జలుబూ మంచిదే! - Sunday Magazine
close
జలుబూ మంచిదే!

కొందరికి సీజన్‌ మారగానే జలుబు చేస్తుంటుంది. అయితే ఆ జలుబు రైనొ, పారాఇన్‌ఫ్లుయెంజా వంటి వాటిలానే కొన్ని రకాల కరొనావైరస్‌ల వల్ల కూడా రావచ్చు. అలాంటి జలుబు వల్ల పెరిగే రోగనిరోధకశక్తి కారణంగా కూడా కొవిడ్‌ దీర్ఘకాలంపాటు రాకుండా ఉంటుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ రోచెస్టర్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు. కొన్ని సందర్భాల్లో జీవితాంతం కొవిడ్‌ రాకపోవచ్చట. అదెలా అంటే- వీళ్లు గతంలో కరొనా వైరస్‌ల కారణంగా జలబు చేసిన రోగుల్ని పరిశీలించినప్పుడు- ఆ వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక వ్యవస్థలోని మెమరీ బి- కణాలు వాటిని గుర్తుపెట్టుకుంటున్నాయనీ, దాంతో ఆ వైరస్‌ మళ్లీ శరీరంలోకి ప్రవేశించగానే వెంటనే యాంటీబాడీలను విడుదల చేస్తున్నాయనీ గుర్తించారు. ఈ బి- కణాలు దశాబ్దాల తరబడి జీవించి ఉంటాయి. కాబట్టి, కొత్తగా వచ్చిన కొవిడ్‌ 19 వైరస్‌ సోకినప్పుడూ అవి వాటిని గుర్తించి యాంటీబాడీలను విడుదల చేయడాన్ని గమనించారట. ఫలితంగా గతంలో ఇతరత్రా కరొనా వైరస్‌ల కారణంగా జలుబు చేసినవాళ్లకి అంత త్వరగా కొవిడ్‌ రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా కొవిడ్‌ వాళ్లమీద అంత ప్రభావాన్ని కనబరచకపోవచ్చు అంటున్నారు సదరు పరిశోధకులు.


యూవీ కాంతితో డి-విటమిన్‌!

సాధారణంగా సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు ఆరోగ్యానికి మంచిది కాదు అంటుంటారు. అయితే శరీరానికి అవసరమైన డి- విటమిన్‌ని ఉత్పత్తి చేయాలంటే అవి అవసరం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది డి-విటమిన్‌ లోపం వల్లే అనేక ఎముక సమస్యలతో బాధపడుతున్నారు. అదీగాక చలికాలంలో పగటి వేళలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కాలంలో పెద్దవాళ్లు బయటకు కూడా వెళ్లలేరు కాబట్టి డి-విటమిన్‌ శాతం మరింత తగ్గిపోతుంది. అందుకే జపాన్‌లోని నగొయా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దీనికోసం చక్కని ్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. ఎలుకల్లో చేసిన ప్రయోగాల్లో- డి-విటమిన్‌ లోపంతో బాధపడుతున్న వాటిని వారానికి రెండుసార్లు చొప్పున పన్నెండు వారాలపాటు యూవీఎల్‌ఈడీలకు గురిచేయడంవల్ల వాటిలో డి-విటమిన్‌ శాతంతోపాటు ఎముక సాంద్రత, కండర బలం పెరిగినట్లు గుర్తించారు. అదేసమయంలో చర్మం కూడా దెబ్బతినలేదట. కాబట్టి పోర్టబుల్‌ యూవీ ఎల్‌ఈడీల్ని తయారుచేసి వాటి కాంతిలో కాసేపు కూర్చోవడం ఆస్టియోసార్కొపెనియాతో బాధపడే వృద్ధులకు ఉపయోగపడుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు.


ఆటలే ఎముకలకు బలం!

చిన్నవయసులో వ్యాయామం ఎక్కువగా చేసినవాళ్లలో పెద్దయ్యాక ఎముక బలం బాగుంటుందనీ దాంతో ఆస్టియోపొరోసిస్‌ రాకుండా ఉంటుందని బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయ నిపుణులు చెబుతున్నారు. అది కూడా పన్నెండేళ్ల వయసు నుంచీ ఆటలాడటం, పరుగులెత్తడం ఎక్కువగా చేసేవాళ్లకి పాతిక సంవత్సరాలు వచ్చేసరికి ఎముకల్లో పటుత్వం పెరుగుతుందట. వాళ్లతో పోలిస్తే ఆటలు ఆడకుండా ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాళ్లలో తరవాతి కాలంలో ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉందట.  దీనికోసం వీళ్లు 12, 14, 16, 25 సంవత్సరాల వరకూ ఎంపిక చేసి యాక్సెలోమీటర్ల ద్వారా వాళ్ల శరీర కదలికల్ని అనుక్షణం గుర్తిస్తూ వచ్చారట. వాటి ఆధారంగా యుక్త వయసు కన్నా కౌమార్యంలో శారీరక వ్యాయామం చేసిన వాళ్లలోనే తరవాతి కాలంలో ఎముకలు దృఢంగా ఉన్నట్లు గుర్తించారు. అది కూడా పరుగులు తీసే ఆటలు ఆడేవాళ్లలో మరీ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఆడ, మగ తేడా లేకుండా ఆ వయసులో పిల్లలకు వ్యాయామం, ఆటలు తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు.


ఆహారమూ వ్యక్తిగతమే!

మనిషి ఆరోగ్యానికీ రోగాలకీ ప్రధాన కారణం ఆహారమే. అయితే చాలామంది తాము పోషకాహారమే తీసుకుంటున్నాం అనుకుంటారు. అయినా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి సందర్భాల్లో- వాళ్లు ఏమి తింటున్నారు, ఎంత తింటున్నారు, అది వాళ్ల శరీరానికి సరిపడిందా లేదా అనేది చెప్పడం వైద్యులకైనా కష్టమే. అందుకే యూరిన్‌ ఫింగర్‌ ప్రింట్‌ అనే సరికొత్త పరీక్షను రూపొందించారు లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన పరిశోధకులు. అంటే- మూత్రంలోని మెటాబొలైట్స్‌ ద్వారా వాళ్లు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో ెలుసుకోవడంతోబాటు తీసుకోవాల్సినవీ సూచించవచ్చట. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన పదార్థాలు సరిపడవు. కాబట్టి వాళ్లకు అవసరమైన ఆహారాన్ని వ్యక్తిగతంగా సూచించడం ద్వారా వ్యాధుల్నీ తగ్గించవచ్చు అంటున్నారు సదరు పరిశోధకులు.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న