చిన్నచిన్న దొంగతనాలు చేస్తా! - Sunday Magazine
close
చిన్నచిన్న దొంగతనాలు చేస్తా!

మాళవిక శర్మ... ‘నేలటిక్కెట్టు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ అమ్మడు. తాజాగా యంగ్‌ హీరో రామ్‌ సరసన ‘రెడ్‌’ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసి త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సందర్భంగా తన
గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతోందిలా...

పుట్టింది ఎక్కడంటే...

నేను పుట్టింది ముంబయిలోని ఈస్ట్‌ అంధేరీలో. అమ్మానాన్నా, అన్నయ్యా, సంప్రదాయబద్ధమైన కుటుంబం. చిన్నప్పటి నుంచీ చదువులో ముందుండేదాన్ని. లాయర్‌ అవ్వాలని కల, అందుకే ప్రస్తుతం లా చదువుతున్నా. సినిమాలూ, చదువూ రెండిటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. ఈమధ్యే కొంచెం కొంచెం తెలుగు కూడా నేర్చుకుంటున్నా!


ఆడిషన్‌ కూడా తీసుకోలేదు

సాధారణంగా కొత్త నటీనటులను తీసుకునేటప్పుడు ఆడిషన్‌ చేయడం తప్పనిసరి. నేను దర్శకుడిని కలవడానికి వెళ్లినప్పుడు దాని కోసం చాలా ప్రిపేర్‌ అయ్యాను. తీరా వెళ్లాక ఆయన నన్ను ఏం అడగలేదు, ఆడిషన్‌ కూడా తీసు
కోలేదు, చాలా నిరుత్సాహపడిపోయా. ‘కనీసం ఆడిషన్‌ తీసుకోవడానికీ ఇష్టపడలేదంటే ఇక ఈ ఛాన్స్‌ పోయినట్టే’ అనుకుని ముంబయి వెళ్లిపోవడానికి రెడీ అయిపోయా. కానీ తర్వాత ఫోన్‌ చేసి ‘ఈ పాత్ర నీదేన’ని చెప్పేసరికి చాలా ఆశ్చర్యమేసింది! అంత నమ్మకంగా నాకు అవకాశం ఇచ్చారు, అదెప్పటికీ మర్చిపోలేను.


తెర పరిచయం ఎలా?

కాలేజీ రోజుల నుంచే పాకెట్‌మనీ కోసం మోడలింగ్‌ చేసేదాన్ని. హిమాలయా, జియోనీ, మీరా కోకొనట్‌ ఆయిల్‌, సంతూర్‌ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో నటించా. 2017లో ‘బ్లూఇండియా’ బ్రాండ్‌ అంబాసిడర్‌ కూడా అయ్యాను. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటా. అలా నా ఫొటోలు దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ చూసి ‘నేల టిక్కెట్టు’లో అవకాశం ఇచ్చారు.


నచ్చే వ్యాపకాలు

నాకు పర్యటనలు చేయడమంటే చాలా ఇష్టం. ఏమాత్రం ఖాళీ ఉన్నా ఏదో చోటికి చెక్కేస్తుంటా. డాన్స్‌ చేయడాన్ని కూడా బాగా ఎంజాయ్‌ చేస్తా.


బ్రేక్‌ తప్పనిసరి

విరామం లేకుండా పని చెయ్యడం నా వల్ల కానేకాదు. షూటింగ్స్‌తోపాటూ నా క్లాసులూ పరీక్షలకు కూడా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కోసారి బాగా అలసిపోతా. పనులన్నీ అయిపోయాక కనీసం ఓ వారం రోజులైనా ఇంటి నుంచి బయటకు రాను. నిద్రపోతూనే ఉంటా, మా అమ్మ ఎంత తిట్టినా సరే!


పార్టీ గర్ల్‌!

షూటింగ్స్‌, పరీక్షలు లేనప్పుడు సమయమంతా స్నేహితులతోనే. అందరం కలిసి పార్టీలకు వెళ్తుంటాం.


కాజేస్తుంటా!

చెప్తే బాగోదు కానీ అదేంటో నాకు ఏవైనా చిన్నచిన్న వస్తువులు కాజేయడం భలే సరదా. ఎక్కడికి వెళ్లినా అక్కడి నుంచి ఏదోటి తెచ్చేసు కుంటా. అలా అని విలువైనవి తీసుకోనులెండి. ఇప్పటివరకూ ఎవ్వరికీ దొరకలేదు తెలుసా!


మెచ్చే నటులు

షారుఖ్‌ఖాన్‌ అంటే ప్రాణం. ఆయన సినిమాలు ఒక్కోటీ ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. తెలుగులో అల్లు అర్జున్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు ఇష్టం. హీరోయిన్లలో నాకు ప్రియాంకా చోప్రా స్ఫూర్తి. నటిగానే కాకుండా వ్యక్తిగానూ తను ఎంతో ఆకట్టుకుంటుంది.


హైదరాబాద్‌ నా రెండో ఇల్లు

ముంబయి తర్వాత నాకు హైదరాబాద్‌ రెండో ఇల్లు అయిపోయింది. మొదటి అవకాశం వచ్చినప్పుడు ఎన్నో ఆశలూ ఆశయాలతో బ్యాగు సర్దుకుని ఇక్కడ వాలిపోయా. నన్ను ఈ ఊరు ఎంతగానో ఆదరించింది. కెరీర్‌ మొదలైంది ఇక్కడే కాబట్టి హైదరాబాద్‌ నాకు చాలా స్పెషల్‌.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న