మంచితనమే ఆస్తి - Sunday Magazine
close

మంచితనమే ఆస్తి

గిరిజనాభివృద్ధి శాఖలో ఉద్యోగి బాలు. భార్య సంధ్య జబ్బు మనిషి. కూతురు కరుణకి పెళ్లి చేసి పంపిస్తే ఆమెను రాచిరంపాన పెట్టి కట్నం బకాయిల కోసం వేధిస్తారు అత్తింటివారు. ఆమె కాక మరో ఇద్దరు పిల్లలు బాలు సంసారం. మెతక స్వభావం, మంచితనం అతని ఆస్తులు. అదే వీధిలో ఉండే ఖాన్‌ సాబ్‌ కుటుంబంతో బాలూకి స్నేహం. ఈ నేపథ్యంలో సాగే పలు సంఘటనల సమాహారం ఈ నవల. మధ్య తరగతి కుటుంబాల్నీ, మానవ సంబంధాల్నీ వివరిస్తూ ఖాన్‌తో స్నేహం బాలూకి ఎలా ఉపయోగపడిందీ, కరుణ సంసారం ఎలా చక్కబడిందీ... తదితర ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. మద్యపానంలాంటి వ్యసనాలూ, వరకట్నం లాంటి దురాచారాలూ సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో చర్చిస్తుంది. మనుషులు చెడ్డవారు కాదనీ పరిస్థితులు వారికి తెలియకుండానే వారిని చెడ్డవారిగా మార్చేస్తాయనీ చెబుతూ ఆసక్తిగా చదివిస్తుంది.

- పద్మ

మిస్టర్‌ బాలు
రచన: అమ్జద్‌
పేజీలు: 120; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 040 27678430


ముత్యాల పొత్తులు

కవిత్వమంటే అపురూపమైన ఉపమానాలేగా! వాటిని తనదైన భాషతో అపూర్వంగా అందించారు కవయిత్రి. ఎక్కడి జొన్నపొత్తూ...ఎక్కడి తుపాకీకి తగిలించిన టోపీ! ఆ రెండింటినీ కలిపి ‘దాని తురాయి/సైనికుడి తుపాకీ మొనమీద/నిలిపిన టోపీలాగుంది’ అనడానికి ఎంత మంచి ఊహావైభవం ఉండాలి. ఇలాగే ‘ఆకాశం నుంచి చూస్తే/కాలసముద్రంలో తేలిన/తాబేలు కూడా కావొచ్చు’ అంటారు ‘మహాగజరాజులా ఎదుట నిలిచినట్టున్న’ భువనగిరి గుట్టని; ‘మా దోసిల్ల అక్షరాలని పోటీపడి/ఒలుచుకుని తిన్న పిచుకల గుంపు ఇదేనా!?’ అని ఆశ్చర్యపోతారు తన పూర్వ విద్యార్థులని చూసి! పజ్జొన్న గటుకా, పిల్లనగొయ్యా, చిల్కలపేర్లు, సందుగ... ఇలా తెలంగాణ యాసలోని మట్టివాసన గుప్పుమంటుందీ కవితల్లో!

- అంకిత

జొన్నకంకి(కవిత్వం)
రచన: నాంపల్లి సుజాత
పేజీలు: 128; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌-9848059893


కథలూ కబుర్లూ

కబుర్లని, ముఖ్యంగా వంటింటి కబుర్లని కథలుగా మలచి చెప్పిన పుస్తకమిది. కొత్తగా వంటింటి బాధ్యత తలకెత్తుకున్నాక ఎదురయ్యే అనుభవాలు పాఠకుల్నీ గతంలోకి తీసుకెళతాయి. కొత్తల్లుడికి ఏమిష్టమో అది చేసిపెట్టడం మర్యాద. అలాగని పుట్టింటా, అత్తింటా, భోజనాలకు పిలిచిన బంధువుల ఇంటా... రోజూ ఒకే కూర వండిపెడితే ఆ మానవుడి పరిస్థితి ఎలా ఉంటుందో వర్ణిస్తారు ‘వంకాయోపాఖ్యానము-మెంతికారము’ కథలో. సరదాగా కథలు చెబుతూనే ఆయా వంటల అసలు రెసిపీలనూ కథతో పాటే ఇచ్చారు రచయిత్రి.

- శ్రీ

నేను వడ్డించిన రుచులు, చెప్పిన కథలు
రచన: సంధ్య యల్లాప్రగడ
పేజీలు: 132; వెల: రూ. 100/-
ప్రతులకు: నవోదయ బుక్‌ హౌస్‌


సినీజీవిత చిత్రం

డెబ్భై ఏళ్ల నాటి హిందీ చిత్రసీమను కళ్లకు కట్టే నవల ఇది. ‘సినిమా కళా కాదు, వ్యాపారమూ కాదు- కొద్దిమంది ఆడే పేకాట’ అంటారు కొడవటిగంటి. ఆ పేక ముక్కలే ఇందులోని పాత్రలన్నీ. ఆడేవాళ్లకే ఆనందం, ఆడగా ఆడగా నలిగి, చిరిగిపోతాయి ముక్కలు. రఫియా, రజియా, రాజులత, ఆనంద్‌, అక్రమ్‌ లాంటి పేకముక్కలతో ప్రొడ్యూసర్ల రూపంలో షావుకార్లు ఆడుకునే ఆటలేే అసలు కథ. సినీ జీవితవిలువలకీ, మామూలు జీవితవిలువలకీ మధ్య తేడా తెలిసి రాజీపడ్డవాళ్లు బతుకుతారు. అది చేతకానివాళ్లు ఈసురోమంటూ బతుకీడుస్తారు. ఆ బతుకులకు అక్షరరూపమైన ఈ నవల అనువాదంలా కాక, స్వతంత్రరచనలా సులభంగా చదివిస్తుంది.

- సుశీల

పేకముక్కలు

రచన: కిషన్‌ చందర్‌
తెనుగు: అట్లూరి పిచ్చేశ్వర రావు
పేజీలు: 264; వెల: రూ. 220/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు


 

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న