర్చిన ‘ఈనాడు’ కోటి రూపాయలతో సహాయనిధినీ ఏర్పాటు చేసింది. దానికి మొత్తం ఆరుకోట్లపైనే నిధులు అందాయి. వాటితో కట్టినవే పాఠశాలలుగా ఉపయోగపడుతున్న ఏడు ఉషోదయ భవనాలు. ఎత్తుగా కట్టిన ఈ భవనాలు కూడా విపత్తులేమైనా ముంచుకొస్తే పునరావాస కేంద్రాలుగా మారతాయి. ఈ వరదల వల్ల చేనేత కార్మికుల మగ్గాలు చెడిపోవడంతో వారంతా ఒక్కసారిగా ఉపాధి కోల్పోయారు. దాంతో రాజోలిలో 1100 చేనేత కుటుంబాలకు ఉచితంగా మగ్గాలను అందజేసిందీ సహాయనిధి సొమ్ముతోనే. హుద్‌హుద్‌ బాధితులకు... 2014 అక్టోబరులో హుద్‌హుద్‌ తుపాను ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేసింది. ఆ సందర్భంగా ఈనాడు రూ. 3 కోట్లతో మొదలుపెట్టిన సహాయనిధి ప్రజల విరాళాలతో రూ.6 కోట్లు దాటింది. దాంతో విశాఖ జిల్లా తంతడి- వాడపాలెంలో బాధితులకు 80 కొత్త ఇళ్లు ఏర్పడడమే కాక దెబ్బతిన్న మరికొన్ని ఇళ్లకు మరమ్మతులు కూడా జరిగాయి.
కేరళకు ఆపన్నహస్తం
2018... ఊహించని రీతిలో ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా కురిసిన వాన కొద్ది గంటల్లోనే వరదై కేరళ రాష్ట్రంలోని పలు జిల్లాలను ముంచెత్తింది. ప్రాణనష్టంతో పాటు జరిగిన తీవ్ర ఆస్తినష్టం మొత్తంగా దేశాన్నే కదిలించింది. మూడుకోట్లతో ‘ఈనాడు’ శ్రీకారం చుట్టిన సహాయనిధికి ప్రజల విరాళాలు చేరి రూ.7.7 కోట్ల పెద్ద మొత్తం అయ్యింది. దాంతో మహిళా సంఘం కుటుంబశ్రీ ఆధ్వర్యంలో 121 ఇళ్లు నిర్మాణం పూర్తిచేసుకుని నేడు లబ్ధిదారుల సొంతమవుతున్నాయి. ముందు ముందు మళ్ళీ వరదలొచ్చినా ఇబ్బంది కలగని విధంగా వీటిని నిర్మించడం విశేషం.

*

కష్టానికి కులమూ మతమూ జాతీ ప్రాంతం ఉండదు. మరి స్పందించే హృదయానికి మాత్రం ఆ వివక్ష ఎందుకుంటుంది.
అందుకే... ‘ఈనాడు’ పిలుపు ఇవ్వడం ఆలస్యం- మేమున్నామంటూ స్పందించారు వేలాది ప్రజలు. వారంతా నిండునూరేళ్లూ చల్లగా ఉండాలని నిండుమనసుతో దీవిస్తున్నారు కేరళలో ఈరోజు గృహప్రవేశం చేస్తున్న ఎందరో చల్లమ్మలు!


అందరూ మహిళలే!

‘ఈనాడు సహాయనిధి’తో కేరళలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఎన్నెన్నో ప్రత్యేకతల సమాహారం. సహాయనిధి లక్ష్యం తెలియజేయగానే ఐఎఎస్‌ అధికారి మైలవరపు కృష్ణతేజ తీవ్రంగా దెబ్బతిన్న అలెప్పీ జిల్లాలో 116 ఇళ్ల నిర్మాణానికి పక్కా ప్రణాళిక రూపొందించారు. దాన్ని ఆచరణలో పెట్టే బాధ్యతను రాష్ట్రంలో అత్యంత చురుగ్గా పనిచేస్తున్న మహిళా సంఘం కుటుంబశ్రీకి అప్పజెప్పారు. దాంతో క్షేత్రస్థాయిలో ఇళ్లనిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల నుంచి ఇంజినీర్లవరకూ అంతా మహిళలే అయ్యి ఈ ప్రాజెక్టుని ఎనిమిది నెలల్లో పూర్తిచేశారు. అచ్చంగా మహిళల చేతిలో రూపుదిద్దుకున్న తొలి పునరావాస పథకం బహుశా దేశంలో ఇదేనేమో!
* వార్డుకో ఇల్లు చొప్పున, ప్రకృతి విపత్తులను తట్టుకునేలా వీటిని నిర్మించారు. అవసరమైనప్పుడు ఆ ఇళ్లనే సహాయకేంద్రాలుగా ఉపయోగించుకోవచ్చు.
* అనుకున్నది 116 ఇళ్లే అయినా, నాణ్యతలో రాజీ పడకుండానే పొదుపుగా ఖర్చు చేసి, మిగిలిన డబ్బుతో మరో ఐదు ఇళ్లు అదనంగా కట్టగలిగారు. పూర్తి నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపికచేశారు.
* ఇళ్లు పొందిన లబ్ధిదారులకు నిర్మాణంలో శిక్షణ ఇచ్చి, వారూ అందులో పనిచేసి ఉపాధి పొందేలా చూడడం మరో విశేషం.
* వరదలు వచ్చినపుడు హెలికాప్టరు ద్వారా సహాయ చర్యలు చేపట్టేందుకు వీలుగా పైకప్పులను కేరళ సంప్రదాయ ఇళ్లలాగా కాకుండా కాంక్రీటుతో చదునుగా వేశారు.


 

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న