ఆ అమ్మాయి కోసం గుండు కొట్టించుకున్నా... - Sunday Magazine
close
ఆ అమ్మాయి కోసం గుండు కొట్టించుకున్నా...

చదువే ప్రపంచమనే కుటుంబం... సినీ ప్రపంచంతో సంబంధం లేని నేపథ్యం ఆ కుర్రాడిది. అయినా ఐదేళ్ల వయసులోనే హీరో కావాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అంతే దృఢంగా ప్రయత్నాలూ చేసి హీరోగా మనముందుకొచ్చాడు కార్తికేయ గుమ్మకొండ.  ‘ఆర్‌ఎక్స్‌100’తో సూపర్‌హిట్‌ కొట్టి ‘గ్యాంగ్‌లీడర్‌’తో విలన్‌గానూ టర్న్‌ తీసుకున్న ఈ యువ నటుడి సినీ జీవితం తన మాటల్లోనే...

హాయ్‌ అండీ...అందరికీ దసరా శుభాకాంక్షలు. నాకు ఎంతో ఇష్టమైన ఈ పండుగ రోజున నా గురించి మీతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ముందు దసరా అనుభవాలు చెబుతా. మాకు ఇది పెద్ద పండుగ. చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు దసరా సెలవులు వస్తాయా అని ఎదురు చూసేవాడిని. ఎందుకంటే క్వార్టర్లీ ఎగ్జామ్స్‌ అయ్యాక పదిరోజులకుపైనే వచ్చే ఆ సెలవుల్లో పుస్తకాలకు దూరంగా ఉండటం చెప్పలేనంత కిక్‌నిచ్చేది. అలానే ఏటా అమ్మమ్మా నానమ్మల ఊరు వెళ్లేవాళ్లం. అక్కడ ఆడవాళ్లంతా బతుకమ్మలు ఆడుతుంటే చూడ్డానికి ఎంతో బాగుండేది. ఎక్కడెక్కడో ఉండే మా బంధువులంతా ఇంటికి వచ్చేవాళ్లు. అందరం జమ్మి చెట్టును పూజించి పాల పిట్టను చూసేవాళ్లం. పెద్దలకు జమ్మి ఆకు ఇచ్చి వాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకునేవాళ్లం. ఎంతో సరదా సరదాగా జరుపుకునే ఆ పండుగ కోసం ముందు నుంచే క్యాలెండర్‌లో తారీఖులు మార్కు చేసుకుని ఎదురు చూస్తుండేవాడిని. ఇప్పుడు అంత సమయం ఉండట్లేదు. ఆ సరదాలన్నింటినీ మిస్‌ అవుతున్నా.

నా గురించి చెప్పాలంటే మా సొంతూరు నల్గొండ జిల్లా మర్రిగూడెం. తాతయ్యా వాళ్లు ఎప్పుడో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మాకు వనస్థలిపురంలో స్కూళ్లున్నాయి. పది వరకూ అక్కడే చదువుకున్నా.
ఎడ్యుకేషన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న కుటుంబాల్లో పిల్లల్ని బాగా స్ట్రిక్టుగా చూస్తారని అందరికీ తెలిసిందేగా. మా ఇంట్లో కూడా అంతే. నన్ను బాగా చదివించాలనుకున్నారు అమ్మానాన్నలు. నాకేమో సినిమాలంటే పిచ్చి. దాంతో ఆదివారం మధ్యాహ్నం మాత్రమే సినిమా చూడ్డానికి ఒప్పుకునేవారు. అలా సినిమా చూసి అందులోని హీరోలా ఆ వారమంతా బిహేవ్‌ చేసేవాణ్ని. అద్దం ముందు నిల్చుని హీరోల్లా డైలాగులు చెబుతూ డాన్సులు ఇరగదీసేవాణ్ని. అంతలా సినిమాలపైన ఇష్టం
కలగడానికి కారణం ‘చూడాలని ఉంది’లో రామ్మా చిలకమ్మా... ప్రేమా మొలకమ్మా పాట. అప్పటికి నాకు ఐదేళ్లుంటాయి. ఎందుకో పాటలో చిరంజీవి గారి డాన్స్‌కి పడిపోయా. నేను కూడా పెద్దయ్యాక అలా అవ్వాలని అనుకున్నా. ఏకాస్త అవకాశం వచ్చినా ఆ పాటకి డాన్స్‌ చేసేవాణ్ని. దాంతో నాకు సినిమాలంటే ఇష్టమని మా ఇంట్లో వాళ్లకి అర్థమైంది కానీ అదే కెరీర్‌గా ఎంచుకుంటానని మాత్రం ఊహించలేకపోయారు.
మా అమ్మ మాత్రం చదవకపోయినా, మార్కులు సరిగా రాకపోయినా చితక్కొట్టేది. పొద్దున్నే మూడు గంటలకి నిద్రలేపేది. ఉదయం నాలుగు గంటల నుంచీ ఏడింటి వరకూ, సాయంత్రం స్కూలు అయ్యాక ఐదు నుంచి రాత్రి పదింటి వరకూ టీచర్లే ఇంటికొచ్చి ట్యూషన్లు చెప్పేవారు.
నాకేమో చదవడం ఇష్టంలేదు. అలాగని ఆ వయసులో సినిమాల్లోకి వెళతానని చెప్పాలంటే భయం. ‘బీటెక్‌ అయ్యాక మా అబ్బాయి అమెరికా వెళ్లి చదువుకుంటాడు’ అంటూ అందరికీ గర్వంగా చెప్పుకునేది మా అమ్మ.  మా అక్క బాగా చదివేది. తనని రోల్‌మోడల్‌గా చూపించి నన్నూ అలా చదవమనేది. చెబితే నమ్మరు... మా అమ్మ ఇంటర్‌ వరకూ కొడుతూనే ఉండేది. ర్యాంకు తెచ్చుకుంటేనైనా ఈ బాధ తప్పుతుందని లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని మరీ వరంగల్‌ నిట్‌లో  కెమికల్‌ ఇంజినీరింగులో సీటు తెచ్చుకున్నా. అక్కడికి వెళ్లాకే నాకు స్వేచ్ఛ దొరికింది. చదవమని కొట్టడానికీ, పొద్దున్నే బలవంతంగా నిద్రలేపడానికీ¨ అమ్మ పక్కన లేకపోవడంతో నాకు నచ్చినట్టు నేను ఉన్నా. పైగా ఆ సమయానికి లావుగా ఉండేవాడిని. సన్నబడటానికి జిమ్‌లో చేరా. కాలేజీలో జరిగే ప్రతి ఫంక్షన్‌లో డాన్స్‌ చేయడం, విడుదలైన సినిమాలు చూడ్డం, షార్ట్‌ ఫిల్మ్‌లు తీయడం వంటివి చేసేవాడిని. నోట్స్‌లు రాయకుండా పక్కవాళ్లవి జిరాక్స్‌లు తీసుకుని చదివేవాడిని. ఈ క్రమంలో చదువు కాస్త పక్కదోవ పట్టింది. ఒకసారైతే మార్కులు తక్కువొస్తున్నాయని అమ్మానాన్నల్ని తీసుకురమ్మన్నారు. ఆ విషయం ఇంట్లో తెలిస్తే కోప్పడతారని తెలిసిన అంకుల్ని బతిమాలి నాన్న అని చెప్పి తీసుకెళ్లా. ఆయన ముందు మా లెక్చరర్‌ నన్ను ఎన్నితిట్టారో. ఆ రోజు మా నాన్న వచ్చి ఉంటే కథ వేేరేలా ఉండేది. మొత్తానికి ఎలాగోలా ఆ సమస్య నుంచి బయట పడ్డా. అక్కడే ఓ లవ్‌ స్టోరీ కూడా నడిచింది. నావీ, నేను ఇష్టపడిన అమ్మాయివీ లక్ష్యాలూ, ఆలోచనలూ వేర్వేరు కావడంతో ఇంజినీరింగు అయ్యాక విడిపోయాం.

ఒక్క ఛాన్స్‌ అడిగా...
ఇంజినీరింగ్‌ తరవాత హైదరాబాద్‌ వచ్చా. అమ్మావాళ్లు పైచదువులు అనేలోపు సినీ రంగంలోకి వెెళ్లాలనుకుంటున్న విషయం ధైర్యంగా చెప్పేశా. కొన్నిరోజులపాటు అమ్మానాన్నలు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఏడవడాలూ అలగడాలూ నిరహారదీక్షలూ వంటివి జరిగాయి. చివరికి ఒకరోజు అమ్మానాన్నలు ఇద్దర్నీ కూర్చోబెట్టి ‘నేను మీరు చెప్పిన రంగంలోకి వెెళ్లి ఎంత సక్సెస్‌ అయినా వేస్టే. అది నాకు సంతృప్తినివ్వదు. ఆ సమయంలో ఏ సినిమా పోస్టర్ని చూసినా బాధ కలుగుతుంది. ఓడిపోయానని నాకు గుర్తు చేస్తుంది. అదే  సినిమాల్లో ప్రయత్నించి ఓడిపోతే ఏ బాధా ఉండదు. అందుకే నాకో ఐదేళ్లు సమయం ఇవ్వండి. ఈ లోపు అవకాశాలు తెచ్చుకోకపోయినా, నిలదొక్కుకోలేకపోయినా వెనక్కొచ్చి మీరు చెప్పినట్టే వింటా’ అని చెప్పా. దాంతో అమ్మా వాళ్లు కన్విన్స్‌ అయినా ఐదేళ్లలో వెనక్కి వచ్చేస్తాడులే అనుకున్నారు. నేను మాత్రం యాక్టింగ్‌ కోర్సు, కిక్‌ బాక్సింగ్‌లో చేరా. అప్పటికి సినీ రంగంలో కూడా పరిచయాలు లేవు. ఆడిషన్ల గురించి తెలుసుకుని వెెళ్లేవాడిని. స్నేహితులు తీసే షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించేవాడిని. క్షణం తీరిక లేకుండా సినిమా ప్రయత్నాల్లో మునిగిపోయా. కొన్నిసార్లు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారేవి. కొందరు రేపూ మాపూ అంటూ తిప్పించుకునేవారు. ఇంకొన్ని సార్లు అవకాశం ఇచ్చాక సినిమా తీయట్లేదు అని చెప్పేవారు. చాలా బాధ అనిపించేది. అయినా పట్టువదలకుండా ప్రయత్నాలు చేసేవాణ్ని. ఆ సమయంలో అమ్మానాన్నలకీ సినిమాల పట్ల నాకున్న ఇష్టం అర్థమైంది. నా మీద నమ్మకం కలిగింది. దాంతో వాళ్లే నిర్మాతలుగా మారి సినిమా తీయడానికి ముందుకొచ్చారు. అలా తీసిన ‘ప్రేమతో మీ కార్తిక్‌’ హిట్‌ కాలేదు. ఆ సినిమాకి పనిచేసిన ఓ టెక్నిషియన్‌ నాకు అజయ్‌భూపతిని పరిచయం చేశాడు. అప్పటికి అజయ్‌ ‘ఆర్‌ఎక్స్‌100’ కథ రాసుకుని హీరో కోసం వెతుకుతున్నాడు. నేను వెళ్లి కలిస్తే కథ చెప్పి హీరోగా నన్ను ఓకే చేశాడు. కానీ సినిమా తీయడానికి నిర్మాత దొరకలేదు. ఇద్దరం కలిసి చాలామందికి కథ చెప్పాం గానీ ఎవరూ తీయడానికి ముందుకు రాలేదు. చాలా నిరుత్సాహపడ్డాం. అప్పుడు మా అక్కే కల్పించుకుని ‘వాడికి ఒక్క హిట్‌ పడితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. మనమే డబ్బులు పెడదాం’ అని ఇంట్లో వాళ్లని ఒప్పించింది. ఆ తరవాత మా సినిమాకి ‘ఆర్‌ఎక్స్‌100’ పేరు పెట్టడానికి అనుమతి ఇవ్వమని జపాన్‌లోని యమహా ఆర్‌ఎక్స్‌100 కంపెనీ వాళ్లకి మెయిల్‌ పెట్టాం. వాళ్లు వెంటనే ఒప్పుకోవడంతో సినిమా పట్టాలెక్కింది. అంతేకాదు, అప్పటి వరకూ బైకు నడపడం రాని నేను ఆ సినిమా కోసమే డ్రైవింగ్‌ నేర్చుకున్నా.
అలా చాలా తక్కువ బడ్జెట్తో తీసిన ఆ సినిమా ఊహించని పేరూ, కలెక్షన్లూ రాబట్టింది. నాకూ బ్రేక్‌నిచ్చింది. ఆ సినిమా విడుదలైన మొదటిరోజు నాన్నతో కలిసి థియేటర్‌లో చూశా. సినిమా అయ్యాక నన్ను పట్టుకుని నాన్న గట్టిగా ఏడ్చేశారు. ఆ కన్నీళ్లకి కారణం చివర్లో నేను చనిపోయినందుకో లేదా సినిమా హిట్‌ అయినందుకో తెలియలేదు. నేనూ ఎప్పుడూ అడగలేదు.
ఆ తరవాత మంచి అవకాశాలు వచ్చాయి. ‘హిప్పీ’, ‘గుణ369’, ‘గ్యాంగ్‌లీడర్‌’ నాకు పేరు తెచ్చిపెట్టాయి. విలన్‌గా చేయడం కూడా కొత్త అనుభూతినిచ్చింది. మంచి పాత్రలు రావాలేగానీ హీరోగా చేస్తూనే విలన్‌గానూ నటిస్తా. ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌లో ‘చావుకబురు చల్లగా’లో శవయాత్ర వాహనం డ్రైవర్‌గా నటిస్తున్నా. ఇంతవరకూ ఏ హీరోనీ ఆ పాత్రలో చూసుండరు. చాలా భిన్నంగా ఉంటుంది. అలానే బోనీ కపూర్‌ తమిళంలో అజిత్‌ కుమార్‌ హీరోగా నిర్మిస్తున్న ‘వలిమై’లో విలన్‌గా చేస్తున్నా. పెద్ద నిర్మాణ సంస్థ... స్టార్‌ హీరోతో కలిసి పని చేయడం చాలా గర్వంగా ఉంది. వరంగల్‌ నిట్‌లో చదివినప్పుడు మార్కులు సరిగా రావట్లేదని తిట్టిన లెక్చరరే ఈ మధ్య క్యాంపస్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కి నన్ను అతిథిగా పిలవడం కొసమెరుపు. అది- నేను ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకం.

- పద్మ వడ్డె


ఇష్టాయిష్టాలు

అభిమాన తారలు: ఇలియానా, సాయి పల్లవి
పనిచేయాలనుకునే దర్శకుడు: పూరీజగన్నాథ్‌
బలం, బలహీనతలు: కుటుంబం
గాడ్‌ ఫాదర్‌: హీరో నాని
హ్యాంగవుట్‌: ఇల్లు
ఇష్టమైన ఫుడ్‌: నాటుకోడి కూర

ఫస్ట్‌ క్రష్‌: రమ్యకృష్ణ, తరవాత దీపిక పదుకొణె


పాపం... శివ

ఇంటర్‌లో ఓ పంజాబీ అమ్మాయిని బాగా ఇష్టపడ్డా. తనని చూస్తూ పరీక్షలు కూడా సరిగా రాసేవాడిని కాదు. కొన్నాళ్లకి ఆమెకి పెళ్లై వెళ్లిపోయింది. అప్పుడు ఎంత బాధపడ్డానో.
* టీనేజీలో నాకు ఇష్టమైన ఓ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు. తనకేమీ కాకూడదనీ, త్వరగా కోలుకుంటే  గుండు కొట్టించుకుంటాననీ వెెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నా. వారం తరవాత తను బాగైంది. వెెంటనే తిరుపతి వెెళ్లి గుండు కొట్టించుకొచ్చా. విషయం తెలియని అమ్మానాన్నలు వీడికి ఇంత భక్తేంటని షాక్‌ అయ్యారు.
* ‘ఆర్‌ఎక్స్‌100’ విడుదలయ్యాక బయటకు వెళితే నన్ను చూసిన ఆడపిల్లలంతా ‘పాపం శివ...’ అంటూ జాలిపడేవారు. ఇప్పటికీ ఎన్ని సినిమాల్లో నటించినా ‘ఆర్‌ఎక్స్‌100’ కార్తికేయ అనే అంటారు. ఆపేరు ఇంటి పేరుగా స్థిరపడిపోయింది.
*  ఒకసారి ఒక అమ్మాయి నా ఫొటోలూ, నా ఆర్టికల్స్‌ అన్నీ అంటించి వాటి కింద కవితలు రాసుకొని వంద పేజీల పుస్తకం తయారు చేసుకుంది. ఒకప్పుడు సినిమా వాళ్లని అంత పిచ్చిగా ఇష్టపడిన నాకోసం ఇప్పుడు ఒకమ్మాయి అలా చేయడం చిత్రంగా అనిపించింది.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న