కొండ అద్దమందు - Sunday Magazine
close

కొండ అద్దమందు

- డేగల అనితాసూరి

 

ఏమండీ...! మీకో శుభవార్త. ‘అందరి తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ అమెరికాలో ఉన్నారు, మా వాడికి ఆ ఛాన్స్‌ వస్తే ఎంత బావుణ్ణో’ అనేదాన్ని కదా ఇన్నాళ్లూ? ఇప్పుడు నిజంగానే మా తమ్ముడు అమెరికా వెళ్లబోతున్నాడట అఫీసు తరపున’’ ఆఫీస్‌ నుంచి వచ్చిన భర్తకు మంచినీళ్లైనా ఇవ్వకనే చల్లటి కబురందించింది వాణి.‘‘అవునా? అన్ని విషయాలూ నాతోనే ముందుగా చెప్పే వాడు ఈ విషయం మాత్రం అక్కకే ముందు చెప్పాడన్నమాట’’ అన్నాడు వాణి భర్త మోహన్‌ కాస్త కినుకగా.‘‘భలే వారే, ఏదో ఆ సంతోషంలో అక్కమీద ప్రేమ కొద్దీ చెప్పి ఉంటాడు. అయినా పెళ్లైనప్పట్నుంచీ అన్ని విషయాలూ నాతో చెప్పుకునే మీ చెల్లెలు, కొడుకు పుట్టగానే వాళ్లాయనతో మీకేగా ముందు చెప్పమంది. ఇదీ అంతే’’ భర్త చేతిలోని బ్యాగు తీసుకొని లోపలికెళ్లింది.
‘‘సర్లే మొత్తానికి నీ కోరికా, నీ మరదలి కోరికా తీరినట్టేగా’’ అన్నాడు జేబులోని సెల్‌ఫోన్‌ తీసి చార్జ్‌లో పెట్టి గదిలోకెళ్తూ.‘‘అక్కడికి నా బామ్మర్ది అమెరికాలో ఉన్నాడంటూ, మీకు మాత్రం ఆఫీసు కొలీగ్స్‌తో చెప్పుకోవాలని లేనట్టు’’ మరుగుతున్న టీ కప్పులోకి వడకడుతూ అంది వాణి. మళ్ళీ నోరెత్తకుండా, భార్య చేతికిచ్చిన టీ తాగటంలో నిమగ్నమయ్యాడు మోహన్‌.‘‘తమ్ముడి అమెరికా ప్రయాణానికి కావలసిన వస్తువులూ, సరుకులూ, మందులూ అన్నీ ప్యాక్‌ చేయటంలో వాణీ, ఆమె తల్లి రాజేశ్వరీ నానా హైరానా పడ్డారు. నెల ముందునుంచీ అక్కడలా ఉండాలట, అక్కడిలా చేయాలట అంటూ తమకు తెలిసినవీ, ఎవరో చెప్పగా విన్నవీ అన్నీ కలిపి జాగ్రత్తలు చెప్పటం మొదలుపెట్టారు.
‘‘అబ్బా...! నాకంతా తెలుసు. ఆల్రెడీ అక్కడున్న నా ఫ్రెండ్స్‌ చెప్పార్లే అంటూ వాణి తమ్ముడు వరుణ్‌ విసుక్కునేసరికి, తమ దృష్టి అతడి భార్య ప్రతిమ మీదకి మళ్ళించారు. వారి గోల భరించలేక ఆమె తలనొప్పో, కడుపునొప్పో వంక చెప్పి గదిలో కెళ్లి తప్పించుకోసాగింది.చివరికి అమెరికా వెళ్లేరోజు రానే వచ్చింది. ఒకవైపు సంతోషమే అయినా, అంతదూరం వెళ్తున్నారే అన్న బెంగ కూడా కలిగి వాణీ రాజేశ్వరీ కంట తడిపెట్టుకుంటే, బావ మోహన్‌, తండ్రి దివాకర్‌లు ధైర్యం చెప్పి వరుణ్‌ని ఎయిర్‌పోర్ట్‌లో విమానమెక్కించి సాగనంపారు.

*             *              *

‘‘అమ్మా మన వరుణ్‌ గాడు అమెరికా వెళ్లి అప్పుడే ఆర్నెల్లు గడిచిపోయింది కదా?’’ అంది వాణి పుట్టింటికి వచ్చినప్పుడు.‘‘అవునే చాలా బెంగగా ఉంటోంది. ఎంత వీడియో కాల్‌లో మాట్లాడినా, దగ్గరున్నట్టు ఉండదు కదా?’’ అంది రాజేశ్వరి.
‘‘ఏముందిలే... వాడిక్కడున్నప్పుడైనా అంతే కదా? సిటీలో మేము మలక్‌పేట్‌లో ఉంటే, వాడు కూకట్‌పల్లిలో. ఇక, మీరేమో ఊళ్లో. అప్పుడైనా కలుసుకోవటాలు ఆర్నెల్లకో సంవత్సరానికో మాత్రమే కదా?’’ అంది వాణి.
‘‘అవుననుకో ఎంతైనా మన దేశంలోనే ఉన్నారన్న ధైర్యం ఉండేది’’ చెప్పింది రాజేశ్వరి.‘‘అవునుగానీ, రాఖీ పండగ వస్తోంది ఎప్పుడూ నేను కూకట్‌పల్లి వెళ్లి వాడికి రాఖీ కట్టేదాన్ని. ఇప్పుడేం చెయ్యాలో’’ అంది వాణి.
‘‘ఏముందోయ్‌... ఆన్‌లైన్లో పంపటమే’’ అన్నాడు మోహన్‌.
‘‘ఆన్‌లైన్‌ ఎందుకు మోహన్‌? అందులో వట్టి రాఖీ మాత్రమే పంపితే ఎంత అవుతుందో అంతే డబ్బులకు రాఖీతో బాటూ ఓ కిలో స్వీటూ హాటు లాంటివికూడా కలిపి పంపొచ్చు పార్సిల్లో అయితే. ఎలాగూ వాళ్లకక్కడ మన పిండివంటలు దొరకటం కష్టమే కదా?’’ అన్నాడు దివాకర్‌.‘‘అవునా? అయితే అలాగే పంపుదాం. అన్నట్టు వాడికి అరిసెలంటే బాగా ఇష్టం. జంతికలు ఇద్దరికీ ఇష్టమే. కొంచెం కజ్జికాయలు నేను చేసిస్తా. రాఖీతో కలిపి పంపుదాం’’ అంది వాణి.
వాణి పంపిన రాఖీ చేతికి కట్టుకుని వాట్సాప్‌లో ఫొటో పెట్టాడు వరుణ్‌. పంపిన స్వీట్లూ, హాట్లూ కూడా చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు ఇద్దరూ. పదిరోజుల తరువాత వాణి బ్యాంక్‌ అకౌంట్‌లో ఐదువేలు క్రెడిట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది.
ఆ రాత్రి భర్తతో ‘‘మావాడి రాఖీ గిఫ్ట్‌ అనుకుంటా. నా అకౌంట్‌లో ఐదువేలేశాడు’’ చెప్పింది వాణి.‘‘గొప్పగా ఐదువేలంటున్నావ్‌... వాడికి పంపిన పార్సిల్‌కే దగ్గరదగ్గర నాలుగువేలు అయ్యింది. అంటే నీకిచ్చిన గిఫ్ట్‌ వెయ్యి మాత్రమే’’ అన్నాడు మోహన్‌.
‘‘నిజమేలే, అయినా గిఫ్ట్‌ ఏం కావాలని అడుగుతాడనుకున్నా. ఇలా డబ్బులేస్తాడనుకోలేదు’’ అంది వాణి.

*             *              *

మర్నాడు తల్లికి ఫోన్‌ చేసి ‘‘అమ్మా... అమెరికా తమ్ముడు రాఖీ గిఫ్ట్‌గా ముష్టి ఐదువేలు వేశాడని చెబితే, అందరి దగ్గరా పరువుపోయేలా ఉంది’’ అంది వాణి.‘‘ఏమోనే తల్లీ. అక్కాయే, తమ్ముడాయే. మీ గొడవలోకి నన్ను లాగొద్దు. నీకేం కావాలో వాడ్నే అడుగు. వాడేం చెబుతాడో నీకే చెప్పమంటా’’ అంటూ తప్పించుకుంది రాజేశ్వరి తెలివిగా. నెలరోజుల తరువాత వాణి బర్త్‌డే అని ఫోన్‌ చేసి విషెస్‌ చెప్పారు ప్రతిమ, వరుణ్లు.‘‘ఉట్టి విషెస్సేనా? అమెరికానుంచీ మీ తమ్ముడేం పంపాడని మీ బావతో సహా మా అత్తగారి తరఫువాళ్లూ, స్నేహితులూ అంతా అడుగుతున్నార్రా’’ అంది వాణి.‘‘అదేమిటి వదినా... మొన్ననే ఆయన రాఖీ అని ఐదువేలు మీ అకౌంట్‌లో వేశారు’’ అంది ప్రతిమ.‘‘ఆ... డబ్బులదేముందిలే. అమెరికా నుంచి ఆపిల్‌ ఫోనో, ల్యాప్‌టాపో, ఐపాడో లాంటివి పంపితే గొప్పగానీ’’ అంది వాణి.‘‘ఓకే అక్కా మాకిప్పుడు రాత్రి తొమ్మిదైంది. భోంచేసి పడుకోవాలి. ఉండనా మరి’’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు వరుణ్‌.

*             *              *

సంవత్సరమైంది. ‘‘ప్రతిమ ఫోన్లో ఇక్కడ్నుంచి కొన్ని సరుకులూ, బట్టలూ, మందులూ పంపమంటూ లిస్టు పెట్టిందే. ఎలా పంపాలో ఏమో’’ అంది రాజేశ్వరి కూతురితో. ‘‘ఏం... వాళ్లన్నయ్య పంపొచ్చుగా. ఈ వయసులో వాళ్ల నాన్న పంపలేరు గానీ మా నాన్నవల్ల అవుతుందా? అమెరికాలో ఉన్న కూతురికోసం ఆమాత్రం చెయ్యలేడా? మొన్నామధ్య వరుణ్‌ ఫ్రెండ్సెవరో ఇండియా వస్తుంటే, వాళ్లన్నయ్యకు ఆపిల్‌ ఫోన్‌ పంపిందట కదా’’ అంది వాణి.‘‘ఏమోనే... వరుణ్‌ అన్నాడు - బావకైతే మొన్న పార్సిల్‌ పంపాడు కాబట్టి తెలుసులే అని. సర్లే... బావ ఆఫీసు పనితో బిజీ అట, ప్రతిమా వాళ్లన్ననే పంపమని చెబుతాన్లే’’ అంది రాజేశ్వరి.

*             *              *

‘‘ఏమండీ... ఇండియా వెళ్తున్నాం కదా మా అన్నకొడుకు కాలేజీకొచ్చాడు. వాడికో ల్యాప్‌టాప్‌, మా అన్న కూతురికో ట్యాబ్‌ తీసుకెళ్దాం’’ అంది ప్రతిమ.‘‘ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఎక్కువయ్యాయి. మళ్లీ అవన్నీ కుదరవు. ఇంతకీ అక్కా బావలకూ పిల్లలకూ ఏమివ్వాలి?’’ అన్నాడు వరుణ్‌. ‘‘వాళ్ల పిల్లలు చిన్నవాళ్లే కదా? పాపకు ముత్యాల సెట్‌ తీసుకున్నాలెండి. బాబుకు రిమోట్‌ కంట్రోల్‌ కారు, రోబో బొమ్మ, పజిల్‌ బుక్స్‌ లాంటివి తీసుకున్నాం కదా. వదినకు చీర పెడదాం లెండి’’ అంది ప్రతిమ.
అమెరికా వెళ్లిన నాలుగేళ్లకు కొత్తగా సిటీలో ప్రతిమ వాళ్ల అన్న ద్వారా కొన్న అపార్ట్‌మెంట్‌ గృహప్రవేశానికి తప్పనిసరై వచ్చారు ప్రతిమ, వరుణ్‌లు.వాణి తమ్ముడికీ, మరదలికీ బట్టలు పెట్టి, వెండి గ్లాసులు గిఫ్ట్‌గా ఇచ్చింది. ప్రతిమ వాణికి కుంకుమ బొట్టు పెట్టి చీర ఇచ్చింది. పిల్లలకు బొమ్మలు ఇచ్చింది.

హైస్కూలుకొచ్చిన వాణి కూతురు ‘‘ఛీ... ఈ ముత్యాల సెట్‌ నాకేం వద్దు’’ అనేసింది. ‘‘నాక్కూడా ఈ చిన్నపిల్లల బొమ్మలు అస్సలొద్దు’’ అంటూ ముఖం చిన్నబుచ్చుకుని వెళ్లి కారెక్కాడు వాణి కొడుకు.అసలే - తన కళ్లముందే ప్రతిమ అన్న పిల్లలకు ఇచ్చిన వస్తువుల్ని చూడటంతో ఒళ్లు మండిపోయిందేమో, ‘‘ఇలాంటి చీరలు నాకు ఇదివరకే రెండున్నాయి ప్రతిమా. సారీ... మరెవరైనా మీ బందువులకు పెట్టేయి’’ అని ఇచ్చేసింది వాణి కూడా. సాయంత్రానికి ఆగమన్నా వినకుండా ప్రయాణమైపోయారు మోహన్‌, వాణి.‘‘అది అడిగేదేమిటో తెలిసీ ఎందుకురా దాన్ని చిన్నబుచ్చటం?’’ అంది తల్లి రాజేశ్వరి.

‘‘అత్తమ్మా... మాకీ నాలుగేళ్లలో ప్రతిసారీ ఏం కావాలన్నా మా అన్నయ్యే పార్సిల్స్‌ పంపుతున్నాడు. పైగా అమెరికాలో ఉన్నామన్న పేరేగానీ, అక్కడ డాలర్లిచ్చినా డాలర్లలోనే ఖర్చులుంటాయని తెలుసుకోకుంటే ఎలా? రెంట్‌కీ, వైద్యానికీ చాలానే ఖర్చవుతుంది. రేపు మాకేం కావాలన్నా మా అన్నయ్యే కదా పంపాల్సింది? తుమ్మితే ఊడే ముక్కు లాంటి ఈయన ఉద్యోగంతో కొంతైనా ఆస్తులుండాలని లోన్‌ తీసుకుని మరీ ఈ అపార్ట్‌మెంట్‌ కొన్నాం కానీ, అందరూ అనుకుంటున్నట్టు డాలర్లెక్కువై కాదు. పైగా వాళ్లు చిన్నపిల్లలేగా. అప్పుడే ట్యాబ్‌లూ, ల్యాప్‌టాప్‌లూ అలవాటు చేయకూడదనే తేలేదు’’ చెప్పింది ప్రతిమ.

*             *              *

ఇప్పుడు బందువులో, స్నేహితులో, ఇంటి పక్కవాళ్లో ‘‘వాణి తమ్ముడు అమెరికాలోనే కదా ఉన్నది?’’ అంటే చాలు...‘‘ఆ ఉన్నార్లే పేరుకి. మీకు ఇక్కడున్న అన్నదమ్ములే నయం, మంచికీ చెడ్డకీ ఆదుకుంటారు. మావాళ్లు ఎంత సంపాదించినా, ఇండియానుంచి ఇంకా ఏవో కొని పంపలేదని మామీదే పడి ఏడుస్తుంటారు’’ అంటూ పుల్లవిరుపుగా మాట్లాడుతుంది వాణి. అలాగే, అమెరికాలో ఏ షాపులోనో కలిసినప్పుడు ఫ్రెండ్సూ, ఫోన్‌ చేసినపుడు బంధువులూ ‘‘మీకేంటమ్మా... అమెరికాలో ఉన్నారు హాయిగా’’ అన్నారంటే, ‘‘అవును అందరికీ దూరంగా అయినవాళ్లను వదులుకుని తప్పనిసరై రావాల్సొచ్చింది. ఇక్కడ ఏం కొందామన్నా కాస్ట్లీనే, పనివాళ్లను పెట్టుకోలేక చచ్చిపోతున్నాం. అన్నీ ఇండియా నుంచీ తెప్పించుకోవటానికి వాళ్లకేవో బహుమతులు పంపుతూ నెట్టుకొస్తున్నాం’’ అంటూ ప్రతిమ వాపోతుంటుంది. రాను రానూ వాణి రాఖీ పంపడం మానేసి వాట్సాప్‌లోనే రాఖీ బొమ్మ పెట్టేసి విషెస్‌ చెప్పేస్తుంటే, బర్త్‌డేలూ, మ్యారేజ్‌ డేలకు ప్రతిమ, వరుణ్‌లు కూడా కేకు బొమ్మమీద గ్రీటింగ్స్‌ ఉన్న ఫోటోలు పోస్ట్‌ చేసి ‘మమ’ అనేస్తున్నారు. దూరం పెరిగితే మనసులు దగ్గరై  ప్రేమలు పెరుగుతాయంటారు. కానీ, ఆశలు మాత్రమే పెంచుకోవటంతో ఎవరికివాళ్లు... అవతలివాళ్లు తమకేవో బహుమతులు ఇవ్వలేదనీ, ఇంకెవరికో ఏవో తెచ్చిచ్చారనీ అక్కసు పెంచుకుంటూ ఆత్మీయతను తెంచుకుంటూ... మమతల నడుమ అగాధాలు తవ్వుకుంటున్నారు. ‘ఏం అమెరికానో ఏమో, ఉన్న ఇద్దరు పిల్లల్నీ ఎడమొహం పెడమొహం చేసి తమకు మనశ్శాంతి కరువు చేసింది’ అనుకుంటూ ఎవరికి సర్దిచెప్పాలో  అర్థంకాక  బాధగా నిట్టూర్చారు వాణి అమ్మానాన్నలు.

Advertisement

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న