అంగట్లో... కదిలే ఇళ్లు! - Sunday Magazine
close
అంగట్లో... కదిలే ఇళ్లు!

ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు... అన్నది పాత సామెత. కానీ  ఇప్పుడు ఇల్లు కట్టడం అంత పెద్ద పని కానే కాదు. సరకుల్ని ఆర్డర్‌ ఇచ్చినట్లు మనక్కావల్సిన మోడల్‌ ఇంటిని ఆర్డర్‌ ఇస్తే రోజుల వ్యవధిలోనే తెచ్చి కోరినచోట పెట్టేస్తారు. ఈ ఇళ్లను మనం ఎక్కడికి కావాలంటే అక్కడకు వెంట తీసుకెళ్లొచ్చు కూడా. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెరిగిన ఈ కదిలే ఇళ్ల ట్రెండ్‌ గురించి చూద్దామా ఓ సారి..!
వాసు నెల్లూరులో రొయ్యల వ్యాపారం ప్రారంభించాడు. చెరువుల దగ్గరే ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కొని నిర్మించడానికి బోలెడు ఖర్చు అవుతుంది. పైగా ఆ చోటులో ఎన్నేళ్లు నివాసం ఉంటాడో తెలీదు. ‘మరెలా..?’ అని ఆలోచిస్తున్న సమయంలో హైదరాబాద్‌లో మొబైల్‌ హౌస్‌లను కట్టి అమ్ముతున్నారని యూట్యూబ్‌లో చూశాడు. వాళ్లతో మాట్లాడి మోడల్‌ చూసుకుని ఇంటిని ఆర్డర్‌ ఇచ్చాడు. నెలలోపే చక్కని చెక్క ఇల్లు అన్ని సౌకర్యాలతో తయారై లారీలో వచ్చేసింది. మరోచోటికి వెళ్తున్నప్పుడు ఈ ఇంటిని వెంట తీసుకెళ్లొచ్చు. హైదరాబాద్‌లో ఉండే నరేష్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కానీ వ్యవసాయం చేయడం చాలా ఇష్టం. అందుకే, నగరం బయట పొలం కొనుక్కుని శని ఆదివారాల్లో వ్యవసాయం చేస్తుంటాడు. అక్కడేమో ఉండడానికి వసతి లేదు. అందుకే, తోటలోనే అన్ని సౌకర్యాలతో ఓ ఇల్లు ఉంటే వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సహా అక్కడికొచ్చి సరదాగా గడపొచ్చు అనుకున్నాడు. తక్కువ ఖర్చుతో వచ్చే షిప్పింగ్‌ కంటెయినర్‌ హౌస్‌లను మన దగ్గరే తయారుచేస్తున్నారని తెలిసి ఆర్డరిచ్చాడు. కొద్దిరోజుల్లోనే ఫర్నిచర్‌తో సహా సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు తోటలోకి వచ్చేసింది. ఇలా చెక్క, షిప్పింగ్‌ కంటెయినర్లతో తయారైన కదిలే ఇళ్లు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇది చాలదూ ఈ తరహా ఇళ్లకు ఎంత డిమాండ్‌ పెరిగిందో అర్థం చేసుకోవడానికి..!


చెక్క ఇళ్లు భలే!
హైదరాబాద్‌, జీడిమెట్లకు చెందిన షేక్‌ జిలానీ రెండేళ్లలో మూడువందలకు పైగా మొబైల్‌ చెక్కఇళ్లను అమ్మారట. ఈ తరహా ఇళ్లను కట్టడానికి ప్రధానంగా పైన్‌వుడ్‌ని వాడతారు. ముందుగా బేస్‌మెంట్‌, సీలింగ్‌, గోడలకు ఇనుప కడ్డీలను ఏర్పాటుచేసి ఆపైన చెక్కతో ఇంటిని నిర్మిస్తారు. వంటగది, హాలు, పడకగది, బాత్‌రూమ్‌లూ... వాటిలో ఉండాల్సిన అన్ని వసతులూ ఈ మొబైల్‌ హౌస్‌లో ఉంటాయి. వీటి ఫ్లోరింగ్‌కి టైల్స్‌ వేయించుకోవచ్చు. సింకులూ పంపులూ నీళ్లట్యాంక్‌ తదితరాలన్నిటినీ ముందే బిగించేసి కావల్సిన చోటుకి తీసుకెళ్లాక డ్రెయినేజీ కనెక్షన్‌ ఇస్తారు. ఈ చెక్క ఇళ్లలో సింగిల్‌ బెడ్‌రూమ్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌, డూప్లెక్స్‌ మోడళ్లను మనకు ఎలా కావాలంటే అలా నిర్మించి ఇస్తున్నారు. ఈ ఇళ్ల కింద కారు పార్కింగ్‌ ఉండేలా కొంత ఎత్తు వరకూ స్తంభాలు ఏర్పాటు చేసి వాటిమీద కూడా ఇంటిని పెట్టుకోవచ్చు. మోడల్‌ని బట్టి మొబైల్‌హౌస్‌ (వెబ్‌సైట్‌: www.mobilehousehyderabad.com)ల ధర రూ.నాలుగు లక్షల నుంచి 14 లక్షల వరకూ ఉంటోంది. ‘మేం కట్టే ఇళ్లకు బ్యాక్టీరియా తీసేసిన నాణ్యమైన చెక్కను వాడతాం కాబట్టి వీటికి చెదలు పడతాయీ, ఎండా వానకు పాడవుతాయనే భయం ఉండదు. గోడలూ పైకప్పులకు ఫోమ్‌ ప్యానెల్‌ని వెయ్యడం వల్ల వేడి లోపలికి రాకుండా ఉంటుంది. ప్రస్తుతం క్రేన్‌లతో లారీలమీదికెక్కించి తీసుకెళ్లే ఇళ్లనే నిర్మిస్తున్నాం. త్వరలోనే బస్సులకున్నట్లే ఇళ్ల కింద టైర్లు ఏర్పాటు చేసి మన కారు వెనకే రోడ్డుమీద తీసుకెళ్లే ‘హౌస్‌ ఆన్‌ వీల్స్‌’ ఇళ్లను కూడా మార్కెట్లోకి తీసుకురాబోతున్నాం’ అంటారు జిలానీ.


రక్షణకు కంటెయినర్‌ హౌస్‌లు...
కంటెయినర్‌ హౌస్‌ల విషయానికొస్తే వీటిని షిప్పింగ్‌ కంటెయినర్లతో తయారు చేస్తారు. హైదరాబాద్‌ శివారులోని బౌరంపేట్‌లో ప్రారంభమైన ‘ఫేమ్‌కో లివింగ్‌ కాన్సెప్ట్స్‌ (వెబ్‌సైట్‌: www.fameco.co.in) కంపెనీ ఇప్పటికే ముప్పైకి పైగా కంటెయినర్‌ ఇళ్లను డెలివరీ చేసింది. ఈ సంస్థ వినియోగదారులు కోరినట్లూ కంటెయినర్లను అత్యాధునిక మోడళ్లలో డూప్లెక్స్‌ ఇళ్లలానూ మార్చి ఇస్తుంది. కంటెయినర్‌ బయటి గోడలకు రంగులు వేసి, లోపలి గోడలకూ సీలింగ్‌కీ ప్లైవుడ్‌తో ప్యానెలింగ్‌ చేస్తారు. వేడిని లోపలికి రానీకుండా ఇనుప గోడలకూ ఈ ప్లైవుడ్‌కీ మధ్యలో ప్రత్యేకమైన ఇన్సులేషన్‌ షీట్‌ని అంటిస్తారు. విద్యుత్‌ కనెక్షన్‌కి వైరింగ్‌, టాయిలెట్‌ సౌకర్యాలన్నిటినీ ముందే ఏర్పాటు చేస్తారు. ‘ఇనుప కంటెయినర్లు కాబట్టి రక్షణ పరంగా సమస్య ఉండదు, చెదలు పట్టే అవకాశం లేదు. అగ్నిప్రమాదాల భయం కూడా తక్కువ. కాబట్టే, వీటిని మళ్లీ అమ్మినా ధర వస్తుంది’ అంటారు ఫేమ్‌కో యజమానులు వంశీ, దిలీప్‌, సంజీవ్‌లు. కంటెయినర్‌ ఇళ్ల ధర రూ.3.5 లక్షల నుంచి మొదలవుతుంది. కావాలంటే ఫర్నిచర్‌తో సహానూ ఇస్తారు. ఎంఏ పోర్టబుల్‌ క్యాబిన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ (www.mapc.in), పెర్‌ఫెక్ట్‌క్యాబిన్‌ (www.perfectcabin.in) ఇలా... తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని కంపెనీలూ కదిలే ఇళ్లను నిర్మిస్తున్నాయి.

ఎంతో ఉపయోగం...
చెక్క, కంటెయినర్‌ ఇళ్లు- గెస్ట్‌ హౌస్‌లూ ఫామ్‌ హౌస్‌లుగానే కాదు, సెక్యూరిటీ గార్డుల కోసమూ షాపులూ కెఫేలూ మొబైల్‌ ఆసుపత్రులకోసం చిన్నగా ఉండేవీ వస్తున్నాయి. ఇక, సిటీలో స్థలం ఖాళీగా ఉన్నప్పుడు ఊరికే వదిలేయకుండా కదిలే ఇళ్లను అక్కడ పెడితే అద్దెక్కూడా ఇచ్చుకోవచ్చు. పెరట్లో ఖాళీ స్థలం ఉంటే గ్యారేజీ కోసమో అద్దెకిచ్చేందుక్కూడా వీటిని తెచ్చుకోవచ్చు. ఇక, భవనాలూ వంతెనలూ డ్యాముల్లాంటి వాటి నిర్మాణాల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కడ పనుంటే అక్కడికెళ్లి ఉండాల్సిందే. అలాంటివారికీ మొబైల్‌ హౌస్‌లు బాగా పనికొస్తాయి. ఎన్నిసార్లు అటూ ఇటూ తరలించినా దెబ్బతినకుండా వీటిని నిర్మిస్తారు. అందుకే, తక్కువ ధరలో కోరిన చోటుకి తీసుకెళ్లగలిగే ఈ ఇళ్లు ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయి.

- మధులత యార్లగడ్డ
Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న