బుజ్జిగాడి క్యారికేచర్‌! - Sunday Magazine
close
బుజ్జిగాడి క్యారికేచర్‌!

పిల్లలు బ్యాట్‌ పట్టుకుని క్రికెటర్ని అవుతాననీ... స్టెతస్కోప్‌ మెడలో వేసుకుని పెద్దయ్యాక వైద్యం చేస్తాననీ వారికి నచ్చిన వృత్తుల్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. మరికొందరేమో నేను స్పైడర్‌ మ్యాన్‌నీ, సూపర్‌మ్యాన్‌నీ అంటూ ఆ గెటప్‌లలో తయారవుతుంటారు. మరి అలాంటి గడుగ్గాయిలు మీ ఇంట్లో ఉంటే వారికి నచ్చిన గెటప్‌లలో ఉన్న మీనియేచర్‌ క్యారికేచర్స్‌ని బహుమతిగా ఇచ్చేయొచ్చు. అచ్చంగా వారి ముఖచిత్రంతోనే వస్తున్న ఈ క్యారికేచర్లు చూడ్డానికి భలేగా ఉంటాయి. పైగా మీ పిల్లలకి వారి  లక్ష్యాన్నీ క్యారికేచర్‌ రూపంలో గుర్తు చేసినట్టు కూడా ఉంటుంది. చెక్క, ఆక్రిలిక్‌తో చేసిన ఈ క్యారికేచర్లు పలు వెబ్సైట్లలో రకరకాల గెటప్‌లతో అందుబాటులో ఉన్నాయి. వాటిలోకి వెళ్లి మీ పిల్లలకు నచ్చిన వృత్తిని ఎంచుకుని అక్కడ వారి ఫొటోని అప్‌లోడ్‌ చేస్తే సరి. తక్కువ ధరకే మీ ఇంటికే క్యారికేచర్‌ హోండెలివరీ వస్తుంది. మీ చిన్నారులూ లేదంటే ఆత్మీయులూ స్నేహితుల పిల్లల పుట్టినరోజులప్పుడు బహుమతిగా ఇవ్వడానికీ బాగుంటాయి.


స్మార్ట్‌ వాచ్‌లోనే ఇయర్‌ ఫోన్లు!

పెద్ద పెద్ద ఫోన్‌లను ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉండాలంటే కాస్త ఇబ్బందే. అందుకే, ఈమధ్య స్మార్ట్‌ వాచ్‌ల వాడకం బాగా పెరిగింది. అయితే, దీంతో ఫోన్‌ మాట్లాడాలన్నా సంగీతం వినాలన్నా బ్లూటూత్‌ లేదా ఎయిర్‌ పాడ్‌లను వెంట ఉంచుకోవాల్సిందే. వాటిని విడిగా తీసుకెళ్లడం, ఎక్కడా పోకుండా జాగ్రత్తగా పెట్టడం అదీ ఓ పనే. ఈ సమస్య లేకుండా స్మార్ట్‌వాచ్‌ లోపలే ఎయిర్‌పాడ్‌లు కూడా పెట్టేసుకునేలా తయారుచేస్తున్నాయి కొన్ని కంపెనీలు. అంతేకాదు, ఈ బ్లూటూత్‌, ఎయిర్‌పాడ్‌లకు విడిగా ఛార్జింగ్‌ కూడా పెట్టక్కర్లేదు. వాచ్‌ ద్వారానే ఛార్జ్‌ అయిపోతాయి. ఎలక్‌స్టర్‌ ఇయర్‌ బడ్స్‌ స్మార్ట్‌ వాచ్‌, రిస్ట్‌ బడ్స్‌ వాచ్‌... లాంటి పేర్లతో వస్తున్నాయి ఇవి.


ఒకటే రెండు విధాలా...

ఇంట్లో ఎన్ని హ్యాండు బ్యాగులున్నా ఎప్పటికప్పుడు కొత్తవి కావాలనుకుంటారు కొందరమ్మాయిలు. అలాగని తరచూ కొని తెచ్చినా ఇంట్లో అడ్డుగా ఉంటాయి. డబ్బులు కూడా వృథా. అలాగని ప్రతిసారీ ఒకే బ్యాగును బయటకు తీసుకెళ్లడం కూడా బాగోదు. అందుకే ఈసారి షాపింగుకి వెళ్లినప్పుడు రివర్సబుల్‌ బ్యాగు ఒకటి కొని తెచ్చేశారనుకోండి... దాన్నే రెండు బ్యాగులుగా వాడేసుకోవచ్చు. ఎలాగంటారా... రెండువైపులా వాడుకోవడానికి వీలుగా వస్తున్న ఈ బ్యాగుల్ని తిరగేస్తే లోపలి వైపు కూడా ఎంచక్కా వాడుకోవచ్చు. ఈ బ్యాగులకు బయటో డిజైన్‌ లోపల మరో డిజైన్‌ ఉంటాయి. కొన్నింటికి వేర్వేరు రంగులు కూడా వస్తున్నాయి. మరికొన్ని టూ ఇన్‌ వన్‌ బ్యాగులకైతే ఒకవైపు ప్లెయిన్‌ మరోవైపు డిజైన్‌ కూడా ఉంటున్నాయి. ఆన్‌లైన్‌లో పలు ఈ-కామర్స్‌ సైట్లలో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఇలాంటి బ్యాగులు ఒకటి కొంటే రెండు బ్యాగులు కొన్నట్లే.


కప్పుకునే రోటీ...

గోధుమ వర్ణంపై... ముదురు ఎరుపు రంగు మచ్చలతో ఉండే రోటీని కూడా ఫ్యాషన్‌ కోణంలో చూశారు నిపుణులు. అందుకే ఇప్పుడు అచ్చంగా అలాగే కనిపించేలా దుప్పట్లు, బెడ్‌షీట్లు, టవల్స్‌, కర్టెన్లు, దిండు కవర్లను రూపొందిస్తున్నారు. అందంగా ఆధునికంగా కనిపించే ఈ రోటీ బెడ్‌షీట్లను మంచంపై వేశారనుకోండి... అంత పెద్ద రోటీని అలా పరిచేశారేంటీ అనుకుంటారు అదాటున చూసినవాళ్లు. అలానే ఈ తరహా టవళ్లలో పిల్లల్ని చుట్టేసి ఫొటోలు తీస్తే... అచ్చం రోటీలో చుట్టినట్టే అనిపిస్తుంది. హాల్లో కర్టెన్‌గా వేలాడదీసినా, కప్పుకున్నా చూసే వాళ్ల కళ్లకు చిత్రంగా ఉండే ఈ రోటీ ఫ్యాషన్‌ ఇంటికి కొత్తందాన్ని తీసుకొస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న