ఆత్మీయులు - Sunday Magazine
close

ఆత్మీయులు

- కటుకోజ్వల మనోహరాచారి

‘సర్‌ర్‌ర్‌...ర్‌...’మన్న శబ్దంతో కారును సడన్‌గా ఆపాడు క్యాబ్‌డ్రైవర్‌. వెనక సీట్లో కూర్చున్న కావేరి ఉలిక్కిపడి ముందుకు చూసింది.
ఎవరో ఒక నడివయస్కురాలు... కొద్దిలో ప్రమాదం నుండి బయటపడింది. ఏ ధ్యాసలో ఉందో రోడ్డును దాటుతూ కారుకు అడ్డుగా వచ్చింది. అదుపుతప్పి రోడ్డుమీద పడిపోయింది. కావేరి ఆందోళనగా డోర్‌ తెరుచుకొని కిందకు దూకింది. ముందుకురికి పడిపోయిన ఆమెను పైకిలేపబోతూ ఆశ్చర్యానికి గురైంది.
ఇంకా చీకట్లు తొలగిపోని ఆ వేకువలో వీధిదీపాల వెలుతురులో వెంటనే గుర్తించింది కావేరి. ఆమె... సుభద్రాంటీ. కావేరి స్నేహితు రాలి తల్లి. ‘‘ఆంటీ... మీరా... ఏమైంది? ఈ టైమ్‌లో ఇలా... ఆందోళన, ఆశ్చర్యం కలగలిసిన గొంతుకతో ప్రశ్నించింది కావేరి.
సుభద్ర సర్దుకుంటూ లేచి నిలబడింది. ‘‘చిత్ర...! చిత్ర... ఆసుపత్రి...’’ అంటూ రోడ్డుకు ఆవలివైపు చూపిస్తూ అలజడితో ఉన్నదాన్లా మాటలు వెతుక్కుంటోంది. క్యాబ్‌డ్రైవర్‌ కారును పక్కన నిలిపి తమవైపే చూస్తున్నాడు.
కావేరికి అర్థమయ్యీ కానట్లు అనిపిస్తుంటే ఆమెను పక్కకు తీసుకెళ్లి గద్దెపైన కూర్చోబెడుతూ ‘‘దెబ్బలేమైనా తగిలాయా ఆంటీ...?’’ అంది. ఆమె లేదన్నట్లు తల ఆడించింది. ఆమె స్థిమితపడేదాకా ఆగి ‘‘చిత్రకేమైంది ఆంటీ...? ఇంతపొద్దున్నే ఎక్కడికెళ్తున్నారు?’’ అడిగింది నిదానంగా.
సుభద్ర మొహంలో బాధాపూరితమైన మార్పు చోటుచేసుకుంది. అప్పటికి కోలుకున్నదాన్లా ‘‘కావేరీ... వచ్చావా...? నాకు తెలుసు... నువ్వు వస్తావని. చిత్ర... ఇంతపని చేస్తుందని నువ్వు ఊహించావా...? అంది ఆందోళన నిండిన స్వరంతో.
కావేరికేమీ అర్థం కాలేదు. ‘‘ఏమైందాంటీ చిత్రకు?’’ రెట్టించింది.
సుభద్ర గొణిగినట్టుగా అంది... ‘‘ఆత్మహత్యా యత్నం చేసింది’’.
కావేరి షాక్‌కు గురైనదాన్లా కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది. తర్వాత తమాయించుకొంటూ ‘‘ఎక్కడుంది ఇప్పుడు...’’ అంది ఆదుర్దాగా.
రోడ్డుకు అటువైపునున్న శాంతి హాస్పిటల్‌వైపు చేయి చూపించింది సుభద్ర. కావేరి టైమ్‌ చూసింది. ఇంకా గంటన్నర సమయముంది ట్రెయిన్‌కు. రైల్వే స్టేషన్‌కు ఇక్కణ్ణుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. క్యాబ్‌ అతనికి పేమెంట్‌ ఇచ్చేసి వెళ్లిపొమ్మంది. బ్యాగ్‌ తీసుకొని ‘‘పదండి ఆంటీ...’’ అంది. ఆమె వెంటనే లేచి ‘‘ఇంజక్షన్‌ తీసుకెళ్లాలి. ఇందాక పగిలిపోయింది రోడ్డుమీద’’ అంది.
కావేరికి విషయం స్పష్టమైంది. రోడ్డుకు ఇటుపక్కనున్న ఒకేఒక్క మెడికల్‌షాపు రాత్రిళ్లూ తెరిచి ఉంటుంది. కనుక ముసిమబ్బువేళలో ఆమె ఈవైపు వచ్చింది. కావేరి ఆమెచేతిలోని ప్రిస్క్రిష్షన్‌ అందుకొని ‘‘నేను తెస్తాను ఇక్కడే ఉండండి’’ అంటూ మెడికల్‌ స్టోర్‌వైపు పరుగెత్తింది. మూడు నిమిషాల్లో తిరిగొచ్చి ‘‘పదండి...’’ అంది.

రోడ్డుకు కుడివైపున ‘శాంతి హాస్పిటల్స్‌’ అని పెద్దలైట్లతో వెలుగుతోంది. ఇద్దరూ అటువైపు అడుగులేస్తుంటే కావేరి మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు.
‘చిత్ర... చిత్ర ఎందుకు ఆత్మహత్య చేసుకోబోయింది? తనకేమీ పెద్దగా కష్టాలుకూడా లేవే?! చిన్నప్పట్నుంచీ తనకున్న అతికొద్దిమంది స్నేహితుల్లో చిత్ర ఒకతి. ఇంటర్మీడియట్‌ దాకా కలిసి చదువుకున్నారు. ఒకరి గురించి ఒకరికి అంతా తెలుసు. అయినా తను ఆత్మహత్య దాకా వెళ్లిందంటే... తనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్నమాట’ అనుకుంది కావేరి.
లిప్టులో పైకి తీసుకెళ్తోంది సుభద్ర.
‘ఏం జరిగుంటుంది? వీళ్లేమీ పేద, మధ్యతరగతి కుటుంబీకులు కాదు. మమ్మీలాగే ఆంటీ కూడా జాబ్‌ చేస్తుంది. అంకుల్‌కు పెద్దపెద్ద బిజినెస్‌లున్నాయి. చదువులోనూ ఎప్పుడూ ముందుండే చిత్రకు పెద్దగా సమస్యలేవీ లేవు. కాకపోతే వాళ్లమ్మానాన్నలు కాస్త క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. మరి ఆత్మహత్యాయత్నానికి కారణం?!’... ఆలోచిస్తోంది కావేరి.
లిఫ్ట్‌ నాలుగో ఫ్లోర్‌లో ఆగింది. సుభద్రతో కలిసి గదిలోకి వెళ్లింది. లోపల బెడ్‌పైన పడుకొని ఉన్న చిత్రకు ఇద్దరు నర్సులు సెలైన్‌ ఎక్కిస్తున్నారు. ఓ పక్కన చిత్ర తమ్ముడు శ్రీకాంత్‌ బిత్తరపోయి కూర్చొని ఉన్నాడు. లోపలికి అడుగు పెట్టగానే ‘‘ఒక ఇంజక్షన్‌ కోసం ఇంతలేటా...?’’ అంటూ కావేరి చేతిలోనున్న ఆంపుల్‌ను లాక్కొని సిరంజ్‌లో లోడ్‌ చేసింది నర్సు.
చిత్ర మగతలో ఉంది. తను తాగిన బాత్‌రూమ్‌ క్లీనర్‌ను కక్కించేందుకు స్టమక్‌వాష్‌ చేశారు హాస్పటల్‌ వాళ్లు. ఇంకా పూర్తిగా స్పృహలోకి రాలేదు. నర్సు సూదిమందును సెలైన్‌లోకి ఎక్కించగానే మగతలో ఉన్న చిత్ర మరింత గాఢతలోకి వెళ్లింది. కావేరి ఆత్రంగా వెళ్లి చిత్ర పక్కనే కూర్చొంది. కానీ తనిప్పుడు ఎవరొచ్చిందీ గుర్తించే స్థితిలో లేదు.
‘‘ప్రమాదం ఏమీ లేదుకదా ఆంటీ’’ అంది కావేరి. సుభద్ర లేదన్నట్లు తల ఊపింది. ‘‘నిద్ర పోనీండి... ఎవరూ లేపొద్దు. ఏదైనా అవసరం పడితే పిలవండి’’ అంటూ నర్సులిద్దరూ వెళ్లిపోయారు.
గదిలో గాఢ నిశ్శబ్దం అలుముకొంది. సుభద్ర నిస్తేజమైన చూపుల్తో మౌనంగా కూర్చొని కూతురువంకే చూస్తోంది. ‘‘అంకుల్‌ లేరా ఆంటీ...’’ అంది కావేరి నిశ్శబ్దాన్ని చీల్చుతూ.
‘‘లేరు. బెంగుళూరెళ్లారు రెండ్రోజుల క్రితం. ఇంకో మూడ్రోజుల వరకూ రారు. ఆయన్నెందుకు టెన్షన్‌ పెట్టాలని చెప్పలేదు కూడా...’’
‘అదే మంచిదిలెండి’ అంటూ. ‘‘నాకు తెలియని సమస్యలు ఏమున్నాయాంటీ చిత్రకు? అసలేం జరిగింది?’’ అనడిగింది. జరిగింది తెలుసుకునేవరకూ మనసు స్థిమితమయ్యేలా లేదు కావేరికి. రాకేష్‌ ట్రెయిన్‌టైమ్‌కు అరగంట ముందు వస్తానన్నాడు స్టేషన్‌కు. అతనొచ్చేలోపే వెళ్లాలని ఒకవైపు! ఇక్కడ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన బాల్యస్నేహితురాలికి ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆత్రుత ఇంకోవైపు. ఉబలాటాన్ని అణచుకోవడానికి ప్రయత్నిస్తూ ‘‘నాకు కాకపోతే ఎవరికి చెబుతారు... చెప్పండాంటీ...? అంది.
సుభద్ర గొంతు సవరించుకొని చెప్పడం మొదలుపెట్టింది.

*             *             *

చిత్రవాళ్లది చిన్న కుటుంబం. అమ్మానాన్నలు సుభద్ర నటరాజన్‌లు, తమ్ముడు శ్రీకాంత్‌. పిల్లల విషయంలో చిత్ర తల్లిదండ్రులు మొదట్నుంచీ స్ట్రిక్టుగానే ఉండేవారు. చిత్ర క్రమశిక్షణలోనే పెరిగింది.
చిన్నప్పుడు చాక్లెట్‌ కావాలంటే... ‘చాక్లెట్‌ తింటే దగ్గు వస్తుంది’ అనేది సుభద్ర. ఐస్‌క్రీం తింటానంటే జలుబు చేస్తుందని వారించేది. చిత్రకు పాలు ఇష్టం లేకుంటే ‘చిన్నపిల్లలు పాలు తప్పనిసరిగా తాగాలని బలవంతంగా తాగించేది.
పెద్దయ్యాక స్నేహితులతో కలిసి పిజ్జాలు, బర్గర్‌లు తింటుంటే చూసి ఇంటికొచ్చాక క్లాస్‌ తీసుకుంది. బేకరీ పుడ్స్‌ తింటే లావెక్కుతారనీ, అవి ఆరోగ్యానికి అంత మంచివికావనీ హితబోధ చేసింది. ఇంటర్మీడియట్‌లో ఓరోజు క్లాసులు నడవనివేళ... ఫ్రెండ్స్‌తో కలిసి చెప్పకుండా సినిమాకెళ్లినందుకు తండ్రికి చెప్పి మరీ వార్నింగ్‌ ఇప్పించింది. కొందరు స్నేహితులకు ఆంక్షలు విధించింది కూడా. ఎలాంటి సినిమాలకెళ్లాలో, ఎవరితో కలిసివెళ్లాలో కూడా తానే నిర్దేశించేది.
ఇదంతా చిత్ర సరిగా అర్థం చేసుకోలేకపోయింది. చిత్రేకాదు, ఆ వయసులో ఉన్న ఏ పిల్లలూ ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేరు కూడా. బోడి పెత్తనంతో తమను అదుపులో పెడుతున్నారనుకుంటారు. అందరు తల్లిదండ్రుల్లా కాకుండా తమవారు ప్రేమ లేనివారనుకుంటారు.
చిత్రకూడా అలాగే అనుకుంది.
హైస్కూల్‌ చదువుతున్నదశలో స్కూల్‌బస్‌ అనుకూలంగా లేకపోయేసరికి సొంతంగా ఆటోను కుదిర్చారు. సమయానికి స్కూల్లో దిగబెట్టడం, మళ్లీ సాయంత్రం ఇంటికి చేర్చడం ఆ ఆటోవాలా పని.
తొమ్మిదో తరగతిలో ఓరోజు స్కూల్‌కు బయలుదేరిన చిత్ర మొహంచూసి ఏదో అయిందని గ్రహించాడు ఆటో అబ్బాయి శామ్యూల్‌. దారిలో బేకరీ దగ్గర ఆటో ఆపి చాక్లెట్‌ కొనిచ్చాడు.
చిత్ర మొహం వెలిగింది. ‘‘థాంక్యూ శామ్యూల్‌’’ అంది. చాక్లెట్‌ను ఇష్టంగా  తిన్నది. మరోరోజు చిత్ర మూడ్‌ను గ్రహించి అదే బేకరీ దగ్గర ఐస్‌క్రీం కొనిచ్చాడు. ఆమె పులకించిపోయింది. ‘‘శామ్యూల్‌, నాకు ఐస్‌క్రీం కొనియ్యాలని నీకెందుకు అనిపించింది...?’’ అంది గోముగా.
‘‘మీ అమ్మతోటి ఐస్‌క్రీం కోసం వాదులాడంగ చూసిన...’’ అన్నాడు. చిత్ర మొహం ఏదోలాపెట్టి ‘‘ఏమో శామ్యూల్‌! సొంత కూతురికి ఐస్‌క్రీం అడిగితేకూడా కొనియ్యని పేరెంట్స్‌ నాకే ఉన్నారు...’’ అంది బాధపడుతున్నట్లు.
‘‘పోనీలే చిత్రా! గంతదానికి బాధెందుకు? నేనున్నానుగదా! నీకేది గావాలన్నా చెప్పు. నేను కొనిస్తా...’’ అన్నాడు.
ఆమెకు హాయిగా అనిపించింది ఆమాట. తన ఇష్టాల్ని గుర్తించే వ్యక్తి ఒకరున్నారు అనుకుంది. ఆరోజు నుండి వస్తూపోతున్నప్పుడు చాక్లెట్లో, కేకో, సమోసానో... ఏదో ఒకటి అతను కొనియ్యడం... చిత్ర తీసుకొని సంతోషపడడం జరుగుతూవస్తోంది. కాలక్రమంలో వాళ్లమధ్య స్నేహం బలపడింది.
ఇంటర్మీడియట్‌ చదువుతున్నప్పుడు సెలవురోజు చిత్ర తన స్నేహితులతో సినిమాకు వెళ్తానంది. తల్లి వద్దంది. ‘‘పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. సెలవురోజు ఇంట్లో చదువుకోవాల్సిందిపోయి సినిమాలేంటి...?’’ అంది.
ఆరోజంతా చిత్ర బాధపడుతూనే ఉంది. మరునాడు కాలేజీకి వెళ్తున్నప్పుడు శామ్యూల్‌ అడిగాడు. ‘‘చిత్రా! ఏమైంది? అట్ల డల్‌గా ఉన్నవ్‌...?’’
ఎవరికో ఒకరికి తన బాధ చెప్పుకోవాలనే తపనలో ఉన్న చిత్ర... ఇంట్లో తనను సినిమాకు వెళ్లకుండా అడ్డుకున్న విషయం చెప్పింది.
‘‘ఓస్‌... అంతేనా? నీకు సినిమా చూడాల్నుందా... నేను చూపిస్త...’’ అన్నాడు.
ఆమె ఉత్సుకతగా ముందుకువంగి ‘‘నిజమా... అదెట్లా సాధ్యం? సెలవురోజు బయటకు వెళ్లనీయరుగదా... మమ్మీడాడీ...’’ అంది.
‘‘సెలవురోజు వెల్లనీయరు. కాలేజీకి డుమ్మాగొట్టి పోవాల. మల్ల కాలేజ్‌ అయిపోయే టైంకు ఇంటికిబోవాల...’’ అన్నాడు శామ్యూల్‌.
ఆమె కొంత ఉత్సుకత, కొంత సందిగ్థతలో ‘‘ఇంట్లో తెలిస్తే కాళ్లిరగ్గొడతారు...’’ అంది.
‘‘తెల్వనియ్యం గదా! కాలేజీకి లీవ్‌బెట్టు. లెటర్‌ నేనిచ్చేత్త...’’ అన్నాడు శామ్యూల్‌.
అంతే! ఆమెలో ఉత్సాహం ఉరకలెత్తింది. ఆరోజు అతనితో కలిసి సినిమాకెళ్లింది. ఇంటికెళ్లడానికి ఇంకా సమయం మిగిలితే ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌కెళ్లి తమకిష్టమైనవన్నీ తిని మెల్లగా ఇంటికి బయలుదేరారు.
వస్తుంటే ‘‘శామ్యూల్‌... నామీద నీకున్నంత ఇష్టం మా పేరెంట్స్‌కి కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేదో...!’’ అంది నిర్లిప్తంగా
అతను ఆమెను ఓదారుస్తున్నట్లు ఆమె భుజంమీద చేయివేశాడు. ఆరోజునుండి వాళ్లకు సినిమాలూ, షికార్లూ సాధారణమయ్యాయి. ఇద్దరిమధ్యా స్నేహం మరింత ముదిరింది. తర్వాత డిగ్రీలో కూడా కాలేజీకి వెళ్ళొచ్చేందుకు అతని ఆటోనే కొనసాగించేలా చూసుకుంది.
ఆరోజు... చిత్ర పుట్టినరోజు.
తండ్రి బిజినెస్‌ పనిమీద పూణె వెళ్లాడు. తల్లి సుభద్రకు ఆరోజు సాయంకాలం హెడ్డాఫీసులో తప్పనిసరిగా హాజరు కావాల్సిన మీటింగ్‌ ఉంది. రాత్రయినా కావచ్చు. అదే విషయాన్ని చిత్రకు చెప్పి ‘‘ఈసారి బర్త్‌డే స్వీట్స్‌ పంచడంతోనే సరిపెట్టుకోమ్మా! వచ్చేయేడు ఘనంగా చేసుకుందాం...’’ అని చెప్పి ఆఫీసుకెళ్లింది.
అది విన్న శామ్యూల్‌ ఆరోజు సాయంత్రం కాలేజీనుండి ఆమెను ఒంటరిగా ఉంటున్న తన ఫ్రెండ్‌ రూమ్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ పెద్దకేక్‌తో సహా బర్త్‌డే ఏర్పాట్లు చేసిపెట్టాడు. రూమ్‌లో వాళ్లిద్దరేతప్ప ఫ్రెండ్‌ కూడా లేడు.
చిత్ర ఉబ్బి తబ్బిబ్బయిపోయింది.
తనకోసం... తనకోసం... ఇంత గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్‌ చేస్తున్న ఈ మనిషి తనకేం అవుతాడు? తన తల్లిదండ్రులకు లేని పట్టింపు ఇతగాడికెందుకు? తనంటే అంతప్రేమా...??
తనకు ‘చిత్ర’ంటే ఎంతిష్టమో చేతల్తో చూపించాడతడు. ఆమె చేతిని పట్టుకుని, పక్కనే ఉండి కేక్‌ కట్‌ చేయించాడు. తన స్వహస్తాల్తో తినిపించాడు. మనసులో పొంగిపొర్లుతున్న ఆనందంతో ఆమె కూడా కేక్‌ముక్కను అతని నోట్లో పెట్టింది. ఇద్దరి హృదయాల్లో చెప్పరానంత ప్రేమ పెల్లుబికింది.
అతనన్నాడు ‘‘ప్రతి సంవత్సరం ఇట్ల నీ బర్త్‌డేను నేనే పక్కనుండి చేయాలనిపిస్తంది.’’
‘‘నాకూ... నీ పక్కనే బర్త్‌డే జరుపుకోవాలనుంది...’’
అంతే! ఆ ఆనందంలో ఆవేశంలో ఇద్దరి మధ్య హద్దులు చెరిగిపోయాయి. శామ్యూల్‌ను విడిచి ఉండలేని స్థితికి వచ్చింది చిత్ర.
ఇంటికెళ్లేసరికి రాత్రయింది. అప్పటికే ఇల్లుచేరిన సుభద్ర రుద్రతాండవం చేసింది. ఆటోవాడితో స్నేహం గురించి తమ్ముడు తల్లికి చెప్పాడు. అగ్గిమీద గుగ్గిలమైన తల్లి, కూతురును ఎడాపెడా బాదింది. ఆటోవాణ్ణి ఏమైనా అంటే తమ పరువే పోతుందనే భయంతో అతన్ని మళ్లీ తమ ఇంటివైపు కన్నెత్తిచూడొద్దని హెచ్చరించి సాగనంపింది.
తల్లి చేతిలో చావుదెబ్బలుతిన్న చిత్ర రాత్రంతా ఏడుస్తూనే ఉంది. తెల్లవారినుండి ఆమె దాదాపు గృహనిర్భందానికి గురైంది. భర్త రాగానే ఇద్దరూ కలిసి చర్చించి చిత్రను కాలేజీ మాన్పించివేశారు. ప్రైవేటుగా డిగ్రీ రాయించాలని నిర్ణయించారు.
చిత్ర మాత్రం శామ్యూల్‌ను కలుసుకోవాలని తహతహలాడుతూనే ఉంది.
ఈ దశలోనే శామ్యూల్‌ ఏకంగా ‘ఇద్దరం వెళ్లి చర్చిలో పెళ్లి చేసుకుందామ’ని వర్తమానం పంపాడు. అతని ఆలోచనల్లోనే మునిగితేలుతున్న చిత్ర ఆ రాత్రి చెప్పాపెట్టకుండా అతనితో వెళ్లిపోయింది.
పరువే పరమావధిగా బ్రతికిన ఆ తల్లిదండ్రులు కంటికి మింటికి ఏకధారగా విలపించారు. పోలీస్‌ రిపోర్టు ఇస్తే తమ కుటుంబపరువు పూర్తిగా గంగలో కలుస్తుందని, ఆత్మీయుల్ని నలుగుర్ని వెంటేసుకుని అన్నిచోట్లా గాలించారు. చిత్ర ఆచూకీ తెలియలేదు. చివరకు పోలీస్‌ రిపోర్టిచ్చినా ఫలితం లేకుండాపోయింది.
అయితే సరిగ్గా వారం రోజులకు... చిత్ర... తనే వచ్చింది. వాడిన పూబంతిలా...!

*             *             *

సుభద్ర చెప్పడం ఆపింది.
హాస్పిటల్‌ గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది.
చిత్ర... తన కుటుంబ సభ్యులకంటే ఆటోవాలాను ఎక్కువ ఇష్టపడుతుందన్న విషయం తనకు తెలిసిందే అనుకుంది కావేరి. కానీ తరువాతి పరిణామాలు తెలియవు. అందుకే... ‘‘తర్వాత... తర్వాత ఏం జరిగింది ఆంటీ...?’’ అంది ఉద్విగ్నంగా ‘‘వాస్తవం తనే గ్రహించింది’’

‘‘ఏంటా వాస్తవం...??’’
‘‘తమ ఆరోగ్యం కోసం భద్రత కోసం తల్లిదండ్రులు చేసే నియంత్రణను పిల్లలు ప్రేమరాహిత్యంగా భావించి, బయటి వ్యక్తులు దురుద్దేశంతో అందించే తాయిలాలను ప్రేమకానుకగా భావిస్తే... నిండు జీవితం బండలవుతుందని తానే స్వయంగా గ్రహించింది’’
‘‘ఎట్లా...?’’
‘‘పెళ్లి పేరుతో తీసుకెళ్లి వారం రోజులపాటు కాపురం పెట్టాడు ఆటోఅబ్బాయి. చిత్ర పెళ్లి ప్రపోజల్‌ తీసుకొస్తే... ‘మీ అమ్మానాన్నలు ఇష్టపడి మనిద్దరికీ పెళ్లిచేస్తేనే చేసుకునేది’ అని లంకె తగిలించాడు.
‘ప్రాణం పోయినా అమ్మానాన్నలు ఒప్పుకో’రన్నది చిత్ర.
‘అయితే పెండ్లి విషయం ఆలోచించుడు మానుకో’ అన్నాడు.
‘పెండ్లి కాకుంటే నన్ను లేపుకొచ్చినట్లవుతుంది కదా’ అంది చిత్ర.
‘ఎట్లైతేంది? మీవోళ్లు పెండ్లి చేత్తమని వొచ్చెదాంక గిట్లనే కలిసుందాం. నీదగ్గర పైసలు, నగలు ఉన్నయ్‌గదా! గవ్వి అయిపోయేదాంక బేఫికర్‌. నాకా ఉద్యోగం, సదువు లేదు. మీవోళ్లను కాదని లగ్గం జేసుకొని మనం బతికేదెట్ట?’
‘నీకు కావాల్సింది నేనా... మావాళ్లా...?’
‘ఉత్త నువ్వుకాదు. మీ అమ్మానాన్నలతో కలిసున్న నువ్వు...’ అతను నవ్వాడు.
చిత్రకు వాస్తవం అర్థమైంది. అతనిది ప్రేమకాదనీ, కేవలం స్వార్ధమనీ గ్రహించిన వెంటనే అతన్ని కాదని వచ్చేసింది’’ వివరంగా చెప్పింది సుభద్ర.
గాఢంగా నిట్టూర్చింది కావేరి. ‘‘మరి అతనిమీద పోలీసులకి కంప్లయింట్‌ చెయ్యలేదా ఆంటీ...?’’
‘‘ఏంటీ చేసేది? తప్పు చిత్రవైపు కూడా ఉందికదా?’’
‘‘అది సరే... తప్పు తెలుసుకుని ఇంటికొచ్చిందికదా! మరి ఈ ఆత్మహత్యా ప్రయత్నం ఎందుకు?’’ కావేరిలో సందిగ్ధం అట్లాగే ఉంది.
సుభద్ర చాలాసేపు మౌనంగా ఉండిపోయి నెమ్మదిగా అంది. ‘‘చిత్ర... గర్భవతని తెలిసింది.’’
కావేరి ఉలిక్కిపడింది. కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తర్వాత సంశయిస్తూనే అంది. ‘‘ఈ పరిస్థితుల్లో... అతనితో పెళ్లికి ప్రయత్నిస్తే ఎట్లా ఉండేదాంటీ...? అతనికి ఉద్యోగం లేకున్నా... మీరే ఏదన్నా దారిచూపించి...’’ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు.
‘‘కావచ్చు! కానీ... అతనికి అప్పటికే
పెళ్లైంది.’’
బాంబ్‌ పేలినట్లు అదిరిపోయింది కావేరి. ‘‘ఏంటీ...??’’
పెళ్లైన వ్యక్తి... ఓ చదువుకునే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడా? పెళ్లిచేసుకుందామని పిలిచి వారంరోజులు కాపురం చేసి వదిలివేశాడా? అయినా వదిలేసింది అతడు కాదు. చిత్రే అతన్ని వదిలించుకుని వచ్చింది.
మరి వదిలించుకోక...?!
‘అమ్మానాన్నల ఆస్తితోకూడిన చిత్ర’ కావాలన్నాడంటే... అతడెంత అవకాశవాది...? ఒక ఆటోవాలాను నమ్మి బయటకుపోతే సరైన గుణపాఠమే నేర్పాడు మరి!
దీనిద్వారా ఏమర్థమవుతుంది?? నియంత్రించినా... పిల్లలకు ఒకదశవరకూ తల్లిదండ్రులే అసలైన భద్రత అనికదా!!
అయినా, చిత్ర... ఎంత తెలివితక్కువ పని చేసింది... అనుకుంటూ ఉలిక్కిపడింది కావేరి... మరి... తను?! తను చేస్తున్నదేమిటీ...??
ఒక కారుడ్రైవర్‌తో లేచిపోవడానికి సిద్ధపడింది.
పెంపకంలో అమ్మానాన్నలు అనుసరిస్తున్న నియంత్రణను బంధనంలా తనింటి కారుడ్రైవర్‌ ప్రదర్శిస్తున్న ఆసక్తిని ప్రేమగా భావించింది. అతడందించే తాయిలాలకు మురిసిపోయి తల్లిదండ్రులకంటే అతడే ఆత్మీయుడనుకుంది. అతడు స్మార్ట్‌ఫోన్‌
కొనిస్తే తీసుకుంది. సినిమాకు తీసుకెళ్తే వెళ్లింది. చివరకు అతనితోనే ప్రేమలో పడింది.
అమ్మానాన్నలు పెట్టే ఆంక్షలు కాస్త ఎక్కువే అయ్యుండొచ్చు. కానీ తమ పిల్లలకు ఎప్పుడు ఏది అవసరమో, ఏది అవసరంకాదో తల్లిదండ్రులకు తెలిసేఉంటుంది. ఏది చేసినా అదంతా తన భద్రతకోసమనీ, తనమీద వాళ్లకున్న బాధ్యతా, ప్రేమా అనీ గుర్తించకుండా... తామిచ్చే జీతంమీద ఆధారపడి బ్రతికే వ్యక్తితో తను... వెళ్లిపోవడానికి సిద్దపడింది.
అతను ఎట్లాంటివాడో... అతని కుటుంబ పరిస్థితులేంటో తెలియదు. అతడు తనను ఎట్లా పోషిస్తాడో తెలియదు. అయినా కొద్దినిమిషాల్లో అతనితో కలిసి బతకడానికి రైలు ఎక్కబోతోంది.
గదిలో గడియారం ఆరుగంటలైనట్లు చూపిస్తోంది.
వెళ్లాలి...!
కావేరి లేచివెళ్లి సుభద్ర కన్నీళ్లు తుడిచింది. ‘‘ఏడవకండి ఆంటీ! అంతా మన మంచికే జరుగుతుంది. చిత్ర కోలుకున్నాక వస్తాను... ధైర్యం చెప్పడానికి’’ అని నెమ్మదిగా బయటకు నడిచింది. లిప్టులో కిందకు దిగుతుంటే సుభద్ర అన్న మాట ఆమె మనసులో పదేపదే ప్రతిద్వనిస్తోంది.
‘తమ ఆరోగ్యంకోసం భద్రతకోసం తల్లిదండ్రులు చేసే నియంత్రణను పిల్లలు ప్రేమరాహిత్యంగా భావించి, బయటి వ్యక్తులు దురుద్దేశంతో అందించే తాయిలాలను ప్రేమకానుకగా భావిస్తే... నిండు జీవితం బండలవుతుంది...’
కఠినంగా అనిపించినా ఎంతో వాస్తవం ఉంది అందులో.
ఆలోచిస్తుంటే మనసుపొరలపై పరుచుకున్న చీకటితెరలు క్రమక్రమంగా విడివడుతున్నట్లు అనిపించిందామెకు. భవిష్యత్‌ ప్రపంచం కనులముందు లీలగా దర్శనమిస్తుంటే... ఎదురుగా వస్తున్న ఆటోను ఆపింది.
ఆమె ఎక్కి కూర్చోగానే ఆటో పరుగుతీసింది.
అయితే... రైల్వేస్టేషన్‌ వైపు కాదు! కావేరి ఇంటివైపు!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న