ఉందిలే మంచికాలం... - Sunday Magazine
close

ఉందిలే మంచికాలం...

- కె.కె. భాగ్యశ్రీ

‘‘సా యంత్రం నువ్వు ఫ్రీయేనా’’ లాప్‌టాప్‌ ముందేసుకుని సీరియస్‌గా ఆఫీస్‌ పని చేసుకుంటున్న సమీరని అడిగింది పావని.
‘‘ఇవాళ వర్క్‌లోడ్‌ కొంచెం తక్కువగానే ఉన్నట్లుంది. ఐదు దాటాక క్లోజ్‌ చేసేస్తా ఎందుకు అలా అడుగుతున్నావు?’’ చేస్తున్న పనిమీద నుంచి దృష్టి మరల్చకుండానే అడిగింది సమీర.
‘‘అబ్బే... మరేమీ లేదు... అదీ... అదీ...’’  నీళ్లు నమలసాగింది పావని.
‘‘అంతలా నసుగుతున్నావు... నాకేమన్నా కొత్త సంబంధం చూశావా?’’ తల్లివైపు చూసి చిరునవ్వు నవ్వింది సమీర. ఆమె ముఖంలో హాసరేఖ చూసి ‘హమ్మయ్య... తాను చెప్పాలనుకున్నది జంకకుండా చెప్పేయొచ్చును’ అనుకుని ‘‘అంతేగా మరి!’’ అంది పావని కుర్చీ లాక్కుని కూతురి పక్కనే కూర్చుంటూ.
అంతే... సమీర వదనంలో క్షణం కిందట కనబడి పావనికి ఊరట కలిగించిన దరహాసం మాయమైంది. ఆ మార్పుకి బెదిరినట్లుగా చూసింది పావని.
‘‘అమ్మా... నీకెన్ని సార్లు చెప్పాను... ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని. మళ్లీ మళ్లీ నన్ను ఇబ్బందిపెడతావెందుకు?’’ ముఖం గంటుపెట్టుకుంది సమీర.
‘సమీర వద్దన్నదని, తాను బెదిరిపోయి ఆగిపోతే... ఈ సమస్య ఎప్పటికీ తీరదు’ అనుకున్న పావని, కూతురి హావభావాలను పట్టించుకోనట్లుగా చూస్తూ...
‘‘నువ్వు వద్దనే అంటావు. కానీ, ఒక తల్లిగా కూతురికి పెళ్లి చేయడం నా బాధ్యత. ఇప్పటికే ‘కూతురి సంపాదనకోసం ఇంకా పెళ్లి చేయకుండా అట్టిపెట్టుకుంది’ అని బంధువులందరూ నన్ను ఎత్తిపొడుస్తున్నారు. కాబట్టి నువ్వు వద్దన్నా, కద్దన్నా... ఈ ఏడాది నీ పెళ్లి చేయడం మాత్రం ఖాయం’’ గద్గదమైన స్వరంతో పలికింది పావని.
తల్లి మనసు కష్టపెట్టుకున్నదని అర్థమైంది సమీరకి.
లాప్‌టాప్‌ తీసి మంచం మీద పెట్టి, తల్లి భుజాల మీద చేతులువేసి ఆమె దగ్గరగా చేరి ‘‘ఎందుకమ్మా అలా బాధపడతావు? నేను అస్సలు పెళ్లి చేసుకోనని అనడంలేదు కదా! కొన్నాళ్లు టైమ్‌ అడుగుతున్నానంతే... ప్లీజ్‌ మా... ట్రై టు అండర్‌ స్టాండ్‌...’’ బ్రతిమలాడినట్లుగా అంది సమీర.
‘‘నాలుగేళ్లుగా ఇదే మాట చెబుతున్నావు? ఇక ఊరుకునేది లేదు.
నా మాట మీద గౌరవం ఉంటే సాయంత్రం పెళ్లివారొస్తారు. రెడీగా ఉండు’’ ఖచ్చితంగా చెప్పేసింది పావని.
నిస్సహాయంగా చూసింది సమీర. ఎప్పుడూ తాను వద్దనగానే ఆ ప్రయత్నం విరమించే తల్లి, ఈసారి ఏమాత్రం తగ్గకుండా తనని శాసిస్తోందంటే... తనకి పెళ్లి చేయాలని ఆవిడ ఎంతటి కృతనిశ్చయంతో ఉందో అర్థమైంది.
‘‘అవునుగానీ, అమ్మా... ఈ కరోనా కాలంలో నన్ను చూసుకునేందుకు పెళ్లికొడుకెక్కడ దొరికాడు నీకు? అసలే... లాక్‌డౌన్‌ పీరియడ్‌ కూడానూ...’’ హాస్యంగా అంటూ తల్లిని హత్తుకుంది సమీర.
‘‘మనసుంటే మార్గం ఉంటుంది. మన సావిత్రి ఆంటీ లేదూ... వాళ్ల పక్కింటివాళ్ల అబ్బాయి నీలాగే ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌కి ముందే ఇంటికి వచ్చేశాడట... ఇంట్లోనుంచే పని చేస్తున్నాడట... మొన్న ఏవో మాటల మధ్యన వాళ్లమ్మగారు తన కొడుకు పెళ్లి గురించి అంటూ ఉంటే... సావిత్రికి నువ్వు గుర్తొచ్చావట. వెంటనే నాకు చెప్పింది’’ ఉత్సాహంగా చెప్పుకుపోతున్న తల్లిని చూస్తే ఆవిడ తన పెళ్లికోసం ఎంతగా కలవరిస్తోందో సమీరకి తెలిసొచ్చింది.
‘పాపం! ఆవిడ తాపత్రయం ఆవిడది. తన చిన్నతనంలోనే తండ్రి పోతే ఎన్నో కష్టనష్టాల కోర్చి తనని ఇంతటిదాన్ని చేసింది. తనకి పెళ్లి చేసి, ఆవిడ బాధ్యత తీర్చుకోవాలని తపిస్తోంది. అది సహజం కూడానూ. కానీ, తనకే... ఏదో వేదనగా ఉంది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే... ఆవిడ ఒంటరిది అయిపోతుంది... అన్న భయం. వచ్చేవాడు ఎలాంటివాడు వస్తాడో... ఆవిడని బాగా ఆదరిస్తాడో లేదో... అన్న మీమాంసతో పెళ్లి వాయిదా వేస్తూ వస్తోంది. అది ఆమెకి చెప్పలేదు... అలాగని ఆమెని ఇంకా ఇంకా బాధపెట్టలేదు.
ఏవేవో ఆలోచనలలో మునిగితేలుతున్న కూతురిని చూస్తూ ‘‘ఏంటీ... ఈ పెళ్లి చూపులెలా తప్పించుకోవాలోనని... ప్లానేస్తున్నావా? ఈసారి ఆ పప్పులేమీ ఉడకవు. పెళ్లి చూపులకి నువ్వు రెడీ అవుతున్నావు... అంతే...’’ కుండ బద్దలుకొట్టినట్లుగా అంది పావని.
‘‘సరే... నీ మాట నేనెందుకు కాదనాలి... కానీ, ఒక్క షరతు...’’
‘‘మళ్లీ ఏంటి?’’ అడిగింది పావని.
కూతురు ఏ ఫిటింగ్‌ పెట్టి ఈ పెళ్లిచూపుల ఘట్టాన్ని కాదంటుందోనన్న భీతి ఆమెది.
తల్లి ముఖంలో మారుతున్న కవళికలు చూసి ‘‘నువ్వంతలా కంగారు పడక్కరలేదులే... నేను చెప్పేది నా ముస్తాబు గురించి. ముందే చెబుతున్నా... పిచ్చి పిచ్చి పట్టుచీరలు కట్టుకోమంటే నావల్ల కాదు. అమ్మోరిలా నగలు దిగేసుకోమని పోరితే అసలే వీలుకాదు. నేను నాలాగే... వినబడుతోందా... అచ్చం నాలాగే ఉంటా...’’ నిష్కర్షగా చెప్పేసింది సమీర.
‘కాదు... కూడదంటే’ మొదటికే మోసం వస్తుందేమోనన్న బెంగతో ‘‘అవేమీ వద్దులే... కనీసం ముఖమన్నా కడుక్కుంటావా?’’ అడిగింది పావని సంశయంగా.
‘‘ముఖం కడుక్కోవడమేం ఖర్మ... ఏకంగా స్నానమే చేస్తాను. అదీ ఆ రాబోయే వాళ్లకోసం కాదు... మండువేసవి కదా... ఆ టైమయ్యేసరికి ఒళ్లంతా చిరాకుగా తయారవుతుంది’’ స్పష్టం చేసింది.
‘‘ఏదో ఒకటిలే... కానీ, ఆ నైటీ దిగేసుకోకుండా... కాస్త మంచిగా...’’ అర్ధోక్తిలో ఆగిపోయింది పావని.
‘‘డోంట్‌ వర్రీ అమ్మా... చక్కగా చుడీదార్‌ వేసుకుంటాలే’’ అభయం ఇచ్చినట్లుగా నవ్వింది సమీర.
సంతోషం పట్టలేక కూతురిని దగ్గరగా తీసుకుని నుదుటిమీద ముద్దుపెట్టుకుంది పావని.
‘‘ఆ అక్షింతలేవో నీ నెత్తిన చల్లేస్తే... అక్కడికి నాకు మనశ్శాంతిగా ఉంటుంది’’ అంది కళ్లమ్మట నీళ్లు తిరగగా.
తల్లి కంట చెమ్మ చూడగానే సమీర మనసు మెలితిప్పినట్లైంది.
‘‘ప్లీజ్‌ అమ్మా... ఎందుకు బాధపడుతున్నావు? పెళ్లికి నేను వ్యతిరేకంకాదు. కాకపోతే... ఏవేవో భయాలూ, సందేహాలూ... అంతే’’ అంటూ తల్లిని ఊరడించింది.
తేటపడిన వదనంతో నవ్వింది పావని కళ్లు తుడుచుకుంటూ.

* * * *

సాయంత్రం ఐదు కాగానే శుభ్రంగా స్నానంచేసి, గంజిపెట్టిన కాటన్‌ చుడీదార్‌ వేసుకుని, తల దువ్వుకుని, క్లిప్‌తో జుట్టుని బంధించి తయారైంది సమీర.
కూతురి వైఖరికి అసంతృప్తి కలిగినా, తాను ఏమన్నా అంటే ‘‘ఠాట్‌... పెళ్లిచూపులూ... గిళ్లిచూపులూ ఏమీవద్దు... అని మొండికేస్తుందని భయం.
అందుకే... ‘కిమన్నాస్తి’ అనుకుని మౌనంగా ఉండిపోయింది పావని. ‘అడగగానే పెళ్లిచూపులకి ఒప్పుకుంది... అదే పదివేలు’ అనుకుంది మనసులోనే.
ఐదు గంటలకే వస్తానన్న వాళ్లు ఐదున్నర అయినా అయిపూ అజా లేరు.
‘‘ఈరోజు ఖచ్చితంగా వస్తామన్నారే... ఇంకా రాలేదేంటి చెప్మా...’’ తనలోతానే అనుకుంటున్నట్లుగా బయటకే అంది పావని.
‘‘అమ్మా... నేను మొదటినుంచీ అనుకుంటున్నా... ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌లో పెళ్లిచూపులేమిటా అని... నువ్వే... పొద్దుటినుంచీ నా బుర్ర తిన్నావు...’’ సమీర విసుగ్గా అనేసి తన గదిలోకి వెళ్లబోతూంటే కాలింగ్‌బెల్‌ మోగింది.
పావని ఉత్సాహంగా కూర్చున్న చోటునుంచి లేస్తూ ‘‘నేను చెప్పానా... తప్పకుండా వస్తారని. వాళ్లే అయ్యుంటారు’’ ఉరుక్కుంటూ వెళ్లి తలుపు తీసింది.
గుమ్మానికి అవతల ఆరడుగుల అబ్బాయి ఒకడు నిలబడి ఉన్నాడు. ముఖకవళికలు కనబడకుండా ముఖానికి మాస్క్‌ అడ్డుగా ఉంది. కళ్లు మాత్రం విశాలంగా, చూపులు చురుగ్గా ఉన్నాయి.
పావనిని చూడగానే అతడు ముఖానికి ఉన్న మాస్క్‌ కిందకి జారుస్తూ... ‘‘పావనిగారిల్లు ఇదేనాండీ?’’ అంటూ అడిగాడు మర్యాద ఉట్టిపడే స్వరంతో.
‘‘అవును బాబూ... మీరూ?’’ పావని సందేహంగా చూసింది అతడివైపు.
‘‘నేను కిరీటి అండీ...’’ చెప్పాడు అతడు.

‘‘ఓహ్‌... సారీ బాబూ... లోపలికి రండి... మీ అమ్మగారు-నాన్నగారు కూడా వస్తారని అనుకున్నా... మీరొక్కరే కనబడేసరికి...’’ అంటూ గుమ్మానికి అడ్డు తొలగింది.
కిరీటి లోపలికి అడుగుపెట్టాడు మొహమాటంగా.
కాలింగ్‌బెల్‌ మోతకి గదిలోకి వెళ్లబోతున్నదల్లా ఆగిపోయిన సమీర, లోపలికి వచ్చిన అతడికేసి చూసింది అభావంగా.
‘‘కూర్చోండి బాబూ...’’ సోఫా చూపించింది పావని.
‘‘ఆంటీ ప్లీజ్‌... మీకన్నా చిన్నవాడిని... నువ్వు అనండి’’ చెప్పాడతను వినయంగా.
‘‘అలాగే బాబూ... మంచినీళ్లిమ్మంటావా?’’
‘‘కొంచెం తెండి ఆంటీ...’’ అన్నాడు కిరీటి.
పావని కూతురివైపు చూసింది. సమీర లోపలికి వెళ్లి చల్లని మంచినీళ్లతో తిరిగివచ్చింది.
‘‘మా అమ్మాయి సమీర బాబూ...’’ పరిచయం చేసింది పావని.
‘‘హాయ్‌...’’ అన్నాడు కిరీటి పలకరింపుగా నవ్వుతూ.
పలచని ఆ చిరునవ్వు సమ్మోహనంగా అనిపించింది సమీరకి.
‘‘హాయ్‌...’’ అంది తను కూడా.
‘‘థాంక్స్‌...’’ మంచినీళ్ల గ్లాసు అందుకున్నాడు కిరీటి. తన చేతిలోని ట్రేని టీపాయ్‌ మీద పెట్టి, అతడికి ఎదురుగా కూర్చుంది సమీర.
‘‘అమ్మ-నాన్నగారూ...’’ ప్రశ్నించింది పావని.
‘‘రాలేదండీ... నాన్నగారు మార్చి నెలలో పనిమీద ముంబై వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు. అమ్మ ఇవాళ అలసిపోయి, రాలేకపోయింది పెళ్లి చేసుకోవలసింది నువ్వే కదా, వెళ్లి చూసి రమ్మని అమ్మ పంపితే నేనొక్కడినే వచ్చా... సారీ ఆంటీ... లేటైంది’’ అన్నాడు కిరీటి కాస్త సిగ్గు పడుతూ.
‘‘ఫరవాలేదులే బాబూ...’’ నవ్వేసింది పావని.
‘‘మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి... నేను వెళ్లి తాగడానికి చల్లగా ఏమన్నా తీసుకొస్తా...’’ వాళ్లకి ఏకాంతం కల్పించాలనే ఉద్దేశ్యంతో లోపలికి వెళ్లిపోయింది పావని.
‘‘మూడు నెలలుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నా... మరి మీరూ...’’ మాట కలిపాడు కిరీటి.
‘‘డిటో... ఇలా ఇంటికి వచ్చానో లేదో... మరి నాలుగు రోజులకే లాక్‌డౌన్‌ ప్రకటించేశారు’’ నవ్వింది సమీర.
‘‘ఇకముందు కూడా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమే’ కంటిన్యూ చేస్తారంటున్నారు’’ అన్నాడు కిరీటి.
‘మే బి. బహుశా అన్ని కంపెనీలకీ ఉండకపోవచ్చేమో...’’ అంది సమీర.
‘‘అసలీ ‘కరోనా’పీడ ఎప్పటికి తొలగిపోతుందో! ఎక్కడో ఎవడో... ఏదో తినడం ఏమిటో... జనాలందరికీ ఈ రోగం చుట్టుకోవడమేమిటో!’’ వేదాంతధోరణిలో అన్నాడు కిరీటి.
అతడు అన్న తీరుకి నవ్వొచ్చింది సమీరకి.
అలా... కాసేపు ఇద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. ఈలోపు పావని చల్లని మామిడిపళ్ల రసం తీసుకొచ్చింది.
‘‘జ్యూస్‌ చాలా బాగుందాంటీ... థాంక్స్‌...’’ తాగడం ముగించిన కిరీటి చెప్పాడు.
నవ్వుతూ తలూపింది పావని.
‘‘మీరు కూడా కూర్చోండి ఆంటీ...’’ అన్నాడు కిరీటి.
‘‘ఫరవాలేదు బాబూ... మీరిద్దరూ మాట్లాడుకోండి’’ అంది పావని.
‘‘మీరు పెద్దవారు... ముందుగా మీతోనే నా గురించి చెప్పుకోవాలి. నాకు వచ్చే ప్యాకేజ్‌ సంవత్సరానికి పన్నెండు లక్షలు. నాకు వచ్చే దానిలో పదిశాతం ఛారిటీస్‌కి ఖర్చుపెడతాను. ఈ సమాజానికి నాకు చేతనైనదేదో చేయాలన్న తాపత్రయం. ఈ లక్షణం నాకు మా అమ్మనుంచి వచ్చింది.
మా అమ్మ తాతగారికి ఒక్కతే అమ్మాయి. పుట్టింటి ఆస్తి మీద వచ్చే డబ్బుతో ఆమె సంఘసేవ చేస్తూ ఉంటుంది. నలుగురు పేదపిల్లలని చదివిస్తోంది. ఈరోజు కూడా కÛరోనా కారణంగా బాధపడుతున్న వారికి బియ్యం, పప్పులూ అవీ పంచి వచ్చింది. అక్కడ ఎండదెబ్బ తినడం వల్లే ఇక్కడికి రాలేక పోయింది. తాను ఎవరికన్నా సహాయం చేయలేనినాడు మరణించినట్లేనని ఆమె భావన.
ఇవన్నీ మీకు ముందుగానే తెలియడం మంచిదని చెబుతున్నాను. రేప్పొద్దున్న మా ఇంటికి కోడలిగా రాబోయే అమ్మాయి ఈ విషయంలో అభ్యంతరాలు లేవదీయడం మంచిది కాదని, ముందే క్లారిటీ ఇస్తున్నా... నాకైతే సమీర బాగా నచ్చింది. తనకి కూడా నేను నచ్చితే పెద్దవాళ్లు ఒక నిర్ణయానికి రండి.’’ తాను చెప్పాలనుకున్న దాన్ని సూటిగా చెప్పేశాడు కిరీటి.
సమీర ముఖం వికసించింది. తన ఆలోచనలకీ, భావాలకీ దగ్గరగా ఉన్న అతడి మనస్తత్వం ఆమెకెంతగానో నచ్చింది. ఆ సంబరంలో ఆమె తల్లి ముఖంలో మారుతున్న రంగులని గమనించలేకపోయింది.
‘‘మంచిది బాబూ... సమీర నీకు నచ్చడం మా అదృష్టం. నేను సమీరతో మాట్లాడి ఏ విషయం మీకు తెలియచేస్తాను’’ ముక్తసరిగా అంది పావని.
‘‘అలాగే ఆంటీ... తొందరేమీ లేదు... అన్నీ ఆలోచించాకే కబురు చేయండి. బై సమీరా... టేక్‌ యువర్‌ ఓన్‌ టైమ్‌’’ అన్నాడు కిరీటి తేటగా నవ్వుతూ.
సమీర నవ్వుతూ తలూపింది. కిరీటి వాళ్ల దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. పావని ఖాళీ జ్యూస్‌ గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్లిపోయింది.
సమీరకి కిరీటి వ్యక్తిత్వం, ముక్కుసూటి దనం అన్నీ బాగా నచ్చాయి. అతడి తోడుంటే తల్లిని బాగా చూసుకోగలనన్న నమ్మకం కలిగించాయి అతడి మాటలు. తల్లి తనని అడిగితే కనక అతడిని చేసుకోవడం తనకిష్టమేనని చెప్పెయ్యాలనుకుంది. కానీ, పావని ఆ ప్రస్తావనే తేలేదు. తనంతట తాను చెప్పడానికి ఏదో బిడియం అడ్డువచ్చింది. సరేలే... ఆమె కూడా ఆలోచించుకోవాలి కదా అనుకుని ఊరుకుంది సమీర.
కానీ, నాలుగైదు రోజులు గడచినా పావనిలో ఉలుకూ-పలుకూ లేదు.
ఆరోజు పొద్దున్నే సరుకులకోసం సమీర బజారుకి వెళ్లినప్పుడు అనుకోకుండా కిరీటి కనిపించాడు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు.
‘‘ఆ రోజునుంచీ మీరు ఫోన్‌ చేయలేదు... మీ కాల్‌ కోసం ఎదురుచూస్తున్నా...’’ అంది సమీర కాస్త బిడియంగా.
‘‘మీ అమ్మగారు తన డెసిషన్‌ చెప్పేశాక మరి ఫోన్‌ చేయడం అనవసరం అనిపించింది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి కదా... ఇక డిస్టర్బ్‌ చేయడం దేనికని...’’ వాడిన వదనంతో చెప్పాడు కిరీటి.
‘‘అమ్మ... డెసిషన్‌ చెప్పిందా?’’ ఆశ్చర్యంగా అడిగింది సమీర.
‘‘మీకు తెలియదా? మా సంబంధం నచ్చలేదనీ, వేరే ఎవరినన్నా చూసుకోమనీ సావిత్రి ఆంటీ ద్వారా చెప్పేశారు కదా!’’ అంతకన్నా ఆశ్చర్యపోతూ అడిగాడు కిరీటి.
‘‘నిజంగా నాకు తెలియదు. అయాం సో సారీ...’’ క్షమించమన్నట్లుగా చూసింది సమీర.
‘‘ఇట్స్‌ ఓకే... అయిందేదో అయింది. మీతో మాట్లాడిన తరువాత మీరు నాకు సూటబుల్‌ మ్యాచ్‌ అనిపించింది. అందుకే నా నిర్ణయం వెంటనే చెప్పేశాను. మీకు కూడా నేను నచ్చి తీరాలని రూలేం లేదు కదా!’’ బలవంతంగా నవ్వాడు కిరీటి. అతడికేసి చూడాలంటేనే ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది సమీరకు.
పెళ్లి విషయంలో మొదటినుంచీ తనకి అపరిమితమైన స్వేచ్ఛ ఇచ్చిన తల్లి, కనీసం తన అభిప్రాయాన్ని కూడా తెలుసుకోకుండా ఎందుకు నిరాకరించిందో ఆమెకు అంతుచిక్కడంలేదు.
తన గురించి కిరీటి ఏమనుకున్నాడో... అని ఆలోచిస్తూంటేనే చాలా అవమానంగా అనిపిస్తోంది.
‘‘ప్లీజ్‌ కిరీటీ... అమ్మ ఇలా ఎందుకు చేసిందో నాకు కూడా తెలియదు... బట్‌... ఒక్కటి మాత్రం నిజం... నాకు మీరు బాగా నచ్చారు’’ తల దించుకుని చెప్పింది సమీర.
‘‘తల దించుకునేంత తప్పు మీరు చేయలేదు సమీరా... ఆంటీ ఇలా చేయడం వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. నేను మీకు నచ్చినందుకు చాలా థాంక్స్‌. కానీ, మీ అమ్మగారి నిర్ణయాన్ని గౌరవించవలసిన బాధ్యత మీకుంది. ఇక నేను వెళతాను’’ మృదువైన స్వరంతో పలికి అక్కడినుంచి వెళ్లిపోయాడు కిరీటి.
అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది సమీర.
ఇంటికొస్తూనే చేతిలోని సరుకుల సంచిని విసురుగా ఓ పక్కకి గిరాటేసి ‘‘అమ్మా... అమ్మా...’’ అంటూ అరిచింది పెద్దగా.
వంటగదిలో కూర పోపేస్తున్న పావని కూతురలా ఆగ్రహంతో చిందులు తొక్కడం చూసి ‘‘అబ్బబ్బా... ఏమిటే ఆ గావుకేకలు...’’ అంటూ చేతిలోని అట్లకాడ సహితంగా హాల్లోకి వచ్చింది.
‘‘ముందిది చెప్పు... నేనేమన్నా నిన్ను నాకోసం సంబంధాలు వెతకమని దేబిరించానా? నువ్వేగా పెళ్లి-పెళ్లి అంటూ నా వెంటబడి ఈ సంబంధం తెచ్చావు... అలాంటిది కనీసం నా అభిప్రాయం కనుక్కోకుండా వాళ్లకి ‘నో’ ఎలా చెప్పేశావు?’’ కోపంతో తల్లిమీద విరుచుకుపడింది సమీర.
‘‘ఓ... విషయం తెలిసిపోయిందా? నీ క్షేమం కోసమే ఈ సంబంధం కాదన్నాను.’’ తాపీగా చెప్పింది పావని వంటగదిలోకి వెళ్లి కూర కలిపేసి తిరిగొచ్చి.
‘‘ఓహో... రమ్మనడం, కాదనడం అన్నీ నీ ఇష్టమేనా? అలాంటప్పుడు నన్ను అడగడం దేనికి? ఎవడో ఒకడికి నన్నిచ్చి ముడిపెట్టేయి’’ రుసరుసలాడింది సమీర.
కూతురికి కిరీటి బాగా నచ్చాడని పావనికి అర్థం అయింది.
‘‘ఆవేశం తగ్గించుకుని నేను చేప్పేది కూల్‌గా విను. ఈ ‘కరోనా’ మూలాన ఎందరికో ఉద్యోగాలు ఊడుతున్నాయనీ, సంపాదన కోల్పోయి చాలామంది రోడ్డున పడుతున్నారనీ వార్తల్లో చూస్తూనే ఉన్నాము కదా! దీని తరువాత ఈ టెక్కీల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదంటున్నారు...’’
‘‘అయితే... దానికీ దీనికీ సంబంధం ఏమిటీ?’’ తెల్లబోయింది సమీర.
‘‘ఉంది... చూడబోతే ఆ తల్లీ కొడుకులకి భవిష్యత్తుకు సంబంధించి ఏమాత్రం ముందు చూపు లేనట్లుంది. ఛారిటీలూ, సమాజసేవల పేరిట ఉన్నదంతా దానధర్మాలు చేసి, ఆర్పేసు కుంటున్నారు. ఒక్కడూ ఉన్నప్పుడే అతడు సేవింగ్స్‌ గురించి ఆలోచించడంలేదు. రేపు పెళ్లయి, పిల్లలు పుట్టాక పరిస్థితి ఏమిటి? చూస్తూ చూస్తూ అలాంటి ఇంటికి నిన్ను పంపించ మంటావా?’’ ఆవేదనగా అంది పావని.
సమీర తెల్లబోయింది తల్లి చెప్పిన కారణం విన్నాక. ఇదా... తల్లి ఈ సంబంధం కాదనడానికి గల కారణం!
‘‘సిల్లీగా మాట్లాడకమ్మా... దానికీ దీనికీ ఏమిటి సంబంధం? కొంతమందికి అలా నలుగురికి సహాయపడడంలో ఆనందం ఉంటుంది. పెద్ద కొంపలు మునిగిపోయి నట్లుగా మాట్లాడతావేమిటి? కనీసం నీ కూతురి మనసులో ఏముందో కూడా తెలుసుకోవా?’’ కస్సుబుస్సులాడింది సమీర.

‘‘ఏమోనమ్మా... మీ నాన్నగారు ఇలాగే పరోపకారం అంటూ ఉన్నదంతా తగలేసి నాకు చిప్ప మిగిల్చారు. ఆయన పోయాక నిన్ను పెంచడానికి నేనెన్ని అవస్థలు పడ్డానో నీకు తెలియదు. నీకు అలాంటి స్థితి రాకూడదనే నా బాధంతా’’ పావని గొంతు గద్గదమైంది.
తల్లి బాధ చూసిన సమీర మనసు ఆర్ధ్రమైంది. ఒక తల్లిగా ‘కీడెంచి మేలెంచమన్న’ ఆవిడ వైఖరి సమంజసమేననిపించింది. తల్లిని దగ్గరగా పొదువుకుని ‘‘పిచ్చి అమ్మా... ఇదా నీ బాధ! కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోతుందనుకున్నావా? అది నిరంతర స్రవంతి. కాలగతిలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవాళ్టి ఈ బాధలు ఎల్లకాలం ఉండిపోతాయంటావా? గతంలో ఇంతకన్నా భయంకరమైన జబ్బులూ, ప్రకృతి వైపరీత్యాలూ దాపురించి మానవ జీవితాలని అల్లకల్లోలం చేశాయి. వాటన్నింటి బారినుంచీ తమని తాము రక్షించుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది మానవాళి అంతా.
మనిషి ఆశాజీవి. రేపుమీద ఆశతో... అలా ప్రయాణిస్తూనే ఉంటాడు. రాబోయే కాలం బాగుంటుందేమోనన్న ‘పాజిటివ్‌ థింకింగ్‌’ అతడి మనుగడకి దోహదపడుతుంది.
నిజానికి నేను కిరీటిని ఇష్టపడింది కూడా ఈ సేవాగుణం చూసే. సాటిమనిషి కష్టానికి స్పందించి సహాయం చేసే తత్వం ఎందరికుంటుంది చెప్పు! అతడిని అలా తీర్చిదిద్దిన వాళ్లమ్మగారు ఎంత గొప్పమనిషో ఆలోచించావా? అలాంటివారి సహకారం ఉంటే భవిష్యత్తులో నిన్ను చక్కగా చూసుకునే వీలు  చిక్కుతుందన్న ఆశ నాకు కలుగుతోంది.
వాళ్లింటికి కోడలిగా వెళ్తే నా జీవితం బాగుంటుంది అని నాకనిపించింది. ఒక తల్లిగా నీ భయాలు నీకుంటాయి. కాదనను. కానీ, భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా నేను తట్టుకుని నిలబడగలననే అనుకుంటున్నాను. ఆ విషయంలో నువ్వే నాకు ఆదర్శం. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి చూడు...’’ ఇందాకటి కోపం మటుమాయం కాగా, శాంతపూరిత స్వరంతో పలికింది సమీర. బేలగా కూతురివైపు చూసింది పావని. సమీర ముఖంలో ఒక నిబ్బరం, మాటల్లో ఒక దృఢసంకల్పం, కళ్లలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడడం గమనించిన పావని పునరాలోచనలో పడింది.

Advertisement

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న