చూస్తే జీన్స్‌... వేస్తే లెగ్గింగ్‌! - Sunday Magazine
close
చూస్తే జీన్స్‌... వేస్తే లెగ్గింగ్‌!

‘డార్క్‌ బ్లూ, లైట్‌ బ్లూ, బ్లాక్‌... ఇంకా వేరు వేరు రంగుల్లోనూ చిరిగినట్లున్నవీ ప్రింట్లున్నవీ... ఇలా జీన్సుల్లో బోలెడు రకాలొచ్చాయి. మళ్లీ వాటినే ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారబ్బా..?’ అని ఈ ఫొటోలను చూసి ఎవరైనా అనుకోవడం సహజమే. అసలు విషయం ఏంటంటే... ఇక్కడున్నవి అసలు జీన్స్‌ కానే కాదు. నూటికి నూరుశాతం లెగ్గింగ్‌లు.

లెగ్గింగ్‌లు... సౌకర్యానికి పెట్టింది పేరు. సైజు కొంచెం అటూ ఇటూ అయినా కాలుని పట్టి ఉంచి స్లిమ్‌గా కనిపించేలా చేస్తాయి. బోలెడంత ఫ్యాషన్‌గానూ ఉంటాయి. కుర్తీ, చుడీదార్‌, అనార్కలీ, టీషర్టులూ... ఇలా వేటిమీదికైనా చక్కగా వేసేసుకోవచ్చు. జాగ్రత్తగా చేత్తో ఉతకాల్సిన పనిలేదు. ఎంచక్కా వాషింగ్‌ మెషీన్‌లో వేసేయొచ్చు. ముడతలు ఉండవు, రంగూ త్వరగా పోదు. ఇలా చెప్పుకుంటూ పోవాలే కానీ లెగ్గింగ్‌ ఉపయోగాల చిట్టా పెద్దదే. ఇక జీన్స్‌ విషయానికొస్తే... అమ్మాయిలకు దానిమీదుండే క్రేజే వేరు. కాకపోతే జీన్స్‌కి కరెక్ట్‌ ఫిట్‌ ఉండాలి, కాస్త లావైతే పట్టదు. వదులైతే బాగోదు. బట్ట మందంగా ఉండడంతో బయట వేడిగా ఉన్నపుడు ఉక్కపోసినట్లుంటుంది, లెగ్గింగ్‌ అంత సౌకర్యంగానూ డెనిమ్‌ ఉండదు. అయినా జీన్స్‌ లుక్‌ జీన్సుదే. అందుకే, ముద్దుగుమ్మలు దాన్ని పక్కన పెట్టలేరు. దీనికి ప్రత్యామ్నాయంగా ట్రెండీగా వచ్చినవే ఈ ‘ఇమిటేషన్‌ డెనిమ్‌/జీన్స్‌ లెగ్గింగ్‌’లు. ఇవి ముమ్మాటికీ లెగ్గింగులే. బట్ట కూడా మామూలు లెగ్గింగులకు వాడే బనియన్‌ క్లాతే. అయితే, వీటిమీద అచ్చం జీన్సులా కనిపించేలా ప్రింట్‌ వేస్తారు. ఇవి ఎంత సహజంగా ఉంటాయంటే వేరు వేరు డెనిమ్‌ రంగులతో పాటు డెనిమ్‌ మీద ఉండే చారలూ బటన్లూ జిప్‌లూ చిరుగుల్లాంటివన్నీ నిజంగా ఉన్నట్లే ఉంటాయి. తడిమి చూస్తేగానీ తెలియదు అవి ప్రింట్‌లు అని. ఈ ఫొటోలను చూస్తేనే ఆ విషయం అర్థమైపోయుంటుంది.

డిజైన్లలోనూ...
ఇమిటేషన్‌ జీన్సు లెగ్గింగుల్లో యాంకిల్‌ వరకున్నవీ త్రీఫోర్త్‌ సైజువీ హైవెయిస్ట్‌... ఇలా బోలెడు రకాలొస్తున్నాయి. ప్రింటెడ్‌ జీన్సులు ఇష్టపడేవారికోసం అలాంటివీ దొరుకుతున్నాయి. వీటితో అటు లెగ్గింగుల్లా సౌకర్యంగానూ ఉంటుంది. ఇటు జీన్సులు వేసుకున్నట్టు ట్రెండీగానూ కనిపిస్తుంది. జెగ్గింగుల్లా కుర్తీలమీదిక్కూడా వేసుకోవచ్చు. వర్షాకాలంలో జీన్స్‌ తడిచినా ఉతికినా త్వరగా ఆరదు. లెగ్గింగ్‌ జీన్స్‌తో ఆ సమస్య కూడా ఉండదు. కొత్త ట్రెండ్‌ అదిరింది కదూ..!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న