గంటలో... హైదరాబాద్‌ నుంచి దిల్లీకి! - Sunday Magazine
close

గంటలో... హైదరాబాద్‌ నుంచి దిల్లీకి!

అదేమిటీ... తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీ వెళ్లాలంటే విమానమెక్కినా రెండుగంటలకుపైగా పడుతుంది, గంటలో ఎలా సాధ్యం అంటారా! హైపర్‌లూప్‌ వాహనాలతో అది సాధ్యమే. వీటితో విజయవాడ నుంచి అమరావతికి ఐదు నిమిషాల్లో, చెన్నై నుంచి బెంగళూరు గంటలో చేరుకోవచ్చు. గాలీ, నీరూ, రోడ్డూ, రైలూ... ఇప్పటిదాకా మనిషికి తెలిసిన ప్రయాణమార్గాలు ఇవి నాలుగే. హైపర్‌లూప్‌ సాంకేతికత మనకు ఐదో మార్గాన్ని పరిచయం చేస్తోంది. అదే... పైపులో ప్రయాణం! అదేమిటో చూద్దాం రండి...
మీరో నాలుగు అంతస్తుల భవనంపై నుంచి కిందకి రావాలని అనుకుందాం. మామూలు మెట్లకన్నా... లిఫ్ట్‌లో రావడానికి తక్కువ సమయం తీసుకుంటుంది కదా!
అదే లిఫ్ట్‌ని మీరు పై నుంచి కిందకి నిలువుగా కాకుండా, మనం కారులో వెళుతున్నట్టే ఓ చోట నుంచి మరో చోటకి అడ్డంగా వెళ్లడానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ‘హైపర్‌లూప్‌’ అలాంటిదే. లిఫ్ట్‌ వెళ్లడానికి దానికంటూ ప్రత్యేక ఛాంబర్‌ ఉన్నట్టే దీనికీ ఉంటుంది. కాకపోతే దీనికి ఛాంబర్‌ బదులు ఓ పొడవైన పైపుని వాడతారు... అంతే తేడా! హైపర్‌లూపుకి ఈ పైపే ప్రధానం. దాని మహా వేగానికి అదే కీలకం! ఎంత వేగం అంటే... గంటకి కనీసం 1200 కిలోమీటర్లు! అంటే తెలుగు రాష్ట్రాల నుంచి దక్షిణాదిలోని ఏ నగరానికి వెళ్లాలన్నా అర్ధగంటలో చేరుకోవచ్చు. దిల్లీకైతే గంట పడుతుంది. మరి ఆ వేగానికీ, పైపుకీ ఉన్న సంబంధం ఏమిటీ అంటారా...

గాలి అడ్డుకోదు...
ఒక్క ప్రయోగశాలల్లో తప్ప సాధారణంగా భూతలంపైన ఏ వస్తువూ గంటకి ఏడొందల కిలోమీటర్ల వేగంతో వెళ్లలేదు! వేగంగా వెళ్లే వస్తువుకి ఎదురయ్యే గాలి దాన్ని అడుగడుగునా అడ్డుకుంటూ ఉండటమే ఇందుకు కారణం. అందుకే ఆకాశంలో గంటకి 1300 కి.మీ వేగంతో వెళ్లే విమానాలు కూడా నేలపైన తక్కువ స్పీడుతోనే వెళతాయి. ఆకాశంలో పైపైకి వెళ్లేకొద్దీ గాలిశాతం తగ్గి శూన్య వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ స్పీడు అందుకుంటాయి. అలాంటి శూన్య వాతావరణాన్ని భూమిమీదా కల్పించి నేలపైనే విమానమంత వేగంతో వెళితే... ఎలా ఉంటుంది! ‘హైపర్‌లూప్‌’కి ఆ ఆలోచనే మూలం. అందుకే ఓ పెద్ద సైజు పైపులో  శూన్య వాతావరణాన్ని కల్పించి అందులో ఓ చిన్న వ్యానులాంటి వాహనాన్ని(పాడ్‌ అంటారు) పంపిస్తారు. దాంతో గాలి తక్కువగా ఉండటం వల్ల ఈ వాహనం పైపులో కనీవినీ ఎరగనంత వేగాన్ని అందుకుంటుంది. అంతేకాదు... ఈ పాడ్‌కి చక్రాల్లాంటివేవీ ఉండవు. చక్రాలతో ఏర్పడే రాపిడి (ఫ్రిక్షన్‌) కూడా వేగాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఈ పాడ్‌ ప్రయాణానికి మ్యాగ్‌-లెవ్‌ (మ్యాగ్నటిక్‌ లెవిటేషన్‌కి పొట్టి రూపం) అనే సాంకేతికత వాడతారు. సాధారణంగా- అయస్కాంతాలని ఉపయోగించి కొన్ని వస్తువుల్ని మనం గాలిలో తేలేలా చేస్తుంటాం కదా. అదే టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ పాడ్‌ని తేలుతూ దూసుకెళ్లేలా చేస్తారు. ఆ రకంగా గంటకి 1300 కి.మీ వేగాన్ని సాధ్యం చేస్తారు. కేవలం అయస్కాంత క్షేత్రాల్లోని మార్పుల ద్వారా ప్రయాణించడం వల్ల దీనికి కరెంటు పెద్దగా అక్కర్లేదు. ఆ రకంగా ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న రైలు, విమానాలకంటే హైపర్‌లూప్‌ అతితక్కువ ఇంధనాన్నే ఉపయోగించుకుంటుంది. అందువల్ల వీటితో పర్యావరణానికీ మేలేనంటున్నారు!

ఎలాన్‌ మస్క్‌ ఆలోచన...
‘హైపర్‌లూప్‌’ ఆలోచన ప్రఖ్యాత సాంకేతికవేత్త ఎలాన్‌ మస్క్‌ది. 2012లో ఆయన ఈ ఆలోచనని ప్రతిపాదించారు. ఆ ఆలోచన ప్రాతిపదికన ఎన్నో స్టార్టప్‌లు భారీ పెట్టుబడులతో ఏర్పడ్డాయి. వాటిలో హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీ(హెచ్‌టీటీ), వర్జిన్‌ హైపర్‌లూప్‌ వన్‌లు చెప్పుకోదగ్గవి. మన దేశంలో ఈ తరహా రవాణాని కల్పించడానికి ఇక్కడి ప్రభుత్వాలతో ఇవి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. హెచ్‌టీటీ సంస్థ  చెన్నై-బెంగళూరు, అమరావతి-విజయవాడ మధ్య వీటిని ఏర్పాటుచేయడానికి ఒడంబడిక కుదుర్చుకుంది. వర్జిన్‌ సంస్థ ముంబయి-పుణెల మధ్య దీన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ సంస్థ ఇటీవలే 500 మీటర్ల పొడవైన గొట్టంలో ప్రపంచంలోనే పాడ్‌ ద్వారా తొలిసారిగా మనుషుల్ని పంపించి విజయం సాధించింది! అలా వెళ్లినవాళ్లలో, ఆ సంస్థలో సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న భారతీయ ఎలక్ట్రానిక్‌ నిపుణుడు తనయ్‌ మంజ్రేకర్‌ కూడా ఉన్నాడు. వచ్చే ఐదేళ్లలోనే ఈ రవాణాని సాధ్యం చేస్తామంటోంది వర్జిన్‌ హైపర్‌లూప్‌. అది సాధించిన రికార్డు కూడా ముందు మనదేశానికే దక్కుతుందనీ చెబుతోంది!


ఒంటె పాలతో చాక్లెట్‌..!

ఆరోగ్యం కోసమనో ఆధునిక మార్గమనో మామూలుగా మనం తాగే పాలకి బదులుగా అప్పుడప్పుడూ వేరే రకాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మేకపాలు, బాదం పాలు, గాడిదపాలు, సోయాపాలు ఈ కోవలోనివే. కానీ వీటన్నింటినీ తలదన్నేందుకు సిద్ధమవుతోంది ఒంటెపాల మార్కెట్‌! ఆరోగ్యం విషయంలో దీనికి సమానం మరేదీ లేదంటున్న నిపుణులు... దీని వాడకం పెరిగితే పర్యావరణానికి ఎంతో మేలని చెబుతున్నారు. ఆ రెండింటికీ సంబంధం ఏమిటంటారా..! మీరే చదవండి...
మనదేశంలో పెద్దగా లేదుకానీ ప్రపంచవ్యాప్తంగా ఒంటెపాల మార్కెట్‌ చాలా పెద్దది. గత ఏడాదే నాలుగున్నర లక్షల కోట్ల వ్యాపారం జరిగిందంటే చూసుకోండి! ఒంటెపాలకి సోమాలియా, కెన్యా వంటి ఆఫ్రికా దేశాలూ, అరబ్బు దేశాలే ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు. అక్కడి నుంచి పాలూ, గడ్డకట్టించిన పాలు, పొడిగా చేసిన పాల పౌడర్‌లు వంటివి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతవుతుంటాయి. మరీ ఆఫ్రికా, అరబ్బు దేశాల స్థాయిలో కాకున్నా ఒంటెలు మనదేశంలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. కాకపోతే మనం ఎప్పుడూ దేశవ్యాప్తంగా వాటి పాల సేకరణ, సరఫరాలపైన దృష్టిపెట్టలేదు. ప్రస్తుతం ఆ అవసరం రావడానికి విదేశాల తరహాలో ఇక్కడా భారీగా లాభాలు చూడాలన్నది ఒక్కటే కారణం కాదు. ఈ పాల ఉత్పత్తి ద్వారానైనా మనదేశంలో ఒంటెల సంఖ్య అంతరించిపోకుండా కాచుకోవాలన్నదే ఉద్దేశం. ఒంటెల ద్వారా వేలాది సంవత్సరాల పర్యావరణ చక్రాన్ని తెగిపోకుండా చూడటం దీని వెనకున్న అసలు లక్ష్యం!

ఒంటెలు అంతరిస్తున్నాయి...
ఎడారి అనగానే మనకి ముందు గుర్తొచ్చే జంతువు ఒంటె. వందలాది సంవత్సరాల నుంచి రాజస్థాన్‌, గుజరాత్‌ల మధ్య సరకు రవాణాకి ప్రధాన ఆధారం ఒంటెలే. ఆ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ వీటిని ఎక్కువగా వాడుతుండేవారు. కానీ, ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ రోడ్ల నిర్మాణం పెరిగి రవాణా అభివృద్ధయ్యేకొద్దీ ఒంటెల అవసరం తగ్గిపోయింది. వాటి ద్వారా వచ్చే ఉపాధి కోల్పోయిన ‘రైకా’ అనే సంప్రదాయ ఒంటెల కాపరి కులాలవాళ్లు పేదరికంలో కూరుకు పోయారు. వీటిని కబేళాలకి తెగనమ్మడం మొదలుపెట్టారు. గత దశాబ్దకాలంలోనే ఉత్తరాదిలో ఒంటెల సంఖ్య భారీగా పడి పోయింది. వాటి సంఖ్య తగ్గడం పర్యావరణానికి మంచిది కాదనే ఆందోళనా మొదలైంది. అలా ఆందోళనకి గురైనవాళ్లలో జర్మనీకి చెందిన మహిళా శాస్త్రవేత్త ఇల్సే కోలర్‌ రాలఫ్సన్‌ ఒకరు. 1990ల్లో ఇండియా వచ్చిన ఆమె ఇక్కడ ‘కామెల్‌ ఛరిష్మా’ అనే సంస్థని ఏర్పాటుచేశారు. దాని ద్వారా తొలిసారి, ఒంటెపాలని సేకరించి విక్రయించొచ్చని రైకా ప్రజలకి కొత్త ఉపాధి మార్గాన్ని చూపారు. ఈ పాలని ఆటిజం వంటి మానసిక సమస్యలున్న పిల్లలకీ, క్యాన్సర్‌ రోగులకీ, మధుమేహులకీ వాడుతుండేవారు. మనదేశంలో స్టార్టప్‌ల బూమ్‌ మొదలుకాగానే ఆద్విక్‌ ఫుడ్స్‌, డీఎన్‌ఎస్‌ గ్లోబల్‌ ఫుడ్స్‌, న్యూట్రా విటా వంటి సంస్థలు ఈ పాలని సేకరించి విక్రయించడం ప్రారంభించాయి. అమూల్‌ సంస్థ కూడా ఈ ఒంటెపాల రంగంలోకి దూసుకొచ్చింది!

పోషకాల్లో నంబర్‌ వన్‌..!
మామూలు ఆవు, గేదె పాలకంటే ఒంటెపాలలో విటమిన్‌ సి మూడురెట్లు ఉంటుంది. ఐరన్‌, జింక్‌, కాపర్‌, సోడియం, మెగ్నీషియం వంటి మ్యాక్రో-మైక్రో పోషకాలు ఇందులో చాలా ఎక్కువట. వీటితోపాటూ ఇందులోని ల్యాక్టోటెరిన్‌ అనే పదార్థం ఆర్థరైటిస్‌ వంటివాటిని రాకుండా అడ్డుకుంటుందని, పెప్టిన్‌ వంటి సహజ ఇన్సులిన్‌ ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల మధుమేహులకీ మంచిదని చెబుతారు. ముఖ్యంగా- లాక్టులోజ్‌ రేట్‌ చాలా స్వల్పమని అంటారు. కాబట్టి, పాలు తాగడం ద్వారా ఏర్పడే అజీర్తి సమస్యలు అసలు ఉండవట. కాకపోతే ఒంటెపాల ఉత్పత్తి తక్కువ కావడం, వాటి ప్రాసెసింగ్‌కయ్యే ఖర్చు ఎక్కువ కావడంతో వీటి ధరలు ఆకాశంలోనే ఉంటున్నాయి. సాధారణంగా ఆవుపాల ధర లీటరు రూ.45 ఉంటే... ‘ఒంటెపాలు’ రూ.125 దాకా ఉంటుంది. ఇక పాల పొడి ధర అర్ధకిలో మూడువేల రూపాయల వరకూ పలుకుతోంది. ఇవేకాకుండా ఈ పాలతో ఐస్‌క్రీములూ, చాక్లెట్లూ, సబ్బులూ, బాడీ క్రీములూ తయారుచేస్తున్నారు. వీటి ధర 150 రూపాయల పైచిలుకే!
ధరలు ఎలా ఉన్నా... ఈ ఉత్పత్తులతో పర్యావరణ వేత్తల లక్ష్యం నెరవేరింది. గుజరాత్‌, రాజస్థాన్‌లలో ఒంటెలని అనామకంగా వదిలేయకుండా పాలకోసమైనా వాటిని కంటికిరెప్పలా చూసుకునే సహకార సంస్థలూ పెరుగుతున్నాయి!


బొమ్మలకూ అందాల పోటీలు!

అందమైన అమ్మాయిని చూస్తే బొమ్మలా ఉంది అనడం సహజం. కానీ ‘బొమ్మను గీస్తే నీలా ఉందీ...’ అన్న పాటలో మాదిరిగానే బొమ్మల్నే అమ్మాయిలతో పోల్చేరోజులివి. అవునండీ... అందాల భామలకే కాదు, బొమ్మలకీ పోటీలు జరుగుతున్నాయి. విశ్వ సుందరి, ప్రపంచసుందరి పోటీల్లోలానే వివిధ దేశాలకు చెందిన బొమ్మలన్నీ పాల్గొనే ఆ అందాల పోటీకి మరోపేరే ‘మిస్‌ దివా డాల్‌’..!

పేరు : ఐశ్వర్యారాయ్‌
వయసు : 21
ఎత్తు : 170 సెం.మీ.
కొలతలు : 34-26-36
స్వస్థలం : ముంబై, మహారాష్ట్ర

...మీరు చదువుతున్నవన్నీ నిజమే, ఇవి ఈ ఏడాది అందాల పోటీల్లో మనదేశం తరపున పాల్గొన్న బొమ్మ వివరాలన్నమాట. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల బొమ్మలు పోటీలో పాల్గొంటాయట. ఇవన్నీ అచ్చంగా అందాల పోటీల్లోలానే స్విమ్‌ సూట్‌, నైట్‌ గౌన్‌, టాప్‌ ట్వెల్వ్‌, టాప్‌ ఫైవ్‌... ఇలా అనేక రౌండ్లలో పోటీపడతాయి. చివరగా కిరీటాన్ని దక్కించుకున్న సుందరిని బంగారు సింహాసనం మీద కూర్చోబెడతారు. అచ్చం ర్యాంప్‌మీద నడిచే భంగిమలకి అనుగుణంగా బొమ్మల పోజుల్నీ మారుస్తుంటారు. దాంతో అవి బొమ్మలా... అమ్మాయిలా... అన్న అనుమానమూ కలగకపోదు. అంతేకాదు, బొమ్మలు తమ మనోభావాల్నీ వ్యక్తం చేయాలి. అవన్నీ వాటి యజమానులు ఉరఫ్‌ డిజైనర్లే రాస్తారన్నమాట. అందంతోపాటు తెలివి, ఆత్మవిశ్వాసం ప్రతిబింబించేలా బొమ్మ ఇచ్చే ప్రసంగం- అంటే, పంపిన వ్యాఖ్యానాన్ని బట్టి ఎంపిక జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన పోటీల్లో మెలిస్సా రోజ్‌ బికర్‌స్టాఫ్‌(ఇంగ్లాండ్‌), మెరినా పెచారట్‌(థాయ్‌ల్యాండ్‌), ఏంజెలా అనె( ఐస్‌ల్యాండ్‌), ఐశ్వర్యారాయ్‌(ఇండియా), మాగ్నోలియా ఫామ్‌(వియత్నాం)... తొలి ఐదు స్థానాల్లో నిలిచారట. మరో రెండు రౌండ్ల తరవాత వీళ్లలో విజేతను ఎంపికచేసి నవంబరు 23న కిరీటాన్ని అలంకరిస్తారట. మిస్‌ దివా టైటిల్‌తోపాటు మిస్‌ ఫొటోజెనిక్‌, బెస్ట్‌ స్విమ్‌సూట్‌... వంటి క్యాటగిరీలూ ఉంటాయట.

ఎలా నిర్వహిస్తారు?

థాయ్‌ల్యాండ్‌కు చెందిన థానెట్‌ ప్రామ్‌సేన్‌ అనే వ్యక్తి, మిస్‌ దివా డాల్‌డాట్‌కామ్‌ ద్వారా నిర్వహిస్తోన్న ఈ అందాల పోటీలకోసం ప్రపంచ దేశాలకు చెందిన వాళ్లెవరైనా బొమ్మల్నీ వాటి దుస్తుల్నీ డిజైన్‌ చేసి పంపించవచ్చట. ఏటా జరిగే ఈ పోటీల్లో పాల్గొనే బొమ్మలన్నీ జులై కల్లా థాయ్‌ల్యాండ్‌కు చేరుకోవాలి. నవంబరులో ఫైనల్‌ రౌండ్‌ పూర్తయ్యాక తమ దేశాలకు తిరిగివస్తాయి. బొమ్మతోపాటు అది ఏ దేశం తరపున పోటీ చేస్తుందో దానికి సంబంధించిన జాతీయ కాస్ట్యూమ్‌, మూడు ఈవెనింగ్‌ గౌన్లూ వాటికి సంబంధించిన యాక్సెసరీలూ, ర్యాంప్‌మీదకి వచ్చేటప్పుడు వేసుకునే అరైవల్‌ అవుట్‌ఫిట్‌ వంటివన్నీ వెబ్‌సైటులో ఉన్న అడ్రస్సుకు పంపించాలి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు బొమ్మల సొంతదారులు అప్లికేషన్‌తోపాటు మనీగ్రామ్‌, వెస్ట్రన్‌ యూనియన్‌ లేదా పేపల్‌... వంటి వాటి ద్వారా ఫీజునీ చెల్లించాలి. మరిన్ని వివరాలు కావాలంటే మిస్‌దివాడాల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సిందే. థాయ్‌కి చెందిన మిస్‌బ్యూటీడాల్‌ అనే మరో వెబ్‌సైట్‌ సైతం ఇలాంటి పోటీలను నిర్వహిస్తుండటం విశేషం!

 

 

 

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న